శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి.. నలుగురి అరెస్ట్..
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్, సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నలుగురు నెయ్యి సరఫరాదారులు అరెస్ట్ చేశారు. ఏర్ డైరీ ఏండీ రాజశేఖరన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు బోలేబాబా డైరీ నిర్వాహకులతోపాటు.. నెల్లూరు వైష్ణవీ డైరీకి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో నిందితులను ప్రవేశపెట్టింది సిట్.. ఆ తర్వాత ఈ నెల 20వ తేదీ వరకు ఆ నలుగురు నిందితులకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి.. ఇక, త్వరలో ఈ వ్యవహారానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులను విచారణ పిలిచే అవకాశం ఉందంటున్నారు.. లిస్ట్ లో ఉన్న రాజకీయ నేతలతో పాటు.. టీటీడీలోని కీలకమైన అధికారులను విచారణకు పిలిచే అవకాశాలున్నాయి.. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్‌ను నియమించింది. ఇందులో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు భారత ఆహార భద్రత-ప్రమాణాల అథారిటీకి చెందిన సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారని, సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. మొత్తంగా గత సంవత్సరం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో మూడు రాష్ట్రాల్లోని మూడు డెయిరీలకు నాయకత్వం వహిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నెయ్యి సరఫరాలో ఉల్లంఘనలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది..
ఎమ్మెల్సీ ఎన్నికలు.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు..
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు నేడు గుంటూరు కలెక్టరేట్‌లో పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణరావు నామినేషన్ వేయనున్నారు. ఇక రేపు నామినేషన్లు పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు గడువునిచ్చింది ఈసీ. ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ చేస్తారు. అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 3 లక్షల 15 వేల 267 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. దీంతో 440 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఈసీ. కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ… నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 85 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. నేడు గడువు ముగియనుండడంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. అటు వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేడు పీఆర్‌టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్‌ను వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తిరుపతి తొక్కిసలాటతో అలర్ట్.. శివరాత్రి ఏర్పాట్లపై ఫోకస్.. నేడు శ్రీశైలానికి ఆరుగురు మంత్రులు..
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది… శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడుతుంది.. శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గతంలో ఎన్నడూ మంత్రులు సమీక్షించిన సందర్భాలు లేవు. రాజధాని అమరావతి నుంచే దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ స్థానిక అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను సమీక్షించేవారు. ఈ ఏడాది ఐదుగురు మంత్రులు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షకు శ్రీశైలం వస్తున్నారు. ఈరోజు మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత, ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలం చేరుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో శివరాత్రి ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈనెల 23న సీఎం చంద్రబాబు భ్రమరాంభ, మల్లికార్జునస్వాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. కేవలం జిల్లా మంత్రి పట్టువస్త్రాలు సమర్పించేవారు. సీఎం స్వయంగా స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారంటే శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పకనే తెలుస్తుంది.
నేటి నుండి జిహెచ్ఎంసిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ నేటి నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ వరకు తమ నామినేషన్ పత్రాలు జిహెచ్ఎంసి కార్యదర్శి కార్యాలయంలో సమర్పించవచ్చు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, తమ నామినేషన్ పత్రాలను మరో ఇద్దరు కార్పొరేటర్ల మద్దతుతో సమర్పించాలి. నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. నామినేషన్ల పరిశీలనను ఫిబ్రవరి 18న నిర్వహించనున్నారు. ఆ రోజు నామినేషన్ల తుది జాబితాను జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఎన్నికలు జరిగితే, 15 స్థానాలున్న స్టాండింగ్ కమిటీకి అత్యధిక మెజార్టీ సాధించిన 15 మంది సభ్యులు ఎంపిక అవుతారు. గత పదేళ్లుగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయి. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో ఈసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి, ఇతర పార్టీ కార్పొరేటర్ల మద్దతు కోసం అభ్యర్థులు లాబీయింగ్ చేపట్టే అవకాశం ఉంది.
కుంభమేళా ఏర్పాట్లపై కాంగ్రెస్ డిప్యూటీ సీఎం ప్రశంసలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పుణ్యస్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కూడా ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పుణ్యస్నానం చేశారు. అనంతరం డీకే.శివకుమార్ మీడియాతో మాట్లాడారు. మహా కుంభమేళాలో ఏర్పాట్లు బాగున్నాయంటూ కితాబు ఇచ్చారు. ఇది చాలా పవిత్రమైనదని.. ప్రతి వారి జీవితంలో చారిత్రాత్మక క్షణం అని చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లో అన్ని ఏర్పాట్లు బాగున్నాయంటూ నిర్వాహకులకు డీకే.శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు. భక్తిలో భాగంగానే కుంభమేళాను సందర్శించినట్లుగా తెలిపారు. ఇక ఏర్పాట్లపై ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఎవరైనా ఏమి చెప్పాలనుకున్నా.. ఇది మన ధర్మం, ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. కనుక వ్యక్తిగత నమ్మకాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేని స్పష్టం చేశారు. కుంభమేళాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సందర్భాను సారంగా చేసిన వ్యాఖ్యలు అని తెలిపారు.
నేడు ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు మోడీ.. ట్రంప్‌తో సమావేశం
ప్రధాని మోడీ సోమవారం రెండు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఫ్రాన్స్, అమెరికాలో మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఏఐ సమ్మిట్‌కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఫ్రాన్స్ అభ్యర్థన మేరకు మోడీ.. ఏఐ సమ్మిట్‌కు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు, చైనా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇక ఫిబ్రవరి 12న ఫ్రాన్స్ వీవీఐపీ విందు ఇవ్వబోతుంది. ఈ విందులో కూడా ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కూడా భేటీ అయి ఇరు దేశాల సంబంధాలపై చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా థర్మో న్యూక్లియర్ యాక్టర్‌ను కూడా మోడీ సందర్శించనున్నారు. అనంతరం ఫ్రాన్స్ నుంచి మోడీ అమెరికా వెళ్లనున్నారు. 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. ఆయన్ను కలిసిన ప్రపంచ నాయకుల్లో అతి కొద్ది మందిలో మోడీ ఒకరు కావడం విశేషం. అంతేకాకుండా కొన్ని రోజులకే అమెరికా నుంచి మోడీకి ఆహ్వానం రావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది
వాహనాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపారు.. 25 మంది మృతి
ఆఫ్రికన్ దేశమైన మాలిలో పరిస్థితి నిరంతరం దిగజారుతోంది. హింస ఆగే సూచనలు కనిపించడం లేదు. మరోసారి, ముష్కరులు వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. సైనిక నిఘాలో ఉన్న వాహనాల కాన్వాయ్‌పై ముష్కరులు దాడి చేశారని, 25 మంది పౌరులు మరణించారని సైనిక ప్రతినిధి తెలిపారు. మరణించిన వారిలో ఎక్కువ మంది బంగారు గనిలో పనిచేస్తున్నవారు ఉన్నారు. ఈ దాడి శుక్రవారం నాడు జరిగింది, దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని అతిపెద్ద నగరం గావో నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పాలక సైనిక దళాలను వ్యతిరేకించే సాయుధ గ్రూపులు చురుకుగా ఉన్నాయి. ఈ సంవత్సరం పౌరులపై జరిగిన అత్యంత ప్రాణాంతకమైన దాడి ఇదేనని చెబుతున్నారు. ఇక్కడ నిరంతరం ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు, ఇది ప్రజలలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఆర్మీ ప్రతినిధి కల్నల్ మేజర్ సౌలేమానే డెంబెలే ప్రకారం, దాడి చేసిన వారు సైన్యం నడుపుతున్న దాదాపు 60 వాహనాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. దీని కారణంగా ప్రతిచోటా గందరగోళం నెలకొంది. ఈ సమయంలో, సైనిక సిబ్బంది బాధితులకు సహాయం చేసి, గాయపడిన 13 మందిని గావో ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ఈ దాడిలో ముష్కరులు కూడా గాయపడ్డారు. అయితే, ఈ దాడిలో ఏ సైనిక సిబ్బంది గాయపడినట్లు ప్రతినిధి వ్యాఖ్యానించలేదు.
వాలంటైన్స్ డే ముందు ఓయోకు గుడ్ న్యూస్.. ఆరు రెట్లు పెరిగిన లాభం
ఓయో మ్యాజిక్ కొనసాగుతుంది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.166 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం కంపెనీ లాభం రూ. 25 కోట్లు. ఇందులో ఆరు రెట్లు పెరుగుదల ఉంది. ఆ కంపెనీ ఆదాయం రూ.1,695 కోట్లు. ఇది గత సంవత్సరం రూ.1,296 కోట్ల కంటే 31 శాతం ఎక్కువ. గత సంవత్సరం ఇది మంచి పనితీరును కనబరిచింది. OYO EBITDA రూ. 249 కోట్లు. ఇది గత సంవత్సరం రూ.205 కోట్ల కంటే 22 శాతం ఎక్కువ. స్థూల బుకింగ్ విలువ (GBV) రూ.3,341 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం రూ.2,510 కోట్ల కంటే 33 శాతం ఎక్కువ. ఈ గణాంకాలు G6 హాస్పిటాలిటీ ఆర్థిక డేటాను మినహాయించాయి. ఆ కంపెనీ డిసెంబర్ మూడవ వారంలో దానిని కొనుగోలు చేసింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో, ఓయో రూ.457 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కాగా గత ఏడాది రూ.111 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఇప్పుడు ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.166 కోట్ల లాభాన్ని ఆర్జించింది. భారతదేశం, అమెరికా వంటి పెద్ద మార్కెట్లలో మెరుగైన పనితీరు కారణంగా కంపెనీలో ఈ వృద్ధి జరిగింది.
నీ మైండ్ ఏమైనా దొబ్బిందా?.. బౌలర్‌పై రోహిత్ శర్మ ఫైర్!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. జో రూట్ (69; 72 బంతుల్లో 6×4), డకెట్ (65; 56 బంతుల్లో 10×4)లు హాఫ్ సెంచరీలు బాదారు. భారీ లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (119; 90 బంతుల్లో 12×4, 7×6) సెంచరీ చేయగా.. శుభ్‌మన్ గిల్ (60; 52 బంతుల్లో 9×4, 1×6) అర్ధ శతకం బాదాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్.. బౌలర్ హర్షిత్ రాణాపై ఫైర్ అయ్యాడు. ‘నీ మైండ్ ఏమైనా దొబ్బిందా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా హర్షిత్ రాణా 32వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లోని ఐదో బంతిని జోస్ బట్లర్ డిఫెన్స్ ఆడాడు. బంతిని అందుకున్న హర్షిత్.. అవసరం లేకున్నా బంతిని వికెట్ల వైపు బలంగా విసిరాడు. బంతి కాస్త కీపర్ కేఎల్ రాహుల్‌కు దూరంగా వెళుతూ.. బౌండరీకి దూసుకెళ్లింది. దాంతో ఓవర్ త్రో రూపంలో ఇంగ్లండ్‌కు అదనంగా 4 పరుగులు వచ్చాయి. బట్లర్ పరుగు కోసం ప్రయత్నించకున్నా.. హర్షిత్ బంతిని విసిరిన తీరుతో రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. హర్షిత్ బౌలింగ్ కోసం వెళుతుండగా.. ‘నీ మైండ్ ఏమైనా దొబ్బిందా’ అంటూ హిట్‌మ్యాన్ హిందీలో తిట్టాడు. అందుకు హర్షిత్ ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కినెట్టి.. గేల్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్!
గత కొంతకాలంగా విఫలమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాదాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. 76 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. చాలా నెలల తర్వాత హిట్‌మ్యాన్ శతకం బాదడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కీలక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముంగిట హిట్‌మ్యాన్ ఫామ్ అందుకోవడం భారత జట్టుకు శుభపరిణామం. ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ టాప్-10లోకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టె రాహుల్ ద్రవిడ్‌ను హిట్‌మ్యాన్ వెనక్కినెట్టాడు. ద్రవిడ్ 318 ఇన్నింగ్స్‌లలో 10,889 పరుగులు చేయగా.. రోహిత్ 259 ఇన్నింగ్స్‌లలో 10,964 రన్స్ చేశాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (18,426), విరాట్ కోహ్లీ (13,906), సౌరవ్ గంగూలీ (11,363) హిట్‌మ్యాన్ కంటే ముందున్నారు. రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఏడు సిక్సర్లు బాదాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు (338) బాదిన రెండో బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. రెండో వన్డేకు ముందు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (331)తో సంయుక్తంగా రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఏడు సిక్సర్లతో గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (351) అగ్రస్థానంలో ఉన్నాడు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో అఫ్రిది రికార్డును రోహిత్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ఏదైనా మనదాకా వస్తే కానీ అర్థం కాదు: కరీనా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. నటిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే హీరో సైఫ్ అలీఖాన్‌ని వివాహం చేసుకుంది. ప్రజంట్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ, అడపదడప సినిమాలు చేస్తుంది. అయితే ఇటీవల ముంబైలోని తన నివాసంలో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించి మనకు తెలిసిందే. నిందితుడు చేతిలో అనేకసార్లు కత్తిపోటుకు గురైన సైఫ్.. అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్ని ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. సిసిటివి ఫుటేజ్ ఉపయోగించి ముంబై పోలీసులు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెజాద్‌ను ప్రాధమిక నిందితుడిగా అరెస్టు చేశారు. ఈ కేసుపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత సైఫ్ అలాగే కరీనా కపూర్ ఖాన్ పై చాలా పుకార్లు వచ్చాయి. దీంతో కరీనా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా ఈ అమ్మడు ‘వివాహాలు..విడాకులు’ గురించి వైరల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘జీవితంలో మనం అనుకునే సిద్ధాంతాలు, ఊహలు ఏవీ వాస్తవాలు కావు. కానీ కొన్ని విషయాలలో ఇతరుల కంటే మనమే గొప్ప తెలివైన వాళ్లం అనుకుంటాం. కానీ సందర్భం వచ్చినప్పుడు జీవితం మన మెడలు వంచి పాఠాలు నేర్పుతుంది. ముఖ్యంగా ఈ పెళ్లిళ్లు, విడాకులు, ఆందోళన, పిల్లలు పుట్టడం, ఆత్మీయుల మరణాలు, పిల్లల పెంపకం.. ఇవన్నీ మన దాకా వస్తేనే పూర్తిగా అర్థమవుతాయి’ అంటూ చెప్పుకొచ్చింది కరీనా. ఇంతకు ముందు సైఫ్ పై దాడి జరిగిన రోజు కూడా కరీనా పై రకరకాల రూమర్స్ వచ్చాయి..‘సైఫ్ పై దాడి ఇక మా కుటుంబానికి ఎంతో సవాళ్లతో కూడిన రోజు. అసలు ఎలా జరిగిందో మాకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కావడం లేదు. ఈ కష్ట సమయంలో కనికరం లేని ఊహాగానాలు, కథనాలకు దూరంగా ఉండాలని మీడియాకు, ఫొటోగ్రాఫర్లకు సవినయంగా మనవి చేస్తున్నా’ అని ఆమె అప్పట్లో రాసుకొచ్చారు. ఇక రీసెంట్ పోస్ట్ చూసుకుంటే కనుక జీవితంలో అన్నింటికి సిద్ధంగా ఉండాలి అని చెప్పకనే చెబుతుంది ఈ అమ్మడు.