నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై BACలో నిర్ణయం తీసుకుంటారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ నెల 28న సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక, అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరుకానున్నారు. తమను చూసి ప్రభుత్వం భయపడుతోందంటున్న వైసీపీ… అందుకే సభను ఏకపక్షంగా నడపాలని చూస్తుందని ఆరోపించింది. తమ అధినేత వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేయనుంది. అలాగే, ఎన్నికల హామీలు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ భావిస్తుంది. దీంతో సభ హాట్‌హాట్‌గా సాగే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా ఈ సారి వెంకటపాలెంలోని NTR విగ్రహనికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది టీటీడీ.. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ముందుగా NTR విగ్రహానికి నివాళులు అర్పించి సభకు హాజరవుతారు నేతలు. కానీ… కోడ్ ఉండడంతో ఈ కార్యక్రమం రద్దు చేసుకున్నారు.. నేరుగా అసెంబ్లీకే రానున్నారు టీడీపీ సభ్యులు.. మరోవైపు… ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన శాసన సభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.. అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. DGP సహా పలువురు ఉన్నతాధికారులతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని YCP నిర్ణయించడంతో ఈ సారి బడ్జెట్ సెషన్ హాట్‌హాట్‌గా సాగనుంది.
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుడు.. కేంద్రం గెజిన్ నోటిఫికేషన్..
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాల్లో ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉండనుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది. ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ ఆమోదం తెలపడంతో.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ వెళ్తుంది. కోల్‌కతా- చెన్నై నెషనల్ హైవే నుంచి ఓఆర్ఆర్కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు లింక్ రోడ్లను నిర్మిస్తారు. కాజ నుంచి తెనాలి నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల లింక్ రోడ్లను నిర్మించనున్నారు. దీని కోసం మూడు ఎలైన్‌మెంట్లను NHAI సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. NHAI నుంచి వచ్చిన ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పుచేర్పులతో కూడిన ప్రతిపాదన, రెండు లింక్‌రోడ్ల ఎలైన్‌మెంట్‌ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక.. వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అక్కడ తుది ఆమోదం తెలుపుతారు. ఇక.. ఓఆర్‌ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా త్వరలోనే నోటిఫికేషన్ జారీచేస్తారు. 21 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు. వాటిని పరిష్కరించి.. క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్‌మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు. అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యాక 3డీ నోటిఫికేషన్ జారీ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డీపీఆర్ సిద్ధం చేస్తూనే.. వివిధ అనుమతులను ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్లు తీసుకోనున్నారు. మొత్తంగా.. అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగుపడిందనే చెప్పుకోవచ్చు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవన్ కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మూడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు పాల్గొన్నారు. చట్ట సభల్లో ప్రజల గొంతుక వినిపించాలని దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.. వైసీపీ సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం కోల్పోవద్దు.. సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు సరైన సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు పవన్. చట్టసభల్లో వాడే భాష విషయంలో సభ్యులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, అభ్యంతరకర పదజాలం వాడొద్దని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ సభ్యులు..అసెంబ్లీలో వాడిన భాష, వ్యవహరించిన తీరును ప్రజలంతా గమనించిన సంగతిని గుర్తించుకోవాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు దిగజారుడు వ్యాఖ్యలు చేసినా …హుందాగా స్పందించాలని సూచించారు. భాష విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో సభ్యులకు దిశానిర్దేశం చేయాలని నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, హరిప్రసాద్‌లను ఆదేశించారు. అసెంబ్లీ, మండలిలో సమస్యలపై ప్రస్తావించేటప్పుడు భాష సరైనదిగా ఉండాలన్నారు. అసెంబ్లీ, మండలిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించాలని, నియోజకవర్గ అవసరాలతో పాటు రాష్ట్ర ప్రజల అవసరాలనూ దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు పవన్‌కల్యాణ్. జనసేన పార్టీ…సామాన్యుడి గొంతు ప్రతిధ్వనించేలా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరేలా, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చట్టసభల్లో వాణి వినిపించాలని ఆదేశించారు. పార్టీ తరపున ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చల్లో పాల్గొనాలని సూచించారు. నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకుని…రాష్ట్రవ్యాప్తంగా ఆ తరహా సమస్యలు ఉంటే వాటిని క్రోడీకరించి చర్చల్లో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయం, ఖర్చు, శాఖలవారీగా కేటాయింపులు, అప్పులు ఇతరత్రా అంశాలపై ప్రతి సభ్యుడు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, కొత్తగా ఎన్నికైన సభ్యులకు సందేహాలు ఉంటే సీనియర్లతో చర్చించి వారు సూచించిన విధంగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. పవన్ దిశానిర్దేశం చేయడంతో ఈసారి జనసేన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో బలమైన గొంతు వినిపించబోతున్నారని అర్థమవుతోంది.
సొరంగంలో చిక్కుకున్న వారి కోసం విస్తృతంగా సహాయక చర్యలు
తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో సంభవించిన ఘోర ప్రమాదం కారణంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో వందలాది మంది పాల్గొంటున్నారు. భారత సైన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయబడింది. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యల్లో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) నుంచి 120 మంది, ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) నుంచి 70 మంది, సింగరేణి రెస్క్యూ టీం నుంచి 35 మంది, అలాగే హైడ్రా నుంచి 15 మంది సహాయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ భారీ ఆపరేషన్‌ను సమీక్షించేందుకు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్, ఐఏఎస్ శ్రీధర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్లు సుదీశ్ కుమార్, ప్రసన్న, పవన్, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్‌ఎఫ్ హరినాథ్‌రెడ్డి, సింగరేణి రెస్క్యూ టీం చీఫ్ కలందర్ వంటి ముఖ్య అధికారులు అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
19గంటలకు పైగా 32 అడుగుల లోతు బోరుబావిలోనే 5 ఏళ్ల చిన్నారి… కొనసాగుతున్న సహాయక చర్యలు
రాజస్థాన్‌లోని ఝలావర్‌లో ఆదివారం నాడు 5 ఏళ్ల బాలుడు 32 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. దీని తరువాత పరిపాలన సహాయక చర్యను ప్రారంభించింది. పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం… ఆ పిల్లవాడు పొలంలో ఆడుకుంటున్నాడు. అతని తల్లిదండ్రులు పొలానికి అవతలి వైపు పనిలో బిజీగా ఉండగా..ఆ పిల్లవాడు బోరుబావి దగ్గర ఉన్న రాతి పలకపై కూర్చుని అక్కడి నుంచి జారి అందులో పడిపోయాడు. బోరుబావిలో పడిపోయిన పిల్లవాడి పేరు ప్రహ్లాద్. అతను 32 అడుగుల లోతులో చిక్కుకుపోయి అపస్మారక స్థితిలో ఉన్నాడు. బోరుబావిలో చిన్నారి పడిపోయాడని పోలీసులకు సమాచారం అందడంతో, NDRF, SDRF బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని బయటకు తీసే ప్రయత్నం ప్రారంభించాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని సబ్-డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) ఛత్రపాల్ చౌదరి తెలిపారు.
పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన
పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన చేసింది. స్వల్పంగా కిడ్నీ సమస్య తలెత్తిందని.. దీంతో దేహం చికిత్సకు సహకరించడం లేదని పేర్కొంది. గొట్టం ద్వారా ఆక్సిజన్ అందుతోందని తెలిపింది. పోప్ మంచి దృక్పథం కలిగిన వ్యక్తిగా వాటికన్ అభివర్ణించింది. పోప్ ఫ్రాన్సిస్ ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 14న ఆరోగ్యం బాగోలేకపోవడంతో రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరించడం లేదని.. విషమంగానే ఉందని గత శనివారం వాటికన్ తెలిపింది. ఆదివారం కూడా అదే ప్రకటన చేసింది. పోప్ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు పేర్కొంది. ఇక శనివారం రెండు యూనిట్ల రక్తం కూడా ఎక్కించినట్లుగా తెలిసింది.
‘కింగ్’ సెంచరీపై అనుష్క శర్మ రియాక్షన్ ఇదే!
ఫామ్ లేమితో ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్‌పై సూపర్ సెంచరీ (100 నాటౌట్: 111 బంతుల్లో 7 ఫోర్లు) చేశాడు. ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా.. ఆచితూచి ఆడి వన్డేల్లో 51వ సెంచరీని పూర్తి చేశాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. విరాట్ శతకం బాదడంతో అభిమానులు జోష్‌లో ఉన్నారు. కింగ్ సెంచరీపై అతడి సతీమణి అనుష్క శర్మ కూడా ఆనందం వ్యక్తం చేశారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను అనుష్క శర్మ ఇంటి నుంచే వీక్షించారు. టీవీలో విరాట్ కోహ్లీ సెంచరీ సంబరాలను ఫొటో తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. లవ్, హైఫై ఎమోజీలను జత చేసి.. తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం అనుష్క పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు సెంచరీ అనంతరం మైదానంలో విరాట్ తన మెడలోని గొలుసుకున్న వెడ్డింగ్ రింగ్‌ను ముద్దాడాడు. అనుష్కకు సందేశమిచ్చేలా ఇలా చేశాడు. ఈ సెంచరీతో 14,000 వన్డే పరుగులను కోహ్లీ పూర్తి చేశాడు. 299 వన్డేల్లో కోహ్లీ 58.20 సగటుతో 14,085 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 73 అర్ధసెంచరీలు ఉన్నాయి.
36 ఏళ్ల వయసులో విశ్రాంతి చాలా అవసరం: విరాట్
36 ఏళ్ల వయసులో విశ్రాంతి చాలా అవసరమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. విశ్రాంతి తీసుకుంటే మిగతా మ్యాచుల్లో రాణించడానికి దోహదం చేస్తుందన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ (100 నాటౌట్: 111 బంతుల్లో 7 ఫోర్లు) సెంచరీ బాదాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. టీమిండియా ఆటగాళ్లకు వారం రోజుల పాటు విశ్రాంతి లభించనుంది. దీనిపై కోహ్లీ స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ… ‘కీలక మ్యాచ్‌లో నేను బాగా బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రోహిత్ శర్మ త్వరగానే అవుట్ అయినా.. మ్యాచ్‌లో నిలుదొక్కుకోవడం, పరుగులు చేయడం మంచి అనుభూతిని ఇస్తోంది. రిస్క్ తీసుకోకుండా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను నియంత్రించాలనుకున్నా. శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడాడు. నేను కూడా కొన్ని బౌండరీలు బాదాను. ఈ క్రమంలో వన్డేల్లో నా సహజసిద్ధమైన ఆట బయటకి వచ్చింది. నా ఆట పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది’ అని తెలిపాడు.
డాకు మహారాజ్ కోసం కేరళ ప్రేక్షకుల డిమాండ్
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా డాకు మహారాజ్ కు నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య వరుసగా వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు నందమూరి బాలకృష్ణ. థియేటర్లలో సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ తాజాగా ఓటీటీలోకి విడుదలైంది. ఈ నెల 21న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ ఓటీటీ రెస్పాన్స్ ఊహించిన దానికి మించి వస్తుంది. ఈ సినిమాను చూసి ఇతర భాషల ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. సినిమా కంటెంట్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ ప్రేక్షకులు అయితే సినిమాని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ సినిమాలోని సీన్లను మలయాళ ప్రేక్షకులు బాగా ట్రోల్ చేసేవారు, కానీ ఇప్పుడు వాళ్లు డాకు మహారాజ్ చూసి ఇటీవల కాలంలో ఇంతటి విజువల్ మాస్ ఫీస్ట్ చూడలేదు, బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్ అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఈ సినిమాను ఒకసారి మలయాళంలో రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాని మలయాళం లో నేరుగా రిలీజ్ చేసి ఉంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండేది కదా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అటు వరల్డ్ వైడ్ గాను డాకు మహారాజ్ ఓటీటీ రెస్పాన్స్ అదరగొడుతోంది. పాకిస్తాన్, బాంగ్లాదేశ్,UAE వంటి దేశాలలో టాప్ 2 లో ట్రెండింగ్ అవుతుంది.
తమిళ్ డైరెక్టర్ తో నేచురల్ స్టార్ సినిమా ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని జోరు మీదున్నాడు. సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను నాని. ఈ యంగ్ హీరో ప్రస్తుతం HIT 3 అనే ఫ్రాంచైజీలో హీరోగా నటిస్తున్నాడు. HIT 1,2 భాగాలను నాని నిర్మించగా మూడవ భాగంలో తానే నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచింది. నేడు ఈ సినిమా ట్రైలర్ రానుంది. ఈ సినిమాతో పాటు దసర కి సీక్వెల్ గా ‘ది ప్యారడైజ్’ ను సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు నాని. అయితే నేచురల్ స్టార్ మరోక యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. తమిళ్ లో శివ కార్తికేయన్ హీరోగా 2022 లో రిలీజై సూపర్ హిట్ అయిన డాన్ సినిమాను డైరెక్ట్ చేసాడు సిబి చక్రవర్తి . ఈ యంగ్ దర్శకుడు నేచురల్ స్టార్ కోసం ఓ కథను సిద్ధం చేసాడట. ఇటీవల నానిని కలిసి స్టోరీని వినిపించాడట సిబి చక్రవర్తి. సిబి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాని. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్ట మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. నేడు నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మా ఫ్యామిలి గొడవలకు త్వరగా ఫుల్‌స్టాప్ పడితే బాగుండు: మంచు విష్ణు
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. ఈ మూవీ కోసం విష్ణు ఎంతో కష్టపడుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ మూవీ పై అంచనాలు పెంచగా.. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి అగ్ర నటీనటులతో పాటుగా.. మోహన్ బాబుతో పాటు కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, బ్రహ్మానందం, సప్తగిరి రఘు బాబు, ఐశ్వర్య రాజేష్, దేవరాజ్ తో పాటుగా మొట్టమొదటి సారిగా విష్ణు కూతుళ్లు మంచు అవ్రామ్, అర్పిత్ రంకా కూడా ఈ మూవీలో భాగం కాబోతున్నారు. ఇక ఇంత భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇక దీంతో విష్ణు అని విధాలుగా ఈ మూవీ కోసం ప్రమోషన్ చేస్తున్నాడు.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. విష్ణు మాట్లాడుతూ.. ‘నా ఎదుట శివుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే.. ఎన్ని జన్మలెత్తినా నాకు తండ్రిగా మోహన్‌బాబునే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. నేను మా అమ్మానాన్నతో ఉండాలి. నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలనేదే నా కోరిక. మా కుటుంబంలోని కలహాలు, గొడవలకు త్వరగా ఫుల్‌స్టాప్ పడితే బాగుండనిపిస్తోంది’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీలో మనోజ్ తో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది.. వారు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. దీని ఉద్దేశించే విష్టు అసంతృప్తి వ్యక్తం చేశారు.