డ్రైవర్ హత్య కేసులో జనసేన నేతకు బెయిల్.. షరతులు వర్తిస్తాయి..!
డ్రైవర్ రాయుడు హత్యకేసులో శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మాజీ ఇంఛార్జ్, జనసేన బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ దొరికింది.. రాయుడు హత్య కేసులో A3గా ఉన్న శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ మంజూరు చేసింది మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు.. అయితే, ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు C3 సెవెన్ వెల్స్ చెన్నై పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని షరతులు పెట్టింది కోర్టు.. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇక, కోర్టు ఆదేశాల ప్రకారం.. నిన్న, ఈ రోజు ఉదయం 10 గంటలకు C3 సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి వెళ్లారు వినుత కోట…
వైఎస్ విగ్రహం తొలగింపు.. నందిగామలో టెన్షన్ టెన్షన్..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించడంతో నందిగామలో ఉద్రిక్తత వాతావరణానికి కారణం అయ్యింది.. ట్రాఫిక్‌కు అడ్డుగా ఉందని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో తొలగించారు మున్సిపల్ అధికారులు… గాంధీ సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించిన ప్రదేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, గౌతమ్, రెడ్డి, మొండితోక జగన్ మోహన్ రావు ఆందోళనకు దిగారు.. వైసీపీ కార్యాలయం నుండి గాంధీ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించిన ప్రదేశంలో నిరసన తెలిపారు.. రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించిన ప్రాంతంలో నిచ్చెన వేసుకుని ఎక్కి నిరసన తెలిపారు.. అయితే, ఈ నిరసన సమయంలో వైసీపీ నాయకులు.. స్థానిక సీఐ మధ్య వాగ్వాదం జరిగింది.. ఎక్కడైతే విగ్రహం తొలగించారో అదే ప్రదేశంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొబైల్ విగ్రహం ఏర్పాటు చేసింది వైసీపీ.. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న వైయస్సార్ విగ్రహాన్ని చూడటానికి వీలులేదని పోలీసులు అడ్డుకోగా.. పోలీసులను తోసుకుంటూ గేటు నెట్టేసి లోపలికి వెళ్లారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.. మున్సిపల్ ఆఫీస్‌లోని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు నేతలు.. అనంతరం నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దేవినేని అవినాష్.. మొండితోక జగన్ మోహన్ రావు..
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.. మహిళలు తప్పకుండా ఇవి తెలుసుకోవాలి..!
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమల్లో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందుబాటులోకి రానుంది… ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చెయ్యచ్చు. పల్లె వెలుగు. అల్ట్రా పల్లె వెలుగు… సిటీ ఆర్డినరీ.. మెట్రో.. ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణం చెయ్యచ్చు. ఇప్పటికే ఏపీ కేబినెట్ సమావేశంలో మహిళల ఉచిత బస్సు పథకం ఆమోదం పొందింది.. స్త్రీ శక్తి అనే పేరు పెట్టారు. అన్ని జలాల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడి కైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.. రాష్ట్రం వ్యాప్తంగా 8,459 బస్సులను మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కోసం కేటాయించారు. ఏడాదికి ఈ పథకం అమలు వలన కోసం రూ.1,950 కోట్లు కేటాయించనుంది ప్రభుత్వం.. ఇక, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు చూపించి ఉచిత బస్సులో మహిళలు ప్రయాణం చేయవచ్చు.. మొన్న జరిగిన కేబినెట్ భేటీలో ఈ పథకం అమలుపై చర్చించి.. అమోదం తెలిపారు.. అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు మొదలు అయ్యాయి.. జీరో ఫేర్ టికెట్ మహిళలకు ఇస్తారు.. గుర్తింపు కార్డు మాత్రం ప్రయాణ సమయంలో చూపించాలి.. ఆధార్ కార్డు.. ఓటర్ ఐడీ.. రేషన్ కార్డు.. పాన్ కార్డు కొన్ని గుర్తింపు పొందిన కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది..
లక్ష కోట్లలో 30% తినేసి.. హరీష్ రావు ప్రాజెక్టు దగ్గర పడుకున్నాడు
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి బీఆర్ఎస్ (BRS) నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల లోపాలు, అవినీతి, లిక్కర్ దందాలు, భూ కబ్జాలు అంటూ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించామని చెబుతారు. అందులో కనీసం 30 శాతం అంటే 30 వేల కోట్లు తినేశారు. హరీష్ రావు అందుకే ప్రాజెక్టు దగ్గరే పడుకున్నాడు. దమ్ముంటే ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలి,” అని జగ్గారెడ్డి అన్నారు. “మీరు దొంగలు.. మాపై నిందలు వేస్తారా? మీ పార్టీలా మేము ప్రైవేటు కంపెనీ అనుకున్నామా? ఔటర్ రింగ్ రోడ్ లీజుకు ఇచ్చి దాంట్లో డబ్బులు కొట్టారు. అప్పుల్లో కూడా కమిషన్లు వసూలు చేశారు. ఇలాంటి దందా ఎవడు చేయడు.. కానీ మీరు చేశారు,” అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కేసీఆర్ కూతురు ఢిల్లీ లో పెద్ద దుకాణం తెరిచింది. కేజ్రీవాల్ కథ ముగిసిపోయింది. కేసీఆర్ కుటుంబం మొత్తం డాన్‌ల కంపెనీ అయింది. మిగిలింది ఏమీ లేదు.. చెరువులు కూడా మింగేశారు,” అని వ్యాఖ్యానించారు.
సీఎంకి కుడా సిట్ నోటీసులు ఇవ్వాలి.. ఆయనను కూడా విచారించాలి
భారతీయ జనతా పార్టీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ బూటకపు విచారణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోణాన్ని తప్పుగా మలుపు తిప్పుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నప్పటికీ వారిని మాత్రం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యాంశం.. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ నేతల ఫోన్‌లు ట్యాప్ చేయించారన్నది. “కేసీఆర్ అనే మూర్ఖుడు రాజకీయ నాయకుల ఫోన్‌లను ట్యాప్ చేయించాడు. ఆయన తన కుమారుడితో కలిసి ప్రత్యేక ఇన్టెలిజెన్స్ బ్రాంచ్ (SIB) ను వ్యక్తిగత అవసరాల కోసం దుర్వినియోగం చేశారు,” అంటూ సంజయ్ ఆరోపించారు.
నిమిష ప్రియను రెండు వారాల్లో వెనక్కి తీసుకోస్తాం.. కేఏ పాల్
యెమెన్లో మరణశిక్ష నుంచి తప్పించుకున్న కేరళ నర్సు నిమిష ప్రియ గురించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచల వ్యాఖ్యలు చేశారు. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిష ప్రియ జూలై 16న చనిపోవాల్సింది. జూలై 14 న సుప్రీం కోర్టులో నిమిషను కాపాడలేక పోయాం అని కేంద్రం చెప్పింది. కానీ మొత్తానికి ఆమెను మరణ శిక్ష నుంచి తప్పించాం. కానీ నాకు పేరు ప్రఖ్యాతలు వస్తాయని కొన్ని శక్తులు ఆమె విడుదలను ఆపించారని అన్నారు. రెండు వారాల్లో నిమిష ప్రియను వెనక్కి తీసుకువస్తామని వెల్లడించారు. తాను మరణిస్తే స్వర్గం వెళ్తానని .. మిగతా వాళ్లను నరకానికి పంపిస్తా అని అన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ను తప్పించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ప్రధాని మోదీని కలిసి అన్ని విషయాలు చెప్తానని వెల్లడించారు.
అమెరికా 50% టారిఫ్ నిర్ణయం.. భారత్‌లో కీలక పరిణామాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం దిగుమతి సుంకాలను విధించిన తర్వాత, దేశీయంగా మరియు అంతర్జాతీయంగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేక నాయకులు దీని పై స్పందించారు. అంతేకాక, ఇతర దేశాలతోనూ భారత్ సంప్రదింపులు జరిపింది. ట్రంప్ టారిఫ్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ, ఇది “అన్యాయమైనది, అనవసరమైనది, వివేకహీనమైనది” అని వ్యాఖ్యానించింది. ప్రపంచ వాణిజ్యానికి ఇది నష్టం కలిగించే చర్యగా పేర్కొంది.
ఆగస్టు 11న అప్డేటెడ్ బిల్లు.. ప్రయోజనాలు తెలుసా!
1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను నూతన బిల్లు 2025ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. తాజాగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొని, అప్డేట్ చేసి మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు కొన్ని జాతీయ పత్రికలు వెల్లడించాయి. లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీ ఈ బిల్లును అధ్యయం చేసి జులై 21న మొత్తం 4500 పేజీలతో కూడిన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. సెలెక్ట్ కమిటీ ఈ నివేదికలో ముసాయిదా బిల్లుకు 285 ప్రతిపాదనలు చేసింది. కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా కొత్త బిల్లును రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ అప్డేటెడ్ బిల్లును ఆగస్టు 11న(సోమవారం) లోక్‌సభ ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం.
యూఎస్ ప్రెసిడెంట్ సాలరీ ఎంతో తెలుసా..?
అగ్రరాజ్యాధినేతగా, నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న యూఎస్ ప్రెసిండెట్ డొనాల్డ్ ట్రంప్ జీతం ఎంతో తెలుసా.. అక్షరాల ఏడాదికి 4 లక్షల డాలర్లు. అది ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.3.36 కోట్లు. అంటే అమెరికా అధ్యక్షుడు నెలకు సుమారు రు.28 లక్షల వేతనం తీసుకుంటారు. ఆయనకు వేతనం మాత్రమే కాదండోయ్ ఖర్చులకు, ప్రయాణాలకు, వినోదానికి కూడా డబ్బులు చెల్లిస్తారు. అధ్యక్షుడు ఖర్చుల కోసం అదనంగా మరో 50 వేల డాలర్లు, ప్రయాణ ఖాతా లక్ష డాలర్లు, వినోద బడ్జెట్ 19 వేల డాలర్లు పొందుతారు. అలాగే వైట్ హౌస్‌లో నివసించడంతో సహా ఇతర ప్రయోజనాలు కూడా ఆయన పొందుతారు. మీకు తెలుసా ఆయన మొదటిసారి అధ్యక్షుడి పని చేసిన సమయంలో తీసుకున్న జీతాన్ని వైట్ హౌస్ పునరుద్ధరణ కోసం విరాళంగా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడి జీతభత్యాలు ఎక్కువే అయినా, ప్రపంచంలోని కొన్ని దేశాల అగ్రనేతలతో పోలిస్తే ఆ మొత్తం అంతంత మాత్రమే. ఉదాహరణకు సింగపూర్ ప్రధాని ఏడాదికి 11.6 లక్షల డాలర్లు అంటే రూ.13.44 కోట్లు వేతనంగా పొందుతారు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏడాదికి రూ.5.5 కోట్ల జీతం అందుకుంటారు.
అలాంటి పాత్రలు ఇస్తేనే సినిమాలు చేస్తా.. ఆశిష్ విద్యార్థి కామెంట్స్
స్టార్ యాక్టర్ ఆశిష్ విద్యార్థికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాదాపు అన్ని భాషల్లో ఆయన సినిమాలు చేశారు. 30 ఏళ్ల కెరీర్ లో 300లకు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యారు. రీసెంట్ గా ఆయన సినిమాలు తగ్గించేశారు. ఎక్కడా కనిపించట్లేదు. దీంతో ఏమైందా అని ఆయన ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. తాజాగా ఆయన ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. నేను ఎందుకు సినిమాలు చేయట్లేదో అని చాలా మంది అడుగుతున్నారు. వారికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను ఇప్పుడు సినిమాలు చేయకపోయినా గ్రేట్ యాక్టర్ నే. 300లకు పైగా సినిమాల్లో నటించాను. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో చేశాను. కానీ ఇప్పుడు బోర్ కొడుతోంది. రెగ్యులర్ గా చిన్న పాత్రలే వస్తున్నాయి.
తెలుగులోకి విజయ్ సేతుపతి కొడుకు సినిమా
తమిళ సినిమా పరిశ్రమలో ‘మక్కల్ సెల్వన్’గా పిలవబడే విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఫీనిక్స్’ ఇటీవల తమిళంలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ వెర్షన్‌గా రానుంది. ఈ సందర్భంగా రేపు (ఆగస్టు 9, 2025) తెలుగు డబ్బింగ్ వెర్షన్ టీజర్ విడుదల కార్యక్రమం జరగనుంది, ఈ కార్యక్రమంలో సూర్య సేతుపతి మీడియాతో ముచ్చటించనున్నారు. ‘ఫీనిక్స్’ ఒక హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా, ఇది ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా అనల్ అరసు దర్శకుడిగా తొలి సినిమా. సూర్య ఈ చిత్రంలో ఒక యువ రెజ్లర్‌గా కనిపించనున్నారడు. ఇంకా ఈ సినిమాలో రలక్ష్మీ శరత్‌కుమార్, సంపత్ రాజ్, దేవదర్శిని, అభినక్షత్ర, వర్ష విశ్వనాథ్, మరియు ‘కాకా ముట్టై’ ఫేమ్ విఘ్నేష్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. సామ్ సిఎస్ సంగీతం, వెల్రాజ్ సినిమాటోగ్రఫీ, మరియు ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ ఈ చిత్రానికి సాంకేతిక బలాన్ని అందించాయి.
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన
తెలుగు సినిమా పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్‌లోని యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) సభ్యులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సమ్మె సందర్భంగా, ఫిల్మ్ చాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు సభ్యులు ఎటువంటి చర్చలు లేదా సంప్రదింపులు చేయకూడదని స్పష్టమైన నిర్దేశించింది. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్‌లోని యూనియన్లు, తమ డిమాండ్లు మరియు సమస్యలపై చర్చలు లేకుండా ఏకపక్షంగా సమ్మెకు దిగడం ద్వారా పరిశ్రమలో కీలకమైన కార్యకలాపాలను స్తంభింపజేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమస్యను తీవ్రంగా పరిగణించి, పరిశ్రమ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.