నా దేవుడు ఎప్పటికి జగనే.. ఉదయం నిద్ర లేవగానే ఆయన ఫొటోకి దండం పెట్టుకుంటా..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.. అయితే, అసెంబ్లీ లాబీల్లో చిట్‌చాట్ సందర్భంగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.. తన రాజకీయ ప్రస్థానంపై మాట్లాడిన ఆయన, “నా దేవుడు ఎప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే.. ఉదయం నిద్రలేవగానే ఆయన ఫోటోకు దండం పెడతాను.. ఈ మాటను ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను” అని అన్నారు. ఇక, 20 ఏళ్లు పార్టీ కోసం పనిచేశాను.. ఎవరు ఏం చేయలేదు.. కానీ, పిలిచి పిల్లని ఇచ్చినట్టు పిలిచి పదవి ఇచ్చింది జగన్ గారే అన్నారు జయమంగళ… అప్పుల్లో కూరుకుపోయిన నన్ను కోలుకునేలా చేశారు అని పేర్కొన్నారు. తన రాజకీయ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, “రాజకీయాల్లో నాది శకుని పాత్ర” అన్నారు. 2014 ఎన్నికల సందర్భాన్ని ప్రస్తావిస్తూ, “అప్పుడు నాకు కాకుండా కామినేనికి టికెట్ ఇచ్చారు. నేను పోటీ చేసి ఉంటే అప్పుడే మంత్రి అయ్యేవాడిని” అని తెలిపారు. అలాగే జిల్లాలో కొల్లు రవీంద్ర కంటే తాను సీనియర్‌నని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
దేవాలయాల పరిరక్షణపై పవన్ కీలక వ్యాఖ్యలు..
దేవాలయాల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని, రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని పవన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయన్నారు. నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక మండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతనంగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఆలయాలు నాగరికతకు చిహ్నాలు అన్నారు. మన కళలు, మన వారసత్వం, మన సంస్కృతి, ధర్మ పరిరక్షణ ఆలయాలతో ముడిపడి ఉన్నాయి. అరుణాచలంలో గిరిప్రదక్షణ చేస్తారు అని తెలుసు.. నాకు గిరిప్రదక్షణ చేయాలని చాలా కోరిక ఉంది. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు, భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటాన్నారు.. శివరాత్రికి రెండు రోజుల ముందు ఈ శ్రీకాళహస్తి గిరి ప్రదక్షణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు పవన్.. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేసిందన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నాం అన్నారు. నిరాదరణకు గురైన ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని.. భక్తులు కోరుకుంటే ఏజెన్సీలో కూడా ఆలయాలు నిర్మించాలన్న ఆయన గొప్ప సంకల్పానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు పవన్ కల్యాణ్..
మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు.. 99 శాతం ఫేక్..
మంత్రులకు మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖలపై ఇంటెలిజెన్స్ విభాగం స్పష్టత ఇచ్చింది. ఆ లేఖల్లో 99 శాతం ఫేక్ అని ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. తెలంగాణలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక సర్పంచ్ ఫోన్ నంబర్‌తో ఈ బెదిరింపు లేఖ పంపినట్లు గుర్తించినట్లు చెప్పారు. అయితే, ఇలా లేఖలు వచ్చిన విషయం ఆ సర్పంచ్‌కే తెలియదని వెల్లడించారు. ప్రత్యేకంగా నలుగురు మంత్రులకే ఈ లేఖలు రావడం వెనుక పెద్ద కారణాలు లేవని, బహుశా వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఇలా చేయించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బెదిరింపు లేఖలు అందిన మంత్రుల నివాసాల వద్ద భద్రత పెంచాలని సంబంధిత విభాగానికి సూచించినట్లు తెలిపారు. ఈ లేఖల వ్యవహారంపై లోతైన విచారణ కొనసాగుతోందని ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు. కాగా, నలుగురు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే.. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్రకు మావోయిస్టుల నుంచి బెదిరింపుల లేఖలు వచ్చాయి.. అంతే కాదు.. చంపేస్తాం.. జాగ్రత్త అంటూ లేఖలో హెచ్చరించారు దుండగులు.. దీంతో, అలర్ట్ అయిన పోలీసులు లేఖల వెనుక ఎవరు? ఉన్నారు అని ఆరీ తీసే పనిలో పడ్డారు.. అందులో భాగంగానే.. అవి 99 శాతం ఫేక్ లెటర్స్ అని తేల్చారు..
అంబటి రాంబాబు వివాదం.. నారా లోకేష్ వర్సెస్ బొత్స..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.. వరుస కేసుల వ్యవహారం కాక రేపుతోంది.. అయితే, శాసనమండలిలో అంబటి రాంబాబు వివాదంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి నారా లోకేష్ మరియు మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి తల్లిని అవమానించారని ఆరోపించారు. మహిళలను కించపరిచే విధానం సరికాదన్నారు. “ఎవరి తల్లినైనా, మహిళనైనా అవమానిస్తే వదిలిపెట్టం. ముందు ముందు మీరు చూస్తారు” అని హెచ్చరించారు. నెల్లూరులో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, తమ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనికి స్పందించిన బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని, అనంతరం వాటిపై పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం కూడా తప్పేనని ప్రశ్నించారు. “అంబటి రాంబాబు తల్లి తల్లి కాదా? తల్లి ఎవరికైనా తల్లే. మహిళ విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే” అని వ్యాఖ్యానించారు. ఇంకో మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసిన ఘటనను కూడా ప్రస్తావించారు. మహిళలను రాజకీయ మైలేజ్ కోసం ఉపయోగించకూడదని అన్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం సీపీఐ (CPI) అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ మిత్రపక్షాలతో కలిసి 25 స్థానాల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ 21 డివిజన్లను కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొంది కింగ్ మేకర్‌గా మారింది. బీజేపీ, సీపీఎం తలో స్థానాన్ని గెలుచుకోగా, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్రులలో ముగ్గురు ఇప్పటికే సీపీఐకి మద్దతు ప్రకటించే అవకాశం ఉండటంతో ఎర్రజెండా పీఠం ఎక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ఖాతా తెరిచిన జనసేన.. ఏ జిల్లాలో గెలిచిందంటే..?
ఏపీకే పరిమితమైందని భావించిన జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి ఘన విజయం సాధించారు. 14వ వార్డులో జనసేన తరఫున పోటీ చేసిన విజయలక్ష్మి ఆరూరి 60 ఓట్ల మెజారిటీతో విజయ కేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుపై ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కాగా.. ఈ మున్సిపాలిటీలో మొత్తం 15 స్థానాలకు గానూ 9 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందగా, ఒక వార్డును జనసేన దక్కించుకుంది. అయితే.. విజయ లక్ష్మీ గెలపుతో తెలంగాణలోని జనసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణలో ఇప్పటివరకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొత్త శక్తిగా ఎదగాలని చూస్తున్న జనసేనకు ఈ గెలుపు ప్రోత్సాహాన్ని ఇస్తోందని అభిమానులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయా? అనే అంశాన్ని జనసేన పార్టీ నిర్ణయించాలి.
కొత్త పీఎంఓ ‘‘సేవా తీర్థ్’’ను ప్రారంభించిన ప్రధాని మోడీ..
బ్రిటిష్ కాలం నుంచి ప్రధాన మంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ కొత్త అడ్రస్ ‘‘సేవా తీర్థ్’’కు మారింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO)తో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేవా తీర్థ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారిగా కీలకమైన కార్యనిర్వాహక విధులను ఏకీకృతం చేయడానికి, పరిపాలన సామర్థ్యాన్ని పెంచడానికి ఈ కొత్త అధునాతన సముదాయాన్ని ప్రారంభించారు. సేవాతీర్థ్‌లో మూడు కీలక కార్యాలయాలు ఒకే చోట ఉంటాయి. ప్రధాని కార్యాలయం, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్ ఉన్నాయి. కర్తవ్య భవన్ 1, 2లలో కీలక మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఆర్థిక, రక్షణ, ఆరోగ్యం, విద్య, కార్పొరేట్ వ్యవహారాలు, వ్యవసాయం, న్యాయ మంత్రిత్వ కార్యాలయాలు ఇందులో ఉంటాయి. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో నిర్ణయాల్లో వేగం, శాఖల మధ్య సమన్వయం మెరుగవుతుంది. కొత్త సముదాయంలో డిజిటల్ ఇంటిగ్రేషన్, పబ్లిక్ ఇంటర్ఫేస్ జోన్లు, సెంట్రలైజ్డ్ రిసెప్షన్, ఆధునిక ఈ గవర్నెన్స్ సపోర్ట్, 4-స్టార్ GRIHA ప్రమాణాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు. భద్రత కోసం స్మార్ట్ యాక్సెస్ నియంత్రణ, ఇంటిగ్రేటెడ్ నిఘా, ఆధునాతన అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు ఉన్నాయి. ఖాళీ అయిన సౌత్, నార్త్ బ్లాక్‌లలో ‘‘యుగే యుగీన్ భారత్ సంగ్రహాలయ’’ అనే పబ్లిక్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
భారత్‌లోనే ఉద్భవించిన “సైక్లోన్” అనే పదం.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే..
సైక్లోన్ అనే పదం తరచూ వింటూనే ఉంటాం.. అది ఏర్పడిన ప్రాంతం.. పుట్టిన సమయాన్ని పట్టి కూడా కొన్ని సార్లు సైక్లోన్ పేర్లు పెడుతూ ఉంటారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు సైక్లోన్ అనే పదం పుట్టుక వెనుక ఆసక్తికరమైన కథే ఉంది.. నేడు ప్రపంచవ్యాప్తంగా వినిపించే “Cyclone” అనే పదం భారతదేశంతో అనుబంధం కలిగి ఉందనే విషయం చాలామందికి తెలియదు. 19వ శతాబ్దంలో భారతదేశంలో పనిచేసిన బ్రిటిష్ నౌకాధికారి Henry Piddington ఈ పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు.. “Cyclone” అనే పదం గ్రీకు పదమైన kyklos / kuklos నుంచి వచ్చింది. దీనికి అర్థం “వృత్తం” లేదా “చుట్టం.” పిడింగ్టన్ బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులను అధ్యయనం చేస్తూ, గాలి ఒక ప్రశాంత కేంద్రం చుట్టూ వలయాకారంలో తిరుగుతుందని గమనించాడు. ఈ భ్రమణాన్ని ఆయన “పాము కాయిల్” (snake coil) తో పోల్చాడు. 1830–1840ల మధ్య పాత నౌకా లాగ్‌బుక్‌లను పరిశీలించిన పిడింగ్టన్, బంగాళాఖాతంలో తుఫానులు మెలికలు తిరిగే స్వభావం కలిగి ఉంటాయని వివరించాడు. పై నుంచి చూస్తే అవి పాము చుట్టలా కనిపిస్తాయని పేర్కొన్నాడు. 1848లో ఆయన రచించిన పుస్తకం The Sailor’s Horn-Book for the Law of Storms లో తొలిసారి “Cyclone” అనే పదాన్ని ఉపయోగించాడు. నావికులు తుఫానుల దిశ, భ్రమణ స్వభావాన్ని అర్థం చేసుకుని సురక్షితంగా నావిగేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పదాన్ని ప్రవేశపెట్టాడు.
ఏఐతో డేటింగ్.. న్యూయార్క్‌లో సంచలనం సృష్టిస్తున్న ఏఐ కేప్!
ప్రేమలో పడటానికి ఎదురుగా ఒక మనిషి ఉండక్కర్లేదు.. కేవలం ఒక యాప్ ఉంటే చాలు. వినడానికి వింతగా ఉన్నా, ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇదే హాట్ టాపిక్. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన సీన్లు ఇప్పుడు ‘ఎవా ఏఐ కేఫ్’ (Eva AI Cafe) రూపంలో కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. అసలు ఏంటి కథ అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం.. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ ‘హెల్స్ కిచెన్’ పరిసరాల్లో వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ప్రారంభమైన ఈ పాప్-అప్ కేఫ్, ప్రపంచంలోనే సరికొత్త ప్రయోగానికి వేదికైంది. ఇక్కడ కాఫీ తాగడానికి వచ్చే కస్టమర్ల ముందు మనుషులు ఉండరు. బదులుగా వారి టేబుల్ మీద ఉన్న మొబైల్ స్టాండ్‌లో ఒక స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. అందులో AI భాగస్వామి (AI Companion) ఉంటుంది. కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్ వైపు చూస్తూ ముచ్చట్లు చెబుతూ కాఫీ తాగుతున్నారు. ఎందుకు ప్రజలు ఈ వింత డేటింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు? అనే ప్రశ్నకు వినియోగదారుల నుంచి ఆసక్తికర సమాధానాలు వస్తున్నాయి.. నో జడ్జిమెంట్: “నేను ఏం మాట్లాడినా అవతలి వ్యక్తి ఏమనుకుంటారో” అనే భయం ఇక్కడ ఉండదు. AI మీ మాటలను తీర్పు ఇవ్వకుండా వింటుంది. తిరస్కరణ భయం లేదు: మనుషుల మధ్య డేటింగ్ అంటే రిజెక్షన్ లేదా ‘ఘోస్టింగ్’ వంటి భయాలు ఉంటాయి. కానీ AI ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
అప్లై చేశారా?.. ఇండియన్ పోస్ట్, రైల్వేలు, బ్యాంకులు, UPSC లలో 54,000+ పోస్టులు.. 10th, డిగ్రీ ఉంటే చాలు
ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న యువతకు సువర్ణావకాశం. ప్రస్తుతం, ఇండియన్ పోస్టల్ సర్వీస్, బ్యాంకులు, రైల్వేలు, UPSC, ఇండియన్ ఆర్మీ, ISRO వంటి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 54,000 కంటే ఎక్కువ ఉద్యోగాల భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 10వ తరగతి నుండి గ్రాడ్యుయేట్లు/పోస్ట్ గ్రాడ్యుయేట్ల వరకు అర్హులు. ఉద్యోగం లేదని వర్రీ అవుతున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026, UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష 2026 కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 933 పోస్టులు భర్తీకానున్నాయి. యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, అగ్రికల్చర్ లేదా ఇతర సూచించిన సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 24, 2026. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు ఇండియా పోస్ట్ పోస్టుల భర్తీ చేపడుతోంది. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఫిబ్రవరి 14, దరఖాస్తును పూర్తి చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
అభిషేక్ శర్మ ఒక స్లాగర్, గొప్ప ఆటగాడు కాదు.. పాక్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్..
హై ఓల్టేజ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాదులు తలపడనున్నారు. ఇప్పటికే రెండు దేశాల మీడియాల్లో క్రికెట్ అనలిస్టులు మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ భారత స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ గురించి అనుచిత వ్యాక్యలు చేశారు. ఒక టీవీ షోలో మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ టెక్నికల్‌గా గొప్ప ఆటగాడు కాదని, అతను ఓ స్లాగర్( టెక్నిక్ కన్నా బంతిని బలంగా బాదే ఆటగాడు)గా అభివర్ణించారు. ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడుతాడా.? అనేది టీమిండియాను కలవరపరుస్తున్న తరుణంలో ఈ అమీర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘అభిషేక్ శర్మ ఒక స్లాగర్. ప్రతీ బంతిని బలంగా కొట్టాలని కోరుకుంటాడు. బంతి కనెక్ట్ అయితే అవుతుంది, లేదంటే విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అతను ఒకే మ్యాచ్‌లో స్కోర్ చేస్తాడు. లేదంటే 10,15,20,0 రన్స్ చేస్తాడు. అతను నిలబడి స్లాన్ చేస్తాడు. అతను సాంకేతికంగా మంచి బ్యాటర్ కాదు. అది నా నిజాయితీ అభిప్రాయం’’ అని ఆమీర్ అన్నారు. ఇదే కాకుండా అభిషేక్‌ను అవుట్ చేయడానికి ప్లాన్ కూడా వివరించాడు. అభిషేక్ రిస్క్ క్రికెట్ ఆడుతాడు. డీప్ కవర్ ఉంచుకుని, అతడి బాడీ పైకి బౌలింగ్ చేస్తాను. స్లో బాల్స్ వేయడం ద్వారా అవుట్ చేయవచ్చు’’ అని పాక్ మాజీ అన్నారు. గతంలో అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలర్లు తనను ఎదుర్కోవడానికి స్లో బాల్స్‌పై ఎలా ఆధారపడుతారో చెప్పాడు. అయితే, ఇలాంటి బాల్స్ ఎదుర్కోవడానికి ప్రాక్టీస్ చేస్తానని చెప్పారు.
టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాంబ్వే విజయం!
భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో సంచలనం నమోదయింది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై పసికూన జింబాంబ్వే విజయం సాధించింది. 170 పరుగుల లక్ష ఛేదనలో ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో జింబాంబ్వే 23 పరుగుల తేడాతో గెలిచింది. జింబాంబ్వే బౌలర్లలో ముజారబానీ 4 వికెట్స్ పడగొట్టగా.. బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. మాట్ రెన్షా (65) ఆసీస్ తరఫున హాఫ్ సెంచరీ బాదాడు. గ్రూప్-Bలో భాగంగా కొలంబోలో ఆస్ట్రేలియా, జింబాంబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాంబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్; 56 బంతుల్లో, 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. తాదివనాషే మారుమణి (35, 21 బంతుల్లో, 7 ఫోర్లు), ర్యాన్ బర్ల్ (35; 30 బంతుల్లో 4 ఫోర్లు), సికిందర్ రాజా (25 నాటౌట్; 13 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. జోష్ ఇంగ్లిస్ (8), కామెరూన్ గ్రీన్ (0), టీమ్ డేవిడ్ (0) విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్ (17) కూడా నిరాశపరిచాడు. ముజారబానీ, ఎవాన్స్ కలిసి ఆసీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లను ఎత్తేశారు. ఈ సమయంలో మాట్ రెన్షా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31) జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ నెమ్మదిగా ఆడడంతో చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. మ్యాక్స్‌వెల్, రెన్షా అవుట్ అయ్యాక.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో ఆసీస్ ఓడక తప్పలేదు. ముజర్బానీ (4/17) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడితో పాటు ఇవాన్స్, మసకద్జ, బర్ల్ కూడా బంతితో రాణించారు.
టాలీవుడ్ తెరపై మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ బ్యూటీఫుల్స్
మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో విన్నర్ ఆర్ రన్నర్ అయిన భామలు ఎక్కువగా బాలీవుడ్లోనే కాలక్షేపం చేస్తుంటారు. ఎప్పుడో అడపా దడపా సౌత్ సినిమాల వైపు తొంగి చూసేవారు. కానీ కాలం మారింది. సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారడంతో అందాల పోటీల్లో విన్నర్, రన్నర్‌గా నిలిచిన భామలు టాలీవుడ్ తెరపై ప్రత్యక్షమౌతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా దూసుకెళుతోన్న మీనాక్షి చౌదరి.. 2018 మిస్ ఇండియా పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. వెంటనే హిందీలో కెరీర్ స్టార్ట్ చేసిన మీనూ టాలెంట్ టాలీవుడ్ గుర్తించింది. రీసెంట్లీ అనగనగా ఒక రాజుతో హాయ్ చెప్పిన మీనాక్షి.. త్వరలో వృషకర్మతో రాబోతుంది. టాలీవుడ్ స్క్రీన్‌పై తళుక్కున మెరుస్తోన్న మరో మిస్ ఇండియా మానస వారణాసి. 2020 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచిన ఈ తెలుగమ్మాయి.. బాలీవుడ్ ఆఫర్స్ కాదని.. తెలుగులోకి ఇంట్రడ్యూసైంది. దేవకీ నందన వాసుదేవతో పరిచయమైన మానస.. కపుల్ ఫ్రెండ్లీతో తన లక్ పరీక్షించుకోబోతుంది. అలాగే 2024 మిస్ యూనివర్శ్ ఇండియా అందాల కిరీటాన్ని కైవసం చేసుకున్న రియా సింఘా సత్య హీరోగా నటిస్తున్న జెట్లీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. వారణాసితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మోస్ట్ బ్యూటీఫుల్ గర్ల్ ప్రియాంక చోప్రా కూడా 2000 మిస్ వరల్డ్ విన్నర్. ఆమె టాలీవుడ్ ఎంట్రీ అప్పట్లోనే జరగాల్సింది కానీ అనివార్య కారణాలతో ఆగిపోయింది. బాలీవుడ్లో స్టార్ డమ్ సంపాదించి హాలీవుడ్ చెక్కేసిన ప్రియాంక చోప్రా మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు ఆడియన్స్‌కు మందాకినిగా కనిపించబోతోంది. 2016 అంతర్జాతీయ అందాల పోటీలో విన్నరైన శ్రీనిధి శెట్టి రైజింగ్ బ్యూటీగా మారింది. 2013లో మిస్ ఇండియా ఎర్త్ రన్నరప్ టైటిల్ గెలిచిన శోభితా.. ఏడాది క్రితం మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరై.. తాజాగా చీకటిలో అనే ఓటీటీ ఫిల్మ్‌తో హాయ్ చెప్పింది. మొత్తానికి టాలీవుడ్ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేస్తున్నారు ఈ బ్యూటీఫుల్ గర్ల్స్.