చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.. కూటమి ప్రభుత్వం వంచనకు పాల్పడింది..!
ఏడాది కాలంలో చంద్రబాబు ప్రజలకు వెన్ను పోటు పొడిచారు.. కూటమి ప్రభుత్వం వంచనకు పాల్పడింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారు.. మహానాడు వేదికగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు.. ప్రజలకు ఇబ్బంది కలగ కూడదని ఇంటింటికి రేషన్ ను వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు.. కానీ, కూటమి ప్రభుత్వం దానిని తొలగించింది.. ఇంటింటికి రేషన్ తీసివేయడం వలన వృద్ధులు, వికలాంగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రీవాల్యుషన్ లో ఐదు మార్కులకు మించి ఎన్నడూ తేడా లేదు . కానీ, కూటమి పాలనలో 20 నుంచి 30 మార్కులు వరకు తేడా వస్తుందని దుయ్యబట్టారు బొత్స.. 5000కు మించి మా హయాంలో ఎన్నడు రీవాల్యుయేషన్ జరగలేదు. విద్యావ్యవస్థ పై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.. మరోవైపు, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు.. ఏడాదిలో వైఎస్ జగన్ 80 శాతం హామీలను అమలు చేశారు. జిల్లా పరిషత్ నుంచి ర్యాలీగా బయల్దేరి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తాం అని వెల్లడించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..
లోకేష్ కోసం పవన్‌ను కూడా డమ్మీ చేశారు..!
మంత్రి నారా లోకేష్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా డమ్మీ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం కండువా కప్పుకుంటేనే పథకాలు ఇస్తాం అంటున్నారు? అని మండిపడ్డారు.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అందరికీ కమీషన్లు వస్తున్నాయి. ఇసుక, మట్టి, మద్యం ఏదీ వదలడం లేదు.. అన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.. దొంగలే.. దొంగ దొంగ అని మాట్లాడుతున్నారు.. వైఎస్ జగన్ మీద కేసులు పెట్టి మీరు జనంలోకి వెళ్లగలుగుతారా..? అని ప్రశ్నించారు.. మీకు ఓటు వేసినందుకు మహిళల గొంతు కోశారు. రాష్ట్రానికి ఫ్లైట్ ఖర్చులు తప్ప మీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఫైర్ అయ్యారు..
క్యాడర్ జాగ్రత్త..! కొందరు కోవర్టులు టీడీపీలో చేరుతున్నారు..
రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది.. కొందరు కోవర్టులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.. టీడీపీలోని చిన్న చిన్న విబేధాలకు కోవర్టులు ఆజ్యం పోస్తున్నారు.. టీడీపీ క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి కొలుసు పార్థసారథి.. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన.. నెల్లూరు నగరంలోని యాదవ్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.. ఇక, టీడీపీ మహానాడు 2025లో మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన ఆరు పాలసీలు గేమ్ చేంజర్‌గా నిలవబోతున్నాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కార్యకర్తలకు, అన్నీ వర్గాల ప్రజలకీ పార్టీని చేరువ చేసేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని వెల్లడించారు.. ఐదేళ్లు కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.. అయితే, రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తోంది.. కొందరు కోవర్టులు టీడీపీలో చేరుతున్నారు.. టీడీపీలో చిన్న చిన్న విబేధాలకు కోవర్టులు ఆజ్యం పోస్తున్నారు.. క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.. ఇక, గత ఐదేళ్లలో తాగిన మద్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు మంత్రి కొలుసు పార్థసారథి..
జగన్ మళ్లీ సీఎం కాలేరు..! ఇంకా ఏం మిగిలిందని 2.0 చూపిస్తాడు..?
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై హాట్ కామెంట్లు చేశారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవ్వలేరన్న ఆయన.. ఇంకా ఏం మిగిలిందని జగన్ 2.0 చూపిస్తాడు..? అని ప్రశ్నించారు.. ఇక, కడపలో జరిగిన మహానాడును కనీవినీ ఎరుగని రీతిలో నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేశారన్నారు. అయితే, వై నాట్ 175 అన్నారు.. 151 నుంచి 11 పడిపోయారని ఎద్దేవా చేశారు.. గతంలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలన్నీ బయటికు వస్తున్నాయి. జగన్ మళ్లీ సీఎం కాలేరు.. ఇక ఏం మిగిలిందని 2.0 చూపిస్తాడు అని నిలదీశారు.. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం తెలుసుకోవడానికి ఆరు నెలలు పట్టిందన్నారు..
తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యూపీఎఫ్..
తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యూపీఎఫ్ నిలిచింది. యూపీఎఫ్ నూతన కార్యవర్గంఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. కన్వీనర్ గా బొల్లా శివశంకర్, అడ్వైజర్ గా గట్టు రామచందర్ రావును నియమించారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో కవిత సమావేశం నిర్వహించారు. త్వరలోనే బీసీ బిల్లులు సాకారం అయ్యేందుకు కార్యచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా.. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత వ్యవహారం సంచలనంగా మారింది. కవిత.. కేసీఆర్‌కు రాసిన లేఖతో వివాదం మొదలు కాగా.. తాజాగా చిట్ చాట్‌లో చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో వాడీవేడీ చర్చ జరుగుతుంది. ఆమె పార్టీ మారుతుందంటూ జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత.. నిన్న (శనివారం) కొత్త ఆఫీస్ ప్రారంభించారు. జాగృతి కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను ఈ ఆఫీసును వినియోగించనున్నారు. ఆమె తన నివాసం పక్కనే కొత్త జాగృతి కార్యాలయాన్ని.. ఏర్పాటు చేశారు. అద్దె భవనంలో ఈ ఆఫీస్ ప్రారంభించారు.
సీఎం రేవంత్‌కి ఒక కన్ను రాహుల్ గాంధీ అయితే మరోకన్ను నరేంద్ర మోడీ..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాల పైనే రేవంత్ రెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారని.. హైడ్రా తో ఇళ్లను కూలగొట్టడం, రైతుల ధాన్యం కొనక పోవడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా రెండు కళ్ళ సిద్ధాంతం తో పని చేస్తున్నారని.. ఒక కన్ను రాహుల్ గాంధీ అయితే మరోకన్ను నరేంద్ర మోడీ అని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ తర్వాత, కంగనా రనౌత్.. శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై ఆగ్రహం..
22 ఏళ్ల న్యాయ విద్యార్థిని షర్మిష్ట పనోలి అరెస్ట్‌పై బీజేపీ సహా ఎన్డీయే నేతలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో శర్మిష్ట పోస్ట్ చేసిన వీడియో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని చెబుతూ, బెంగాల్ పోలీసులు శుక్రవారం ఆమెను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన దాడులపై కొంతమంది బాలీవుడ్ నటులు మౌనంగా ఉన్నారని ఆమె విమర్శిస్తూ వీడియో చేశారు. అయితే, కొంతమంది ఈ వీడియోపై అభ్యంతరం తెలపడంతో, దానిని డిలీట్ చేసి, క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, ఆమెకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. పవన్ తర్వాత బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కూడా ఆమెకు మద్దతు ఇచ్చి, వెంటనే ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘శర్మిష్ట తన వ్యక్తీకరణ కోసం కొన్ని అసహ్యకరమైన పదాలను ఉపయోగించారని నేను అంగీకరిస్తున్నాను, కానీ ఈ రోజుల్లో చాలా మంది యువకులు అలాంటి పదాలను ఉపయోగిస్తున్నారు. ఆమె తన ప్రకటనలకు క్షమాపణలు చెప్పింది, అది చాలు, ఆమెను మరింత బెదిరించడం, వేధించడం అవసరం లేదు. ఆమెను వెంటనే విడుదల చేయాలి’’ అని అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఉత్తర కొరియాగా మార్చవద్దని నేను కోరుతున్నారు. అందరికీ ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి.’’ అని కంగనా అన్నారు.
15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్..
కర్ణాటక బెళగావిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆరుగురు నిందితులు బాలికపై రెండుసార్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ చర్యని వారు మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి బాలికను బ్లాక్‌మెయిల్ చేశారు. ఈ బ్లాక్‌మెయిల్ బాలిక రెండోసారి గ్యాంగ్ రేప్‌కి గురవ్వడానికి కారణమైంది. పోలీసులు కథనం ప్రకారం, మొదటి సామూహిక అత్యాచారం దాదాపుగా ఆరు నెలల క్రితం జరిగింది. నిందితుల్లో ఒకరైన బాలిక స్నేహితుడు ఆమెను బెళగావి శివారల్లోని కొండ ప్రాంతానికి వచ్చేలా చేశాడు. అక్కడికి తన స్నేహితులను కూడా పిలిచారు. వీరంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి నిందితులు బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత నేరస్తుల్లో ముగ్గురు ఆమెపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేధింపులు భరించలేక బాలిక శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మేము బిచ్చగాళ్లమే.. ఒప్పుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..
పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఆ దేశం సైన్యానికి మాత్రం బాగా ఖర్చు చేస్తోంది. ప్రజల గురించి ఆలోచించడం మానేసి, భారత వ్యతిరేకతతోనే బతుకుతోంది. దేశాన్ని ఆర్థిక గండం నుంచి బయటపడేసేందుకు ప్రధాని నేతృత్వంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల ముందు సాగిలపడుతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ మిత్రదేశాల పర్యటనలకు వెళ్లి ‘‘భిక్షం’’ అడుగుతోంది. పాకిస్తాన్ ప్రధాని పర్యటనకు వస్తున్నారంటే దాని మిత్రదేశాలు భయపడుతున్నాయి. తమను ఎక్కడ అప్పులు అడుగుతారో అని సందేహపడుతున్నాయి. ఇప్పటికే, పాకిస్తాన్ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. నిత్యావసరాలు అందుబాటు ధరల్లో లేవు. ఇక గోధుమ పిండి కోసం పెద్ద యుద్ధాలే చేయాల్సి వస్తోంది. రాజకీయ తిరుగుబాటు, సైన్యం ఒత్తిళ్లు, బలూచ్ తిరుగుబాటు, పాక్ తాలిబాన్ల దాడులతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది.
కమెడియన్ అలీకి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్..
కమెడియన్ అలీకి చిరంజీవి ఎంతో అనుబంధం ఉంది. వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఈ నడుమ పెద్దగా కలిసి ఒకే స్టేజిపై కనిపించట్లేదు గానీ.. చాలా సార్లు ఒకరిపై ఒకరు అనుబంధాన్ని చూపించుకుంటున్నారు. తాజాగా అలీకి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు చిరంజీవి. ప్రతి ఏడాది సమ్మర్ లో బ్రహ్మానందం, అలీకి తన తోటలో పండే మామిడి పళ్లను పంపిస్తుంటారు చిరంజీవి. ఈ సారి కూడా తన తోటలో పండిన మామిడి పళ్లను స్పెషల్ గా ప్యాక్ చేసి పంపించారు చిరు. కేవలం మామిడి పళ్లు మాత్రమే కాకుండా అందులో చిరంజీవి భార్య సురేఖ వంటకాలను కూడా పంపించారు. సురేఖ వంటకాలను అందరికీ రుచి చూపించాలనే ఉద్దేశంతో ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ అనే ఫుడ్ బిజినెస్ ను ప్రారంభించింది. అందులో ఉప్మ, రసం, పొంగల్, కేసరితో పాటు.. రెడీ టు మిక్స్ పొడులను కూడా పంపించారు. వీటితో అప్పటికప్పుడు వంటలను చేసుకోవచ్చు. ఈ గిఫ్ట్ వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసింది.
నా పెళ్లి అప్పుడే.. నారా రోహిత్ క్లారిటీ..
నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత భైరవం మూవీతో వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత రోహిత్ ఇందులో మాస్ పర్ఫార్మెన్స్ తో అలరించాడు. ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో తన పెళ్లిపై కూడా స్పందించాడు. నారా రోహిత్ కు హీరోయిన్ సిరితో గతేడాది అక్టోబర్ లోనే ఎంగేజ్ మెంట్ జరిగింది. గత డిసెంబర్ లోనే పెళ్లి జరగాల్సి ఉన్నా.. నారా రోహిత్ తండ్రి అకాల మరణం చెందడంతో వాయిదా పడింది. రోహిత్ తండ్రి రామ్మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయంపై నారా రోహిత్ స్పందిస్తూ.. ఈ ఏడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. తన తండ్రి రామ్మూర్తి నాయుడు సంవత్సరికం అయిపోయిన తర్వాత తమ పెళ్లి ఉంటుందని చెప్పుకొచ్చాడు. హీరోయిన్ సిరితో నారా రోహిత్ కొంత కాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. సిరి పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాతో తెరమీద కనిపించబోతోంది. ఆమె స్వస్థలం రెంటచింతల. తెలుగు అమ్మాయి. ఆస్ట్రేలియాలో చదువుకుంది. వీరిద్దరూ కలిసి ‘ప్రతినిధి2’ సినిమాలో నటించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది.