జీబీఎస్‌పై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. నిన్నటికి నిన్న గుంటూరు జీజీహెచ్ లో ఓ వృద్ధురాలు జీబీఎస్ వ్యాధి లక్షణాలతో మృతి చెందడం కలకలం రేగింది.. అయితే, అధికారుల లెక్కల ప్రకారంలో ఏపీలో 17 జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి.. అనధికారంగా ఈ సంఖ్యలో ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది.. ఈ నేపథ్యంలో.. అలర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీస్తోంది.. మరోవైపు.. ఈ రోజు జీబీఎస్ పై సమీక్ష సమావేశం నిర్వమించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీబీఎస్ కేస్ లు వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించారు.. ఈ వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు.. ఇంజక్షన్ కూడా అందుబాటులో ఉంచాలని.. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో మంత్రి సత్య కుమార్ యాదవ్, సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచే మే నెల దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో మే నెల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అందులో మొదటగా.. రేపు ఉదయం అనగా ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి.. ఇక, 21వ తేదీ ఉదయం ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది టీటీడీ.. 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టిక్కెట్లు విడుదల చేయనుండగా.. అదే రోజు 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.. 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కాబోతున్నాయి.. ఇక, 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనున్నట్టు వెల్లడించింది టీటీడీ..
కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు.. కుమారుడితో సెల్ఫీ వైరల్..!
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి.. గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన వేడుక. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని, లోతుగా నాటుకుపోయిన భారతజాతి విలువలను ప్రతిబింబిస్తుంది. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం, హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాదిమంది నమ్మకం. ఇక, ఈ సందర్భంగా లోకేష్ దంపతులు తమ కుమారుడు దేవాన్ష్ తో కలిసి దిగిన సెల్ఫీ వైరల్‌గా మారిపోయింది.. మరోవైపు.. కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు.
వల్లభనేని వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి.. కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీని అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.. ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు.. 14 రోజుల రిమాండ్ విధించడంతో.. విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.. అయితే, రేపు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని ఆయన రేపు కలుస్తారు.. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్‌లో పరామర్శించిన జగన్.. ఆమెకు భరోసా ఇచ్చారు.. వంశీ అరెస్ట్ రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.. రేపు ఉదయం 10.30 గంటలకు పలువురు వైసీపీ నేతలతో కలసి విజయవాడ జిల్లా జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్.. ములాఖత్ లో వల్లభనేని వంశీని కలిసి పరామర్శించనున్నారు.. కాగా, ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ అయిన వైసీపీ నేతలను కూడా వైఎస్ జగన్ పరామర్శిస్తూ.. వారికి ధైర్యాన్ని చెబుతూ.. భరోసా ఇస్తూ వస్తోన్న విషయం విదితమే..
ముగిసిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నామినేషన్ల గడువు
స్టాండింగ్ కమిటీ ఎన్నిక నామినేషన్ దాఖలుకు గడువు పూర్తయింది. ఈ నెల 10 వ తేదీ నుండి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలుకు అవకాశం కల్పించారు రిటర్నింగ్ అధికారి.. గడువు పూర్తయ్యే సమయానికి స్టాండింగ్ కమిటీ ఎన్నికకు మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుండి ఏడు నామినేషన్లు దాఖలు కాగా.. ఎంఐఎం నుండి 8 ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుండి 2 నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు బీజేపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేసిన అన్ని పార్టీల అభ్యర్థుల పేర్లను అధికారికంగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దాఖలైన నామినేషన్ల పై రేపు కమిషనర్ సమక్షంలో స్కూటీనీ నిర్వహించనున్నారు రిటర్నింగ్ అధికారి. స్కూటినీ అనంతరం ఫైనల్ లిస్టును రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. స్కూటిని తరువాత 21 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ కు అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నుండి దాఖలైన రెండు నామినేషన్లు ఉపసంహరణ జరిగితే స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సభ్యులు ఉపసంహరణ చేసుకోకపోతే మాత్రం 25 వ తేదీన ఎన్నిక జరగనుంది.
ముస్లిం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ఉద్యోగులు కోసం ప్రత్యేక రాయితీని ప్రకటించింది. వారి మతపరమైన ఆచారాలను పాటించేందుకు వీలుగా రోజువారీ పని సమయాన్ని ఒక గంట తగ్గించి, ముందుగా ఇళ్లకు వెళ్లే అవకాశం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతికుమారి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 2 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు సహా అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ముస్లిం సిబ్బందికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిర్ణయంతో ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే విధుల నుంచి విముక్తి పొంది, రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. ఏటా ముస్లిం ఉద్యోగుల మతపరమైన ఆచారాలను గౌరవిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా పని సమయాల్లో సడలింపునిచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంజాన్ వేడుకల నిర్వహణ, ప్రత్యేక రేషన్ సరఫరా, మసీదుల వద్ద వసతులు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అనేక చర్యలను చేపడుతోంది. మతపరమైన విధులు నిర్విఘ్నంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూచనలు అందించింది.
ముందు వారికి రేషన్ కార్డులు ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కమిషనర్ శాసనాలు ఇవ్వడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అర్హులందరికీ అందుబాటులోకి రానివ్వాలని, ఈ ప్రక్రియ త్వరగా ప్రారంభించమని ఆయన్ని కోరారు. ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి తాజా ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల కోడ్ ఉన్న జిల్లా కేంద్రాలు (ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రాంతాలు) మినహాయించి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా, ప్రజలు పునరావళి చేసినందున జారీ ప్రక్రియను వాస్తవంగా వారితో సమాచారం ఇవ్వడం, జిల్లా తకునెప్పుడు ఇది కొనసాగించబడేలా సూచనలు ఇచ్చారు.
ఢిల్లీ సీఎం రేసు నుంచి తప్పుకున్న పర్వేష్ వర్మ! కారణమిదే!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 10 రోజులైంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం ఫ్రాన్స్, అమెరికా వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి ఎంపిక వాయిదా పడింది. అయితే మూడ్రోజుల క్రితం మోడీ విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇక ముఖ్యమంత్రి ఎంపిక అంశంపై సోమవారం శాసనసభా పక్ష సమావేశం ఉంటుందని ప్రకటించారు. అనూహ్యంగా హైకమాండ్ గురువారానికి వాయిదా వేసింది. అంటే 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్నామొన్నటిదాకా ఢిల్లీ ముఖ్యమంత్రిగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది. ఢిల్లీ సీఎం ఆయనేనంటూ ప్రచారం జరిగింది. కానీ సోమవారం అంచనాలన్నీ తారుమరయ్యాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసు నుంచి పర్వేష్ వర్మ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ మహిళా ముఖ్యమంత్రులు లేరు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠంపై మహిళకు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో మాదిరిగా ఢిల్లీలో కూడా తొలిసారి ఎన్నికైన అభ్యర్థినే ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టాలని హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో దాదాపుగా పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకున్నట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన మద్దతుదారుల్లో ఆశలపై నీడలు కమ్ముకున్నట్లు సమచారం.
యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. కాల్ మెర్జ్ చేస్తున్నారా? మీ ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త!
టెక్నాలజీని వాడుకుని సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు అన్నీఇన్నీ కావు. ఫేక్ మెసేజ్ లు, కాల్స్, లింక్స్ పంపి అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్, మిస్డ్ కాల్ స్కామ్ ల ద్వారా బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. అదే కాల్ మెర్జింగ్ స్కామ్. దీనిపై యూజర్లకు యూపీఐ బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు పొరపాటున కాల్ మెర్జ్ చేశారో మీ ఖాతాలోని డబ్బులు ఖాళీ అయినట్టే. మరి కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. కాల్ మెర్జింగ్ స్కామ్ లో సైబర్ క్రిమినల్స్ యూపీఐ యూజర్లను కాల్ మెర్జింగ్ పేరిట మోసం చేసి తెలియకుండానే వారి వన్ టైమ్ పాస్ వర్డ్ లను OTP కాజేస్తున్నారు. ఇది స్కామర్లు అనధికార లావాదేవీలు, ఖాతాలు లూటీ చేయడానికి అనుకూలంగా మారింది. అయితే దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), అఫీషియల్ X ఖాతాలో, వినియోగదారులను హెచ్చరించింది, “స్కామర్లు మిమ్మల్ని మోసం చేసి OTP లను దొంగిలించడానికి కాల్ మెర్జింగ్‌ను ఉపయోగిస్తున్నారు. స్కామర్ల వలలో పడకండి. అప్రమత్తంగా ఉండండి, మీ డబ్బును కాపాడుకోండి.” అంటూ అలర్ట్ చేసింది.
కేక పుట్టించే ఫీచర్లతో.. మార్కెట్ లోకి విడుదలైన వివో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫోన్ తయారీ కంపెనీ వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. Vivo V50 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Vivo V50 మిడ్ రేంజ్ ఫోన్. దీనిలో ZEISS కో- కెమెరా టెక్నాలజీని అందించింది. ఈ ఫోన్‌తో పెళ్లి, పార్టీ ఫోటోలను క్లిక్ చేయవచ్చు.90w ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ 6000mAh బ్యాటరీతో వస్తున్న అత్యంత సన్నని హ్యాండ్ సెట్ ఇదేనని వివో తెలిపింది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వివో V50 8GB RAM + 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 34,999. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999 కి అందుబాటులో ఉంది. 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.40,999కి కొనుగోలు చేయవచ్చు. దీని ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ సేల్ ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది.
మళ్ళీ మొదలెట్టారు!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ వారం రోజుల గ్యాప్ తర్వాత మరల ప్రారంభమైంది. ఆమధ్య సీక్రెట్ గా ఓపెనింగ్ చేసిన రాజమౌళి అంతే సీక్రెట్ గా షూటింగ్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూట్ లొకేషన్ వివరాలు సహా ఏ వివరాలు బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సెట్లోకి ఫోన్ లు అనుమతించడం లేదు, ప్లాస్టిక్ ఐటమ్స్ ని అనుమతించడం లేదు. చాలా రోజులపాటు షూట్ చేయాల్సిన నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా సోదరుడి వివాహం ముంబైలో జరిగింది. ఈ వివాహం కోసం ఆమె వారం రోజులు బ్రేక్ తీసుకుంది. మరోపక్క రాజమౌళి దగ్గర బంధువులలో ఒకరు చనిపోవడంతో ఆ కార్యక్రమాలకు రాజమౌళి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక అలా వారం రోజుల గ్యాప్ తర్వాత రాజమౌళి మరల సినిమా షూటింగ్ ప్రారంభించారు. హైదరాబాదులో ఉన్న ఆల్ల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కే ఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమా ఒక అడ్వెంచర్స్ డ్రామాగా రూపు దిద్దుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రియాంక చోప్రా సహా పలు హాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు. సినిమాలోని నటీనటులు సహా ప్రొడక్షన్ బాయ్ వరకు అనేక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్లు సైన్ చేసిన తర్వాతే సెట్లోకి అడుగుపెట్టేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
మీరు మంచి సినిమాలు చేస్తే ఎందుకు చూడరు హరీష్ శంకర్?
తాజాగా జరిగిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా హాజరైన హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మనోళ్లు (తెలుగు ప్రేక్షకులు) మన సినిమాలు చూడరు కానీ బయట సినిమాలు బానే చూస్తారు. కాబట్టి ఈ సినిమాని కూడా చూడాలంటూ ఆయన కామెంట్ చేశారు. ఆయన వెటకారంగా మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన టార్గెట్ అయ్యేలా చేశాయి.. నిజానికి హరీష్ శంకర్ కెరియర్ మొదటి నుంచి స్ట్రైట్ సినిమాలు కంటే ఎక్కువగా రీమేక్ సినిమాలే చేశారు. చివరిగా ఆయన చేసిన మిస్టర్ బచ్చన్ కూడా హిందీలో రూపొందిన రైడ్ సినిమాకి రీమేకే. మిస్టర్ మజ్ను డిజాస్టర్ గా నిలవడంతో ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ ని చెక్కే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో ఇలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ కి హాజరవుతున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బావుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారు కానీ హరీష్ శంకర్ మాత్రం తెలుగు సినిమాలను పక్కనపెట్టి వేరే భాషల సినిమాలను ఆదరిస్తున్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. మీరు మంచి సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలు కాకుండా వేరే భాషల సినిమా కోసం ఎందుకు ఆసక్తి చూపిస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.. ఇక AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది.