పవన్ కల్యాణ్‌పై కాటసాని హాట్ కామెంట్స్..
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని నిర్ధారణ అయిన నేపథ్యంలో, పవన్ కల్యాణ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల మెట్లను పవన్ కల్యాణ్ పై నుంచి కిందికి.. లేదా కింది నుంచి పైకి.. కడుగుతారా అంటూ ఎద్దేవా చేశారు. లోపల ఒకటి పెట్టుకుని బయట మరోటి మాట్లాడటం సరికాదని, మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలని సూచించారు. నోరు వచ్చినట్టు మాట్లాడకుండా జాగ్రత్త పడాలని హితవు పలికారు. ఒకే అంశంపై ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడటం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు కాటసాని.. అమ్మా, నాన్న హారతి ఇచ్చిన సమయంలో సిగరెట్ వెలిగించుకున్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఇక, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పులు వదిలి తిరుపతి ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించేవారని కాటసాని గుర్తు చేశారు. ఇదే సమయంలో శ్రీశైలంలో కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహరీ గోడ కూల్చివేతపై మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ప్రహరీ గోడను కూల్చడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షించి గోడను కూల్చించారని ఆరోపించారు. సొంత ఖర్చులతో ప్రహరీ గోడను తిరిగి నిర్మించి, బాధితులకు క్షమాపణలు చెప్పాలని శిల్ప చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు.
కోట్లాది మంది భక్తులను షాక్‌కు గురిచేసిన పాపం చంద్రబాబుదే.. సజ్జల ఫైర్
తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన బాధ్యత పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిదేనని ఆయన ఆరోపించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ చేపట్టిందని సజ్జల గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం తీవ్ర తప్పిదమని అన్నారు. ఈ అంశం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించినదైనందున టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన సంస్థలు చేసిన ల్యాబొరేటరీ పరీక్షల నివేదికలు, రెండు సందర్భాల్లోనూ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా వెల్లడించాయని సజ్జల చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబు తన ఆరోపణలను వెనక్కి తీసుకోకుండా, ఇంకా అదే తరహా ప్రచారం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు సజ్జల.. సీఎం చంద్రబాబు దురుద్దేశాలు బయటపడ్డాయని, అబద్ధమని నిర్ధారణ అయిన తర్వాత కూడా కొత్త అబద్ధాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విచారణ మొత్తం జంతువుల కొవ్వు అంశంపైనే జరిగిందని, ఇప్పుడు వేరే కంపెనీల పేర్లు తెరపైకి తీసుకురావడం కుట్రలో భాగమేనని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఉన్న హర్ష్ డెయిరీనే తర్వాత భోలే బాబా డెయిరీగా మారిందని, గత ప్రభుత్వ హయాంలో అసలు భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి తీసుకోలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ కాలంలో టెక్నికల్ ఇన్స్పెక్షన్ అనంతరం భోలే బాబాను బ్లాక్‌లిస్ట్ చేశామని తెలిపారు.
పాదయాత్ర నా జీవితాన్ని మార్చేసింది.. సమాజం నుంచి ఎంతో నేర్చుకున్నా..
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్రతో ప్రజలకు చేరువయ్యారు నారా లోకేష్.. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడానికి లోకేష్ పాదయాత్ర కూడా దోహదం చేసింది.. ఇప్పుడు మరోసారి తన పాదయాత్ర గురించి గుర్తుచేసుకున్న మంత్రి నారా లోకేష్.. పాదయాత్ర తన జీవితాన్నే మార్చేసిందని, సమాజం నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం దక్కిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కాకినాడ జేఎన్‌టీయూ (JNTU)లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించిందని, అదే తన ఆలోచనా విధానంలో పెద్ద మార్పుకు కారణమైందని లోకేష్ తెలిపారు. సమాజం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పారు. ఇక, పిల్లలను సోషల్ మీడియా ప్రభావం నుంచి దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు ఎలా ఉపయోగించుకోవాలన్నదానిపై దృష్టి పెట్టాలని సూచించారు. డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీ ద్వారా వరదలను ముందుగానే అంచనా వేసే విధానాలపై పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో రాజమండ్రి పుష్కరాల సమయంలో జరిగిన దురదృష్టకర తొక్కిసలాటను గుర్తు చేస్తూ, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
నాంపల్లి అగ్ని ప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న యువకుడి చివరి కాల్ రికార్డింగ్
హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఇటీవల చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుకాణంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న యాదయ్య, లక్ష్మి దంపతుల కుమారులు అఖిల్, ప్రణీత్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వారిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళిన సేల్స్‌మ్యాన్ మహ్మద్ ఇంతియాజ్, ఆటో డ్రైవర్ సయ్యద్ హబీబ్, మరో మహిళ బేబీ సైతం మృత్యువాత పడ్డారు. వాస్తవానికి ఆ ఫర్నిచర్ దుకాణంలోని సెల్లార్ ఒక మృత్యు కుహరాన్ని తలపించింది. అయితే.. తాజాగా ఇంతియాజ్‌కి సంబంధించిన లాస్ట్ కాల్ రికార్డు బయటకు వచ్చింది. చనిపోయే కొద్దిక్షణాల ముందు సేల్స్‌మ్యాన్ ఇంతియాజ్ మాట్లాడిన కాల్ రికార్డింగ్ వైరల్‌గా మారింది. “ఫైర్ నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పాడింది అన్న.. ఎగ్జిట్ రూట్‌లు అన్నీ మూసుకుపోయాయి.. నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు.. బయటకు రాలేకపోతున్నాం.. అన్న కాపాడండి.. అసలేం కనిపించడం లేదు..” అని ఆర్తనాదాలు చేశాడు. యువకుడి చివరి కాల్ రికార్డింగ్ కన్నీరు పెట్టిస్తోంది.
పరువు తీసుకోవడమే పాక్ ప్రధాని పని.. ఈసారి ఏం చేశాడంటే..
పాకిస్తాన్ రాజకీయ నాయకులు పరువు తీసుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు ఉన్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తాజాగా, ఆయన ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుపుపై సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు పాక్ పీఎంను ఒక ఆట ఆడుకుంటున్నారు. మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా షరీఫ్ పోస్ట్‌పై సెటైర్లు వేశారు. ‘‘ఆస్ట్రేలియా -బీ టీమ్’’పై గెలవడంలో గొప్పేంటి అని ప్రశ్నించారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించడంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదటి టి20ఐలో ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు టీమ్ పాకిస్తాన్‌కు అభినందనలు. పాకిస్తాన్ క్రికెట్‌ను బలోపేతం చేయడంలో అవిశ్రాంత కృషి చేసినందుకు చైర్మన్ పిసిబి చీఫ్ మొహ్సీన్ నఖ్వీ మరియు అతని మొత్తం జట్టును కూడా నేను అభినందిస్తున్నాను. దేశానికి గర్వకారణమైన క్షణం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై ఆకాష్ చోప్రా స్పందిస్తూ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీంలోని కీలక ఆటగాళ్లు ఈ సిరీస్ ఆడటం లేదని, 170 పరుగుల ఆటలో 20 రన్స్ తేడాతో విజయం సాధించడం పెద్ద గొప్ప కాదని ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా టీంలో కీలమైన ఐదుగురు ఆటగాళ్లు లేకుండా పాక్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ట్రావిస్ హెడ్ నేతృత్వంలో ఆసీస్ బీ టీమ్ పాక్‌లో ఆడుతోంది. తొలి టీ20లో పాక్ 168/8 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 146/8కి పరిమితమైంది. కేవలం 22 పరుగుల తేడాతో గెలవడం పెద్ద గెలుపు, దేశానికి గర్వకారణం కాదని ఆకాష్ చోప్రా చెప్పారు.
బైడెన్‌కు $7,750 విలువైన సిల్వర్ ట్రైన్ సెట్.. బహుమతిగా ఇచ్చిన పీఎం మోడీ..
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత విలువైన సిల్వర్ ట్రైన్ సెట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. అమెరికా విదేశాంగ శాఖ నివేదిక భారత నాయకులు అమెరికా అగ్ర రాజకీయ నాయకులకు ఇచ్చిన ఖరీదైన బహుమతుల వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌కు $7,750 విలువైన స్టెర్లింగ్ సిల్వర్ రైలు సెట్‌ను బహుమతిగా ఇచ్చారు, తరువాత దానిని నేషనల్ ఆర్కైవ్స్‌కు బదిలీ చేశారు. స్టేట్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ కార్యాలయం విడుదల చేసిన ఈ నివేదిక, 2024 సంవత్సరంలో వివిధ US ఏజెన్సీలకు నివేదించిన బహుమతుల వివరాలను వివరిస్తుంది. సెప్టెంబర్ 10, 2023న, ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షుడు బైడెన్‌కు కండువాలు, కుంకుమ పువ్వు, వుడెన్ టీ బాక్స్‌ను బహుకరించారని, దీని విలువ $562 ఉంటుందని అంచనా వేయబడిందని వైట్ హౌస్ ప్రకటన పేర్కొంది. టీ, కుంకుమ పువ్వు వంటి పాడైపోయే వస్తువులు మినహా మిగిలిన వస్తువులను నేషనల్ ఆర్కైవ్స్‌కు అప్పగించారు. 2024 అక్టోబర్ 21న ప్రధాని మోడీ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు $2,969 విలువైన పష్మినా శాలువాను బహూకరించారని, దానిని నేషనల్ ఆర్కైవ్స్‌కు కూడా బదిలీ చేశారని కూడా నివేదిక పేర్కొంది.
ఎలాన్ మస్క్ పెద్ద స్కెచ్..! ఐఫోన్‌కు స్టార్‌లింక్ ఫోన్ పోటీయేనా..?
ఎలాన్ మస్క్ అంటేనే వినూత్న ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలు. ఎలక్ట్రిక్ కార్లతో టెస్లా, అంతరిక్ష రంగంలో స్పేస్‌ఎక్స్, ఉపగ్రహ ఇంటర్నెట్‌తో స్టార్‌లింక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త ప్రయోగాలు.. ఇలా అనేక రంగాల్లో తన ముద్ర వేసిన మస్క్ ఇప్పుడు మరో కొత్త పరిశ్రమపై దృష్టి పెట్టినట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఈసారి ఆయన చూపు స్మార్ట్‌ఫోన్ రంగంపై పడిందా..? అనే ప్రశ్నలు ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ చాట్‌బాట్లు, అంతరిక్ష అన్వేషణ తర్వాత మస్క్ స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ విషయం గురించి ఆయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక యూజర్ “స్టార్‌లింక్ బ్రాండెడ్ ఫోన్ వస్తే అద్భుతంగా ఉంటుంది” అంటూ కామెంట్ చేశాడు. స్టార్‌లింక్ అనేది ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ నిర్వహిస్తున్న ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవ అన్న విషయం తెలిసిందే. అయితే, ఆ యూజర్ కామెంట్‌కు స్పందించిన మస్క్.. ఇది అసాధ్యం కాదు అంటూ బదులిచ్చారు. ఈ ఒక్క మాటతోనే స్టార్‌లింక్ ఫోన్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. మస్క్ ఇప్పటివరకు స్పష్టంగా ఫోన్ విడుదల చేస్తున్నాం అని చెప్పకపోయినా, ఆ అవకాశం ఉందన్న సూచన మాత్రం ఇచ్చారు.
సడెన్‌గా బంగారం, వెండి ధరలకు బ్రేక్.. షాకింగ్ రీజన్ చెప్పిన నిపుణులు
సడెన్‌గా బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతోన్న బంగారం, వెండి ధరలు నేడు పతనమయ్యాయి. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో శుక్రవారం మార్కెట్లలో హడావుడి కనిపించింది. గురువారం వరకూ రికార్డు స్థాయిలను తాకిన ఈ ధరలు ఒక్కరోజులోనే దిశ మార్చుకోవడంతో ఇన్వెస్టర్లు గందరగోళానికి గురయ్యారు. దేశీయ మార్కెట్, ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ మూడు శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. బంగారం ధర దాదాపు ఒకటిన్నర శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అమెరికాలో కామెక్స్ మార్కెట్‌లో బంగారం ధర ఒక్కరోజులోనే రెండు శాతం కంటే ఎక్కువగా పడిపోయింది. గురువారం వెండి కిలోకు రూ.4,20,000 పైగా, బంగారం 10 గ్రాములకు రూ.1,80,000 దాటిన తర్వాత ఈ పతనం రావడం గమనార్హం. ఈ అంశంపై నిపుణులు షాకింగ్ కారణాలను చెబుతున్నారు. డాలర్ మళ్లీ బలపడుతోందని ఇదే ఈ మార్పునకు కారణమని అంటున్నారు. డాలర్ విలువ పెరగడంతో బంగారం, వెండిపై అమ్మకాలు పెరిగాయని.. చాలా రోజులుగా పెరుగుతూనే ఉన్న ధరలు ఒక్కసారిగా తగ్గడంతో పెట్టుబడిదారులు లాభాలు బుక్ చేసుకోవడం మొదలుపెట్టారని స్పష్టం చేశారు. డాలర్ సూచీ ఇటీవల తక్కువ స్థాయిల నుంచి మళ్లీ పైకి రావడం, రూపాయితో పోలిస్తే డాలర్ రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ ఒత్తిడి పడిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా భారత్‌లో బంగారం డిమాండ్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. ధరలు ఆకాశాన్ని తాకడంతో నగల కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, 2025 చివరి త్రైమాసికంలో కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కొంత తగ్గాయని, అయితే పెట్టుబడిదారుల ఆసక్తి మాత్రం బలంగా ఉందని తెలిపింది. ధరలు పడిపోయినా, మొత్తం నెలను చూస్తే బంగారం, వెండి ఇప్పటికీ చరిత్ర సృష్టించాయి. 1980ల తర్వాత బంగారానికి ఇదే అత్యుత్తమ నెలగా మారనుంది. వెండి అయితే జనవరిలోనే 50 శాతం కంటే ఎక్కువ లాభం చూపించే దిశగా ఉంది. ఇది ఇప్పటివరకు ఎన్నడూ లేని స్థాయి అని నిపుణులు చెబుతున్నారు. అమెరికా వడ్డీ విధానంపై మారుతున్న అంచనాలు, డాలర్ బలహీనతే ఈ భారీ ర్యాలీకి కారణమని వారు అంటున్నారు.
ఓటీటీలోకి ధురంధర్, నెట్‌ఫ్లిక్స్ తీరుపై ఆగ్రహం.. కారణాలేంటి..?
ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి చూసిన తరుణం వచ్చింది. బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘‘ధురందర్ ’’ ఓటీటీలోకి వచ్చింది. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో కేవలం హిందీలోనే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రీజినల్ భాషల్లో కూడా ఓటీటీలో కనిపిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నాలు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లను కొల్లగొట్టింది. ఇప్పుడు, ప్రపంచం మొత్తం ధురందర్-2 కోసం వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే, మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌పై ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ థియేటర్ లో చూసిని సినిమా నిడివి కన్నా, నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ తక్కువ నిడివితో ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పాటు క్వాలిటీ బాగా లేదని ఆరోపిస్తున్నారు. థియేటర్‌లో ఈ సినిమా 3 గంటల 45 నిమిషాలు ఉంటే, నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ మాత్రం 3 గంటల 25 నిమిషాలు ఉంది. దాదాపుగా 9 నుంచి 10 నిమిషాల సీన్లను తొలగించారు. సినిమాలో ఓటీటీలోకి వచ్చిన కొద్దిసేపటి నుంచే సోషల్ మీడియాలో అభిమానుల ఫిర్యాదుల వెల్లువెత్తాయి. సినిమాలోని కొన్ని ముఖ్యమైన డైలాగ్స్‌ను మ్యూట్ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. కొన్ని సన్నివేశాలను పూర్తిగా కట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఏ-సర్టిఫికేట్ పొందినప్పటికీ, మళ్లీ సెన్సార్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓటీటీలో అన్ కట్ వెర్షన్ చూడాలనుకున్నామని, ఇలా చేస్తే సినిమా సహజత్వం పోతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాలో 10 నిమిషాల సన్నివేశాలను కట్ చేయడంతో సినిమా ప్రవాహంపై ప్రభావం పడిందని చెప్పారు.
‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే.. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. శర్వానంద్ సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా ఒప్పుకున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఎవరూ నమ్మలేదు. కానీ, నిర్మాతల ప్లానింగ్‌తో ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అయ్యి హిట్టు కొట్టింది. అయితే.. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. ఓ కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే గౌతమ్ (శర్వానంద్), అదే కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే నిత్య(సాక్షి వైద్య)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారు. అయితే అనూహ్యంగా గౌతమ్ పాస్ట్ రిలేషన్ కారణంగా ఈ పెళ్లికి అడ్డంకులు ఏర్పడతాయి. ఆ రిలేషన్ కారణంగా ఎందుకు పెళ్లికి ఇబ్బంది ఏర్పడింది? అసలు గౌతమ్ పాస్ట్ రిలేషన్‌లో ఉన్న దియా(సంయుక్త)తో ఎందుకు బ్రేకప్ అయింది? గౌతమ్ తండ్రి కార్తీక్ (సీనియర్ నరేష్) లేటు వయసులో ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు? అతని లేటు పెళ్లి గౌతమ్ పెళ్లికి అడ్డంకిగా మారిందా? చివరికి గౌతమ్ నిత్యను పెళ్లి చేసుకున్నాడా లేదా? గౌతమ్ లైఫ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన దియా ఏం చేసింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని ఓటీటీలో వీక్షించండి.