రైతులకు గుడ్‌న్యూస్.. నిధులు విడుదల..
రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఖరీఫ్ పంట బీమా పథకాలకు నిధులు విడుదల చేసింది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్.. ఖరీఫ్ పంట బీమా పథకానికి 132 కోట్ల 58 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఖరీఫ్ పంట 2025 కు రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర వాటా 50 శాతం నిధులు విడుదలయ్యాయి.. ముందస్తు ప్రీమియం సబ్సిడీగా చెల్లించడానికి ఈ నిధులు వినియోగించనున్నారు.. పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 132 కోట్ల 58 లక్షల నిధులు విడుదల చేయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
జనసేన ఎమ్మెల్యేలపై పవన్ కల్యాణ్ ప్రత్యేక సర్వే..!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. తమ పార్టీ ప్రజాప్రతినిధుల తీరుపై ఫోకస్ పెట్టారు.. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారట.. ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలపై ప్రధానంగా ఈ సర్వే ద్వారా ఆరా తీస్తున్నారట జనసేనాని.. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల జోక్యం ఏ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉంది..? ఎవరు ఎక్కువ ఇసుక.. మద్యం.. ఇతర లావాదేవీల్లో ఉన్నారు..? అనే అంశాలపై పూర్తిస్థాయిలో వివరాలతో కూడిన సర్వే చేస్తున్నారట.. ఇటీవల జనసేన ఎమ్మెల్యేలపై వరస విమర్శలు.. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఈ పరిణామాలపై సీరియస్‌గా ఉన్న పవన్ కల్యాణ్.. సర్వేకు ఆదేశాలు ఇచ్చారట.. అయితే, ఈ సర్వే ఆధారంగా.. ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. దీంతో, ఆరోపణలు ఎదుర్కొంటున్నర ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైనట్టుగా ప్రచారం సాగుతోంది..
తనిఖీల ఎఫెక్ట్.. దిగొస్తున్న సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు..!
సినిమా థియేటర్లపై తనిఖీల ఎఫెక్ట్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.. ప్రభుత్వ తనిఖీల ఎఫెక్ట్‌తో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు దిగివస్తున్నాయి.. ఇప్పుడు సినిమా థియేటర్లతో పాటు, మల్టీప్లెక్స్‌లు ఆహార పదార్థాల ధరలపై 10 శాతం నుండి 20 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించి విక్రయాలు సాగిస్తున్నాయట.. అంతేకాదు.. బై వన్.. గెట్ వన్.. ఆఫర్లతో వినియోగదారులను తినుబండారాలు విక్రయిస్తున్నారు.. నిన్న, మొన్న వరుసగా రెండు రోజులు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు అధికారులు.. టికెట్ ధరలు, ఆహార పదార్థాల క్వాలిటీ, ధరలు పెంపుపై వచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకుని ఈ సోదాలు నిర్వహించారు.. మిరజ్ సినిమాస్ మల్టీప్లెక్స్ లలో లార్జ్ సైజ్ పాప్కాన్ బకెట్ 750 రూపాయలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.. ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముతున్న థియేటర్లను నోటీసులు ఇచ్చారట.. ధరలపై నియంత్రణ లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.. దీంతో, అసలుకే ఎసరు వచ్చేలా ఉందని గ్రహించిన సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు.. ఇప్పుడు ధరలను తగ్గించి అమ్మకాలు సాగిస్తున్నారు.. అయితే, ఇది ఇప్పుడు విశాఖకే పరిమితం అయ్యిందా..? రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల ప్రభావం కనిపిస్తుందా? అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
జనాభా పెరుగుదల.. ప్రభుత్వం ప్రత్యేక సర్వే..
గతంలో జనాభా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కుటుంబ నియంత్రణతో జానాభా తగ్గుముఖం పట్టింది.. అయితే, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరిగినా ఉత్తరాధి రాష్ట్రాల్లో మాత్రం.. జనాభా పెరుగుతూ పోయింది.. ఇప్పుడు, ఇది దక్షిణాది ప్రాంతానికి పెను ముప్పుగా మారిందనే చర్చ సాగుతోంది.. ఆర్థికంగా, రాజకీయంగా కూడా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పుడు మళ్లీ పిల్లలను కనండి.. అంటూ పాలకులు ప్రోత్సహిస్తున్నారు.. అయితే, ప్రభుత్వ పెద్దల మాట ఇలా ఉన్నా..? ప్రజల్లో దీనిపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకున్న ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కార్.. అందులో భాగంగా.. జనాభా పెరుగుదల అంశానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.. జనాభా పెరగాలని ఇప్పటికే స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, జనాభా పెరగడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.. దీంతో 20 రోజుల పాటు ప్రత్యేక సర్వే నిర్వహించడానికి సిద్ధమైంది ప్రభుత్వం.. వైద్య ఆరోగ్య.. మహిళా శిశు సంక్షేమ శాఖలకు ఈ బాధ్యతలు అప్పగించారు.. ప్రతి ఇంటిలో సర్వే నిర్వహించి.. వారి అభిప్రాయాలు సేకరించబోతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 20 రోజుల పాటు సర్వే నిర్వహించబోతున్నారట.. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితులు.. ఎక్కువ మంది పిల్లలు ఉంటే వచ్చే ఇబ్బందులు.. ప్రభుత్వం నుంచి కోరుకునే సౌకర్యాలపై కొన్ని ప్రశ్నలు ఆధారంగా ఈ సర్వే నిర్వహించబోతున్నారు..
రాజకీయ కక్షతోనే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు.. కేసీఆర్ సంచనల ఆరోపణలు..!
ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీష్‌రావు భేటీ ముగిసింది.. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చలు జరిపారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ (NDSA) ఇచ్చిన రిపోర్టును నిర్మాణ సంస్థ L&T తప్పు పట్టడంపై చర్చించారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజీపై రిపోర్ట్ ఎలా ఇస్తారన్న ఎల్ అండ్ టీ సంస్థ ప్రశ్నని కమిషన్ ఎదుట ప్రస్తావించాలని నిర్ణయించారు. నిర్మాణ సంస్థ లేఖతో ఎన్బీఎస్ఏ నివేదికలో డొల్లతనం బయటపడిందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి నిర్మాణం పొర్తయ్యేవరకు జరిగిన ప్రక్రియనంతా వివరించేందుకు వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కమిషన్ కోరనున్నట్లు నిర్ణయించారు.
ఆ ముగ్గురూ సైనికుల సాహసాన్ని అవమానిస్తున్నారు.. కిషన్‌రెడ్డి ఫైర్..!
నిన్న జైహింద్ ర్యాలీ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ కూడా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరారని.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు ఆకాంక్షించారని గుర్తు చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారన్నారు. పాక్ ఉగ్రవాద స్థావరాలను, పాక్ కీలకమైన సైనిక కేంద్రాలను ధ్వంసం చేసిన విషయాన్ని మనం చూశామని.. ఆపరేషన్ సిందూర్ ఎవరికి తెలియకుండా జరిగిన సంఘటన కాదన్నారు. క్షణ, క్షణం మీడియా లైవ్‌లో ప్రపంచం మొత్తం చూసిందని.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన 23 నిమిషాల్లో 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన మన సైన్యం మనకు కళ్లకు కట్టినట్లు చూపించిందని వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ శత్రువులకు నిద్ర లేకుండా చేశాయి
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా బ్రహ్మోస్ క్షిపణులు మన దేశ శత్రువులకు నిద్ర లేకుండా చేశాయని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగిస్తూ త్రివిధ దళాలను, ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సోదరీమణుల కోపాన్ని ప్రపంచమంతా చూసిందని తెలిపారు. పాకిస్థాన్ లోపల.. వందల మైళ్ల లోపల.. వారి ఇళ్లల్లోకి చొరబడి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ గజగజలాడిందని.. దెబ్బతో పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. ఉగ్రదాడులపై భారత్ ఎప్పుడూ తీవ్రంగా స్పందిస్తుందని.. సైన్యం సమయం, ప్రణాళికలు వేసుకుని దాడి చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక అణు బెదిరింపులకు భారత్ ఎప్పుడూ భయపడదని తెలిపారు. స్వచ్ఛమైన కాన్పూర్ శైలిలో చెప్పాలంటే.. శత్రువు ఎక్కడున్నా వాళ్ల అంతు చూస్తామని మోడీ హెచ్చరించారు.
యుద్ధ బాధితులకు అండగా ఉంటాం.. కాశ్మీర్ టూర్లో అమిత్ షా భరోసా
జమ్మూకాశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను అమిత్ షా పరామర్శించారు. పాక్ షెల్లింగ్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ప్రజలను టార్గెట్‌గా చేసుకుని పాక్ దాడులు చేయడం గర్హనీయమన్నారు. పాక్ దాడుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం, ప్రజల సంఘీభావం ఉంటుందని.. యావద్దేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. స్థానిక ప్రజలు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యావద్దేశానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి పిరికిపంద చర్య అని.. ఏ ఉగ్రవాద చర్యను ప్రధాని మోడీ ఉపేక్షించరని చెప్పారు.
ఫైనల్లో ఆర్సీబీ గెలుస్తుంది.. జోస్యం చెప్పిన మిస్టర్ 360!
ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుస్తుందని మిస్టర్ 360, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పాడు. క్వాలిఫయర్-1లో తేలిపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు. జోష్ హేజిల్‌వుడ్ రాకతో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ బలంగా మారిందన్నాడు. భువనేశ్వర్ కుమార్ టోర్నీలో చక్కగా బౌలింగ్ చేస్తున్నాడని ఏబీడీ తెలిపాడు. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐపీఎల్ నాకౌట్ చరిత్రలోనే బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక జూన్ 3న ఫైనల్ కోసం ఆతృతగా వేచి చూస్తోంది. జియో హాట్‌స్టార్‌లో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ… ‘క్వాలిఫయర్-1లో విరాట్ కోహ్లీ పెద్దగా పరుగులు చేయలేదు. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభంలో మొదటిసారి స్క్రీన్ మీద చూసినప్పుడు అతడిలో ఏకాగ్రతను చూశాను. ఒక్కోసారి త్వరగా పెవిలియన్ చేరుతారు. అయినా ఇబ్బందేమీ లేదు. కోహ్లీ కచ్చితంగా ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడతాడు. ఇందులో నాకు ఎటువంటి డౌట్ లేదు. ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ ఆడుతుంటే చూడ్డానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పాడు. ఐపీఎల్ 2025 ఆరంభం నుంచి కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. ఇప్పటికే 600 పరుగుల మార్క్ అందుకున్నాడు. క్వాలిఫయర్-1లో 12 పరుగులే చేసిన కింగ్.. ఫైనల్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
పవన్ మాట.. ఛాంబర్ వద్దకు ఏఎం రత్నం..
పవన్ కల్యాణ్ నటించిన హరిహరీ వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టికెట్ రేట్ల కోసం ఏఎం రత్నం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ రీసెంట్ గా టాలీవుడ్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన సినిమా అయినా సరే టికెట్ రేట్ల కోసం వ్యక్తిగతంగా రావొద్దని.. ఫిలిం ఛాంబర్ ద్వారానే అప్లై చేసుకోవాలని తేల్చి చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఏఎం రత్నం ఫిలిం ఛాంబర్ ద్వారానే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఏపీలో టికెట్ల రేట్లకు సంబంధించి ఏది కావాలన్నా అందరూ పవన్ వద్దకు వెళ్లి కలిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు పవన్ సినిమా నుంచే ఈ టికెట్ల రేట్ల విషయంలో ప్రాసెస్ మారిపోయింది. ఇది ఒక రకంగా ఏఎం రత్నంకు ఇబ్బందే అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్వయంగా పవన్ సినిమా అయి ఉండి.. నేరుగా వెళ్లి ఓకే చేయించుకోలేని పరస్థితులు ఉన్నాయి. కానీ పవన్ చెప్పాడంటే దాన్ని ఫాలో కావాల్సిందే కదా.