ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష.. హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలి..!
ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయార్జన శాఖలపై మరోసారి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టెక్నాలజీ సహాయంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.. లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది అన్నారు సీఎం చంద్రబాబు.. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఏడాది రూ. 1 లక్షా 34 వేల కోట్లకు పైగా ఆదాయం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. సాంకేతికత వినియోగంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలన్నారు.. అంతర్జాతీయంగా ఎర్రచందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.. ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అధికారులకు పన్ను వసూళ్లు, ఎగవేతదారుల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.. ఇక, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు సీఎం చంద్రబాబు.. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఉన్నప్పటికీ.. పన్ను ఆదాయంలో ఆ స్థాయిలో లేదు.. అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలన్నారు.. ఇక, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణాశాఖ ఆదాయం పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు..? హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలి… మనకు ఆదాయం వచ్చే హైదరాబాద్ లాంటి నగరం లేనందున.. దానిని పూడ్చుకునే విధంగా పనిచేయాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు…
తిరుమలలో తగ్గిన రద్దీ.. సిఫార్సు లేఖల దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి అనునిత్యం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.. ఇక, సెలవు రోజుల్లో ఆ సంఖ్య మరింత భారీగా ఉంటుంది.. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా.. సిఫార్సు లేఖలపై శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. అయితే, తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగానే ఉంది.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది టీటీడీ.. మే 15వ తేదీ నుంచి.. అంటే ఎల్లుండి నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునః ప్రారంభించనున్నట్టు టీటీడీ పేర్కొంది.. దీనిపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..
వల్లభనేని వంశీకి అనారోగ్యం..! ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందులు..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ కోర్టుకు తెలిపారు.. నాకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు తెలిపిన వంశీ.. తాను మాట్లాడేందుకు కూడా ఇబ్బంది ఉందని.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాను అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.. జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.. వైద్య పరీక్షలు నిర్వహించి.. రిపోర్టులు ఇవ్వాలని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
రఘురామకృష్ణంరాజు షాకింగ్ కామెంట్స్.. రేపు ప్రతీకార దినోత్సవం..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రేపు ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవం జరుపుతున్నట్టు ప్రకటించారు.. 2021 మే 14వ తేదీన నాపై రాజద్రోహం కేసు పెట్టి నన్ను తీసుకెళ్లి ఏం చేసారో అందరికీ తెలుసు.. అదే వాళ్ల చావుకు వచ్చిందన్నారు.. నా రచ్చబండ ద్వారా వాళ్లు ఎంత పనికిమాలిన వాళ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు.. అందుకే ప్రజలు కక్షతో ఓడించారనా పేర్కొన్నారు.. రేపు నా పుట్టినరోజు, నన్ను కొట్టిన తర్వాత ప్రజలంతా ప్రతీకారం తీర్చుకున్న రోజు.. అందుకే, రేపు ప్రతీకార దినోత్సవాన్ని స్థానిక రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ జరుపుతున్నాం అని ప్రకటించారు.. ఇక, అందరూ ఈ ప్రతీకార దినోత్సవంలో పాల్గొనాలి అంటూ ఆహ్వానించారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు..
నేను క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తను.. నా లీడర్ కేసీఆర్
తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఒకవైపు దేశం కోసం మనవాళ్లు యుద్ధం చేస్తుంటే.. మరోవైపు రైతులు తమ పంట అమ్ముకోవడానికి మరో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ధాన్యం రాశులను గాలికి వదిలేసి అందాల రాసుల చుట్టూ సీఎం తిరుగుతున్నారు అని ఎద్దేవా చేశారు. రైతుల దగ్గర పంటను కొనడం లేదు.. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగకుండా జాప్యం చేస్తున్నారు.. రైతులకు 4 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది.. రైతు పెట్టుబడి సాయం అందించడంలో కూడా జాప్యం కొనసాగుతుందని హరీశ్ రావు అన్నారు. అయితే, రైతుల ధాన్యంలో తరుగు తీయమని సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ, క్వింటాలుకు 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఓ రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు.. నిన్న మహబూబాబాద్ జిల్లాల్లో కిషన్ అనే రైతు చనిపోయారు.. ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఎండ దెబ్బతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి సహజ మరణాలు కావు.. ప్రభుత్వం చేసిన హత్యలు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సీఎం సెక్రటేరియట్ ముఖం చూడట్లేదు.. ఉంటే జూబ్లీహిల్స్ పాలస్ లో.. లేకుంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లి అందాల పోటీలపై రివ్యూ చేస్తున్నారు.. ఈ సీఎంకు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ద రైతుల మీద ఎందుకు లేదు అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ
పాకిస్థాన్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సిందూర్‌తో నూర్ ఖాన్ వైమానిక స్థావరం పూర్తిగా దెబ్బతిందని.. విమానాశ్రయానికి సంబంధించిన రన్‌వే ధ్వంసమైందని గుర్తుచేశారు. లీజుకు తీసుకున్న చైనా విమానాలను నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ చేయగలరా? అంటూ ఒవైసీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పాకిస్థాన్‌ను ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు.. 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల ముందే పురుషులను కాల్చి చంపేశారు. దీంతో భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఎలాగైనా పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. దీంతో మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌పై భారత వాయుసేన మెరుపుదాడులు చేసింది. దీంతో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసం అయింది. అంతేకాకుండా వంద మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించిన మోడీ
భారత వాయుసేన చూపించిన ప్రతిభను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఉదయం పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో వాయుసేనను మోడీ కలిశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించారు. శత్రువులకు భారత వాయుసేన వెన్నులో వణుకు పుట్టించిందని.. అందుకే ఉదయాన్నే మీ దగ్గరకు వచ్చేసినట్లు తెలిపారు. వీరులను చూసినప్పుడు జీవితం ధన్యమైపోయిందన్నారు. అందుకే భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. భారత వాయుసేన చూపించిన ప్రతిభ.. భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ప్రతి భారతీయుడు మీ వెంట ఉన్నారని.. అలాగే ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీ వెంట ఉన్నాయని వాయుసేనను ఉత్తేజ పరిచారు. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సాధారణమైన సైనిక విన్యాసం కాదని.. ఇది భారతదేశ నీతి, నియమం, నిర్ణయానికి నిదర్శనం అని ప్రధాని మోడీ కొనియాడారు.
మరిన్ని ఎస్-400 సిస్టమ్స్ కావాలి.. రష్యాని కోరిన భారత్.!
‘‘ఆపరేషన్ సిందూర్’’ విజయం కావడంలో భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులను గాలిలోనే అడ్డుకుని, సత్తా చాటింది. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాల కన్ను ఎస్-400 సిస్టమ్‌పై పడింది. దీంతో రష్యా తయారు చేస్తున్న దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రపంచ దేశాలు ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ కొరకు రష్యాని సంప్రదిస్తున్నాయి. 600 కి.మీ నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్, ఫైటర్ జెట్‌లను ట్రాక్ చేయడం, 400 కి.మీ వరకు టార్గెట్లను అడ్డగించడం దీని ప్రత్యేకత. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్ మరిన్ని ఎస్-400 రక్షణ వ్యవస్థల కోసం రష్యాని సంప్రదించినట్లు తెలుస్తోంది. భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని విస్తరించడానికి వీటిని కోరుతోంది. భారత్ 2018లో రష్యాతో ఐదు S-400 వైమానిక రక్షణ వ్యవస్థల కోసం USD 5.43 బిలియన్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు మరిన్ని ఎస్-400లు కావాలని భారత్ కోరుతున్నట్లు తెలుస్తోంది.
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటన ఖరారైంది. ఈ నెల 19న ఆమె శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ద్రౌపది ముర్ము శబరిమల పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 18న కొట్టాయం చేరుకుంటానని, 19న శబరిమల సందర్శన చేస్తానని ప్రకటన వెలువడింది. రాష్ట్రపతి భవన్ ఈ కార్యక్రమ వివరాలను ఈ రోజు కేరళ ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రపతి తన కేరళ పర్యటనలో భాగంగా కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలను సందర్శిస్తారు. మాజీ రాష్ట్రపతి వివి గిరి తర్వాత ద్రౌపదిముర్ము శబరిమలను దర్శించిన రెండో రాష్ట్రపతి అవుతారు. మే 18న రాష్ట్రపతి కేరళలోని కొట్టాయం జిల్లాలోని పాలాలో ఉన్న సెయింట్ థామస్ కాలేజ్ జూబ్లీ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. కొట్టాయంలో ఉన్న కుమారకోమ్‌లో ఆమె బస చేస్తారు. మే 19న రాష్ట్రపతి హెలికాప్టర్ ద్వారా నీలక్కల్ చేరుకుంటారు. నీలక్కల్ నుండి, రాష్ట్రపతి రోడ్డు మార్గంలో పంబకు ప్రయాణించి, ఆపై కాలినడకన శబరిమల ఆలయానికి వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రపతి సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేరళ ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.
మనవడి కోసం ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు!
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, నందమూరి మోహన కృష్ణ గతంలో కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. 2000 సంవత్సరంలో చివరిగా బాలకృష్ణతో ఓ సినిమా చేసి ఆపేశారు. ఇప్పటి నుంచి ఇక మీదట కెమెరా ముట్టుకోనని ఒట్టు వేసుకున్నారు. అయితే నిన్న జరిగిన జానకిరామ్ కుమారుడు సినిమా లాంచ్‌లో ఫస్ట్ షాట్ కి గౌరవ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. మనవడి కోసం ఆయన పాతికేళ్ల ఒట్టు తీసి గట్టుమీద పెట్టడం గమనార్హం. మరోవైపు.. నందమూరి కుటుంబంలో నాలుగో తరానికి చెందిన తారక రామారావుని ప్రపంచానికి పరిచయం చేస్తుండటంతో అభిమానులు ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కారుతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైకి దూసుకొచ్చిన టాలీవుడ్ హీరో.. అడ్డుకోవడంతో..
టాలీవుడ్ హీరో బెల్లం కొండా శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద హల్చల్ సృష్టించాడు. రాంగ్ రూట్ లో కార్ తో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అడ్డుకుని ఇదేంటని నిలదీయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటపడింది. అందరికీ ఆదర్శంగా నిలిచే నటులే ఇలా ప్రవర్తిస్తే సాధారణ ప్రజలు వీరిని చూసి ఏం నేర్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. 2014లో అల్లుడు శీను మూవీతో హీరోగా అరంగేట్రం చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆ రేంజ్‌లో విజయం సాధించలేదు. చాలా గ్యాప్ తర్వాత 2019లో తమిళ రీమేక్‌గా వచ్చిన రాక్షసుడు సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అనంతరం మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కానీ, వాటికి యూట్యూబ్‌లో హిందీ వెర్షన్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్, లైక్స్ ఉండటం విశేషం. ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసిన కూడా విజయం వరించలేదు. దాంతో ఎలాగైన హిట్ కొట్టెందుకు ప్రయత్నిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కెరీర్‌లో 12 వ చిత్రం చేస్తున్నాడు. శ్రీనివాస్ కొత్త ప్రాజెక్ట్ BSS12 ఇప్పటికే షూటింగ్ స్థాయిలో ఉంది.
రజినీకాంత్‌కు ఫస్ట్ చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రచ్చ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రూమర్లు సైతం వినిపిస్తున్నాయి. ఆగస్టు 14న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఓ షోలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్‌కు తొలుత వేరే కథ చెప్పానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఆయనకు వేరే కథ చెప్పాను. కానీ అనుకోని కారణాల దృష్ట్యా ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చెప్పారు. రెండు నెలలకు పైగా ఆ స్క్రిప్ట్‌పై పని చేసినట్లు తెలిపారు. “ఆ కథ రజినీకాంత్‌కి బాగా నచ్చింది. కానీ.. రెండు నెలల తర్వాత మళ్లీ ఆయనను కలిసి కూలీ కథ చెప్పాను. మొదటి కథ రజనీ కాంత్‌కు నచ్చినప్పటికే ఆ స్టోరీ చేయలేక పోయాం. దానికి కూడా ఓ కారణం ఉంది. వాస్తవానికి నేను అనుకున్న పాయింట్ ఒక చోట పూర్తిగా డౌన్ అయిపోయినట్లు అనిపించింది. దీంతో ఆ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పోయింది. భవిష్యత్‌లో ఎప్పుడైనా కొత్త ఆలోచన వస్తే, ఆ కథను అందుకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తా.” అని దర్శకుడు లోకేష్ కనగరాజ్ వివరించారు.