సచివాలయంలో వైసీపీ కోవర్టులు..! ప్రక్షాళన చేపట్టిన సీఎస్.. వారికి స్థాన చలనం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వివిధ శాఖల్లో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ముఖ్య శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న వారిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి నీరబ్ కుమార్ ప్రసాద్.. అయితే, సచివాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారని.. ఎప్పటికప్పుడు సచివాలయంలో జరుగుతోన్న పరిణామాలను వైసీపీకి చేరవేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన గత కేబినెట్ సమావేశంలోనూ చర్చ సాగింది.. సచివాలయంలో ఉన్న వైసీపీ కోవర్టుల సంగతి చూడాలంటూ కేబినెట్ సమావేశంలో సీఎస్ నీరబ్ కుమార్‌ను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. దీంతో.. చర్యలకు దిగిన సీఎస్.. వివిధ శాఖల్లో ఏఎస్, డీఎస్, జేఎస్‌లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రీ-షఫుల్ చేశారు.. మొత్తంగా 13 మంది సచివాలయ ఉద్యోగులకు స్థాన చలనం కలిగింది.. ఇక, ఆ 13 మందిలో ఆరుగురిని జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి నీరబ్ కుమార్ ప్రసాద్.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. సీఎం చంద్రబాబు పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఈ రోజు కర్నూలు జిల్లా ఓర్వకల్ లో చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. వాతావరణంలో మార్పులు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆ టూర్‌ను క్యాన్సిల్ చేశారు.. ఇక, ముందు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు చేశారు అధికారులు.. అయితే, ఆ తర్వాత రద్దు చేసి ఓర్వకల్ లో పర్యటన ఖరారు చేశారు. ఇప్పుడు వర్షం కారణంగా ఓర్వకల్ పర్యటన కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామునే పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయ్యింది.. ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు.. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో ఈ పెన్షన్ల పంపిణీలో పాల్గొనాల్సి ఉంది.. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ పర్యటన రద్దు అయ్యింది. అయితే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రతీ నెల 4 వేల రూపాయల చొప్పున పెన్షన్లు పంపిణీ చేస్తోంది.. ఇక, సీఎం చంద్రబాబు.. ప్రతీ నెల పెన్షన్ల పంపిణీలో పాల్గొంటోన్న విషయం విదితమే.. మరోవైపు.. ఈ నెల ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే.
వర్ష బీభత్సం.. విజయవాడలో విరిగిపడిన కొండచరియలు.. ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇక, విజయవాడలోనూ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది.. దీంతో.. వీజయవాడ సున్నపు బట్టీల సెంటర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి… ఈ ఘటనలో ఓ ఇల్లు కూలిపోయింది.. నలుగురురికి తీవ్రగాయాలు అయినట్టు చెబుతున్నారు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని రెండు చోట్ల ఇళ్లు కూలాయి.. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు సిబ్బంది.. శిథిలాల్లో తొమ్మిది మంది చిక్కుకోగా.. వారిని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.. అయితే, వారిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.. శిథిలాల నుంచి ఆరుగురును వెంటనే వెలికి తీశారు స్థానికులు.. సహాయక సిబ్బంది.. మరిన్ని శిథిలాలను తొలగించి మరొక వృద్ధురాలిని బయటకు తీశారు.. బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.. బయటకు వచ్చిన ఏడుగురిలో ఒకరు మృతి చెందారని సిబ్బంది చెబుతున్నారు.
భారీ వర్షాలు.. సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు..
ఆంధ్రప్రదేశ్‌లో ఒకరోజు ముందుగానే పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీని చేపట్టింది ప్రభుత్వం.. ఇంటి వద్దుకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అధికారులు.. అయితే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు ఉద్యోగులు.. ఇక, భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చు అన్నారు సీఎం.. పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని.. టార్గెట్లు పెట్టవద్దని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. అయితే, వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మరో 3 రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.. మరో మూడు రోజుల కూడా భారీ వర్షలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు ప్రభుత్వం అప్రమత్తం అయ్యాంది.. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా వర్షాలపై పరిస్థితిని సమీక్షించారు సీఎం చంద్రబాబు.. ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.. అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని.. పూర్తి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు..
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట కు టెంపుల్ బోర్డు..
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. యాదగిరిగుట్ట బోర్డుకు టీటీడీ తరహాలో స్వయంప్రతిపత్తి, విధివిధానాలు ఉండేలా అవసరమైతే చట్టాన్ని సవరించాలన్నారు. యాదగిరిగుట్ట రాజగోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. అలా ఆపలేరని, కొనసాగించక తప్పదని స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో ఇప్పటివరకు ఏయే అభివృద్ధి పనులు జరిగాయి, అసంపూర్తిగా ఉన్న వాటిపై సమగ్ర నివేదికను వారం రోజుల్లో అందించాలని సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యాలు, కాటేజీల నిర్మాణానికి దాతలు, కార్పొరేట్ సంస్థలను తీసుకెళ్లాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాదగిరిగుట్టను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాన్ని రామప్పగుడి ఆకారంలో అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ వెలుపల దాదాపు వెయ్యి ఎకరాల్లో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకురావాలని చెప్పారు. అనంత్ అంబానీ జామ్‌నగర్‌లో 3000 ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని సీఎం ప్రస్తావించారు. ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు.
జుమ్మా బ్రేక్పై ఎన్డీయేలో చీలికలు.. ప్రభుత్వంపై జేడీయూ ఫైర్..!
అస్సాం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ప్రతి మత విశ్వాసానికి దాని సంప్రదాయాలను కాపాడుకునే హక్కులను కాలే రాసే విధంగా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో జుమ్మా ప్రార్థనల కోసం 2 గంటల వాయిదా పద్ధతిని రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) నాయకుడు నీరజ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. మత విశ్వాసాలపై దాడి చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. పేదరికం నుంచి పైకి లేవడంపై అస్సాం సీఎం మరింత దృష్టి పెడితే బాగుంటుందని ఆయన అన్నారు. రంజాన్ సందర్భంగా శుక్రవారం సెలవులపై నిషేధం విధిస్తున్నారు.. కానీ హిందూ సంప్రదాయంలో మా కామాఖ్య దేవాలయం దగ్గర కొనసాగుతున్న బలి ఆచారంపై నిషేధం విధించగలరా? అని నీరజ్ కుమార్ ప్రశ్నించారు. కాగా, మత విశ్వాసాలపై దాడి చేసే హక్కు ఎవరికీ లేదు.. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న ప్రజలను పైకి తీసుకురావడంతో పాటు అస్సాం వరదలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చూసుకోవడంపై మీరు మీ దృష్టిని కేంద్రీకరిస్తే బాగుండేది అని జేడీయూ నేత నీరజ్ కుమార్ అన్నారు. అస్సాంలో సాదులా యొక్క ముస్లిం లీగ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి శుక్రవారం జుమ్మా ప్రార్థనల కోసం రెండు గంటల వాయిదా పద్ధతిని సీఎం హిమంత్ బిస్వాశర్మ నిలిపి వేయడం దారుణమన్నారు.
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు నెలకు రూ.8లక్షలు.. సర్కార్ ఆలోచన
ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీ-2024ని అమలు చేయాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 27న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం తెలిపింది. డిజిటల్ మీడియా హ్యాండిల్/డిజిటల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అడ్వర్టైజింగ్ గుర్తింపును ఎలా పొందుతారనే దానికి సంబంధించిన ప్రక్రియ, మార్గదర్శకాలు ఆగస్టు 28న విడుదల చేశారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన విధానాలు, కార్యక్రమాలను సామాన్య ప్రజలకు షేర్ చేసే డిజిటల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ప్రభుత్వం రూ.8 లక్షల వరకు ప్రకటన రూపంలో చెల్లిస్తుంది. కొత్త సోషల్ మీడియా విధానం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ మీడియా హ్యాండిల్స్, పేజీలు, ఛానెల్‌లు, ఖాతాదారులు, ఆపరేటర్లు, డిజిటల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కంటెంట్ రైటర్‌లు లేదా వారితో అనుబంధించబడిన ఏజెన్సీలు/సంస్థలు రాష్ట్రం లోపల, వెలుపల నిర్వహిస్తున్నారు. డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాల గురించి సమాచారాన్ని అందించే వారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనల సమాచార, ప్రజా సంబంధాల విభాగానికి లింక్ చేయబడతారు. తర్వాత వాటిని డిపార్ట్‌మెంట్‌లో లిస్ట్ చేసి నిబంధనల ప్రకారం ప్రచారం చేస్తారు.
కంగనా రనౌత్‌కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు..
భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈరోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులపై కంగనా చేసిన వ్యాఖ్యలను రాబర్ట్ ఈ సందర్భంగా మండిపడ్డారు. కంగనా రనౌత్ ఒక మహిళ కాబట్టి నేను ఆమెను గౌరవిస్తాను.. కానీ, ఆమెకు పార్లమెంటులో ఉండే అర్హత లేదని భావిస్తున్నాను అని అన్నారు. ఆమె చదువుకోలేదు, ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో ఆమె లేదని నేను అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఎంపీ కంగనా మహిళల గురించి ఆలోచించాలి అన్నారు. మహిళల భద్రత విషయంలో దేశమంతా ఒక్కతాటిపైకి రావాలన్నదే నా విజ్ఞప్తి.. మహిళల భద్రత అత్యంత కీలకమైన అంశంగా అభివర్ణించారు.. దాన్ని పరిష్కరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని రాబర్ట్ వాద్రా సూచించారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీ రనౌత్ సోమవారం ఒక ఇంటర్వ్యూ క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలపై కంగనా మాట్లాడుతూ.. భారతదేశంలో “బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి” తలెత్తవచ్చు.. కానీ భారత్ లో బలమైన ప్రభుత్వం ఉండటం వల్ల అలా జరగలేదని వ్యాఖ్యనించింది. రైతుల ఆందోళనలో మృతదేహాలు వేలాడుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ “కుట్ర”లో చైనా, యునైటెడ్ స్టేట్స్ ప్రమేయం ఉందని కూడా కంగనా రనౌత్ ఆరోపించారు. ఈ కామెంట్స్ పై ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు తీవ్ర స్థాయిలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై విమర్శలు గుప్పించాయి.
పాపం సూర్యకుమార్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది!
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ బరిలోకి దిగిన సూర్య గాయం బారిన పడ్డాడు. శుక్రవారం తమిళనాడుతో మ్యాచ్ సందర్భంగా అతడి చేతికి గాయమైంది. దాంతో దులిప్ ట్రోఫీకి మిస్టర్ 360 దూరమయ్యే అవకాశం ఉంది. బంగ్లాతో టెస్టు సిరీస్ సమయానికి సూర్య అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. 2023 ఫిబ్రవరిలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ద్వారా సూర్యకుమార్ యాదవ్ భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆపై అతడికి మళ్లీ టెస్టు జట్టులో స్థానం దక్కలేదు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలని భావించిన సూర్య.. ముంబై తరఫున బుచ్చిబాబు టోర్నీలో బరిలోకి దిగాడు. తమిళనాడు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన సూర్య.. అనంతరం ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దాంతో ఇప్పుడు దులిప్ ట్రోఫీలో పాల్గొనడంపై సందిగ్దం నెలకొంది.
ఆ ఆలోచన సరికాదు.. భారత పిచ్‌లపై హర్భజన్ సింగ్ అసహనం!
భారత పిచ్‌లపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. మనం గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదని, కేవలం మూడు రోజుల్లోపే మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలనే ఆలోచన మాత్రం సరికాదన్నారు. తొలి రోజు నుంచే స్పిన్ పిచ్‌లను రూపొందించడం వల్ల బ్యాటర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందన్నారు. పేస్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లను తయారుచేసి ఆడితే బాగుంటుందని హర్భజన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 19 నుంచి భారత్ వేదికగా బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో పేస్‌తో పాటు స్పిన్ పిచ్‌లను తయారు చేయాలని కోరారు. హర్భజన్ సింగ్ తాజాగా స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడుతూ… ‘మనం టర్నింగ్ ఎక్కువగా ఉండే పిచ్‌లు తయారు చేసి ఆడుతున్నాం. భారత జట్టు గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ కేవలం మూడు రోజుల్లోపే మ్యాచ్‌ను ముగించాలనే ఆలోచన సరికాదు. సాధారణంగా నాలుగో రోజు నుంచి స్పిన్‌కు పిచ్‌లు అనుకూలంగా మారతాయి. ఆ లోపు బ్యాటర్లు పరుగులు చేసేందుకు సమయం ఉంటుంది. ఇప్పుడైతే తొలి రోజు నుంచే స్పిన్ తిరుగుతోంది. దాంతో బ్యాటర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. స్పిన్ పిచ్‌లపై ఏ బ్యాటర్ అయినా సులువుగానే ఔట్ అవుతారు’ అని అన్నారు.
సెప్టెంబరు 5న ముహూర్తానికి నేచురల్ స్టార్ రెడీ.. దర్శకుడు ఇతనే..
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రిలీజైన సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దసరా, హాయ్ నాన్న తాజగా సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హీరోగా పేరుతెచ్చకున్నాడు నాని. నాచురల్ స్టార్ సీనిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు సంపాదించాడు ఈ కుర్ర హీరో. ‘సరిపోదా శనివారం’ సినిమా నుండి బయటకు వచ్చాడు నాని. సో ఇక నాని నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాని తన నెక్ట్స్ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు అందుతున్నాయి. నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో HIT ఫ్రాంచైజ్ తీసుకువచ్చాడు. మొదటి పార్ట్ లో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించగా, రెండవ పార్ట్ లో అడివి శేష్ నటించాడు. మొదటి రెండు భాగాలు హిట్ కావడంతో హిట్ 3ని నిర్మించనున్నారు.ఈ దఫా పోలీస్ క్యారక్టర్ లో నాచురల్ స్టార్ నాని నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన పూజ కార్యక్రమాలను సెప్టెంబరు 5న మొదలు పెట్టనున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. మరోవైపు నాని నిర్మాతగా వాల్ పోస్టర్ బ్యానర్ లో మరో సినిమా స్టార్ట్ చేసాడు. బలగం చిత్రంతో నటుడిగా ఆకట్టుకున్న ప్రియదర్శి హీరోగా కోర్ట్ ‘స్టేట్ vs ఏ నోబడి’ అనే చిత్రాన్ని స్టార్ట్ చేసాడు. ఇటు హీరోగా అటు నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నాడు నేచురల్ స్టార్.