అమరావతి పనులపై నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ బాధ్యత మోడీదే..!
అమరావతి రీలాంచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పది సంవత్సరాలకు రాజధాని నిర్మాణానికి పునాదిరాయి వేశారు.. అయితే, గత ఐదు సంవత్సరాలు అమరావతి పనులు ఆగిపోయినందుకు ప్రధాని నరేంద్ర మోడీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. దేశంలో కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సింది.. అలా ఇవ్వకుండా అప్పు ఇప్పించడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.. అమరావతి పునఃనిర్మాణం సభలో ప్రధాని మోడీ ప్రత్యేక హోదా మాట ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు నారాయణ.. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయడాన్ని సీపీఐ స్వాగతిస్తోందన్నారు నారాయణ.. 2029 కల్లా కుల గణన పూర్తిచేసి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.. రాష్ట్రంలో కోడికత్తి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు అలానే ఉన్నాయి.. ఆ కేసులను కూడి నిగ్గు తేల్చాలి అని సూచించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..
ప్రధాని మోడీ ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ, పవన్‌కి చాక్లెట్ ఇచ్చారు..!
ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న ప్రధాని మోడీ అమరావతికి వచ్చారని గుర్తుచేశారు.. అయితే, మొన్న వచ్చినప్పుడు (అమరావతి శంకుస్థాపనకు తొలిసారి వచ్చినప్పుడు) నీరు – మట్టి తీసుకొచ్చారు.. ఈసారి (అమరావతి రీలాంచ్) ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి చాక్లెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక, సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్.. రైతు దగ్గర నుంచి ప్రతి ధాన్యం గింజ కూడా కొనాలని డిమాండ్ చేశారు కారుమూరి.. అలా కొనని పక్షంలో రైతులు వెంట ఉండి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.. రైతులకు చిరిగిపోయిన సంచులు ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి.. చిరిగిపోయిన సంచలిచ్చి రైతులకు ఏమి చేస్తారు అని మండిపడ్డారు మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరావు..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే మెగా డీఎస్సీ సహా పలు రకాల పోస్టుల భర్తీకి సిద్ధమైన సర్కార్.. ఇప్పుడు ఏపీ ప్లానిండ్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో 175 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.. ఎంబీఏ అర్హతగా.. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీ చేయనుంది.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి.. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీకి సిద్ధమైన కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రస్తుతం ఏడాది కాలానికి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి పొడిగించే అవకాశం లేకపోలేదు.. ఇక, ఏపీ ప్లానిండ్ డిపార్ట్‌మెంట్‌లో భర్తీ చేయనున్న 175 పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతలు, దరఖాస్తులు, వేతనానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎంబీఏ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60 వేల వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. మే 13వ తేదీ దరఖాస్తులకు చివరితేది కాగా.. విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.. 2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థికి 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.. ఈ పోస్టులు సంబంధించిన అర్హతలు, దరఖాస్తులు, వేతం.. తదితర పూర్తి వివరాల కోసం https://apsdpscareers.com/YP.aspxలో చూసుకోవచ్చు..
అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట..! వాళ్లు రాజధానిగా గుర్తించాల్సిన పనిలేదు..
ఏపీ రాజధాని అమరావతి అంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొలుసు పార్థసారథి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి రీలాంచ్ కార్యక్రమంపై స్పందిస్తూ.. రాజధాని పునఃప్రారంభ పనులు గొప్పగా మొదలయ్యాయన్నారు.. అమరావతిపై విషం చిమ్మిన స్వార్థపరులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని సూచించారు.. అలా చేస్తే.. తెలుగు ప్రజలు క్షమించక పోయినా.. దేవుడు వారిని క్షమిస్తారని వ్యాఖ్యానించారు.. ఇక, అమరావతి రీలాంచ్ సభకు వచ్చేందుకు వాహనాలు సరిపోక వేలమంది గ్రామాల్లో ఉండిపోయారని తెలిపారు.. సభలో సీఎం చంద్రబాబు నాయుడు పనితీరుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంపై ఆయనకు ఉన్న కమిట్‌మెంట్‌ను తెలియజేస్తాయన్నారు పార్థసారథి.. అమరావతి శక్తిని సాక్ష్యాత్తు ప్రధాని మోడీ గుర్తించి కీర్తించారు.. అమరావతి దేవతల రాజధాని అని మోడీ పేర్కొన్నారని గుర్తుచేశారు.. కానీ, అమరావతి భ్రమరావతి అని గత పాలకులు వ్యాఖ్యానించారని మండిపడ్డారు.. గత పాలకులు అమరావతి ప్రాధాన్యతను అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు.. ఇక, అమరావతి సభ సమయంలో అగ్ని ప్రమాదం వెనుక ఎవరైనా ఉంటే దానిపై పోలీసులు విచారణలో గుర్తిస్తారని తెలిపారు. అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారు.. వైసీపీ గుర్తించాల్సిన అవసరం లేదు.. గుర్తించాలానే ఆలోచన విధానం వారికి లేదన్నారు.. అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారకు.. మరోవైపు.. అమరావతికి చట్ట బద్దత కల్పించే అంశంపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు మంత్రి కొలుసు పార్థసారథి..
మరోసారి మంచి మనుసుచాటుకున్న కేటీఆర్.. మంజుల, అశ్వినీల కుటుంబానికి భరోసా
నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెంబి మండలం లోతేర తండాకు చెందిన అక్కాచెల్లెళ్లు బాణావత్ మంజుల, బాణావత్ అశ్వినీలు శుక్రవారం ఎంసెట్ పరీక్ష రాసి తిరిగే సమయంలో ఆర్మూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చిన కేటీఆర్, మృతుల తండ్రి బాణావత్ రెడ్డి ఉపాధి నిమిత్తం మలేషియాలో ఉండటాన్ని గమనించి, వెంటనే ఆయనను తెలంగాణకు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అర్థరాత్రి దాకా వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుల మేనమామ కుటుంబానికి అండగా నిలిచి, వైద్యులు, అధికారులు, పోలీసులతో సమన్వయం చేసి మరణాంతర ప్రక్రియను వేగవంతం చేశారు. అనంతరం మృతదేహాలను అంబులెన్స్ ద్వారా స్వగ్రామం లోతేర తండాకు తరలించి, అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తెలంగాణతో సంబంధం ఉన్న 5 కారిడార్‌లకు లక్ష కోట్లు
కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత 10 సంవత్సరాలలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, అన్ని రాష్ట్రాల రాజధానులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడానికి కేంద్రం కృషి చేస్తున్నది. ఈ నిర్మాణం వెనుక ఉన్న ముఖ్యమైన అంశం తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ. 2014 వరకు రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, ప్రస్తుతం 5,200 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విస్తరణ తెలంగాణలోని 32 జిల్లా కేంద్రాల గుండా జాతీయ రహదారుల అనుసంధానానికి తోడ్పడింది.
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఒడిశా గవర్నర్ సూపర్ ఐడియా..!
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఓ అదిరిపోయే ఐడియా చెప్పారు.. ముడి చమురు దిగుమతిని తగ్గించాలని సూచించారు.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి పునరుత్పాదక శక్తి వైపుకు అడుగులు వేయాలన్నారు.. సాంప్రదాయ ఇంధన వనరుల నుండి పునరుత్పాదక ప్రత్యామ్నాయాలకు మారాలని.. అప్పుడే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుందన్నారు.. ఇక, ఒడిశా రాజ్ భవన్ ప్రాంగణంలో 150 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ పనిచేస్తోంది, త్వరలో మరో 400 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం అన్నారు హరిబాబు.. గవర్నర్ నివాసాన్ని నెట్ జీరో ఇంధన క్యాంపస్ గా మార్చడానికి ఇది ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించిన ఆయన.. మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల వలన స్థిరమైన రవాణా దిశగా నిర్ణయాత్మక మార్పు జరుగుతోంది.. పీఎం-కుసుమ్ యోజన సౌరశక్తితో నడిచే పంపుసెట్లను ఏర్పాటు చేయడంలో రైతులకు సహాయ పడుతుందన్నారు.
‘‘2029 ఎన్నికల వరకైనా పూర్తవుతుందా.?’’ కులగణనపై ఒవైసీ..
కేంద్రం ఇటీవల జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’ చేస్తామని ప్రకటించింది. 2024 ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్‌తో సహా పలు ఇండీ కూటమి పార్టీలు కులగణనను డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ-ఎన్డీయే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కులగణనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల్ని లేవనెత్తారు. కులగణనకు కేంద్రం ఒక టైమ్ లైన్ ఉండాలని కోరారు. ‘‘బీజేపీ ఎన్డీయే ప్రభుత్వానికి కులగణనకు టైమ్‌లైన్ ప్రకటించాలి. ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఎప్పుడు అమలు అవుతుంది అనేది చెప్పాలి. 2029 పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది జరుగుతుందా..?’’ అని ఓవైసీ ప్రశ్నించారు. కులగణన ప్రాముఖ్యతను వివరిస్తూ, అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు, యూదులు, చైనీయాలు సహా అనేక అణగారిన వర్గాలపై నిశ్చయాత్మక చర్యలు తీసుకోవడం వల్లే అమెరికా శక్తివంతంగా ఎదగడానికి వీలు కలిగిందని అన్నారు. కులగణ వివిధ కులాల మధ్య భూయాజమాన్యం ఇతర ప్రయోజనాలను వెల్లడిస్తుందని, ముస్లింలో కులగణన పస్మాండ ముస్లింల వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుందని చెప్పారు.
దాయాదికి దెబ్బ మీద దెబ్బ.. పాక్ నౌకలకు భారత జలాల్లోకి ప్రవేశం నిషేధం..
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌కి భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్‌ని ఎలా దెబ్బతీస్తే ఆ దేశం పతనమవుతుందో అలాంటి నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే, పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ రాజకీయ నేతలు, సెలబ్రెటీలు, సినీయాక్టర్ల ఇన్‌స్టా అకౌంట్లు, యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. పాక్ మీడియా, వెబ్‌సైట్లను నిషేధించింది. ఇదే కాకుండా, పాక్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని నిషేధించింది. ఇదిలా ఉంటే, శనివారం పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై నిషేధాన్ని విధించిన భారత్ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ జెండా కలిగిన ఓడలు భారత జలాల్లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని, తదుపరి నోటీసులు వచ్చే వరకు కొనసాగుతాయని, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాక్ జెండా ఉన్న ఓడలు తమ జలాల్లోకి రాకుండా, ఏ నౌక కూడా భారత ఓడరేవుల్లోకి ప్రవేశించకుండా నిషేధించారు.
సూర్యవంశీకి సచిన్‌లాగా సపోర్ట్ చేయండి.. లేదంటే వాళ్ల గతే పడుతుంది?
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. మీలో ప్రతిభ ఉంటే.. ఎవ్వరూ ఆపలేరని నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్‌కి చెందిన సూర్యవంశీ ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా ఈ క్రీడారుడిని కాపాడుకోవాలంటూ.. క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి హెచ్చరించారు. ఛాపెల్ గతంలో టీం ఇండియా కోచ్‌గా కూడా పనిచేశారు. సూర్యవంశీ రాణించాలంటే సచిన్ టెండూల్కర్ లాంటి మద్దతు అవసరమని ఆయన అన్నారు. సూర్యవంశీకి సచిన్ లాగా మద్దతు లభించకపోతే.. వినోద్ కాంబ్లీ, పృథ్వీ షాలకు ఎదురైన గతే ఎదురవుతుందని ఛాపెల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘సచిన్ టెండుల్కర్ విజయానికి అతడి టాలెంట్ మాత్రమే కాదు. అతడి భావోద్వేగ పరిణితి, సచిన్‌కు చక్కటి మార్గనిర్దేశనం చేసిన చిన్ననాటి కోచ్, బాహ్య ప్రపంచపు సర్కస్‌లో పడి దారి తప్పకుండా కాపాడిన కుటుంబం సచిన్ విజయానికి కారణం. వినోద్ కాంబ్లీ సచిన్ అంత ప్రతిభావంతుడే. కానీ చిన్న వయసులో వచ్చిన గుర్తింపును హ్యాండిల్ చేయలేకపోయాడు. క్రమశిక్షణ తప్పాడు. చివరకు ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా పతనమయ్యాడు. ప్రథ్వీ షా కూడా మరో యువ సంచలనం. అయితే, అతడు మళ్లీ శిఖరాగ్రానికి చేరే అవకాశం ఉండి ఉండొచ్చు. కాబట్టి.. యువ క్రీడాకారుల టాలెంట్ సరిగ్గా మలచాల్సిన అవసరం కూడా ఉంది’’ అని అన్నారు. సూర్యవంశీని కాపాడుకోవాలని బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు సూచించారు. అతడికి మార్కెటింగ్ కోసం అతిగా వాడొద్దని నొక్కిచెప్పారు.
స్టార్ హీరోయిన్ నడుము గిల్లిన వ్యక్తి.. వీడియో వైరల్..
ఈ నడుమ హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్ లకు వెళ్తే.. అక్కడ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. వారి మీద కావాలని కొందరు చేతులు వేయడం.. లేదంటే వారి ప్రైవేట్ పార్ట్స్ మీద అసభ్యకరంగా తాకడం లాంటివి కూడా చూస్తున్నాం. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కు కూడా ఇలాంటి సమస్యనే ఎదురైంది. ఆమె ఎవరో కాదు మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయమే అక్కర్లేదు. మలయాళంలో ఆమెకు ఉన్నంత క్రేజ్ మరే హీరోయిన్ కు కూడా లేదు. తిరుగులేని ఫాలోయింగ్ ఆమె సొంతం. అయితే రీసెంట్ గా ఆమె బెంగుళూరులో ఓ షాప్ ఓపెనింగ్ కోసం వెళ్లింది. ఆమెను చూసేందుకు వందలాది మంది వచ్చారు. దీంతో కారుమీదనే నిలబడి ఆమె అందరికీ అభివాదం చేస్తున్న టైమ్ లో.. ఓ పోకిరీ జనం మధ్యలో నుంచి ఆమె నడుము గిల్లాడు. దాంతో ఆమె ఒకింత షాక్ కు గురైంది. అతను ఎవరు అనేది ఆ జనాల్లో సరిగ్గా కనపించట్లేదు. కానీ ఆమె మాత్రం దాన్ని హైలెట్ చేయకుండా అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన వారంతా సదరు వ్యక్తిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక హీరోయిన్ ను అలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటుందని.. ఎలాంటి ఎక్స్ పోజింగ్ పాత్రలు కూడా చేయని ఆమె మీద.. ఇలాంటి ఘటన బాధాకరం అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక మంజు రీసెంట్ గా రజినీకాంత్ తో వేట్టయాన్ మూవీలో హీరోయిన్ గా చేసింది. ఎల్-2 ఎంపురాన్ లో కూడా నటించింది.
ఆదిపురుష్ చూపించి.. కొడుక్కి సారీ చెప్పిన సైఫ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, ఆదిపురుష్ చిత్రంలో రావణుడి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన నేపథ్యంలో, సైఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ, తన కుమారుడితో కలిసి ఈ సినిమాను చూసిన ఒక సంఘటన ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు, ఈ సినిమా ఎంతటి నిరాశను మిగిల్చిందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. “నా కుమారుడితో కలిసి ఆదిపురుష్ చూస్తున్నప్పుడు, సినిమా గురించి నాకు పూర్తిగా అర్థమైంది. నా కుమారుడు నన్ను ఒక చూపు చూశాడు, ఈ సినిమాని ఎందుకు చూడమంటున్నావు అన్నట్టు. నేను వెంటనే క్షమాపణ చెప్పేశాను,” అని సైఫ్ తన అనుభవాన్ని వివరించారు. ఈ వ్యాఖ్యలు, ఆదిపురుష్ చిత్రం పట్ల ప్రేక్షకులతో పాటు ఆ సినిమాకి పని చేసిన వారు కూడా ఎదుర్కొన్న నిరాశను స్పష్టంగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి.రామాయణం లాంటి గొప్ప ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్, శ్రీ రాముడి కథను అద్భుతంగా ఆవిష్కరిస్తుందని అందరూ ఆశించారు. కానీ, దర్శకుడు ఓం రౌత్ తీసుకున్న కొన్ని సృజనాత్మక నిర్ణయాలు కారణంగా ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విజువల్ ఎఫెక్ట్స్, సంభాషణలు, కథనం వంటి కీలక అంశాలు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. అంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో కీలక పాత్ర పోషించిన సైఫ్ స్వయంగా దాని లోపాలను ఒప్పుకోవడం ఈ సినిమా ఎదుర్కొన్న వైఫల్యాన్ని మరింత స్పష్టం చేస్తోంది.