నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.. కీలక ప్రకటన చేయనున్న ఏపీ సీఎం..!
నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.. ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, ఉన్నతాధికారులు.. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు నాయుడు.. జనాభాపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.. ఇప్పటికే జనాభాలో యువత తగ్గడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. రాబోయే పదేళ్లలో వృద్ధులు ఎక్కువ అవుతారని గణాంకాలు చెబుతున్నాయి.. దీంతో, జనాభా పెరుగుదల ఆవశ్యకతను సీఎం చంద్రబాబు వివరించే అవకాశం ఉంది.. మరోవైపు, దక్షిణ భారతంలో జనాభా తగ్గుదలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.. గతంలో.. ఒక్కరు ముద్దు.. ఇద్దరు చాలు అని ప్రచారం చేసిన ప్రభుత్వాలు.. ఇప్పుడు.. ముగ్గురుని కనండి.. నలుగురైతే నష్టమేంటి అనేవిధంగా తమ నిర్ణయాలను మార్చుకుంటున్నాయి.. పిల్లలను బరువుగా భావించకుండా.. ఆస్తిగా పరిగణించాలని కూడా చెబుతున్నారు.. దీంతో, ఇవాళ జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందంటున్నారు..
మెడికల్ కాలేజీలో విద్యార్థులకు లైంగిక వేధింపులు..!
నిత్యం ఏదో ఒక మూల.. మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు.. పసికూనలు, బాలికలు, యువతులు, మహిళలు.. వృద్ధులు అనే తేడా లేకుండా.. ఎక్కడో ఓ చోట.. ఈ వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి.. దీనిపై పది మందితో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేశారు ప్రిన్సిపాల్.. కమిటీ దృష్టికి కీలక విషయాలు తీసుకువచ్చారు విద్యార్థినులు.. బయో కెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రో బయాలజీ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయో కెమిస్ట్రీ ఎల్ టీ గోపాలకృష్ణ, పాదాలజీ ఎల్ టీ ప్రసాద్ లు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.. మెయిల్ ద్వారా ఒకేసారి ఫిర్యాదు చేశారు 50 మంది విద్యార్థినులు.. దాంతో విద్యార్థినుల నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకుంది కమిటీ.. తమ శరీరాన్ని తాకుతూ, బుగ్గలు నిమురుతూ వికృత చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని ఆరోపిస్తున్నారు విద్యార్థినులు.. తమ ఫోటోలు అసభ్యకరంగా తీసి, వన్ టైం వ్యూ ద్వారా తమ వాట్సాప్ కి పంపించే వారని కంప్లైంట్ చేశారు.. రూమ్‌కి రమ్మని బెదిరించడం.. డబ్బులు ఇస్తానని అనడం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.. మద్యం సేవించి బూతులు తిట్టేవారని, తమ మాట వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని కమిటీ దృష్టికి తీసుకుని వెళ్లారు విద్యార్థినులు..
ఎర్రచందనం స్మగ్లర్ల బరితెగింపు.. పుష్ప సినిమాకు మించిన సీన్..!
ఎర్రచందనం చెట్లను ఎలా నరకాలి.. వాటికి ఓ చోటికి ఎలా చేర్చాలి.. అక్కడి నుంచి ఫారెస్ట్ అధికారులు, పోలీసుల కళ్లు గంపి.. ఎలా తరలించాలి.. ఇలా కొత్త ఐడియాలు ‘పుష్ప’ సినిమాలో చూపించారు.. ఆ తర్వాత పుష్ప సినిమాలోని సీన్ల తరహాలో ఎన్నో స్మగ్లింగ్ ఘటనలు వెలుగు చూశాయి.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు.. ఉపయోగించిన టెక్నిక్‌తో.. అటు ఫారెస్ట్ అధికారులు.. ఇటు పోలీసులు నోరువెల్లబెడుతున్నారు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు.. ఎర్రచందనం అక్రమ రవాణాకు పోలీస్ స్టిక్కర్లు తమ వాహనాలకు వేసుకొని మరి స్మగ్లింగ్ చేస్తుండగా కల్లూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు.. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లు తిరుపతి రుయా ఆసుపత్రిలో సమీపంలో ఉండే ఆంబులెన్స్ డ్రైవర్లుగా గుర్తించారు.. వారి వద్ద నుండి దాదాపు 13 లక్షల రూపాయలు విలువచేసే 8 ఎర్రచందనం దుంగలను, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అటవీశాఖ అధికారులు.. స్వతగాహ అంబులెన్స్ డ్రైవర్లు కావడంతో రూట్లు తెలియడంతోపాటు వేగంగా నడిపే అలవాటు ఉండటంతో ఈజీ మనీ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు అరెస్టు అయినా ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు…
శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు.. పర్యాటకుల తాకిడి..!
కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం డ్యామ్ దగ్గర.. గేట్లు ఎత్తినప్పుడు.. ఆ కృష్ణమ్మ పరవళ్లు తొక్కే విధానం అందరినీ కట్టిపడేస్తోంది.. రెగ్యులర్‌గా శ్రీశైలం వెళ్లేవారు సైతం.. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తినప్పుడు మరోసారి వెళ్లి వద్దాం అనుకుంటారు.. అలాంటి వాతావరణం అక్కడ ఉంటుంది.. శ్రీశైలం డ్యామ్ నుంచి దూకే కృష్ణమ్మ పాలనురగలా.. అందరినీ ఆకట్టుకుంటుంది.. ఇక, డ్యామ్ పరిసరాల్లో.. వర్షంలా పడే ఆ తుంపర్లలో సేదతీరితూ ఎంజాయ్ చేస్తుంటారు పర్యటకులు, శివయ్య భక్తులు.. ఈ ఏడాది కూడా శ్రీశైలం గేట్లు ఎత్తడంతో.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యటకులు తరలివస్తున్నారు.. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,48,696 క్యూసెక్కుల నీరు వచ్చి డ్యామ్‌లో చేరుతుండగా.. మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం.. 882.80 అడుగులుగా ఉంది.. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 203.4290 టీఎంసీలుగా ఉంది.. ఇక, కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఇలా.. ఔట్ ఫ్లో రూపంలో శ్రీశైలం నుంచి 1,48,734 క్యూసెక్కుల నీరు.. నాగార్జున సాగర్‌లోకి వెళ్తోంది.. ఇక, ఈ రోజు శుక్రవారం కావడంతో.. శని, ఆదివారాల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.. ఇదే సమయంలో.. పర్యటకుల తాకిడితో.. భారీ ఎత్తు ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్న విషయం విదితమే..
జీహెచ్ఎంసీ పరిధిలో బదిలీలు.. 23 మంది డిప్యూటీ కమిషనర్ల పోస్టింగ్ మార్పు..!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో విస్తృత స్థాయిలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 23 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పలువురికి పదోన్నతులు కూడా ఇచ్చి కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. ఇందులో ఎవరెవరు ఎక్కడి నుండి ఎక్కడికి బదిలీ అయ్యారంటే.. ఖైరతాబాద్ సర్కిల్‌కు జయంత్ ను డిప్యూటీ కమిషనర్‌గా నియమించగా, యూసఫ్‌గూడా డీసీగా రజనీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్కాజ్ గిరి డిప్యూటీ కమిషనర్ గా జకియా సుల్తానా, చందానగర్ కు శశిరేఖ, ఉప్పల్ కు రాజును నియమించారు. అలాగే, సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా ఆంజనేయులు, గోషామహల్ కు ఉమా ప్రకాష్, రాజేంద్రనగర్ కు రవికుమార్, ఎల్బీనగర్ కు మల్లికార్జునరావు, హయత్ నగర్ కు వంశీకృష్ణ బాధ్యతలు చేపడతారు. అలాగే మూసాపేట్ డిప్యూటీ కమిషనర్‌గా సేవా ఇస్లావత్, బేగంపేట్ కు డాకు నాయక్‌ను నియమించారు.
భూమి మీదకు శుభాన్షు శుక్లా తిరిగి రావడం వాయిదా.. ఆరోజే వచ్చేది..!
ఆక్సియం-4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు అస్ట్రోనాట్స్ జూలై 14వ తేదీన భూమి పైకి తిరిగి రాబోతున్నారని నాసా ప్రకటించింది. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ గురువారం నాడు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే, ఆక్సియం-4 మిషన్ పురోగతిని క్షణ్ణంగా పరిశీలిస్తు్న్నామని, దానిని ఈనెల 14వ తేదీన అన్ డాక్ చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 25వ తేదీన ఆక్సియం-7 మిషన్ ను నాసా ప్రయోగించింది. మరుసటి రోజు ఐఎస్ఎస్ లో అస్ట్రోనాట్స్ విజయవంతంగా ల్యాండ్ అయ్యారు. అప్పటి నుంచి శుభాన్షు శుక్లా సహా ఇతర వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో పలు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. అయితే, వారు జూలై 10వ తేదీనే భూమి పైకి తిరిగి రావాల్సి ఉండగా.. దానిని జూలై 14వ తేదీకి వస్తున్నారని నాసా వెల్లడించింది. భూమి మీదకు వచ్చిన తర్వాత వ్యోమగాములు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.
మోడీ టూర్‌పై పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఖండించిన విదేశాంగ శాఖ
ప్రధాని మోడీ ఇటీవల ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించి వచ్చారు. మూడు దేశాల అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు. తాజాగా మోడీ పర్యటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న భారతదేశాన్ని వదిలేసి.. కేవలం 10 వేల మంది ఉన్న దేశాల్లో మోడీ పర్యటించడం ఆశ్చర్యం కలిగిస్తోందని విమర్శించారు. మోడీ ఏఏ దేశాలకు వెళ్తున్నారో ఆ దేవుడికే తెలియాలన్నారు. 140 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశంలో ఉండరు కానీ.. 10 వేల మంది కూడా ఉండని దేశాలకు మాత్రం వెళ్తుంటారని వ్యాఖ్యానించారు. పైగా అక్కడ అత్యున్నత పురస్కారాలు కూడా అందుతున్నాయని ఎద్దేవా చేశారు.
గాజాపై యుద్ధం ముగియలేదు.. హమాస్ పాలన అంతమే లక్ష్యమన్న నెతన్యాహు
గాజాపై ఇంకా యుద్ధం ముగియలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా స్పీకర్‌తో సమావేశం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విలేకరులతో మాట్లాడారు. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యా్న్ని ఇజ్రాయెల్ పూర్తి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందమే కుదిరిందని.. కానీ హమాస్ ప్రభుత్వాన్ని అంతం చేయడమే తమ అంతిమ లక్ష్యమని తేల్చి చెప్పారు. గాజాలో హమాస్ సైనిక, పాలనా సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని వెల్లడించారు. పాలనకు హమాస్ ముగింపు పలికితేనే సమస్యకు పరిష్కారం అని.. అంతే తప్ప 60 రోజుల కాల్పుల విరమణ శాంతికి మార్గం కాదని స్పష్టం చేశారు. ఇక ఇరాన్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత వాషింగ్టన్‌లో చారిత్రక పర్యటన జరిగిందని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఇక హమాస్ చెరలో ఉన్న బందీలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బాధిత కుటుంబాలకు నెతన్యాహు హామీ ఇచ్చారు.
సినిమాలు లేక.. ఖాళీగా దర్శనమిస్తోన్న థియేటర్స్
జులై మొదలవడంతోనే నిరాశపరిచింది. గత వారం వచ్చిన నితిన్ తమ్ముడు బిగ్గెస్ట్ డిజాస్టర్ అయి డిస్ట్రిబ్యూటర్స్ ను నిండా ముంచేసింది. కొన్ని ఏరియాలలో సాయంత్రం షోస్ కూడా పడలేదంటే థియేటర్ల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక నవీన్ చంద్ర షో టైమ్ పరిస్థితి కూడా ఇంతే. కాకుండా ఈ సినిమాను కేవలం లిమిటెడ్ థియేటర్స్ లో కమిషన్ బేస్ మీద రిలీజ్ చేయడం వలన ఎవరికీ నష్టాలు ఏమి లేవుకానీ థియేటర్స్ షోస్ కూడా పడని పరిస్థితి. ఇక ఈ వారం కూడా పరిస్థితి దాదాపు ఇంతే. సుహాస్ నటించిన ఓ భామ అయ్యో రామ ఈ రోజు థియేటర్స్ లో విడుదలవుతోంది. వారానికి ఓ సినిమాతో వస్తున్న సుహాస్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఈ సినిమాకు బజ్ అంతగా ఏమి లేదు. ట్రైలర్ కూడా అంతంత మాత్రమే. ఇక చక్రవాకం సీరియల్ తో గుర్తింపు తెచుకున్న ఆర్కే నాయుడు నటించిన చిత్రం 100. రెండు రోజుల ముందుగా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించిన ఈ సినిమా వస్తున్నట్టు తెలీదు. సినిమాకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా చాలా వీక్ గా చేసారు. ఈ రెండిటితో పాటు వర్జిన్ బాయ్స్ అనే సినిమా కూడా నేడు రిలీజ్ అవుతుంది. కేవలం ఓటీటీ కోసమే థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నట్టు ఉంది ఈ సినిమా. ఈ మూడు సినిమాలు లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. స్టార్స్ సినిమాలు ఏమి లేక థియేటర్స్ లు ఖాళీగా ఉంటున్నాయి. చిన్న సినిమాల వలన థియేటర్స్ ఓనర్స్ కు కనీసం రెంట్ ఖర్చులు కూడా రావడం లేదు.
‘కూలీ’ టికెట్ బుకింగ్స్‌కు డేట్ లాక్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ మాస్ మోడ్‌లోకి రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘కూలీ’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా టాప్ ట్రెండింగ్ మూవీలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడని ప్రకటించిన నాటి నుంచే అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ సినిమాపై ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పాజిటివ్ హైప్ ఉంది. ముఖ్యంగా రజినీ అభిమానులు తమ అభిమాన నటుడిని మళ్లీ యాక్షన్ గెటప్‌లో చూడబోతున్నారని తెగ ఉత్సాహపడుతున్నారు. ఇక రజినీకాంత్ తో పాటు ఉపేంద్ర, నాగార్జున, శ్రుతి హాసన్ వంటి టాప్ స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో మల్టీ స్టారర్ మేజిక్ వర్క్ అవుతుందనే నమ్మకం తో మేకర్స్ ఉన్నారు.