నకిలీ ఏసీబీ అధికారి కేసులో ఊహించని ట్విస్ట్.. తెరవెనుక కిలాడీ లేడీ ఖాకీ..!
విశాఖపట్నంలో నకిలీ ఏసీబీ అధికారి కలకలం సృష్టించాడు.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన బలగా సుధాకర్ చాలాకాలం కిందట విశాఖలోని ఆదర్శనగర్ పాత డెయిరీఫారం వద్ద నివాసం ఉంటుండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు.. ఇక, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ చక్రపాణిని కలిసి.. తాను ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌నని పరిచయం చేసుకుని.. మీ ఆఫీస్‌లో అవినీతిపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని, వాటిపై కేసు నమోదుచేయాల్సి ఉందంటూ బెదరించాడు.. అయితే, ఏసీబీ అధికారినంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేసిన అతడిని విశాఖ పీఎం పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే, నకిలీ ఏసీబీ అధికారి కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి.. నకిలీ ఏసీబీ అధికారి కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. నకిలీ ఏసీబీ వెనుక కిలాడీ లేడీ ఖాకీ ఉన్నట్టుగా చెబుతన్నారు అధికారులు.. ఆ కిలాడీ లేడీ ఖాకీ ఎవరో కాదు.. గతంలో నోట్ల మార్పిడి కేసులో సంచలనంగా మారిన రిజర్వుడు ఇన్స్పెక్టర్ స్వర్ణలత.. ఈ ఘటనతో లేడీ పోలీస్ స్వర్ణలత తన తీరు మార్చుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.. సస్పెండ్ అయ్యి జైలుకి వెళ్లొచ్చినా ఆమె వ్యవహార శైలిలో మార్పురాలేదట.. నోట్ల మార్పిడి కేసులో గతంలో సంచలనంగా మారిన స్వర్ణలత పేరు మరోసారి తెర పైకి వచ్చింది..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. వారికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఏపీ లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు.. అయితే, వారికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ధర్మాసనం.. దీంతో, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్పలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. ఇక, ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో తక్షణ ఊరట ఇవ్వడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది.. మరోవైపు, అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరగా.. మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది ధర్మాసనం.. ఇక, కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.. కాగా, మద్యం కేసులో ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం విదితమే.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. ఆ పిటిషన్లను కొట్టేసింది. అంతే కాదు.. ఈ కేసులో అన్ని వివరాలు బయటకు రావాలంటే పిటిషనర్లను అదుపులోకి తీసుకొని విచారించాల్సిందేనని స్పష్టం చేసింది.. దీంతో, నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా వారికి షాక్ తగిలినట్టు అయ్యింది..
కీలక అజెండాతో కేబినెట్ భేటీ.. ముగ్గురు మంత్రులు డుమ్మా..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అయ్యింది.. మొత్తం 31 అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది.. ఈ సమావేశంలో రాజధాని అమరావతి చట్టబద్ధతపై ప్రత్యేక చర్చ సాగుతోంది.. విభజన చట్టంలో రాజధాని అనే అంశం దగ్గర అమరావతి అని ఉండేలా కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్.. దీనిపై కేబినెట్‌లో చర్చించి కేంద్రానికి పంపే ఆలోచనలో ఉంది.. అయితే, ఈ రోజు ఏపీ కేబినెట్‌కు ముగ్గురు మంత్రులు దూరంగా ఉన్నారు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం వివిధ కార్యక్రమాల్లో ఉండడం వల్ల మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్.. ఈ రోజు కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు.. తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్నందున.. కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నారు నారా లోకేష్.. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి భూమి పూజ చేశారు మంత్రి నారా లోకేష్.. రూ.5,001 కోట్ల పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటు చేయబోతోంది.. దీని ద్వారా 2 వేల మంది వరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రానుండగా.. మరో రూ.839 కోట్లతో ఐదు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయనుంది ఎల్జీ ఎలక్ట్రానిక్స్.. మరోవైపు.. విదేశీ పర్యటనలో ఉన్నందున మంత్రి సత్యకుమార్ యాదవ్.. కేబినెట్ భేటీకి హాజరుకాలేకపోయారు.. ఇక, సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఉరవకొండలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఇవాళ్టి కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నారు..
‘‘ఎవరైనా భారత్ వ్యతిరేక ప్రచారం చేశారో..’’ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..
ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కొన్ని శక్తులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సోషల్, డిజిటల్ వేదికలపై దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘాను తీవ్రతరం చేయాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించిందని సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేసింది. దీని తర్వాత పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్న తరుణంలో రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సలహా ఇచ్చింది. ఆపరేషన్ గురించి లేదా భారత దేశ భద్రతా పరిస్థితి గురించి నకిలీ కథనాలు వ్యాప్తి చేసే సోషల్ మీడియా అకౌంట్లపై కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని కోరింది. దేశంలో లేదా విదేశాల నుంచి ఎక్కడనుంచైనా భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది.
సరిహద్దు గ్రామాలు ఖాళీ.. ఊళ్లను విడుస్తున్న జనాలు
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనంతరం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద పాకిస్తాన్ సైన్యం బుధవారం చేసిన ఘనమైన దాడులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో 15 మంది పౌరులు మరణించగా, 43 మంది గాయపడ్డారు. ధ్వంసమైన ఇళ్లు, పగిలిన దుకాణాలు, దగ్ధమైన వాహనాలు, రక్తపు మరకలు, శిథిలాలతో సరిహద్దు గ్రామాలు భయానకంగా మారిపోయాయి. ఆలయాలు, స్కూళ్లు, మసీదులపై కూడా పాకిస్తాన్ సైన్యం షెల్లింగ్ చేసి దాడి చేసింది. గురువారం కూడా కాల్పులు కొనసాగించగా, బుధవారంతో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. పూంచ్ పట్టణంలో నివసించే స్థానిక ఎమ్మెల్యే అజాజ్ జాన్ మాట్లాడుతూ.. “పాకిస్తాన్ సైన్యం భారీ ఫిరంగి దాడులకు పాల్పడటంతో మొత్తం పట్టణం యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. సుమారు ఆరు గంటల పాటు పూంచ్ పట్టణంపై తీవ్రస్థాయిలో ఫిరంగి దాడులు జరిగాయి. వందలాది షెల్స్ పట్టణంలో పడ్డాయి. ఆ భయాన్ని, దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు లేవు. మా ప్రైవేటు పాఠశాలలు, దేవాలయాలు, మసీదులు, మదర్సాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ లైన్స్, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్‌లు అన్నీ దాడులకు గురయ్యాయి.” అని వెల్లడించారు
‘‘పాకిస్తాన్‌పై దాడి చేసే హక్కు భారత్‌కి ఉంది’’.. బ్రిటీష్ ఎంపీ మద్దతు..
‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో 100 మంది వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత చర్యని పలు దేశాలు సమర్థిస్తున్నాయి. తాజాగా, బ్రిటీష్ ఎంపీ ప్రీతి పటేల్ భారత్‌కి మద్దతు ప్రకటించారు. భారతదేశంతో కలిసి ఉగ్రవాద నిరోధక సహకారాన్ని బలోపేతం చేయాలని యూఎస్ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడారు. పాకిస్తాన్ నుంచి సరిహద్దు ఉగ్రవాద ముప్పుని గుర్తించాలని యూకేని కోరారు. ‘‘ ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పహల్గామ్ లో 26 మంది పర్యాటకుల్ని క్రూరంగా హత్య చేశారు. ఇది అనాగరికమైన, క్రూరమైన హింసాత్మక చర్య. చాలా మంది బాధితులను తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలపై కాల్చి చంపారు. ఈ ఘటనతో ప్రభావితమైన వారితో నా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి’’ అని ఆమె అన్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలంటూనే, పాక్ ఆధారిత ఉగ్రవాద గ్రూపుల నుంచి ఎదుర్కొంటున్న ముప్పుని యూకే గుర్తించాలని ప్రతీ పటేల్ అన్నారు.
రూ. 20 కోట్ల క్లబ్ లో చిన్న సినిమా
ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ ప్రజెంట్ హాట్ టాక్ ఆఫ్ ది కోలీవుడ్డే కాదు టాలీవుడ్‌గా మారింది టూరిస్ట్ ఫ్యామిలీ. సీనియర్ హీరో శశి కుమార్, సీనియర్ నటి సిమ్రాన్ లీడ్ రోల్స్ వచ్చిన ఈ సినిమా శ్రీలంక నుండి శరణార్థి కుటుంబం చెన్నైకి చేరుకున్నాక ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా చేసుకుని తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా జస్ట్ మౌత్ టాక్‌తో దూసుకెళుతోంది. పాన్ ఇండియా సినిమా కాదు, భారీ బడ్జెట్ చిత్రం అంతకన్నా కాదు, పెద్ద స్టార్స్ లేరు కానీ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. పోటీలో కార్తిక్ సుబ్బరాజ్, సూర్య కాంబోలో వచ్చిన రెట్రో ఉన్న కూడా ఎక్కడా తగ్గకుండా ఆ సినిమాను మించి దూసుకెళ్తోంది టూరిస్ట్ ఫ్యామిలీ. కాగా ఈ సినిమా లేటెస్ట్ గా మరో మైల్ స్టోన్ మార్క్ ను అందుకుంది. కేవలం తమిళనాడు వ్యాప్తంగా మే 1రిలీజ్ అయిన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తు వారం రోజుల్లోనే రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అటు బుక్ మై షో టికెట్స్ పరంగా ను అదరగొడుతూ 500K టికెట్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ గా రెండవ వారంలో అడుగుపెట్టిన ఈ సినిమాకు అదనంగా మరో 85 థియేటర్స్ ను కేటాయించారు. ఈ వారం మారె ఇతర సినిమాలు లేకుండడంతో సాలిడ్ కల్కేక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.
‘శుభం’ మూవీలో నటించడానికి కారణం ఇదే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. తాజాగా నిర్మాతగా మారిన సామ్ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శుభం’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మూవీ టీం తో కలిసి సామ్ వరుస ప్రమోషన్స్ చేస్తుంది. ఏ చిన్న ఈవెంట్‌ని కూడా వదలడం లేదు. ఇక ఈ ‘శుభం’ మూవీలో సమంత కూడా అతిథి పాత్రలో నటింన విషయం తెలిసిందే. అయితే ఆమె నటించడానికి బలమైన కారణం ఉందట. రీసెంట్‌గా మీడియాతో ముచ్చటించిన సామంత ఈ విషయం గురించి చెప్పుకోచ్చింది.. ‘నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పని చేస్తున్నారు. ‘శుభం’ చిత్రం చాలా బాగా వచ్చింది. కెరీర్ మొదలు పెట్టి దాదాపు 15 ఏళ్లు అయింది. నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించాను. ఎలాంటి హడావుడి లేకుండా సినిమాను ప్రారంభించాం 8 నెలల్లో పూర్తి చేశాం. ఇక నేను ‘శుభం’ లో అతిథి పాత్ర పోషించాల్సింది కాదు. కానీ నిర్మాతగా నా తొలి చిత్రం కోసం నేను ఎవరినీ సాయం అడగాలనుకోలేదు. అందుకే నేనే నటించాను. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా నా మీద ఉంది. రిలీజ్ వరకు మాత్రమే ప్రచారం చేస్తాను. తర్వాత సినిమా పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది సమంత.