రెండో సారి మూడో సారి సీఎం కావాలని నాకు ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
శిల్పకళా వేదికగా ఈరోజు (సెప్టెంబర్ 5న) నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలో ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది ముఖ్యమంత్రులు ఫైనాన్స్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను తమ దగ్గర పెట్టుకుంటారు. కానీ తాను విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నట్లు తెలిపారు. అత్యంత వివాదాస్పద శాఖ విద్యా శాఖ.. అది తనకు వద్దని పలువురు చెప్పారు… కానీ వివాదాస్పదం సంగతి చూద్దామనే తన దగ్గర పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైన శాఖ అని.. అందుకే దానిని తాను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కొంత మంది అవగాహన రాహిత్యంతో ఈ శాఖకు మంత్రిని పెట్టమని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. విమర్శలకు ఒకటే మాట చెప్తున్నా… ఈ శాఖలో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే దీనిని తన దగ్గర పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
కల్వకుంట్ల పంచాయతీపై.. కడియం రియాక్షన్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్వకుంట్ల కవిత ఆరోపణలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో కూడా మొదటి సారి మీడియా ఎదుట స్పందించారు. ఆయన కవిత ఎపిసోడ్‌పై మాట్లాడుతూ.. అది ఆస్తి తగాదాలకు సంబంధించినది మాత్రమే అని అన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను అన్నింటిని కూడా దొచుకుంది. ధరణిని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల డబ్బులను సంపాదించుకున్నారు. ఇప్పుడు వేల ఎకరాలు పంచుకునే క్రమంలో, వేల కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణపై పడి దోచుకుంది. అందుకే వారిని తెలంగాణ ప్రజలు పక్కన పెట్టారని కడియం పేర్కొన్నారు.
వినాయక నిమజ్జనానికి 10 లక్షల మంది రావొచ్చు: ట్రాఫిక్ సీపీ జోయల్ డెవిస్
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ గణేష్ పండగ చాలా ముఖ్యమైనదని, ఇరవై వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం అవుతాయన్నారు. నిమజ్జనం సాఫీగా జరగడానికి అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. వినాయక నిమజ్జనం తమకు ఛాలెంజింగ్ అని బందోబస్తు కోసం నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. రూట్ ఇన్స్‌ఫెక్షన్స్ చేసి ఆయా విభాగాలకు అవసరమైన సూచనలు ముందుగానే చేశామన్నారు. 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది రెండు షిఫ్ట్‌ల్లో గణేష్ బందోబస్తు విధుల్లో ఉంటారని చెప్పారు. వినాయక నిమజ్జనంకు పది వేల పైగా టస్కర్ వాహనాలు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సుమారుగా పది లక్షల మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొనే అవకాశం ఉంది అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం ఆరు గంటలకు బడా గణేష్ శోభాయాత్ర స్టార్ట్ అవుతుందని, నాలుగో నెంబర్ క్రేన్ వద్ద 12 గంటలకు కంత నిమజ్జనం పూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. బడా గణేష్ నిమజ్జనం చూడటానికి వచ్చేవారు వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణా వినియోగించాలి అని సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్దభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ నెల 18 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ హాజరుపై ఉత్కంఠ!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. ఇక, ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 18న ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు మొదలవుతాయి.. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఇక, మొదటి రోజున అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు కొనసాగాలి, ఏఏ అంశాలపై చర్చ జరగాలి అనే విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) హాజరుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన శాసన సభ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ, ఈసారి హాజరవుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అలాగే, రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రతిపక్షంగా వైసీపీ స్పందన వంటివి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి.
దేశంలో బీజేపీతో కలిసి పని చేసిన పార్టీలు అంతమైపోతున్నాయి..
జీఎస్టీ పేరుతో ప్రజలను బీజేపీ ప్రభుత్వం లూటీ చేసింది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తొమ్మిదేళ్ల పాటు కార్పొరేట్లకు దోచిపెట్టి ఇప్పుడు జీఎస్టీ మార్పులు చేశారు.. జీఎస్టీ స్వరూపం మార్చాలి, రానున్న రోజుల్లో జీఎస్టీ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ మాత్రం డొనాల్డ్ ట్రంప్ కి భయపడుతున్నారు అని ఎద్దేవా చేశారు. ఏపీలో ఉన్న పార్టీలు అని మోడీకి దాసోహం అయ్యాయని పేర్కొన్నారు. దేశంలో బీజేపీతో కలిసి పని చేసిన పార్టీలు అంతమైపోతున్నాయి.. మరోవైపు, తెలంగాణలో బీఆర్ఎస్ రెండుగా చీలింది.. బీజేపీ భస్మాసుర హస్తం, దీనికి టీడీపీ, జనసేన మినహాయింపు లేదు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను చంపాలనే ఉద్దేశంతో కొంతమంది మాట్లాడుతున్నారు.. ఉదేశపూర్వక్షంగా ఫ్యాక్టరీని చంపి ఆ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెడుతున్నారు అని నారాయణ ఆరోపించారు.
భారత్‌పై ట్రంప్ అక్కసు.. సోషల్ మీడియాలో సంచలన పోస్ట్..
భారత్-అమెరికా మధ్య సంబంధాలపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై ఆయన మాట్లాడుతూ.. తాము భారత్, రష్యాలకు దూరమైనట్లే అని పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధాని మోడీ, పుతిన్, జిన్‌పింగ్‌లు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన ట్రంప్.. ఆ మూడు దేశాలు ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇక భారత్, రష్యాలను చైనా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఆ మూడు దేశాలకు సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుతూ, తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో వ్యంగ్యంగా పోస్టు చేశారు. ఇక, ప్రతీకార టారీఫ్స్ తో ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్న వేళ.. తియాన్‌జిన్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో రష్యా, చైనా, భారత్ అధినేతలు ఒకే వేదికపై కలిశారు.అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించి.. తామంతా ఏకతాటిపై ఉన్నట్లు అమెరికాకు సంకేతాలు పంపించారు. వీరి భేటీపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ చర్చ కొనసాగుతుంది. ట్రంప్ తీరుతోనే ఆ మూడు దేశాలు ఒక్కటయ్యాయనే వాదన కూడా యూఎస్ లో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిత్ర దేశంగా ఉన్న భారత్ తమకు దాదాపుగా దూరమైనట్లు అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సమంత వీడియో.. రాజ్ నిడుమోరు భార్య షాకింగ్ పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆమె పెద్దగా సినిమాలు చేయకపోయినా.. ఆమె చేస్తున్న పనులతో తెగ ట్రెండింగ్ అవుతోంది. మనకు తెలిసిందే కదా.. సమంత కొన్ని రోజులుగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తిరుగుతోంది. ఈ జంట నిత్యం ట్రిప్పులు, టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తమ మధ్య ఏముందో బయట పెట్టట్లేదు. తాజాగా వీరిద్దరూ దుబాయ్ లోని ఓ ఫ్యాషన్ షోకు వెళ్లారు. అక్కడ సమంత ఓ వీడియో పోస్టు చేసింది. అందులో ఓ వ్యక్తి చేతిని పట్టుకుని కనిపిస్తోంది. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అది చూసిన వారంతా రాజ్ చేయి పట్టుకుందని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి టైమ్ లో రాజ్ నిడుమోరు భార్య శ్యామలి దే షాకింగ్ పోస్ట్ చేసింది. తెలివి తక్కువగా ప్రవర్తించకండి.. తెలివి తక్కువ పని కూడా తెలివిగా చేయండి అంటూ ఆమె రాసుకొచ్చింది. మరో పోస్టులో నిష్ఫక్షపాతంగా ఉండటం అంటే ఇక్కడ మనం ఏదీ సొంతం చేసుకోవద్దు. అలాగే మనల్ని ఏదీ సొంతం చేసుకోవద్దు అంటూ రాసింది. ఇది చూసిన వారంతా సమంతను దృష్టిలో ఉంచుకునే ఇలాంటి పోస్టు చేసిందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. సమంత చివరగా శుభం సినిమాకు ప్రొడ్యూసర్ గా చేసింది. త్వరలోనే నందినిరెడ్డితో ఓ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
నవదీప్ ఇమేజ్ డ్యామేజ్.. అనవసరంగా జడ్జిగా వెళ్లాడా..?
హీరో నవదీప్ కు సినిమాల్లో మంచి పేరుంది. నటుడిగా బోలెడన్ని అవకాశాలు వస్తాయి. హీరోగా కాకపోయినా సినిమాల్లో పాత్రలు చేయాలనుకుంటే లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి అతనికి. అలాంటి నవదీప్ బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కు జడ్జిగా వెళ్లాడు. అక్కడ సామాన్యులను బిగ్ బాస్ షోకు పంపేందుకు ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలిపే స్థాయిలో నవదీప్ ఉన్నాడు. అక్కడే అసలు సమస్య వచ్చింది. సామాన్యులపై నవదీప్ కొన్ని సార్లు బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వ్యవహరించిన తీరు అతనికి తీవ్ర విమర్శలు తెచ్చిపెడుతన్నాయి. ఆ మధ్య ఓ కంటెస్టెంట్ ను ఊరు నుంచి వచ్చావ్ నీకు అంత సీన్ లేదు అంటూ కామెంట్ చేయడం పెద్ద రచ్చకు దారి తీసింది. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే కాకుండా మరికొందరు కంటెస్టెంట్స్ విషయంలో ఇలా వ్యవహరించడంతో అతను అనవసరంగా ఈ ప్రోగ్రామ్ కు జడ్జిగా వచ్చాడంటూ ఆయన అభిమానులు అంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షో వల్ల గానీ.. ఆ షోకు సంబంధించిన ప్రోగ్రామ్స్ లో పాల్గొంటే వచ్చే పేరు కన్నా విమర్శలే ఎక్కువగా ఉంటున్నాయనే విషయం తెలిసిందే. అందుకే నవదీప్ బుద్ధిగా సినిమాలు చేసుకోకుండా ఇందులోకి వచ్చి తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నాడని అంటున్నారు.