మున్సిపాలిటీల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్.. మంత్రి నారాయణ సమీక్ష
ఎండలు దంచికొడుతున్నాయి.. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. దీంతో, సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. మున్సిపాలిటీల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై మంత్రి నారాయణ దృష్టిసారించారు.. తాగు నీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ.. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మరియన్న తదితరులు పాల్గొన్నారు.. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు.. తాగు నీరు సరఫరాలో ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.. వారంలో మూడు సార్లు డ్రింకింగ్ వాటర్ సరఫరాపై సమీక్ష చేస్తానని వెల్లడించారు మంత్రి నారాయణ.. శివారు ప్రాంతాలకు కూడా అవసరమైన మేర డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. పారిశుధ్యం పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.. చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ..
మాజీ మంత్రి విడదల రజినిపై మరో ఫిర్యాదు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నే త, మాజీ మంత్రి విడదల రజినిపై మరో ఫిర్యాదు పోలీసులకు అందించింది.. గత ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించారని.. వారి నుంచి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగాలు రావడంతో.. ఇప్పటికే మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో, ఐపీఎస్ పల్లె జాషువా, విడదల రజిని మరిది విడదల గోపి, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణలపై కేసు నమోదైన విషయం విదితమే కాగా.. ఇప్పుడు, విడదల రజిని, ఆమె మరిది విడదల గోపీపై ఎస్పీకి మరో ఫిర్యాదు అందింది.. ఇద్దరిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు చిలకలూరిపేటకి చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం.. 2022 ఏప్రిల్ లో రజిని అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.. వంద మంది వచ్చి తనపై దాడి చేసి, ఇంట్లో ఫర్నిచర్, కారుని ధ్వంసం చేశారన్న ఆయన.. మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించి, తనని, తన కుటుంబాన్ని మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు.. అయితే, అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా నామమాత్రంగా కేసు కట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు.. రజిని, ఆమె మరిది గోపి పేర్లు FIR లో చేర్చి.. తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు బాధితుడు సుబ్రమణ్యం.
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం.. ఆ రెండు కోణాల్లో విచారణ..
హైదరాబాద్ నుంచి వెళ్లిన ఓ పాస్టర్ రాజమండ్రి శివార్లలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద బుల్లెట్ పై వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ మృతి పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రవీణ్ మరణం ప్రమాదమా? హత్యా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టి.. ఆధారాల సేకరణలో నాలుగు పోలీసు బృందాలు నిమగ్నమయ్యాయి. మరో రెండు రోజుల్లో పోస్టుమార్టం నివేదిక వస్తే పాస్టర్ మృతిపై స్పష్టత రానుంది. అన్ని కోణాల్లోనూ ఈ కేసు సమగ్ర దర్యాప్తు జరుగుతుందంటున్నారు పోలీసులు..
వల్లభనేని వంశీకి మళ్లీ షాక్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్‌ను మరోసారి పొడిగించింది కోర్టు.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి రిమాండ్‌ను ఏప్రిల్ 9వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ్టితో ముగిసింది వల్లభనేని వంశీ రిమాండ్.. దీంతో, జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీని కోర్టుకు తీసుకెళ్లారు గన్నవరం పోలీసులు. మరోవైపు.. వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువరించనుంది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం.. దీంతో, అసలు వంశీకి బెయిల్ వస్తుందా? మరోసారి షాక్ తప్పదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురువారం రోజు సీఐడీ కోర్టు డిస్మిస్ చేసిన విషయం విదితమే కాగా.. మరోవైపు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ.. ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ వేసిన పిటిషన్‌పై నేడు తీర్పు రానుంది.. ఇక, సత్యవర్ధన్ ను బెదిరించడం, కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. దీంతో, వంశీకి ఈసారైనా బెయిల్ వస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.
నేడు తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరుగుతుంది. దీని ప్రభావంతో వడ గాలుల వీస్తున్నాయి. ఇక, నేడు తెలంగాణలోని 15 జిల్లాలకు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంగా 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటి పోతున్నాయి. నేటి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే, ఉత్తర తెలంగాణలోని పలు జిలాల్లో 45 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది.
బడ్జెట్కి డబ్బులు లేవు.. వాగ్దానాలు విపరీతంగా చేశారు.. వాటిని నెరవేర్చడానికి తిప్పలు
తెలగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి చాలా బాగా నిర్వహించారు అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాలకు నేను లేకపోయినా.. నాకు చాలా మంది ప్రజాప్రతినిధులు చెప్పారు.. అసలు మాట్లాడించేవారు కాదని.. ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే మార్షల్స్ కి పని చెప్పే వారని విన్నాను.. ఇక, బడ్జెట్ లో సామాన్యులకు ఏ ప్రభుత్వం న్యాయం చెయ్యడం లేదు.. అప్పులు ఎక్కువగా ఉన్నాయి.. హామీలు ఎక్కువగా ఉన్నాయి.. బడ్జెట్ కి డబ్బులు లేవు.. వాగ్దానాలు విపరీతంగా చేశారు.. వాటిని నెరవేర్చడానికి తిప్పలు పడుతున్నారు అని ప్రభుత్వంపై సెటైర్లు వేశారు ఆయన. అయితే, హామీలను నెరవేర్చడం కోసం ప్రిపేర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది.. రుణమాఫీలో టెక్నికల్ కారణాల వల్ల చాలా మందికి రాలేదు.. జిల్లాల్లో కొన్ని ఏరియాలో చాలా తక్కువ మందికి రుణమాఫీ జరగలేదు.. పెన్షన్, మహిళలకు 2500, ఆడ పిల్లలకు తులం బంగారం, ఇవన్నీ నెరవేర్చాలి.. బడ్జెట్ పెట్టిన దాంట్లో పూర్తి స్థాయిలో ఖర్చు చేసి అన్ని అమలు చేసేవిధంగా చూడాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. అయితే, పెట్టిన ప్రతి రూపాయినీ ఖర్చు పెట్టాలి అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. కొన్ని పద్దుల చుట్టూ మాత్రమే తిరుగుతున్నారు.. దాదాపుగా రెండు కోట్ల మందికి కనీస వేతనం అందించాల్సి ఉంటుంది.. అంగన్వాడీలు, ఆశా వర్కర్ల, సింగరేణి, ఆర్టీసీ, వ్యవసాయ కూలీలు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, లేబర్ డిపార్ట్మెంట్ లో పని చేసే వారు.. ఇలా ప్రతి ఒక్క విభాగంలో పని చేసే వారికి కనీస వేతనం ఉండేలా చూడాలన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులపై పోరాడాల్సిందే.. అందరం కలిసి పోరాటం చేద్దాం.. అసలు అంశాలు చర్చకు రాకుండా తిట్టుకోవడం ఏంటి? అని ప్రశ్నించారు. అప్పులు చేశావు కాబట్టి నీదే బాధ్యత అంటే కుదరదు.. వాళ్ళ టైమ్ అయిపోయింది..ఇక మీరు ఏం చేస్తున్నారు.. దానిమీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. గతంలో కూడా చంద్రబాబు టూరిజంపై ప్రాధాన్యత ఇచ్చారు.. ఇప్పుడు ప్రభుత్వం టూరిజం పైనా దృష్టి పెట్టాలి.. ప్రాధాన్యత ఇవ్వండి అన్నాను.. కావాలని నా వాఖ్యలను వక్రీకరించారు.. అది మంచిది కాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
ప్రజా ధనం దుర్వినియోగంపై కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్
ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాలపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కేజ్రీవాల్ సహా ఇతరులపై ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లుగా రౌస్ అవెన్యూ కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 18కు ధర్మాసనం వాయిదా వేసింది. కేజ్రీవాల్, ఇతరులపై అధికారిక ఫిర్యాదు తర్వాత దర్యాప్తు ప్రారంభించినట్లు రాష్ట్ర పోలీసులు కోర్టుకు సమాచారాన్ని తెలియజేశారు. రాజధాని అంతటా పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రజా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్ సహా ఇతరులపై కేసులు నమోదు చేయాలని మార్చి 11న కోర్టు పోలీసులకు ఆదేశాలిచ్చింది. 156(3) Cr.PC సెక్షన్ కింద దరఖాస్తు అనుమతికి అర్హమైనదని కోర్టు పరిగణనలోనికి తీసుకుంది. దీంతో ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డెఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 2007లోని సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేహా మిట్టల్ తన తీర్పులో పేర్కొన్నారు.
రేపే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. సమయం, వివరాలు ఇవే..
తెలుగు నెలలో చివరి మాసం ఫాల్గుణ మాసం. కాబట్టి ఈ ఏడాది చివరి అమావాస్య ఈ నెల 29న రానుంది. మార్చి 29న(రేపు) సంభవించనుంది. ఈ గ్రహణం మీన రాశిలో సంభవిస్తుంది. కానీ.. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఈ ఏడాది మొదటి పాక్షిక సూర్యగ్రహణం యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, బార్బడోస్, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, బెర్ముడా, ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్లాండ్, హాలండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, ఉత్తర రష్యా, స్పెయిన్, మొరాకో, ఉక్రెయిన్, ఉత్తర అమెరికా తూర్పు ప్రాంతాలు, ఇంగ్లాండ్ మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే.. భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. ఇది పాల్గుణ మాసం కృష్ణ పక్ష అమావాస్య రోజున సంభవించే పాక్షిక సూర్యగ్రహణం. గ్రహణం సందర్భంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణకాలంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు గ్రహణకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమేనా! అని అందరికీ సందేహాలు వస్తుంటాయి. మన దేశంలో కనిపించదు కాబట్టి సూత కాలం అంటూ మనకు ఏమీ ఉండదు. ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మగువలకు వరుస షాక్‌లు.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!
ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మరలా వరుసగా షాక్‌లు ఇస్తున్నాయి. గత 5-6 రోజలుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.440 పెరగగా.. నేడు రూ.1,140 పెరిగింది. నేడు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.83,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,980గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న వెండి.. నేడు రూ.3000 పెరిగింది. శుక్రవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1, 05,000గా ఉంది.
సన్నీడియోల్ దెబ్బకి సైడవుతున్న బాలీవుడ్ సినిమాలు..
ఐపీఎల్ ఎఫెక్టో, మరో ఇతర కారణాలో తెలియదు కానీ బాలీవుడ్ సినిమాలు కొన్ని వాయిదా పడ్డాయి. అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బీ, వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ పిక్చర్ సన్నీ సంస్కారీకి తులసి కుమారీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయింది భూల్ చుక్ మాఫ్. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్‌ను సెన్సేషనల్ నిర్మాత సంస్థ మెడాక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ ఫస్ట్ టైం జోడీ కడుతుండగా తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాను ఇపుడు మే9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. వచ్చే నెల 10నే సన్నీడియోల్ భారీ బడ్జెట్ చిత్రం జాట్ రిలీజ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంటరవుతున్నాయి. కాగా, ఇప్పుడు జాట్ మూవీ కోసమే భూల్ చుక్ మాఫ్ పోస్ట్ పోన్ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నతొలి బాలీవుడ్ సినిమా జాట్. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాలు సన్నీ డియోల్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగులోను ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న జాట్ కు పోటీగా రావడం రిస్క్ అని భావించి చాలా సినిమాలు సైడ్ అవుతున్నాయని టాక్ ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మజాకా.. ఎక్కడ చూడాలంటే.?
సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా వచ్చిన ఈ సినిమా. ఫిబ్రవరి 26న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. సందీప్ కిషన్, రావు రమేష్ ల కామెడీ నవ్వులు పూయించింది. నవ్వుల బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయింది. ఉగాది కానుకగా నేటి నుండి మజాకాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. థియేటర్ రిలీజ్ అయి నాలుగు వారాలు కావంటంతో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచింది. ఈ నెల 28న అనగా నేటి నుండి మజాకా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వీకెండ్ కు సరదాగా ఫ్యామిలీతో కలిసి నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకాను చూసి ఈ ఉగాదికి అందరూ ఎంజాయ్ చేయండి.