పవన్ కల్యాణ్ రూ.50 లక్షల విరాళం.. కొణిదెలలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చాలా మంది ఇంటి పేర్లతో ఊర్లు ఉంటాయి.. అసలు, ఊర్ల పేర్లను బట్టే.. ఇంటి పేర్లను కూడా పిలిచేవారని చెబుతారు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్.. ఇంటి పేరుతో ఓ గ్రామం ఉంది.. ఆ గ్రామానికి భారీ విరాళాన్ని ప్రకటించడమే కాదు.. ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. ఇక, అసలు విషానికి వస్తే.. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల అనే గ్రామం ఉంది.. ఆ గ్రామంలో తాగునీటి ట్యాంకు నిర్మాణానికి పవన్ కల్యాణ్ ట్రస్టు ద్వారా 50 లక్షల రూపాయలు ఇచ్చారు.. ఎన్నికలకు ముందు నియోజకవర్గ పర్యటనలో పవన్ కల్యాణ్ కొణిదెల గ్రామాన్ని సందర్శించినప్పుడు తన ఇంటిపేరుతో ఊరు ఉందన్న విషయం తనకు తెలియదని.. తాము అధికారంలోకి వస్తే ఈ కొణిదేల గ్రామాన్ని దత్తాతకు తీసుకుంటానని హామీ ఇచ్చారు.. ఇక, ఇచ్చిన హామీలో భాగంగా మొదటిసారిగా గ్రామంలో నీటి కొరత ఉందని స్థానిక ఎమ్మెల్యే జయసూర్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు పోవడంతో.. అందుకు స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 50 లక్షల రూపాయలను తమ ట్రస్టు ద్వారా విడుదల చేస్తున్నామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. దీంతో, ఈరోజు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయ సూర్య, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్.. కొణిదెల గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన సాయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు కొణిదెల గ్రామస్తులు..
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. టెండర్లు ఖరారు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో వడివడిగా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే పలు పనులకు చురుకుగా కొనసాగుతుండగా.. ఇప్పుడు .. అమరావతిలో రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసింది ప్రభుత్వం.. టెండర్లలో L1 గా నిలిచిన సంస్థలకు బిడ్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఎపీ సెక్రటేరియట్, హెచ్‌వోడీ కార్యాలయాలు (GAD టవర్) నిర్మాణ పనులను ఎన్ సీసీ లిమిటెడ్.. రూ.
882.47 కోట్లకు దక్కించుకుంది.. సచివాలయంలోని జీఏడీ టవర్‌ను నిర్మించనుంది ఎన్ సీసీ లిమిటెడ్ సంస్థ.. ఇక, సచివాలయంలోని 1, 2, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణ పనులను షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ లిమిటెడ్ దక్కించుకుంది.. రూ.1,487.11 కోట్ల వ్యయంతో 1, 2 హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం కోసం బిడ్లు ఆమోదించింది ప్రభుత్వం.. మరోవైపు, ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 3 ,4, హెచ్‌వోడీ టవర్లు నిర్మాణ పనులు లార్సెన్ అండ్ టౌబ్రో లిమిటెడ్ దక్కించుకుంది.. 1303.85 కోట్ల రూపాయల వ్యవయంతో 3, 4 హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం కోసం LIబిడ్లు ఆమోదించింది ప్రభుత్వం.. L1 బిడ్డర్లకు ప్రతిపాదిత పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్..
స్పేస్ పాలసీపై సీఎం సమీక్ష.. 25 వేల కోట్ల పెట్టుబడులు టార్గెట్..!
25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో స్పేస్ పాలసీ రూపొందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీని ద్వారా ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం.. 25 నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీలు కూడా కల్పించనుంది.. విద్యార్ధులను భాగస్వాములు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. ఆకర్షణీయంగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 ఉండాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. తుది పాలసీ రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు..
మోడీ విజన్, చంద్రబాబు ప్లానింగ్‌తో ఏపీ అభివృద్ధి..
ప్రధాని నరేంద్ర మోడీ విజన్, సీఎం చంద్రబాబు నాయుడు ప్లానింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.. ఇక, ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన రోజును సంవిధాన్ హత్యా దివస్ గా జరుపుకున్నాం.. వాక్ స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యం కోల్పోయిన రోజుగా భావించామన్న ఆయన.. ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమంగా ఎమర్జెన్సీని గుర్తించారు.. 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు తమ నిర్ణయాన్ని ఇచ్చారని గుర్తుచేశారు.. ఇక, 450 కోట్లు టూరిజం నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చింది.. చాలా ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయి.. వాటిలో ఒకటి రాజమండ్రిలో ఇవాళ ప్రారంభించాం.. సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి పలు ప్రాజెక్టులపై కూడా చర్చించామని వెల్లడించారు గజేంద్ర సింగ్ షెకావత్.. మోడీ విజన్, చంద్రబాబు ప్లానింగ్ తో ఏపీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న ఆన.. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.. ప్రణాళిక బద్ధంగా ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తాం అన్నారు.. మరోవైపు, పెహల్గామ్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.. పర్యాటకులు స్వేఛ్చగా అక్కడ ప్రాంతాలను సందర్శించ వచ్చు అన్నారు.. మరో పదిహేను రోజుల్లో అక్కడ పర్యాటకుల సందడి మొదలవుతుందని వెల్లడించారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.
డీజీపీకి బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ కీలక లేఖ..
డీజీపీకి బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ లేఖ రాశారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. బక్రీద్ 2025 సందర్భంగా పోలీసులు ఎన్ని ఆవులను రక్షించారు..? అని ప్రశ్నించారు. జంతువుల రవాణా, వధకు ఎన్ని పశువైద్య ధృవీకరణ పత్రాలు జారీ చేశారు? రాష్ట్రవ్యాప్తంగా అక్రమ గోవధను ఆపడానికి ఎలాంటి దీర్ఘకాలిక చర్యలు అమలు చేయబడుతున్నాయి? అని అడిగారు. “పెద్ద ఎత్తున అక్రమ గోవధ అనేది శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదు. ఇది మన సమాజం యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక నిర్మాణంపై ప్రత్యక్ష దాడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో గోవులను రక్షించడానికి , గో రక్ష కమిటీలను స్థాపించడానికి తన నిబద్ధతను వ్యక్తం చేశారు. ఈ దార్శనికతను గౌరవించాలని, సంవత్సరంలో 365 రోజులు గో సంరక్షణ చట్టాలను అమలు చేయడానికి చురుకైన చర్యలు తీసుకోవాలని నేను మీ శాఖను కోరుతున్నాను.” అని డీజీపీకి రాసిన లేఖలో ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తావించారు.
గుడ్‌న్యూస్.. ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ..
ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఒకేరోజు మూడు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసినట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. మరో 3212 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్టసిస్ట్, 1284 ల్యాబ్ టెక్నీషియన్, 1950 మల్టి పర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి.. మెరిట్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లోని పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం 3 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
‘నా భార్య నెలకు రూ. 25 వేలు సంపాదిస్తుంది.. నేను భరణం చెల్లించను’.. హైకోర్టు సంచలన తీర్పు!
సమాజంలో రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువై పోతోంది. సెలబ్రిటీలే కాదు.. సామాన్యులు సైతం విడాకుల బాట పడుతున్నారు. పెళ్లిళ్లు మున్నాళ్ల మచ్చటగానే మిగిలిపోతోంది. అయితే విడాకుల సమయంలో భరణం చెల్లిస్తుంటారు. కోర్టు తీర్పులను అనుసరించి భరణానికి ఒప్పుకుంటూ ఉంటారు. కాగా ఓ భర్త మాత్రం తాను భరణం చెల్లించనని చెప్పాడు. ‘నా భార్య నెలకు రూ. 25 వేలు సంపాదిస్తుంది.. నేను భరణం చెల్లించను’ కోర్టు ఆదేశాలను సవాల్ చేశాడు. ఈ నేపథ్యంలో విడాకుల భరణానికి సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. మహిళ ఉద్యోగం చేస్తుంటే, విడాకుల తర్వాత భర్త నుంచి ఆమెకు లభించే భరణాన్ని కోల్పోవడానికి ఇది ఒక ఆధారం కాదని హైకోర్టు పేర్కొంది. బాంబే హైకోర్టులో జస్టిస్ మంజుషా దేశ్‌పాండే ధర్మాసనం జూన్ 18న ఈ తీర్పును వెలువరించింది. ఓ వ్యక్తి తన భార్యకు ప్రతి నెలా రూ. 15,000 జీవనాధారం చెల్లించాలని ఆదేశించిన ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్ చేశాడు.
కార్తీ సినిమాలో నటిస్తున్న నాని..?
నేచురల్ స్టార్ నాని తమిళ మెట్లు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్నాడు. హిట్-3తో రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు. అలాగే నిర్మాతగానూ వరుస హిట్లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన తమిళ స్టార్ హీరో కార్తీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కార్తీ ఇప్పటికే సర్దార్-2 సినిమాను కంప్లీట్ చేశాడు. అలాగే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఖైదీ-2ను చేస్తున్నాడు. ఇప్పుడు తమిజ్ డైరెక్షన్ లో భారీ సినిమా చేయబోతున్నాడు. ‘కార్తీ-29’ వర్కింగ్ టైటిల్‌తో మూవీని తీస్తున్నాడు. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడంట. హిట్-3లో కార్తీ మంచి రోల్ చేశాడు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందుకే కార్తీ సినిమాలో కీలక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాడంట. ఈ సినిమాను 1960 బ్యాక్ డ్రాప్‌లో రామేశ్వరం తీరం నేపథ్యంలో స్మగ్లింగ్ ఫ్లాట్ ను ఆధారంగా చేసుకుని తీస్తున్నారు. ఇది గ్యాంగ్ స్టర్ సినిమాగా రాబోతోంది. జులై నుంచే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బిచ్చగాడు-3 వచ్చేది అప్పుడే.. విజయ్ ఆంటోనీ క్లారిటీ..
విజయ్ ఆంటోనీ హీరోగా తన డైరెక్షన్ లోనే వచ్చిన బిచ్చగాడు ఓ సెన్సేషన్. దానికి సీక్వెల్ గా ఇప్పటికే సెకండ్ పార్ట్ వచ్చింది. మూడో పార్టు ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దానిపై హీరో విజయ్ ఆంటోనీ క్లారిటీ ఇచ్చారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్తున్నాను అనే ప్రచారాన్ని ఖండించారు. ఫేమ్ ఉన్నంత మాత్రాన రాజకీయాలకు తాను సెట్ కాను అని తేల్చేశారు. ‘నా డైరెక్షన్ లో మరిన్ని సినిమాలు కూడా వస్తాయి. ఈ మూవీ తర్వాత బిచ్చగాడు-3 ఉంటుంది. ఇప్పటికే దాన్ని స్టార్ట్ చేశాం. అది కూడా నేనే డైరెక్ట్ చేస్తున్నాను. 2027లో అది రిలీజ్ అవుతుంది. స్క్రిప్ట్ పనులు ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే అన్ని డీటేయిట్స్ ఇస్తాం. మార్గన్ మూవీ ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనే నమ్మకం ఉంది. కన్నప్ప మూవీకి మాకు పోటీ లేదు. ఆ మూవీ పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీకి సీక్వెల్ గురించి మూవీలోనే క్లారిటీ ఇచ్చాం అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.