పవన్ కల్యాణ్‌పై చంద్రబాబు హాట్ కామెంట్స్..
పవన్ కల్యాణ్ కామెంట్లపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నారావారిపల్లి నివాసంలో మీడియాతో చిట్‌చాట్‌లో హాట్ కామెంట్లు చేశారు.. నిన్న పవన్ కల్యాణ్ సభ పెట్టి చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారని తెలిపారు.. ఎందుకు వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌ను తిడుతున్నారు? ఎందుకు అంత భయం? ఎందుకు అంత పిరికితనం? అని ఎద్దేవా చేశారు.. అధికారం ఉందన్న అహంకారం మంచికాదు.. ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.. ఈ సంక్రాంతి ఒక ఆశను, భవిష్యత్తు కోసం పోరాడే శక్తిని ఇస్తుందని ఆకాక్షించారు చంద్రబాబు.. అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారని పేర్కొన్న ఆయన.. సేవాభావం ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలన్నారు.. కానీ, తప్పు చేస్తూ ఎదురుదాడి ద్వారా కప్పి పుచ్చుకుంటున్నారని మండిపడ్డారు.. కేసులకు భయపడే పరిస్థితి లేదు.. కార్యకర్తలు తెగించి రోడ్డుపైకి వస్తున్నారని తెలిపారు చంద్రబాబు.. జైలులో పేట్టి భయబ్రాంతులకు గురిచేస్తే లొంగిపోరని స్పష్టం చేశారు.. ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టకూడదు.. కానీ, వైసీపీ మాత్రం పెట్టుకోవచ్చా..? అని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా పోరాటం ఆగదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటానని ప్రకటించారు.. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారు.. విధ్వంసానికి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన ప్రభుత్వమిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..
210 కోట్లతో వాటర్ హీటర్ తయారీ ప్లాంట్
హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్ మరియు ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్ అట్లాంటిక్ జాయింట్ వెంచర్, హింటాస్టికా రూ. 210 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లోని జడ్చర్లలో వాటర్ హీటర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రెండు సంస్థల ఈ సమాన జాయింట్ వెంచర్ వాణిజ్య ఉత్పత్తిలోకి ప్రవేశించింది మరియు 500 మందికి పైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్ చైర్మన్ సందీప్ సోమనీ గురువారం ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది తెలంగాణలో హింద్‌వేర్ గ్రూపునకు చెందిన 9వ ప్లాంట్ అని తెలియజేశారు. ఈ సదుపాయం భారతదేశంలో వాటర్ హీటర్ల కోసం పెరుగుతున్న మార్కెట్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ మరియు శ్రీలంకలకు ఎగుమతి చేస్తుంది. జాయింట్ వెంచర్ సంస్థ హింటాస్టికా యొక్క ప్లాంట్ 5.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది మరియు 6 లక్షల యూనిట్ల వాటర్ హీటర్లు మరియు హీటింగ్ ఉపకరణాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఛైర్మన్ మాట్లాడుతూ, “సామర్థ్యాన్ని విస్తరించడానికి తగినంత స్థలం అందుబాటులో ఉంది మరియు ఈ సామర్థ్యంతో కూడిన ప్రణాళిక 12 లక్షల యూనిట్ల వరకు రాంప్ అవుతుందని భావిస్తున్నారు.” గ్రూప్ వాటర్ హీటర్‌లతో పాటు గాజు పాత్రలు, శానిటరీ వేర్ మరియు PET బాటిళ్ల తయారీ సౌకర్యాలను కలిగి ఉంది. రెండేళ్లలో తెలంగాణలో కొత్త ప్రాజెక్టులపై రూ. 600 కోట్ల పెట్టుబడులు పెట్టామని, హైదరాబాద్‌లోని కొత్త గాజుల కొలిమిపై వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి అదనంగా రూ. 200 కోట్ల పెట్టుబడులు రానున్నాయని చైర్మన్ తెలిపారు.
పవన్ కల్యాణ్ గ్లాస్ ఎప్పుడో పగిలింది..
పవన్ పై మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… పవన్ కల్యాణ్ గ్లాస్ ఎప్పుడో పగిలింది అని వ్యాఖ్యానించారు.. తన పార్టీ కార్యకర్తలను నమ్మలేని వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు.. పవన్ ఇప్పటికైనా జనసేన పార్టీ మూసేయాలని సలహా ఇచ్చారు. పార్టీ మూసివేసి తెలుగుదేశం పార్టీలో మంచి పదవి తీసుకోవాలంటూ ఎద్దేవా చేశారు.. పార్టీ కార్యకర్తలను, అభిమానులను చంద్రబాబుకు అమ్మేస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. దమ్ము వుంటే రా.. నేను బ్రాహ్మణ వీధిలో వుంటా.. చూసుకుందాం రా.. అంటూ పవన్ కల్యాణ్‌ను సవాల్ విసిరారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఇక, పవన్ కల్యాణ్ ఒక టెర్రరిస్ట్.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు వెల్లంపల్లి.. పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు..
వైఎస్ జగన్‌పై దాడి కేసులో కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు.. బాధితుడిని విచారించరా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విపక్షనేతగా ఉన్న సమయంలో.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనపై కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది.. అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్‌ఐఏ కోర్టు.. ఇదే సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసుకు బెయిల్ నిరాకరించిన ఎన్ఐఏ కోర్టు… కేసులో బాధితుడి స్టేట్‍మెంట్ రికార్డు చేశామని ఎన్‍ఐఏ న్యాయవాది కోర్టుకు తెలపడంతో.. అసలు రికార్డు చేస్తే చార్జిషీట్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు న్యాయమూర్తి.. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను విచారించి ఉపయోగం ఏముందన్న కోర్టు.. ఈ నెల 31వ తేదీ నుంచి విచారణకు షెడ్యూల్ ప్రకటించింది.. కోర్టుకు బాధితుడు సహా మిగిలినవారంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి. ఇక, ఈ కేసులో శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.. కాగా, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై కోడికత్తితో శ్రీనివాస్ దాడి చేశారు. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం శ్రీనివాస్ రిమాండ్‌లో ఉన్నారు. అయితే, బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు.. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎందుకు విచారించడంలేదు.. ఆయన్ను విచారించకుండా.. ఈ కేసులో సాక్షులను విచారిస్తే ఉపయోగం ఏముందని ప్రశ్నించింది.. ఇదే సమయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు ఎన్ఐఏ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దాంతో న్యాయస్థానం కలుగజేసుకుని స్టేట్‌మెంట్ రికార్డు చేస్తే ఛార్జిషీట్‌లో ఎందుకు పేర్కొలేదని ప్రశ్నించడంతో ఈ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్టు అయ్యింది. ఇక, తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీన జరగనుండడంతో.. ఏం జరుగుతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.
సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్.. సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మొత్తంగా మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ అని పేర్కొన్నారు.. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని.. భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని అభిలషించారు సీఎం వైఎస్ జగన్.. ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలని, పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్లలో, ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
‘బొంజా’ బొనాంజా.. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణం
తక్కువ ధరలో విమాన ప్రయాణికులకు సేవలందించేందుకు ఆస్ట్రేలియాలో కొత్త ఎయిర్ లైన్స్ సంస్థ అందుబాటులోకి రానుంది.దేశీయ విమానయాన సంస్థ బొంజా ఎయిర్‌లైన్ కు ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆమోదం లభించింది. విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అథారిటీ అనుమతినిచ్చింది. ఇది క్వీన్స్‌లాండ్, అంతర్రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ విమానాశ్రయాలకు విమాన సర్వీసులను ఆందిస్తుంది. క్వీన్స్‌ల్యాండ్‌లోని సన్‌షైన్ కోస్ట్ నుండి వారాల్లోనే మొదటి సర్వీస్‌ను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. 16 గమ్యస్థానాలకు సన్‌షైన్ కోస్ట్‌లోని బేస్ నుండి సేవలు అందించబడతాయి. వీటిలో కైర్న్స్, టౌన్స్‌విల్లే, విట్సుండే కోస్ట్, మాకే, రాక్‌హాంప్టన్, గ్లాడ్‌స్టోన్, బుండాబెర్గ్, క్వీన్స్‌ల్యాండ్‌లోని టూవూంబా వెల్‌క్యాంప్ ఉన్నాయి. అంతర్రాష్ట్ర గమ్యస్థానాలలో కాఫ్స్ హార్బర్, పోర్ట్ మాక్వేరీ, టామ్‌వర్త్, న్యూకాజిల్, ఆల్బరీ, మిల్దురా, అవలోన్, మెల్‌బోర్న్ ఉన్నాయి. బోంజా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ జోర్డాన్ మాట్లాడుతూ ఫిబ్రవరిలోపు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బోన్సా స్మార్ట్‌ఫోన్ యాప్, రిజిస్టర్డ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా మాత్రమే టిక్కెట్‌లను విక్రయిస్తామని ఆయన తెలియజేశారు. 15 సంవత్సరాల క్రితం టైగర్ ఎయిర్‌వేస్ ప్రారంభించిన తర్వాత ఇది ఆస్ట్రేలియా యొక్క మొదటి ఎయిర్‌లైన్ అని ప్రాంతీయ అభివృద్ధి మంత్రి కేథరీన్ కింగ్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన రంగం ఆస్ట్రేలియాదేనని ఆమె అన్నారు. కొత్త ఎయిర్‌లైన్ ప్రవేశం దేశీయ ఛార్జీలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది. బోంజాకు US-ఆధారిత పెట్టుబడి సంస్థ 777 భాగస్వాములు మద్దతునిస్తున్నారు. ప్రస్తుతం దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌లో నడుస్తున్న క్వాంటాస్, జెట్‌స్టార్, వర్జిన్ మరియు రెక్స్ వంటి ప్రధాన విమానయాన సంస్థలతో బోన్సా పోటీ పడనుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్ వంటి అతిపెద్ద నగరాలను తప్పించి ప్రాంతీయ ప్రాంతాలకు సేవలందించడం బోంజా లక్ష్యం. ప్రపంచంలోని టాప్ 15 దేశీయ విమానయాన మార్కెట్లలో తక్కువ ధర కలిగిన విమానయాన సంస్థ లేనిది ప్రస్తుతానికి ఆస్ట్రేలియా మాత్రమే.
చరణ్ కు అవమానం.. ఉపాసన ముందే ఇడియట్ అని తిట్టిన చిరు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఈ మధ్యనే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ ఫంక్షన్ లో మెరిసి అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. అక్కడ ఇంటర్నేషనల్ లెవల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ముఖయంగా చిరంజీవికి తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు. “నాన్న 41 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయనను చూసి నేను చాలా నేర్చుకున్నాను. నటుడిగా కొన్ని కొన్ని విషయాల్లో ఆయన చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ముఖ్యంగా బాడీ ఫిట్ నెస్ విషయంలో అస్సలు తగ్గరు. ఒకరోజు నేను డైనింగ్ టేబుల్ వద్ద తింటుంటే.. ఏంటీ చరణ్ కొంచెం తగ్గినట్లు కనిపిస్తున్నావు.. అస్సలు తినడం లేదా..? అని అడిగారు. నేను కూడా అది నిజమే అనుకోని అవును డాడీ అని తలూపాను.. అంతే వెంటనే ఆయన.. ఇడియట్.. బరువు పెరిగావు.. కనిపించడం లేదా..? జిమ్ సరిగ్గా చేస్తున్నావా..? రేపటి నుంచి ఇంకొంచెం గట్టిగా చెయ్ అని అనేశారు. ఇక అక్కడే ఉన్న ఉపాసన ఆ మాటలు విని.. అదేంటీ .. మిమ్మల్ని అలా అవమానిస్తున్నారు అని అడిగింది. అది అవమానం కాదు.. ఇద్దరు నటుల మధ్య డిస్కషన్ అలాగే ఉంటుంది అని ఉపాసనకు చెప్పాను.
కుక్క ఎంత పని చేసింది.. మూడో ఫ్లోర్ నుంచి దూకి..
ఈమధ్య కొన్ని కుక్కలు సృష్టిస్తున్న వీరంగం అంతాఇంతా కాదు. ఏం చేయకపోయినా.. జనాలపై ఎగబడి, దాడులకు దిగుతున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. తాజాగా ఒక కుక్క చేసిన పనికి.. ఓ డెలివరీ బాయ్ మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.6లోని లుంబిని ర్యాక్ క్యాజిల్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న శోభన నాగాని.. ఈనెల 11వ తేదీన ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మహ్మద్ రిజ్వాన్(23) అనే డెలివరీ బాయ్, పార్శిల్ ఇవ్వడానికి ఇంటికి చేరుకున్నాడు. బయట నిల్చొని డోర్ బెల్ కొట్టాడు. అయితే.. ఆ ఇంటి తలుపులు ముందునుంచే తీసి ఉంది. ఎవ్వరూ కనిపించకపోయేసరికి.. రిజ్వాన్ డోర్ బెల్ మోగించాడు. ఆ శబ్దం విని.. ఇంట్లో ఉన్న జర్మన్ షెపర్డ్ కుక్క ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఆ డెలివరీ బాయ్‌ని కరిచేందుకు ఎగబడింది. ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన రిజ్వాన్.. ఆ కుక్క నుంచి తప్పించుకునేందుకు పరుగు లంకించాడు. ఆ కుక్క తన వెంట పడటంతో, ఏం చేయాలో పాలుపోక మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ ప్రమాదంలో అతడు కారిడార్ రెయిలింగ్ నుంచి జారి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రిజ్వాన్ కుటుంబసభ్యులు.. ఆ కుక్క యజమానురాలు శోభనపై కేసు పెట్టారు. తన కుక్కను కట్టేయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్లే, తన సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయని రిజ్వాన్ సోదరుడు ఖాజా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో.. పోలీసులు శోభనపై ఐపీసీ సెక్షన్ 336, 289 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాహుల్ ఇన్నింగ్స్ గొప్పదేం కాదు.. మాజీ క్రికెటర్ బాంబ్
గురువారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఎంత అద్భుతంగా రాణించాడో అందరికీ తెలుసు! చివరివరకు క్రీజులో కుదుర్కొని.. గడ్డు పరిస్థితుల్లో ఉన్న భారత్‌ని గెలిపించి, త్రివర్ణ పతాకం రెపరెపలాడించేలా చేశాడు. అఫ్‌కోర్స్.. అతడు నిదానంగానే ఆడాడు కానీ, అత్యంత కీలకమైన పరిస్థితుల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఒకవేళ రాహుల్ గనుక లేకపోతే.. మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేది. అందుకే.. ప్రతిఒక్కరూ కేఎల్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సరైన సమయంలో గొప్ప ఇన్నింగ్స్ ఆడావంటూ కితాబిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా చేరిపోయాడు. అతని ఇన్నింగ్స్ గొప్పగా లేకపోయినా.. పరిణతి చెందిన బ్యాటర్‌గా సత్తా చాటాడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘కొంతకాలం నుంచి కేఎల్ రాహుల్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అయితే.. పేలవ ప్రదర్శన కనబర్చి, విమర్శలపాలయ్యాడు. వైస్ కెప్టెన్‌గా హోదాని కూడా కోల్పోయాడు. గత మూడు, నాలుగు నెలల నుంచి అతని పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అయితే.. ఇప్పుడు మాత్రం ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, రాహుల్ తన సత్తా చాటాడు. సరైన సమయంలో తనను తాను నిరూపించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆచితూచి ఆడాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన బ్యాటింగ్.. తన అనుభవానికి అద్దం పడుతుంది. నిజానికి.. రాహుల్ ఇన్నింగ్స్ గొప్పగా ఏమీ లేకపోవచ్చు. కానీ.. పరిణతి చెందిన బ్యాటర్ ఎలా ఉండాలో, ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో కేఎల్ రాహుల్ చాటి చెప్పాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు.