వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు హైకోర్టులో షాక్ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ దాఖలుచేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై అత్యవసర విచారణకు నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. వంశీ హౌస్ మోషన్ పిటిషన్‌పై వచ్చే గురువారం విచారణ చేపడతామని ఈ సందర్భంగా చెప్పింది న్యాయస్థానం.. ఇక, అనారోగ్యంతో బాధ పడుతున్న తనకు మధ్యంతర బెయిల్ ఇస్తే చికిత్స చేయించుంకుంటానంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కూడా వచ్చే గురువారం విచారణ చేయనున్నట్టు హైకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది..
తిరుమలకు రికార్డుస్థాయిలో భక్తులు.. హుండీ ఆదాయం..!
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు. ఇక, వికేండ్ లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటే.. వేసవి సెలవుల్లో అయితే భక్తుల తాకిడి మరింత ఎక్కువగా వుంటుంది. దీనితో సర్వదర్శనం భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివుండే సమయం కూడా అంతకంతకూ పెరుగుతుంది. టోకేన్ లేకుండా తిరుమల చేరుకునే సర్వదర్శనం భక్తులు స్వామివారి దర్శనభాగ్యం కోసం 24 గంటల సమయం వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీవారి ఆలయంలో వున్న పరిస్థితిలో దృష్యా లఘు దర్శన విధానాన్ని అమలు చేస్తే గంటకు నాలుగు నుంచి నాలుగువేల ఐదు వందల మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. ఇక శ్రీవారి ఆలయంలో స్వామివారి నిర్వహించే పూజా కైంకర్యాల సమయాని మినహాయిస్తే మిగిలిన సమయాల్లో స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తుంది టీటీడీ.. గురు, శుక్రవారాల్లో 15 నుంచి 16 గంటల సమయం.. మంగళవారం 18 గంటల సమయం.. మిగిలిన రోజులో 19 గంటల సమయం పాటు భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం టీటీడీకి లభిస్తుంది.. దీనితో గురు, శుక్రవారాల్లో 65 వేల మంది భక్తులకు.. మిగిలిన రోజులో 80 నుంచి 85 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభిస్తుంది. మరో వైపు స్వామివారి రోజు వారి హుండీ ఆదాయం కూడా చాలా రోజులు తరువాత 5 కోట్ల మార్క్ ని దాటింది. దీనితో ఐదు రోజులు వ్యవధిలో స్వామివారికి హుండీ ద్వారా 19 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మరో వైపు శ్రీవారికి ఐదు రోజులు వ్యవధిలో 2 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం రోజు అయితే ఏకంగా 46 వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అన్నప్రసాదం సముదాయంతో పాటు క్యూ లైనులో వేచివున్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం కల్పించింది. ఇలా ఐదు రోజులో 12 లక్షల భోజనాలు భక్తులకు సరఫరా చేసింది టీటీడీ.. మొత్తంగా వికేండ్ లో శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా సేవలందించడంతో పాటు అత్యధిక మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)
రెండు గంటల్లో టీడీపీకి రూ.17 కోట్ల విరాళాలు.. ఏం చేస్తారంటే..?
మహానాడు వేదికగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీపై విరాళాల వర్షం కురిసింది.. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 17 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్టు టీడీపీ ప్రకటించింది.. పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా, పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని వెల్లడించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీకి విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వగా.. రెండు గంటల వ్యవధిలేనే భారీగా విరాళాలు ఇచ్చారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.. పార్టీలో డబ్బున్న నేతలు కార్యకర్తల సంక్షేమానికి విరాళాలు ఇవ్వాలి కోరారు సీఎం చంద్రబాబు.. అయితే, పార్టీ బ్యాంకు ఖాతాను ప్రకటించిన వెంటనే 17 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని ప్రకటించారు.. పార్టీకి విరాళాలు ఇచ్చిన దాతలు అందరికీ అభినందనలు.. ఆన్‌లైన్‌లో కూడా పార్టీకి విరాళాలు అందించవచ్చు.. అన్నారు చంద్రబాబు.. మహానాడు ఎప్పుడు నిర్వహించినా హుండీ ఏర్పాటు చేసి.. సేకరించిన విరాళాలు పేదల కోసం ఖర్చు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.. మహానాడు తొలిరోజు ప్రకటన చేయగానే స్పందించి రూ.17 కోట్లకు పైగా విరాళాలు అందించిన టీడీపీ నేతలు, అభిమానులు అందరికీ అభినందనలు తెలియజేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, కడప వేదికగా పసుపు పండుగ మహానాడు అట్టహాసంగా సాగుతోంది.. ఇవాళ ప్రారంభమైన మహానాడు.. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న విషయం విదితమే..
తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే నాలుగు రోజుల పాటు వానలే వానలు..
తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ కేంద్రం వర్ష సూచనలు జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేయగా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక, రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొనింది. రేపు పలు జిల్లాల్లో దాదాపు 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ ఇవ్వడంతో చురుకుగా కదులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. అయితే, హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని, మ్యాన్ హోళ్లు, నాలాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు పలు సూచనలు జారీ చేశారు.
రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే కలలు కంటున్నారు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలన పైనా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విషం చిమ్మారు అని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మీడియా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారు.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు మోడీ.. దేశంలో అభివృద్ధి తారాస్థాయికి చేరుకుంటుంది అని గుర్తు చేశారు. కానీ, ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. అయితే, ప్రపంచంలో నాల్గవ ఆర్థిక శక్తిగా భారత్ చేరుకుంది.. బీజేపీ, మోడీకి పెరుగుతున్న ఆదరణను కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇక, పేదరికం అనుభవించిన వ్యక్తి మోడీ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోడీనీ కులం పేరుతో రాహుల్ గాంధీ దూషించారు.. ఇక, రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే భయంకరమైన కలలు కంటున్నాడు అని ఎద్దేవా చేశారు. దేశంలో యువత ఉద్యోగాలు చేసే వారుగా కాకుండా.. ఉద్యోగాలు ఇచ్చే వారీగా తయారు చేస్తున్నారు మోడీ అని పేర్కొన్నారు. ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకుంది రాహుల్ గాంధీ కుటుంబం.. ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ట పెరుగుతుంటే.. మోడీనీ నాయకునిగా కీర్తిస్తుంటే గర్వకారణం కాదా అనేది ఖర్గే చెప్పాలని ఓబీసీ మోర్చ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్పై మంత్రి సీతక్క ఆగ్రహం..
నిర్మల్ జిల్లా కలెక్టర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. నాయక్ పోడులు అంటే నిర్మల్ జిల్లా కలెక్టర్ కు తెలియకపోవడం బాధాకరం అన్నారు. అధికారిగా ఉన్నప్పుడు వాళ్లు అన్ని తెలుసుకోవాలని సూచించింది. ఏ కులం, ఏ రిజర్వేషన్ వస్తదో తెలియకపోవడం వారి తప్పు.. రాజ్యంగాన్ని చదవాలని తెలిపింది. ఏ కులం వారికి ఏ ఏ రిజర్వేషన్లు, ఏం హక్కులు ఉన్నాయే తెలుసుకోని వాటిని అమలు చేయాలని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమస్య ఎక్కడెక్కడా ఉందో నా దృష్టికి తీసుకురండీ.. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సర్టిఫికెట్ల సమస్య పరిష్కరించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు లెటర్లు పంపిస్తామని మంత్రి సీతక్క వెల్లడించింది. అయితే, నాయక్ పోడ్ వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా చూస్తామని మంత్రి సీతక్క చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పేదల పక్షాన ఈ ప్రభుత్వం నిలపడుతుంది.. పోడు భూముల సమస్యను ప్రభుత్వంతో మాట్లాడి.. నెరవేరే విధంగా చూస్తాను అని తెలిపింది. ఇందిరమ్మ ఇండ్లలో ప్రత్యేకంగా కొన్ని ఇళ్లు నాయక్ పోడ్లకు అందించేలా మంత్రితో మాట్లాడతాను అని పేర్కొనింది. అలాగే, జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి కుల ధ్రువీకరణ పత్రం వచ్చే విధంగా చూస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చింది.
ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్‌కు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్.. త్వరగా చేసుకోండి
ఆధార్ అప్ డేట్ చేసుకోని వారికి బిగ్ అలర్ట్. త్వరలోనే ఉచిత గడువు ముగియనున్నది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI పౌరులు తమ ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే ఈ సౌకర్యం జూన్ 14, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గడువు లోగా అప్ డేట్ చేసుకుంటే రూ. 50 సాధారణ ఫీజు ఉండదు. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా అప్ డేట్ చేసుకోండి. UIDAI యొక్క ఆధార్ నమోదు, అప్ డేట్ నిబంధనలు, 2016 ప్రకారం, ప్రతి ఆధార్ హోల్డర్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తన గుర్తింపు రుజువు, చిరునామా రుజువులను నవీకరించవలసి ఉంటుంది. ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, బ్యాంక్ ఖాతాను తెరిచేటప్పుడు లేదా KYC ప్రక్రియను పూర్తి చేసేటప్పుడు మీ సమాచారాన్ని నవీకరించడం వలన మీరు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటుంది.
బంగ్లాదేశ్ నుంచి భారీ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్..
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్న చొరబాటుదారుల ప్రయత్నాలను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. అస్సాంలోని దక్షిణ సల్మారా మంకాచర్ జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌కి చెందిన బృందం చొరబాటు ప్రయత్నాలను బీఎస్ఎఫ్ విఫలం చేసింది. ఈ రోజు తెల్లవారుజామున అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద అనుమానిత కదలికలను గుర్తించడంతో సరిహద్దు దళాల ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. బీఎస్ఎఫ్ తక్షణ చర్యలతో చొరబాటుదారులు వెనక్కి తగ్గారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్ జాతీయులు, రోహింగ్యాలను అధికారులు గుర్తించి, వారిని బంగ్లాదేశ్‌లోకి ‘‘నెట్టివేస్తున్నారు’’. గత కొన్ని రోజులుగా 150 మంది అనుమానిత అక్రమ బంగ్లాదేశ్ జాతీయులను అస్సాంలోని సరిహద్దు లోని వివిధ ప్రదేశాల ద్వారా బంగ్లాదేశ్‌లోకి నెట్టేశారు. అయితే, భారత్ పుష్‌బ్యాక్ వ్యూహంపై బంగ్లాదేశ్ స్పందించింది. వెరిఫికేషన్ సమస్యను కేవలం పేరు ద్వారా మాత్రమే చేయలేమని, వ్యక్తి నేపథ్యం గురించి తనిఖీ చేయాలని బంగ్లాదేశ్ అధికారి రుహుల్ ఆలం సిద్ధిక్ అన్నారు. భారత్‌తో దీనిపై సామరస్యపూర్వకమై పరిష్కారాన్ని రూపొందించాలని కోరుకుంటున్నామని, బంగ్లాదేశీయులు కానీ వారిని మా దేశానికి పంపకుండా చూసుకుంటున్నామని అన్నారు. మరోవైపు, భారత్ ‘‘పుష్ బ్యాక్’’ విషయంలో అవసరమైతే జోక్యం చేసుకుంటామని బంగ్లాదేశ్ సైన్యం తెలిపింది.
అమెరికా వీధుల్లో ‘మేడ్ ఇన్ ఇండియా’ మ్యాన్‌హోల్ కవర్లు..! నెట్టింట చర్చ?
అమెరికా వీధుల్లో ఏర్పాటు చేసిన ‘మేడ్ ఇన్ ఇండియా’ మ్యాన్‌హోల్ కవర్ల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే అంశంపై చర్చ జరుగుతోంది. భారతదేశంలో తయారు చేసిన మ్యాన్‌హోల్ కవర్ అక్కడి రోడ్ల వద్దకు ఎలా చేరుకున్నాయి.? అనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది. నిజానికి, స్టీఫెన్ అనే వ్యక్తి వాషింగ్టన్ స్టేట్ సియాటిల్ నగరంలోని మ్యాన్‌హోల్ కవర్ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నాడు. దానికిపై “మేడ్ ఇన్ ఇండియా” అని రాసి ఉంది. ఈ పోస్ట్‌ను పంచుకున్న స్టీఫెన్ ప్రశ్నను లేవనెత్తాడు. “సియాటిల్ నగరానికి మ్యాన్‌హోల్ మూతలు భారతదేశం నుంచి ఎందుకు వస్తున్నాయి.?” అని స్టీఫెన్ అడిగిన ఈ ప్రశ్న వైరల్ గా మారింది. ఇరు దేశాల నెటిజన్లు ఈ అంశంపై చర్చించారు.
కన్నప్పలో విష్ణు కుమార్తెల సాంగ్ ప్రోమో రిలీజ్..
మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ 27న రిలీజ్ అవుతున్న సందర్భంగా విష్ణు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన కూతుర్లు అయిన అరియానా, వివియానా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిపై షూట్ చేసిన ‘జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ’ పాట లిరిక్స్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ పాటను కూడా వారిద్దరే పాడారు. ఇందులో ఇద్దరి లుక్ బాగానే కనిపిస్తోంది. త్వరలోనే పూర్తి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందించారు. ముకేశ్ కుమార్‌సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. ప్రభాస్ అందరికంటే ఎక్కువ సమయం ఇందులో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. వీఎఫ్ ఎక్స్ పనుల కారణంగా మూవీ వాయిదా పడింది. అయితే మూవీ హార్డ్ డిస్క్ పోయిందంటూ ఈరోజు పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చారు.
జూన్ నుంచి షూట్.. లొకేషన్స్ రెక్కీలో పూరి బిజీ
దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక భారీ పాన్-ఇండియా చిత్రంలో హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. హైదరాబాద్ మరియు చెన్నై నగరాల్లో లొకేషన్స్ రెక్కీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా యొక్క కథానుసారం లొకేషన్స్ కథలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలుస్తోంది. ఈ రెక్కీ ప్రక్రియ పూర్తయిన వెంటనే, జూన్ నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఆమె పాత్ర ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్.
హార్డ్ డిస్క్ మిస్సింగ్.. ఇది చేసిందెవరో మీ అందరికీ తెలుసు
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమా త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయిందంటూ ఈ రోజు ఉదయం కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ నమోదు అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయం మీద మంచు విష్ణు గానీ ఆయన నిర్మాణ సంస్థ కానీ అధికారికంగా స్పందించలేదు. తాజాగా మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్న 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ అధికారికంగా స్పందించింది. ముంబై నుంచి హైదరాబాద్ రావాల్సిన ఒక హార్డ్ డిస్క్ మిస్ అయిందని, అందులో ఇద్దరు లీడ్ యాక్టర్స్ మధ్య ఉన్న కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ఉందని, దానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్‌తో కూడిన హార్డ్ డిస్క్‌నే మిస్ అయిందని చెప్పుకొచ్చారు. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి హైదరాబాదులోని ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్‌కి రావాల్సి ఉందని వెల్లడించారు. చరిత అనే ఒక మహిళ ఆదేశాల ప్రకారం రఘు అనే వ్యక్తి దాన్ని ఆఫీస్ అడ్రస్ నుంచి సైన్ చేసి తీసుకున్నాడు. అయితే రఘు కానీ చరిత కానీ ఇద్దరికీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీతో సంబంధం లేదు. ఖచ్చితంగా వీరిద్దరూ సినిమాకి ఏదో నష్టం చేయాలని దాన్ని దొంగలించారని పేర్కొన్నారు. సుమారు నాలుగు వారాల క్రితమే దీనికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని, దీని వెనక ఎవరున్నారో అధికారులు మా దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అయితే దీని వెనక ఎవరున్నారో అది బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. అలాగే మాకు అందుతున్న సమాచారం మేరకు వీరందరూ కలిసి ఆన్‌లైన్‌లో లేని ఫుటేజ్ సంబంధించి 90 నిమిషాల్లో రిలీజ్ చేయాలని కన్నప్ప సినిమాని చంపేయాలని ప్రయత్నిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.