సీఎం చంద్రబాబు వైజాగ్ టూర్ రద్దు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ్టి విశాఖపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు.. షెడ్యూల్ ప్రకారం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం.. మరోవైపు, విమాన ప్రమాదం ఘటనతో.. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట కూటమి ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన కార్యక్రమం కూడా రద్దు చేశారు.. ఇక, అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం.. ఈ ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని కీలక అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది..
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో విద్య, వ్యవసాయం కుంటుపడింది..
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్ ) మండిపడ్డారు. విద్యా వ్యవస్థ కూడా కుంటుపడింది.. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదు అని పేర్కొన్నారు. విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదు.. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతు రోసా అమలు విషయంలో ప్రణాళిక లేదు అని ఆరోపించారు. పాఠశాలలు ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడడం లేదు.. అరకొర రుణమాఫీ, ఆచూకీ లేని రైతు భరోసా, అందని రైతు మా, ప్రాజెక్టులు పడావు అని విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పండగలా మారిన వ్యవసాయం.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తోంది అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, 1000కి పైగా సంక్షేమ గురుకులాల ఏర్పాటుతో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ విద్యా వ్యవస్థ.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అవస్థలు ఎదుర్కొంటున్నది అని కేటీఆర్ విమర్శించారు. తక్షణమే రాష్ట్రంలో విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే, రైతులకు ఎరువులను, విత్తనాలను అందించాలి.. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
కర్ణాటకలో రోడ్డుప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల మృతి
కర్ణాటకలో హోసకోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందారు.. తిరుపతి నుండి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసి బస్సు ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. దీంతో, బస్సులో ఉన్న కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4) మరియు (1) సంవత్సరం చిన్నారి కూడా ప్రాణాలు విడిచింది.. మరో 16 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు.. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు.. క్షతగాత్రులు హోస్కోట్‌లోని సిలికాన్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొదుతున్నారు.. మృతుల్లో ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన తులసి (21) బీటెక్ విద్యార్థి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది..
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ
ప్రధాని మోడీ అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలికి చేరుకున్నారు. సంఘటనాస్థలిని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు.. మృతుల గురించి వాకబు చేశారు. ఇక ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు. దు:ఖంలో ఉన్న కుటుంబాలను ఓదార్చనున్నారు. గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్‌పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక 15 మంది మెడికోలు కూడా చనిపోయినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. మొత్తంగా 265 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. ఇక మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (68) కూడా ఉన్నారు. లండన్‌లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.కోటి పరిహారం ప్రకటించింది.
కుటుంబం మొత్తాన్ని బలిగొన్న విమాన ప్రమాదం.. లండన్‌లో స్థిరపడాలని..!
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఏఐ171 విమానం గురువారం (జూన్ 12) ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మృతి చెందారు. విమానం భవనంపై కుప్పకూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 265కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. లండన్‌లో స్థిరపడాలని బయల్దేరిన ఓ కుటుంబం మొత్తాన్ని విమాన ప్రమాదం బలిగొంది. విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 10 మంది మృతి చెందగా.. వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి కుటుంబ సభ్యులు అందరూ మృతి చెందారు. డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్.. వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనతో ప్రతీక్ జోషి కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఓ నవ వధువు కూడా చనిపోయింది. రాజస్థాన్‌కు చెందిన ఖుష్బూకు గత జనవరిలో పెళ్లయింది. ఆమె భర్త లండన్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. లండన్ వెళ్లాక తొలిసారి భర్తను కలిసేందుకు ఖుష్బూ గురువారం బయలుదేరింది. విమాన ప్రమాదంలో ఖుష్బూ మరణింది. దీంతో ఖుష్బూ జాడ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లండన్‌లో ఉన్న భర్త శోకసముద్రంలో మునిగిపోయాడు.
ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించాం.. ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడి
ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్‌కు అణు కార్యక్రమానికి హృదయం లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. అందులో నటాంజ్ స్థావరం కూడా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో నెతన్యాహు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. వైమానిక దాడుల్లో ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసమయ్యాయి. పక్కా ప్రణాళికతో ఈ దాడులు చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక దాడుల్లో ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హుస్సేన్ సలామి అమరుడయ్యాడని స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మేజర్ జనరల్ హుస్సేన్ సలామితో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర ముఖ్య అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అట్టుడుకుతున్న పశ్చిమాసియా.. శక్తివంతమైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మృతి
పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతోంది. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. వైమానిక దాడుల్లో ఇరాన్‌లో శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హుస్సేన్ సలామి అమరుడయ్యాడని స్థానిక మీడియా పేర్కొంది. ఇక ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మేజర్ జనరల్ హుస్సేన్ సలామితో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర ముఖ్య అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధపడుతోంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తం అయింది. దేశమంతా ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ రక్షణ శాఖ హెచ్చరించింది.