ప్రజలు జగనన్న వన్స్ మోర్ అంటున్నారు.. టీడీపీది పగటి కలే..!
జగనన్న వన్స్‌మోర్ అని ప్రజలు అంటున్నారు.. అధికారంలోకి వస్తామనేది టీడీపీ పగలి కలే అని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. 2019 నుండి ఎక్కడా గెలవకపోవడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కిపోయారు.. శవాల నోట్లో తులసి తీర్థం పోసిన విధంగా టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయి.. ఆ ఎమ్మెల్సీలు సొంత ఓట్లు, సింబల్‌తో గెలవలేదు.. అయినా పెద్ద ఘనకార్యం సాధించినట్లు సంబరాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు.. కానీ, వాళ్ల అహంకారం కళ్లు నెత్తికెక్కి అసెంబ్లీలో స్పీకర్ ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కులానికి చెందిన స్పీకర్‌ను అవమానించి దాడికి యత్నించడం ఎంత వరకు సబబు? అంటూ ఫైర్ అయ్యారు రోజా.. చేసిన తప్పును సమర్థించుకోవడానికి మా నాయకులపై నిందలు వేయడం సిగ్గు చేటన్న ఆయన.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల జాతి వాళ్లకు పదవులు ఇస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితులను ముందు పెట్టి అన్యాయం చేస్తున్నామని చెప్పడం దురదృష్టకరం అన్నారు. ఇక, జీవో నంబర్ 1 కోసం తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎప్పుడైనా ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చిందా? అని నిలదీశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేస్తే ప్రజా రక్షణ బాధ్యతతో జీవో నంబర్ వన్‌ను తీసుకొచ్చామన్న రోజా.. ఆ జీవో ప్రజలకు రక్షణ కల్పించడానికే.. జీవో రద్దు అంటే ప్రజలను చంపడానికి అవకాశమివ్వడమే అన్నారు. వాళ్లకు ఎమ్మెల్సీలు వస్తే ఏం జరిగదు.. 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారు.. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే అన్నారు. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అంటూ హెచ్చరించారు మంత్రి ఆర్కే రోజా.
ఆర్థిక సంక్షోభంలో పీసీసీ.. పార్టీ ఆఫీస్‌ల ఆస్తి పన్ను కూడా కట్టలేని పరిస్థితి..!
ఆర్థిక సంక్షోభంలో పీసీసీ కూరుకుపోయింది.. అది ఎంతలా అంటే.. పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను కూడా చెల్లించలేని స్థితి వచ్చింది.. దీనికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏఐసీసీకి రాసిన లేఖ సాక్షింగా నిలుస్తోంది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి.. రాష్ట్రంలోని తొమ్మిది కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు గానూ రూ. 1.40 కోట్లకు పైగా బకాయిలు చెల్లాంచాలని పేర్కొంది.. దీంతో.. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను చెల్లింపు వివరాలను ఏఐసీసీ ట్రెజరర్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.. దీనిపై స్పందించిన ఏఐసీసీ.. స్థానికంగానే నిధులు సమీకరించుకుని బకాయిలు చెల్లించుకోవాలని సమాధానం ఇచ్చింది.. దీంతో.. పార్టీలోని సీనియర్లను.. పార్టీ సానుభూతిపరులను విరాళాలు కోరుతూ లేఖ రాశారు గిడుగు రుద్రరాజు.. విరాళాలు అందించే వారు ఏ ఖాతాల్లో వేయాలో అనే బ్యాంకు వివరాలను కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.. మొత్తంగా విరాళాలు సేకరించి.. ఆస్తి పన్ను చెల్లించేందుకు పీసీసీ సిద్ధం అయ్యింది. ఏఐసీసీకి రాసిన లేఖలో వివిధ జిల్లాల కార్యాలయాలకు పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను వివరాలను పేర్కొన్నారు గిడుగు రుద్రరాజు.. విశాఖపట్నం రూ.30 లక్షలు, కాకినాడ రూ.42,71,277, ఏలూరు రూ.6,29,926, విజయవాడ రూ.41,73,917, గుంటూరు రూ.3,92,282, ఒంగోలు రూ.5,31,783, నెల్లూరు రూ.1,51,867, కడప రూ.6 లక్షలు, కర్నూలు రూ.2,94,890.. ఇలా మొత్తంగా రూ.1.40 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న వివరాలను లేఖలో పొందుపర్చారు.. ఇక, దానిపై అధిష్టానం స్పందించిన తర్వాత.. ఇప్పుడు ఫండ్ వసూలుకు పూనుకున్నారు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.. అసలే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న పార్టీని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.. కానీ, ఆ పార్టీని మాత్రం ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి.
జనసేన-బీజేపీ పొత్తు.. మాధవ్ సంచలన వ్యాఖ్యలు
జనసేన-బీజేపీ పొత్తుల వ్యవహారంలో బీజేపీ నేత మాధవ్ కీలక కామెంట్లు చేశారు.. పదాధికారుల సమావేశంలో ఏదో జరుగుతోందనే భావన చాలా మందిలో ఉంది. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే జాతీయ పార్టీ నిర్ణయం మేరకే ఉంటాయన్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం చేసే అంశం మీదే చర్చించామన్న ఆయన.. గతంతో పోల్చుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్ల శాతం పెరిగిందన్నారు.. విశాఖలో ఓట్ల శాతం తగ్గింది.. కానీ, మిగిలిన చోట్ల ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఇక, జనసేనతో కలిసి ఉన్నాం.. కానీ, కలిసున్నా లేనట్టేనని మేం భావిస్తున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవ్.. జనసేనతో కలిసి బీజేపీ ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉందని నమ్ముతారన్న ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదని ఆరోపించారు.. తమ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని పీడీఎఫ్ చెప్పుకుంటుంటే.. ఆ విషయాన్ని ఖండించమని జనసేనను కోరినా ఖండించ లేదని విమర్శించారు. మాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదనేది మా ఆరోపణ అన్నారు. మరోవైపు, మేం వైసీపీతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు.. మేం బీజేపీ హైకమాండ్‌కు చెప్పే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని.. వైసీపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారని భావిస్తున్నాం అన్నారు. వైసీపీ వేసిన ఈ అపవాదును తుడుచుకునే ప్రయత్నం చేస్తాం.. మే నెలలో ఈ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తామని ప్రకటించారు. పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు ఉన్నాయి.. మేం మాత్రం పార్టీ బలోపేతం గురించే ప్రయత్నం చేస్తాం.. పొత్తులు హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు బీజేపీ నేత మాధవ్.
TSPSC పేపర్ లీక్ కేసుని.. పనోళ్లతో క్లోజ్ చేసే కుట్ర చేస్తున్నారు
TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC తాళాల గుత్తి ఆంధ్రోడి చేతిలో పెట్టారని, సిట్ విచారణ అధికారి AR శ్రీనివాస్ కూడా ఆంధ్రవాడేనని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం విద్యార్ధి ఉద్యమమని, 30 లక్షల నిరుద్యోగుల గోస పట్టదా? అని మండిపడ్డారు. విచారణ సరిగ్గా జరగాలని కోరినందుకు తనకు నోటీసులు పంపారన్నారు. సిట్ అధికారి ఆంధ్ర అధికారి అయినప్పుడు రిపోర్ట్ ఎలా ఉంటుంది? ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లంతా ఎక్కడ పోయారని నిలదీశారు. సిట్ ద్వారా TSPSC లీకేజ్ పూర్తిగా బయటపడదని.. సిట్ అంటే సిట్ & స్టాండ్ మాత్రమేనని ఆరోపించారు. గతంలో సిట్ వేసిన కేసులన్నీ ఎక్కడపోయాయని.. డ్రగ్స్, నయీమ్ ల్యాండ్ , గోల్డ్ స్టోన్ ప్రసాద్, హౌసింగ్ బోర్డు, ఎమ్మెల్యే కొనుగోలు అంశం వంటివి కేసుల విచారణలు ఏమైపోయాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాల డీటెయిల్స్‌ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని తాము కోర్టులో కోరామన్నారు. గంటసేపు కోర్టులో వాదనలు జరిగాయని, ఇద్దరి తరుఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారని వివరించారు. కోర్టులో ప్రాసెస్ మొదలైందని, మూడు పేజీల రిపోర్ట్ రాశారని, ఇప్పటిదాకా సిట్ విచారించిన విషయాలు తమకు కూడా తెలపాలని కోరామన్నారు. సిట్ రిపోర్ట్ కోర్టుకు సడ్మిట్ చేయడంతో పాటు తమకు కూడా ఇవ్వాలని కోరామని తెలిపారు. పేపర్ లీకేజ్ అంశం ప్రవీణ్, రాజశేఖర్‌లకే పరిమితం కాదని.. చైర్మన్, సెక్రెటరీలు, శంకర్ లక్ష్మిలను బాధ్యులుగా చేర్చాలని డిమాండ్ చేశారు.
ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి, క్షిపణి రావచ్చు.. ఐసీసీకి మెద్వెదేవ్ వార్నింగ్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆ సంస్థ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ సోమవారం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి)పై క్షిపణి దాడి చేస్తామని బెదిరించారు. రష్యా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు క్షిపణి దాడితో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టునే బెదిరించడం గమనార్హం. ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధ నేరాలకు పుతిన్ కారణమని ఐసీసీ ఆరోపించింది, అయితే ఉక్రెయిన్‌లో ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదని రష్యా ఖండించింది. పుతిన్ విధేయుడైన మెద్వెదేవ్ టెలిగ్రామ్‌లో ఇలా వ్రాశాడు, “ప్రతి ఒక్కరు భగవంతుడు, క్షిపణులకు జవాబుదారీగా ఉంటారు. ఉత్తర సముద్రంలోని రష్యా నౌక నుంచి హేగ్‌లోని భవనంపైకి హైపర్ సోనిక్ క్షిపణి దాడి ఊహించడం సాధ్యమే.” అని ఆయన రాసుకొచ్చారు. ఆకాశాన్ని సునిశితంగా గమనిస్తూ ఉండండి అంటూ జడ్జీలను బెదిరించారు. అలాగే ఐసీసీ ఒక దయనీయ అంతర్జాతీయ సంస్థ అంటూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పేర్కొంటూ ఈ వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ న్యాయస్థానం పేర్కొంది. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు రష్యాపై చెల్లుబాటుకావని క్రెమ్లిన్ ఇప్పటికే తెలిపింది. పుతిన్ అరెస్ట్‌కు సంబంధించిన వారెంట్‌ను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సమర్థించారు.
80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు?.. కోర్టు ఆగ్రహం
ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్ అమృత్‌పాల్ సింగ్ వ్యవహరంలో పంజాబ్-హర్యానాల ఉన్నత న్యాయస్థానం పంజాబ్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేయడంలో విఫలం కావడంపై మండిపడిన న్యాయస్థానం.. ఆపరేషన్ తాలుకా నివేదికను సమర్పించాలని పంజాబ్ పోలీస్ శాఖను ఆదేశించింది. ‘‘మీ వద్ద 80 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వారంతా ఏం చేస్తున్నారు? అమృత్‌పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు?’’ అంటూ పంజాబ్- హరియాణా హైకోర్టు మంగళవారం పంజాబ్) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరారీలో ఉన్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా నిఘా వర్గాల ఫెయిల్యూర్ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తరుణంలో అతన్ని అరెస్ట్ చేసేందుకు శనివారం నుంచి భారీ ఎత్తున్న చర్యలు మొదలుపెట్టినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. ఇప్పటిదాకా 120 మంది అమృత్‌పాల్ అనుచరుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అంతకు ముందు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ పరిణామాలపై స్పందించారు. పంజాబ్ కోరుకునేది శాంతి, అభివృద్ధి మాత్రమే. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరినీ ఊపేక్షించబోమన్నారు. కఠినంగా అణచివేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిసామరస్యాలకు విఘాతం కలిగించేందుకు యత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భగవంత్ మాన్ పేర్కొన్నారు. అమృత్‌పాల్ ఆచూకీ కోసం పోలీసులు చేపడుతోన్న ఆపరేషన్‌పై పంజాబ్ ముఖ్యమంత్రి తొలిసారిగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిసామరస్యాలతోపాటు దేశ పురోగతే తన ప్రాధాన్యాలని పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తులను వదిలిపెట్టబోమన్నారు. ‘
పూజా పాప కోసం పాట అందుకున్నాడు…
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ లవ్ యాక్షన్ మూవీ అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ రంజాన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కి రెడీ అవుతున్న ‘KKB KKJ’ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. లేటెస్ట్ గా ‘KKB KKJ’ సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు. అమాన్ మల్లిక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ ‘జీ రహే థె హమ్’ సాంగ్ ని సల్మాన్ ఖాన్ స్వయంగా పాడడం విశేషం. హీరోయిన్ ప్రేమ కోసం హీరో చేసే ఎఫోర్ట్స్ నేపధ్యంలో వచ్చే ఈ సాంగ్ సల్మాన్ ఫాన్స్ ని ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా లాంగ్ హెయిర్ తో, హెడ్ బ్యాండ్ కట్టి సల్మాన్ ఖాన్ కనిపించిన విజువల్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేల పెయిర్ బాగుంది అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. వెంకీ మామ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ రంజాన్ కి రిలీజ్ అవుతుంది. ఈద్ కి రిలీజ్ అంటే చాలు సల్మాన్ ఖాన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది. మరి ఈ రంజాన్ కి ఆ నమ్మకాన్ని భాయ్ జాన్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.
ఆ ‘పెయిడ్’ కౌంటర్ వాళ్ళకేనా సర్?
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియా నుంచి ఆస్కార్ వరకూ వెళ్లి, అక్కడ నాటు నాటు పాటకి అవార్డ్ గెలవడం ప్రతి ఇండియన్ కి ప్రౌడ్ ఫీలింగ్ కలిగించింది. కలలో కూడా ఒక ఇండియన్ సినిమా ఆస్కార్ గెలుస్తుందని అనుకోని ప్రతి ఒక్కరికీ ఆర్ ఆర్ ఆర్ స్వీట్ షాక్ ఇచ్చింది. జక్కన్న చెక్కిన ఈ యాక్షన్ ఎపిక్ ఆస్కార్ తెచ్చిన విషయంలో అందరూ హ్యాపీగానే ఉన్నారు కానీ కొంతమంది మాత్రం ఆస్కార్ కోసం అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ టీం వరకూ వెళ్ళినట్లు ఉంది. డబ్బులు పెట్టి ఆస్కార్ తెచ్చారు అనేలా విమర్శలు చేసిన వారికి ‘పెయిడ్’ కౌంటర్ వేశారు. ఇటివలే టెస్లా కార్స్ నాటు నాటు పాటకి ట్రిబ్యూట్ ఇస్తూ లైట్ షో చేసింది. ఆ లైట్ షో వీడియో సోషల్ మీడియాలో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుంది. దీంతో ‘ఎలాన్ మస్క్’ టెస్లా కార్ లైట్స్ వీడియోకి హార్ట్స్ ఇస్తూ ట్వీట్ చేశాడు. ఒక ఇండియన్ సినిమా గురించి ఎలాన్ మస్క్ లాంటి పర్సన్ ట్వీట్ చెయ్యడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మస్క్ ట్వీట్ కి ఆర్ ఆర్ ఆర్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ‘వీ పెయిడ్ అవర్ లవ్ టు ఎలాన్ మస్క్’ అంటూ రిప్లై వచ్చింది. ఈ రిప్లైలో ‘పెయిడ్’ వర్డ్ ని ఆల్ క్యాప్స్ పెట్టడం చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కోసం డబ్బులు ఖర్చు పెట్టారు అనే వాళ్లందరికీ కౌంటర్ వేసినట్లు ఉంది. ఆస్కార్ అవార్డ్ కోసం డబ్బులు ఇస్తే ఇప్పుడు ఎలాన్ మస్క్ కి కూడా డబ్బులు ఇచ్చి ట్వీట్ చేయించామా అని అడిగినట్లు ఉంది. మొత్తానికి పెయిడ్ అంటున్న అందరినీ సైలెంట్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సూపర్ ట్వీట్ చేసింది. అందుకే అంటారు జక్కన్న అంత ఈజీ కాదని.