డ్రగ్స్‌పై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్.. పెనుముప్పుగా మారింది..!
సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్‌పై స్పందించారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. “రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది.. మన ఎన్డీఏ ప్రభుత్వం మునుపటి అవినీతి, నేర పాలన నుండి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య, రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.. కొంతకాలం క్రితం, విశాఖపట్నం పోర్టులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని, గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందని చూపిస్తుందన్నారు పవన్.. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఎక్స్‌లో పోస్టు.. వైసీపీ ఎమ్మెల్యేపై కేసు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయం మొత్తం సోషల్ మీడియా పోస్టుల చుట్టూ తిరుగుతోంది.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు పోలిసులు.. ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్ర శేఖర్ పెట్టిన పోస్ట్‌లపై స్థానిక టీడీపీ నేత కిషోర్ ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గతంలో.. సర్కారు వారి పేకాటా… రాష్ట్రంలోని పేకాట క్లబ్ ల నుండి వారం వారం కమిషన్ వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కుమారుడు మంత్రి నారా లోకేష్.. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ పేకాట ఆడేలా మౌలిక, సాంఘిక వసతులు ఏర్పాటు చేయడం ధర్మమా లోకేష్ అంటూ Xలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.. అయితే, ఆ ట్వీట్ కు రియాక్షన్ గా గతంలోనే నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా కేసు నమోదు చేసి.. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో పోలీసులు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై పలు కేసులు నమోదు చేశారు. ఎలక్షన్ సమయంలో పెండింగ్ లో ఫిర్యాదులపై సైతం కేసులు నమోదు చేశారని ఎమ్మెల్యే చంద్ర శేఖర్ వాపోతున్నారు.. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పోస్టింగులకు పెట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తూ వస్తున్న పోలీసులు మొట్టమొదటిసారి ఓ వైసీపీ ఎమ్మెల్యే పైనే కేసులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.. ఈ విషయంలో వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి..
వేషం మార్చిన అఘోరీ.. మహానంది క్షేత్రంలో ప్రత్యక్షం
వస్త్రాలు లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తిరిగి వివాదాలను సృష్టించారు అఘోరీ నాగసాధు. నిన్న కర్నూలు రోడ్లపై వస్త్రాలు లేకుండా తిరిగి హల్చల్ చేశారు. అయితే, తెల్లవారేసరికి మహానంది క్షేత్రంలో ప్రత్యక్షమయ్యరామే. కర్నూలులో ఆమె సొంత కారు పాడైపోవడంతో ప్రైవేట్ కారులో వచ్చారు అఘోరీ నాగసాధు. ఇక, కాషాయ వస్త్రాల్లో వచ్చిన అఘోరి నాగసాధుకు స్వాగతం పలికారు ఆలయ సిబ్బంది , పూజారులు. అనంతరం ఆమె మహానందిశ్వర స్వామి, కామేశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.. ఆమెకు ఆశీర్వచనాన్ని అందించారు ఆలయ పూజారులు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక కళ్యాణం కోసమే తాను పర్యటిస్తున్నారు అన్నారు.. ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడం, మహిళలకు రక్షణ కల్పించడం, గోహత్యలను నివారించడం తన లక్ష్యమన్నారు. భక్తులందరూ తమ తమ పనులను భక్తిశ్రద్ధలతో చేసుకుంటూ లోక కల్యాణం కోసం పాటుపడాలన్నారు అఘోరి నాగసాధు.. మరోవైపు.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన యాగంటి క్షేత్రాన్నీ లేడీ అఘోరి సందర్శించి శ్రీ ఉమా మహేశ్వర స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. మొన్నటి వరకు దిగంబరంగా తిరుగుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివిధ ఆలయాలను సందర్శిస్తూన్న అఘోరి ప్రస్తుతం ఎర్రటి వస్త్రం ధరించి యాగంటి క్షేత్రానికి వచ్చారు. ఈ సందర్భంగా , అఘోరి మాట్లాడుతూ సనాతన ధర్మం కాపాడడం కోసమే నా పోరాటమని, స్పష్టం చేశారు మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల జరుగుతున్న దారుణ అఘాయిత్యాలు, నియంత్రించాలని, ఆలయాల పై జరుగుతున్న దాడులు, గోవుల వధ ను ఆపేయాలని పేర్కొన్నారు.
పోలవరంలో విదేశీ నిపుణుల బృందం.. ప్రాజెక్టుపై రానున్న స్పష్టత..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన నాలుగో రోజు కొనసాగనుంది. గడిచిన మూడు రోజుల్లో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన బృందం కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణంపై ఒక క్లారిటీ కి వచ్చింది. 2026 నాటికి వాల్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదే సమయంలో ప్రధాన డ్యామ్ అయిన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులను ఏరకంగా మొదలుపెట్టాలి అనే విషయంపై నాలుగో రోజు అధికారులతో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసే పనిలో భాగంగా విదేశీ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు అధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో బృందం చర్చించింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయా ఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేయబోతున్నారు. నిన్నటి వరకు జరిగిన చర్చల్లో ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా.. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు చేపట్టాలన్న జల వనరుల శాఖ ప్రతిపాదనకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపింది. శనివారం దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వనుంది. డయాఫ్రం వాల్ డిజైన్లు, నిర్మాణ వ్యవధిపై జరిగిన చర్చలో 2026 మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పాటు.. వాల్ ఎత్తును 19 మీటర్ల వరకు పెంచాలని నిర్ణయించారు. కాఫర్ డ్యాంల నుంచి సీపేజీని అరికట్టడంపై కూడా చర్చించారు. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీని అరికట్టేందుకు 7,840 హెచ్‌పీ మోటార్లను వాడాల్సి ఉంటే.. ప్రస్తుతం 3,750 హెచ్‌పీ మోటార్లతో డీవాటరింగ్ చేపడుతున్నారు. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని.. అప్పుడు వాల్ నిర్మాణానికి ఆటంకాలు ఎదురుకావని నిపుణులు సూచించారు. శనివారం జరగనున్న సమావేశంతో మరిన్ని అంశాలపై పూర్తి క్లారిటీ రానుంది.
దేశంలో ఏపీలోనే సీ ప్లేన్ తొలిసారి.. ఈ మూడు రూట్లలో సర్వీసులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీ ప్లేన్ సర్వీసులకు రంగం సిద్ధం చేసింది.. ఇప్పటికే విజయవాడ-శ్రీశైలం మధ్య ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.. ఈ రోజు లాంఛనంగా ఆ సర్వీసులను ప్రారంభించి శ్రీశైలం వెళ్లలనున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. దేశంలోనే సీ ప్లేన్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం అన్నారు.. కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేట్లు స్కీం ను రూపొందిస్తున్నాం అన్నారు.. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే కనీసం 500 ఎకరాల అవసరం లేకుండా వాటర్ ఏరో డ్రోమ్స్ సహాయంతో ఎయిర్ ట్రావెల్ కు అవకాశం ఉందన్నారు.. ఉడాన్ స్కీం ద్వారా వయబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది.. టూరిజం కూడా సహకరిస్తే ఇంకా వేగంగా ముందుకు వెళ్తాం అన్నారు.. ఇక, ప్రస్తుతానికి విజయవాడ – శ్రీశైలంతో పాటు విజయవాడ – నాగార్జున సాగర్, విజయవాడ – హైదరాబాద్ రూట్‌లు కన్ఫర్మ్ అయ్యాయి అని వెల్లడించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతంలో రాజధాని అమరావతికి కనెక్ట్ చేసే విధంగా మరిన్ని స్టేషన్ లు అభివృద్ధి చేస్తాం అన్నారు.. రెగ్యులర్ ట్రావెల్ కు మరో మూడు నాలుగు నెలల సమయం పడుతుందన్నారు.. అయితే, ప్రస్తుతం ఇది ట్రయిల్ మాత్రమే.. ధరలు, ట్రిప్ ల వివరాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.. సీ ప్లేన్ ఆపరేషన్స్ కు కేవలం రాష్ట్రాన్నే కాదు దేశ గతినే మార్చే శక్తి ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. చంద్రబాబు సూచన మేరకే పాలసీలో కొన్ని మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చాం.. చంద్రుడు మన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నిత్య పున్నమి ఉంటుందని పున్నమి ఘాట్ సాక్షిగా చెబుతున్నా అంటూ సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.. అతి చిన్న దేశం మాల్దీవుస్ లో సీ ప్లేన్ ద్వారా చాలా ఆదాయం వస్తుంది.. అలాంటిది 140 కోట్ల జనం, 1350 దీవులు ఉన్న భారత దేశంలో సీ ప్లేన్ ఆపరేషన్స్ ఒక విప్లవం కానున్నాయన్నారు.. అందుకు అమరావతినే మొదటి వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.
నామినేటేడ్ పోస్టులు భర్తీ.. రెండో జాబితాలో 59 మందికి పదవులు.. లిస్ట్ ఇదే..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కూటమిలోని తెలుగుదేశం పార్టీ.. జనసేన పార్టీ.. బీజేపీతో కో-ఆర్డినేషన్ చేసుకుంటూ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. ఇప్పటికే తొలి జాబితాలో కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా.. ఇప్పుడు 59 మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ.. రెండో జాబితా విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.. 59 మందితో విడుదల చేసిన జాబితాలో జనసేన నుంచి 10 మందికి.. బీజేపీ నుంచి ముగ్గురికి ఇద్దరికి అవకాశం దక్కగా.. మిగతా పోస్టులు తెలుగుదేశం పార్టీకి చెందినవారికి దక్కాయి..
అసలు ప్రక్రియ మొదలు.. నేటి నుంచి వివరాల సేకరణ..
రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేలో నేడు అసలు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశలో (బుధవారం) నుంచి మూడు రోజులుగా కుటుంబాలను గుర్తించి సిబ్బంది ఇళ్లకు ఎన్యూమరేటర్లు స్టిక్కర్లు వేసిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి ప్రజల నుంచి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలో B.C, S.C, S.T, ఇతర వెనకబడిన వర్గాలకు అభివృద్ధి, అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు చేసేందుకు సర్వే చేస్తున్నారు. ఇక ఈ సర్వే డేటా ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. కాగా.. కుటుంబ వ్యక్తిగత వివరాలను గణకులు(ఎన్యూమరేటర్లు) సేకరించడమే కాకుండా.. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల కోసం స్వగ్రామంలోని ఇల్లు వదిలి, దూరప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇంటింటికి తిరుగుతూ కుటుంబ సర్వేలో కుల వివరాలు ఎన్యుమరేటర్లు నేటి నుంచి సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసి పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే స్టిక్కరింగ్ 95 శాతం పూర్తయింది. GHMC పరిధిలో 19,722 ఎన్యూమరేటర్లు పని చేస్తున్నారు. ఈరోజు నుంచి సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు. నేటి నుంచి 21 వరకు ఇంటింటికి తిరిగి సర్వే వివరాలు ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు. మొత్తం 243 కులాలను ఫైనల్ చేసి క్యాస్ట్ కోడ్స్ లిస్ట్ చేసిన అధికారులు. ఎస్సీ కేటగిరీలో 59 కులాలు, ఎస్టీ కేటగిరిలో 32 కులాలు, ఇక 134 కులాలు, ఓసీ కేటగిరిలో 18 కులాలు బీసీ కేటగిరి లో చేర్చారు.
నేటి నుంచి ఇంటింటి సర్వే.. వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం..
నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయని తెలిపారు. కలెక్టర్లు ఎనుమరెటర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడితే ప్రజల సందేహాలు ఏంటో వెను వెంటనే తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా పెద్ద కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్న అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. క్వశ్చనీర్ పకడ్బందీగా రూపొందించారు, ఎనిమరేటర్లకు బాగా శిక్షణ ఇచ్చారు, హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇది.. మనం చూపే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం అవడం ఆధారపడి ఉంటుంది అన్నారు. యావత్ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుటుంబ సర్వేను గమనిస్తుందని వివరించారు.
రేపు రాంచీలో రోడ్ షో నిర్వహించనున్న ప్రధాని మోడీ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి నవంబర్ 10న వారంలోపే వస్తున్నారు. ఇక్కడ రాజధాని రాంచీలో బీజేపీ అభ్యర్థితో కలిసి రోడ్ షో చేయనున్నారు. దాదాపు గంటన్నర పాటు సాగే ఈ రోడ్ షో దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ప్రధాని మోదీ ఈ రోడ్ షోకు సంబంధించి జార్ఖండ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, రాంచీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్ షో సందర్భంగా ప్రధాని భద్రత కోసం 11 మంది ఎస్పీలు, 30 మంది డీఎస్పీలు, దాదాపు 4000 మంది అదనపు భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 20,000 మంది బైక్ రైడర్లు రోడ్ షోలో పాల్గొంటారు. దీంతో పాటు 501 మంది బ్రాహ్మణులు శంఖుస్థాపనలు చేసి శంఖుస్థాపన చేసి ప్రధాని విజయ సంకల్పాన్ని ఆశీర్వదించనున్నారు. సాంప్రదాయ ఛౌ నృత్యం ద్వారా స్థానిక కళాకారులు కూడా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. ప్రధాని మోదీ సుమారు 3 కిలోమీటర్ల పొడవైన రోడ్ షో ఓటీసీ గ్రౌండ్ నుండి ప్రారంభమై పిస్కా మోడ్, మెట్రో గాలి, దుర్గా మందిర్ మీదుగా రాటు రోడ్ చౌక్ వద్ద ముగుస్తుంది. ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రోడ్ షో మార్గంలో ఎత్తైన భవనాలపై డ్రైన్ల క్లీనింగ్, చెత్త పారవేయడం, సెక్యూరిటీ సిబ్బందిని మోహరిస్తున్నారు. అంతేకాకుండా రోడ్ షో మధ్యలోకి ఎవరూ రాకుండా రోడ్డుకు ఇరువైపులా రెండు లేయర్ల బారికేడింగ్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కూడా యుద్ధప్రాతిపదికన రోడ్డు పక్కన డ్రైన్లు, రోడ్ల మరమ్మతు పనులు చేపట్టింది. ఈ మార్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా దెబ్బతిన్న రోడ్డును జేసీబీ సహాయంతో మరమ్మతులు చేస్తున్నామని, రోడ్ షో సందర్భంగా నీరు చేరకుండా సరైన డ్రైనేజీ ఏర్పాట్లు చేశామన్నారు.
లక్ష మందిని పిలిచి, విందు పెట్టి చాలా గ్రాండ్ గా కారును సమాధి చేసిన రైతు కుటుంబం
మన జీవితంలో ఉపయోగించిన కారు, ఫోన్, ల్యాప్‌టాప్ వంటి వాటిని కొంత కాలం తర్వాత చెత్తకుప్పల్లో పడేస్తాం కానీ గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని ఓ గ్రామంలో ఇలాంటి దృశ్యం కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గ్రామానికి చెందిన ఒక కుటుంబం వారి అదృష్ట కారుని దాని సమయం ముగిసినప్పుడు పూర్తి ఆచారాలతో ఖననం చేసింది. కారు పట్ల కుటుంబ సభ్యుల భావాలు ఎంత గాఢంగా ఉన్నాయంటే ఆ కారును ఎప్పటికీ గుర్తుంచుకునేలా గ్రాండ్‌గా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంత్యక్రియలకు ముందు కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. పూలతో అలంకరించి, దాని పైభాగంలో కొబ్బరికాయను ఉంచి, దానిపై ఆకుపచ్చ కవర్ వేసి, పూజలు నిర్వహించి, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబ సభ్యులు కారుకు వీడ్కోలు పలికారు. అలాగే అంత్యక్రియలకు మొత్తం రూ.5 లక్షలు ఖర్చు చేశారు. కార్యక్రమంలో స్థానిక సాధువులు, మత పెద్దల సమక్షంలో గ్రామంలోని సుమారు 1500 మందికి అన్నదానం చేశారు. ఈ విశిష్ట కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వాన పత్రికను ప్రజలకు పంపారు. అందులో ‘‘ఈ కారు మా కుటుంబంలో సభ్యురాలిగా మారిందని, మాకు ఎంతో అదృష్టమని లేఖలో రాశారు. మేము దానిని ఎల్లప్పుడూ మా జ్ఞాపకాలలో ఉంచాలనుకుంటున్నాము, కాబట్టి మేము దానిని గౌరవప్రదంగా సమాధి చేస్తున్నాము.’’ అని రాసుకొచ్చారు.
పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. 20 మంది మృతి, పలువురికి గాయాలు
పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 20 మంది మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. క్షతగాత్రులందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఘటనా స్థలానికి బాంబు నిర్వీర్య దళాన్ని కూడా రప్పించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. క్వెట్టాలో రెండు బాంబు పేలుళ్లు జరిగినట్లు చెబుతున్నారు. ఒక పేలుడులో నలుగురు మరణించగా, రెండో పేలుడులో దాదాపు 15 మంది గాయపడ్డారు. ఈ బాంబు పేలుడు ఎవరు, ఎందుకు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ ప్రమాదం జరిగినప్పుడు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు, ఇక్కడ ఒక ప్యాసింజర్ రైలు రావాల్సి ఉన్నందున స్టేషన్ వద్ద చాలా రద్దీగా ఉంది. పేలుడు అనంతరం క్వెట్టా రైల్వే స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. భారీ బాంబు పేలుడు సంభవించినట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం ప్రకారం, జాఫర్ ఎక్స్‌ప్రెస్ భిండి వైపు వెళ్తుండగా భారీ పేలుడు సంభవించింది.
మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని ప్రభాస్ ఫోటో లీక్
మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నరుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. ఆ మధ్య టీజర్ రిలీజ్ సమయంలోను అదే విషయం ప్రకటించారు. కాగా ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ నంది పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు అందరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రభాస్ లుక్ పోస్టర్ ను మాత్రం రిలీజ్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆ మధ్య వచ్చిన కన్నప్ప టీజర్ లో ఫ్లాష్ కట్ లో ఓ షాట్ లో చూపించారు. తాజగా కన్నప్ప సినిమాకు సంబందించిన ప్రభాస్ ఫొటో ఒకటి లీక్ అయింది. లాంగ్ హెయిర్ తో శివ నామాలు పెట్టుకుని, మేడలో రుద్రక్షలు ధరించి, కాషాయ కండువా ధరించి చేతిలో ఆయుధం పూని వున్న ప్రభాస్ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. యూనిట్ కు చెందిన ఎవరో సెల్ ఫోన్ లో క్లిక్ మనిపించి ఎక్స్ లో పోస్ట్ చేసారు. మరి ఈ లీక్స్ పై మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి
శివకార్తికేయన్ లైనప్ చూస్తే మతిపోవాల్సిందే..
తమిళ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమాతో తొలిసారి రెండు వందల కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడుశివ కార్తికేయన్. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడు శివ. ఆ కష్టానికి తగిన గుర్తింపు అమరన్ సక్సెస్ రూపంలో వచ్చింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమలో సాయి పల్లవి, శివ కార్తికేయన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. కాగా అమరన్ సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న శివకార్తికేయన్ వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. శివ చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా స్టార్ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వంలో కేరీర్ లో 23వ సినిమా చేస్తున్నాడు శివ. ఈ సినిమా తర్వాత గతంలో తనతో డాన్ సినిమాను డైరెక్ట్ చేసిన సీబీ చక్రవర్తితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక కెరీర్ మైల్ స్టోన్ మూవీ 25వ సినిమాను లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో చేస్తున్నాడు. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. ఈ సినిమాకు ‘పురాణనూరు’ టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. ఈ మూడు సినిమాల తర్వాత విజయ్ తో గోట్ సినిమాను తెరకెక్కించిన వెంకట్ ప్రభు తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శివ. అలాగే పార్కింగ్ సినిమాతో ఆకట్టుకున్న రామ్ కుమార్, H. వినోద్, వినాయక్ చంద్రశేఖరన్ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ సినిమాలతో శివకార్తికేయన్ అగ్రనటుల రేస్ లో ఎంటర్ అవుతాడనే చెప్పాలి.