టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం.. మంత్రులకు సీఎం కీలక సూచనలు..
తిరుమల టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో సిట్ నివేదికపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారంపై ఏపీ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. అసలు నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందన్న తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయంను అధికారులు కేబినెట్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో సిట్ నివేదిక అధికారికంగా అందిన తర్వాతే స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు స్పష్టమైన సూచనలు చేశారు.
జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ ఘటనపై స్పందించిన జగన్.. సంచలన వ్యాఖ్యలు..
రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, ఆంధ్రప్రదేశ్ జంగిల్‌రాజ్‌గా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు, మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదు. బరితెగింపునకు అడ్డుకట్ట లేకుండా పోయింది. విచ్చలవిడితనం ఊహించని స్థాయికి చేరింది అంటూ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి దిగజారారో అర్థం కావడం లేదని విమర్శించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి, భయపెట్టాడని ఆరోపించారు వైఎస్ జగన్… అలాగే ఆముదాలవలస ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, సత్యవేడు ఎమ్మెల్యే మహిళపై అత్యాచారం చేసి అధికార బలంతో కేసును క్లోజ్ చేయించుకున్నారని జగన్ పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి పీఏపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళను అరెస్టు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డ్యాన్సుల వ్యవహారాన్నీ ఆయన ప్రస్తావించారు. ఇక, చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తయ్యాయని, మూడు బడ్జెట్లు పెట్టినా ప్రజలకు ఒక్క మంచిపని కూడా జరగలేదని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి ప్రతి హామీని అమలు చేశామని గుర్తుచేశారు. కోవిడ్ వంటి సంక్షోభంలోనూ ఏ పథకాన్నీ నిలిపివేయలేదన్నారు.
ప్రజల మధ్యే ఉంటా.. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తా..
రాబోయే కాలంలో ప్రజల మధ్యే ఉంటూ 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… గ్రామస్థాయిలో పార్టీ కమిటీలను మరింత బలోపేతం చేస్తామని, జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని స్పష్టం చేశారు. “ఈసారి ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్ తన్నినట్టుగా తంతారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇసుక, మద్యం, ఖనిజాల రంగాల్లో విస్తృత స్థాయిలో అవినీతి జరుగుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మొత్తం చంద్రబాబు నాయుడు మరియు ఆయన అనుచరుల జేబుల్లోకి వెళ్తోందని విమర్శించారు. బెల్టుషాపులు, మద్యం షాపులన్నీ అధికార పార్టీ నేతల ఆధీనంలోనే నడుస్తున్నాయని మండిపడ్డారు. గత ఎనిమిది త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. వసతి దీవెన నిధులు కూడా ఇవ్వలేదని, గోరుముద్ద పథకంలో నాణ్యత పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో కల్తీ ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా నిర్వీర్యమైందని, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, యూరియా కూడా అందుబాటులో లేదన్నారు జగన్.. ఇక, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేశారని జగన్ విమర్శించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు పూర్తిగా అబద్ధాలని తేలిపోయాయని అన్నారు. గ్యాస్ సిలిండర్ల నుంచి మద్యం వరకు ప్రతి రంగంలోనూ మోసాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరోవైపు, వైసీపీ హయాంలో ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేశామని, అందులో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని జగన్ స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తికాకముందే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో “దోచుకో–పంచుకో–తిను” అనే విధానం నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 35 అజెండా అంశాలకు ఆమోదం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి, పర్యాటక రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానంలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేసే అంశంపై చర్చ జరిగింది. ఇక, పలమనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు కోసం భూ బదిలీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖపట్నంలో 500 చదరపు గజాల స్థలం కేటాయించేందుకు కూడా అంగీకారం తెలిపింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు గ్రూప్–1 ఉద్యోగం కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించింది.
ఎన్నికల గుర్తు ‘‘గడియారం’’.. అదే గడియారంతో అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు..
మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మరణం తీవ్ర విషాదంగా మారింది. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా అందరూ మరణించారు. దీంతో, మహాయుతి సర్కార్‌లో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన మృతదేహాన్ని బారామతిలోనే ఉంచారు. రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన లీర్జెట్ 46 విమానం ముంబై నుండి బయలుదేరిన 35 నిమిషాల తర్వాత, ఉదయం 8:45 గంటల ప్రాంతంలో కూలిపోయింది. మరణించిన వారిలో పవార్ పీఎస్ఓ, సహాయకుడు, ఇద్దరు సిబ్బంది (ప్రధాన పైలట్ మరియు ఫస్ట్ ఆఫీసర్) ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ల్యాండింగ్ అవుతున్నప్పుడు అదుపుతప్పి కూలిపోయినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, పవార్ మృతదేహాన్ని ఆయన చేతి గడియారం ద్వారా గుర్తించారు. ఎన్సీపీ అధికారి ఎన్నికల గుర్తు కూడా గడియారమే. 66 ఏళ్ల పవార్, ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం బారామతి వెళ్లారు. మరికొన్ని క్షణాల్లో ల్యాండ్ కావాల్సిన విమానం, ప్రమాదంతో ముగిసింది.
అజిత్ తర్వాత ‘పవర్’ ఎవరికి? పార్టీ పగ్గాల కోసం తెర వెనుక పావులు
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఘటన అజిత్ పవార్ అకాల మరణం. బుధవారం బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లోని రెండు వర్గాల మధ్య ఏకీకరణ గురించి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. అజిత్ పవార్ పార్టీని ఎవరు నడిపిస్తారు? అజిత్ వర్గం ఇప్పుడు తిరిగి శరద్ పవార్ వద్దకు వస్తుందా? ఆయన పార్టీ కోసం తెర వెనుక పావులు కదుపుతుంది ఎవరు, ఇప్పుడు ఆయన పవర్ ఎవరికి దక్కుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మహారాష్ట్రలో అజిత్ పవార్‌ను అందరూ “దాదా” అని పిలుస్తారు. ఈ పిలుపు ఆయనకు స్థానికంగా ఉన్న ఇమేజ్‌కు అద్దం పడుతుంది. అజిత్ తన ఎన్సీపీ పార్టీని మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతం, ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో బలోపేతం చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ విడిపోయినప్పుడు, అజిత్ పవార్ చాలా మంది ఎమ్మెల్యేలను సమీకరించి, తన వర్గాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు. మహాయుతి కూటమిలో ఆయన కీలక వ్యక్తిగా ఎదిగి, ఎన్డీఏలో బలమైన మిత్రుడిగా కొనసాగారు. బారామతి ఆయన రాజకీయలకు బలమైన కోట, అక్కడి నుంచి ఆయన అనేకసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన మరణం పార్టీ భవిష్యత్తును గందగోళంలోకి నెట్టేసింది. ఇప్పుడు పార్టీ ఎవరి చేతుల్లోకి వెళుతుందనే ప్రశ్న మహారాష్ట్ర రాజకీయాల్లో తలెత్తింది.
జిన్‌పింగ్‌పై “సైనిక తిరుగుబాటు”.. తప్పించుకున్న చైనా అధ్యక్షుడు..!
చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా సైనిక కుట్ర జరిగిందనే వార్తలు వినిస్తున్నాయి. జిన్‌పింగ్‌ను అరెస్ట్ చేయాలిన సైనిక అధికారులు ప్రణాళిక వేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయం ఆపరేషన్‌కు కొన్ని గంటల ముందే జిన్‌పింగ్‌కు తెలిసిందని, దీంతోనే ఈ తిరుగుబాటు విఫలమైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్(CMC) వైస్ చైర్మన్ జాంగ్ యౌషియా, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ లియు జెన్లీలపై జిన్‌పింగ్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెస్ట్రన్ మీడియా కోడైకూస్తోంది. ఇప్పటికే చైనా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం జాంగ్, లియులు తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనలు, చట్ట ఉల్లంఘటనకు పాల్పడినట్లు ప్రకటించింది. దీనికి తోడు చైనీస్ మిలిటరీ అధికారిక వార్తాపత్రిక పీఎల్ఏ డైలీలో అధివారం ప్రచురితమైన ఎడిటోరియల్ ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇద్దరు జనరల్స్ “ఛైర్మన్ బాధ్యత వ్యవస్థను తీవ్రంగా తొక్కి, దెబ్బతీశారని” ఆరోపించింది. ఇక్కడ ఛైర్మన్ అంటే షి జిన్‌పింగ్. ఆయన తర్వాత స్థానంలో జాంగ్ యూక్సియా ఉన్నారు. నివేదికల ప్రకారం, జాంగ్ యౌషియా, లియు జెన్లీ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 18 రాత్రి జిన్ పింగ్‌ను అరెస్ట్ చేయాలని ప్రణాళిక రచించారు. అయితే, దీని అమలుకు 2 గంటల ముందు ఆపరేషన్ లీక్ అయింది. ఒక హోటల్లో ఉన్న జిన్‌పింగ్ అక్కడి నుంచి బయలుదేరారు. వెంటనే కుట్రదారుల్ని కౌంటర్ అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కొన్ని నివేదిక ప్రకారం, జిన్‌పింగ్ ఉన్న హోటల్ వద్ద జిన్‌పింగ్ సెక్యూరిటీ, జాంగ్ వర్గానికి మధ్య తీవ్రమైన కాల్పులు జరిగినట్లు చెబుతున్నాయి.
రోహిత్-కోహ్లీ ప్రభావం.. లైవ్ టెలికాస్ట్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొన్ని సంవత్సరాల క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టుతో మ్యాచ్‌లు లేని సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న భారత ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది. భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ను పక్కన పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే బీసీసీఐ ఆ విధానంను తీసుకొచ్చింది. ఈ మార్పు దేశవాళీ క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చింది. యువ ఆటగాళ్లకు స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం లభించడమే కాకుండా.. అభిమానుల్లో కూడా దేశవాళీ మ్యాచ్‌లపై ఆసక్తి పెరిగింది. గత ఏడాది రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌ను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జైపూర్‌లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లలో ముంబై జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఇందుకు కారణం రోహిత్ శర్మ ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటమే. అంతేకాదు బెంగళూరులో ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచ్‌లు కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. అయితే ఆ మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులకు బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. రోహిత్ -కోహ్లీ పాల్గొన్న మ్యాచ్‌ల లైవ్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
థియేటర్ కలెక్షన్లతో పనిలేదు.. ఓటీటీతోనే సేఫ్: ‘స్పిరిట్’ బాక్సాఫీస్ అరాచకం షురూ!
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ అనౌన్స్మెంట్ నుండే ప్రకంపనలు సృష్టిస్తోంది, షూటింగ్ ఇంకా పూర్తిస్థాయిలో మొదలవ్వకముందే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను ప్రారంభించింది. తాజాగా ఈ సినిమా భారీ OTT డీల్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది, ప్రభాస్ క్రేజ్, సందీప్ వంగా మేకింగ్ స్టైల్‌పై ఉన్న నమ్మకంతో, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ ఎంతలా ఉందంటే, సినిమా విడుదల కాకముందే నిర్మాతలకు ‘టేబుల్ ప్రాఫిట్స్’ వచ్చేలా చేసిందని అంటున్నారు. ఈ సినిమా బిజినెస్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభాస్, సందీప్ వంగా రెమ్యునరేషన్లు మినహాయించి, సినిమా నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు కంటే నెట్‌ఫ్లిక్స్ చెల్లించిన ఓటీటీ డీల్ మొత్తం చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల థియేట్రికల్ రిలీజ్ ద్వారా వచ్చే ఆదాయం అంతా అదనపు లాభంగానే లెక్కించబడుతుంది. అంటే, సినిమా మొదటి రోజే నిర్మాతలను లాభాల్లోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ‘యానిమల్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సందీప్ వంగా చేస్తున్న సినిమా కావడం, పైగా అందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండటం ఈ స్థాయి హైప్‌కు ప్రధాన కారణం, ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఏమాత్రం వెనుకాడకుండా రికార్డు స్థాయి ధరను ఆఫర్ చేసింది, మొత్తానికి, ‘స్పిరిట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో పక్కన పెడితే, బిజినెస్ పరంగా మాత్రం ఇప్పుడే ఒక కొత్త రికార్డును సెట్ చేసింది. .
సౌత్ కోటకు బీటలు: టాప్-4లోకి రణవీర్ ఎంట్రీ.. షేక్ అవుతున్న ఇండియన్ బాక్సాఫీస్!
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించబడింది, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ భారతీయ సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని రికార్డును నమోదు చేసింది. భారతదేశంలోనే ఏకంగా ₹1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కింది, ఇప్పటివరకు బాలీవుడ్ తరపున అత్యధిక దేశీయ వసూళ్లు సాధించిన చిత్రంగా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ (₹760 కోట్లు) పేరిట ఉన్న రికార్డును ‘ధురంధర్’ తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలో మొత్తం ₹1002 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతోంది, తద్వారా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మైలురాయిని అందుకున్న మూడవ చిత్రంగా నిలిచింది. భారతీయ సినీ చరిత్రలో ₹1000 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాల జాబితాను గమనిస్తే, ‘ధురంధర్’ మినహా మిగిలినవన్నీ సౌత్ చిత్రాలే కావడం విశేషం. ప్రస్తుతం దేశీయ వసూళ్లలో టాప్ 4 స్థానాల్లో ఉన్న సినిమాలను పరిశీలిద్దాం . పుష్ప 2: ద రూల్ ₹1471 కోట్లు, బాహుబలి 2: ద కన్ క్లూజన్ ₹1417 కోట్లు, ధురంధర్ ₹1002 కోట్లు, KGF: చాప్టర్ 2 | ₹1001 కోట్లు. గతంలో వెయ్యి కోట్లు సాధించిన సౌత్ చిత్రాలన్నీ భారీ స్థాయిలో మల్టీ-లాంగ్వేజ్ (పాన్ ఇండియా) విడుదలతో ఆ మార్కును అందుకున్నాయి కానీ, ‘ధురంధర్’ ప్రధానంగా తన ఒరిజినల్ హిందీ వెర్షన్ ద్వారానే ఈ స్థాయి వసూళ్లను సాధించి, సింగిల్ లాంగ్వేజ్‌లో ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించడం విశేషం. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, రణవీర్ సింగ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావడమే కాకుండా, బాలీవుడ్ బాక్సాఫీస్ సత్తాను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.