విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఒకరిని కాపాడబోయి ఒకరు..!
విజయవాడలో ఘోరం జరిగింది.. స్థానికంగా నారా చంద్రబాబు నాయుడు కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు విడిచారు.. నారా చంద్రబాబు నాయుడు కాలనీలో రాజమండ్రికి చెందిన ఓ కుటుంబం నివాసం ఉంటుంది.. అయితే, విద్యుత్ షాక్‌తో ఒక్కే కుటంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు.. వరుసగా ముగ్గురు మృతిచెందారు.. ఒకరిని కాపాడబోయి ఒకరు.. ఇలా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.. మృతుల్లో ప్రసాద్ (61), ఆయన భార్య హేమ వాణి (54), చెల్లెలు ముత్యావల్లి (55)గా గుర్తించారు పోలీసులు.. బాధితుడు ప్రసాద్ లారీ డ్రైవర్‌గా పని చేస్తాడు.. ఘటన ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో చోటు చేసుకుంది.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు.. కాలనీలో విషాదఛాయలు అలుముకోగా.. శోక సంద్రంలో ఆ కుటుంబ సభ్యులు మునిగిపోయారు..
వల్లభనేని వంశీ రెండో రోజుల కస్టడీ పూర్తి.. మరోసారి అస్వస్థత..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రెండు రోజుల కస్టడీ పూర్తి అయ్యింది.. రెండు రోజుల పాటు నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీని ప్రశ్నించారు కంకిపాడు పోలీసులు.. నకిలీ పట్టాల వ్యవహారంపై వంశీ నుంచి వివరాలు సేకరించారు.. అయితే, రాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్న వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడం.. ఆస్పత్రికి తరలించడం.. ఆ తర్వాత మళ్లీ పీఎస్‌కు తీసుకొచ్చి ప్రశ్నించడం జరగగా.. మరోసారి అస్వస్థతకు గురయ్యారు వల్లభనేని వంశీ.. ఇక, రెండు రోజుల కస్టడీ కూడా పూర్తి కావడంతో.. కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి వంశీని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు కంకిపాడు పోలీసులు.. వల్లభనేని వంశీకి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత తిరిగి విజయవాడ సబ్ జైలుకు తరలించనున్నారు పోలీసులు..
పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ సమయంలోనే బంద్ ఎందుకు..?
జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రికందుల దుర్గేష్ ఆదేశించిన విషయం విదితమే.. అసలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ సమయంలోనే ఇలాంటి నిర్ణయం ఎందుకు అని ప్రశ్నించారు మంత్రి.. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడం కోసమే విచారణ అన్నారు.. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయకుండా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడం కోసమేనని అని.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. రాజమండ్రిలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్… సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్యనైనా సానుకూలంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని హితవుచెప్పారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరహర వీరమల్లు రిలీజ్ సమయంలోనే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు.? అని ప్రశ్నించారు. దీనిపై చర్చించడానికి పూర్తి ఎంక్వయిరీ జరుగుతుంది… సినిమా ఇండస్ట్రీ బాగుండాలన్నా… వీరి తీసుకున్న నిర్ణయం గురించి తెలియాలి.. సినిమా రంగానికి సంబంధించి ఒక కొత్త పాలసీను కూడా తీసుకురాబోతున్నాం అని వెల్లడించారు.. సినీ పరిశ్రమనికి ప్రభుత్వం తరఫునుంచి పూర్తి సహకారం ఉంది… పర్సంటేజ్ పెంచాలని ఎగ్జిక్యూటర్స్ అడుగుతున్నారనేది తెలిసిందన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును చేర్చడం తెలంగాణకే ఎంతో అవమానం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్ చేసిన పనులు ఏవైనా ఉన్నాయా అంటే అవి బీఆర్ఎస్ పై నిందలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు చేరవేయడమే తప్పా తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం లాగ మారిపోయిందని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును చేర్చడం తెలంగాణకే ఎంతో అవమానం అని అన్నారు. గతంలో కేస్ ల తర్వాత ఆయన వైఖరి మారుతుంది అనుకున్నారు.. కానీ మారలేదు. అప్పట్లో ఓటుకు నోటు కుంభకోణం చేస్తే ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా చెప్పారు. డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారు అని చెప్పారు. ఇప్పుడు అదే విషయం స్పష్టం అయింది. బీజేపీకి నిజాయితీ ఉంటే.. స్పందించాలి అని కోరారు. అమృత్, సివిల్ సప్లై స్కామ్, యంగ్ ఇండియా, హెచ్ సీయూ భూముల విషయంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని తేల్చింది. 10 వేల కోట్ల విషయంలో స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారణ జరిపించాలని రిపోర్ట్ ఇచ్చింది.
కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావొచ్చు..
కాసేపటి క్రితం కేటీఆర్ కాంగ్రెస్ పై, సీఎం రేవంత్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సచివాలయంలో పంచాయతీ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయింది అని మండిపడ్డారు. కాళేశ్వరంలో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమీషన్ ముందుకు రావడానికి ఎందుకు అని ప్రశ్నించారు. గ్లోబెల్స్ ప్రచారంలో నిన్ను మించిన వారు లేరు.. కేటీఆర్.. నీకు గ్లోబెల్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవ చేశారు. అబద్దాల పునాదుల పై బిఆర్ఎస్ నడుస్తుంది. గోబెల్స్ ను కేటీఆర్ మించిపోయాడు.. కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావొచ్చు.. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదు.. కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉంది బిఆర్ఎస్ కాదా.. మోడీ ప్రశంసల కోసమే… ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేసారు. యుద్ధంలో ట్రంప్ నీతిని అమలు చేస్తున్నారు మోడీ.. అబద్దాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు..
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా
తెలంగాణ పాలిసెట్ పలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీ దేవ సేనా ఫలితాలను రిలీజ్ చేశారు. పాలిసెట్ ఉత్తీర్ణత 84.33 శాతంగా నమోదైంది. పాలిసెట్ లోనూ బాలికలదే హవా కొనసాగింది. గోరుగంటి శ్రీజ, తుమాటి లాస్య శ్రీ 120 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకు 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 98,858 అభర్థులు హాజరయ్యారు. వీరిలో 83,364 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. హాజరైన 53085 బాలురకు గాను 42836 మంది అనగా 80.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదేవిధంగా హాజరైన 45773 బాలికలకు గాను 40528 మంది అనగా 88.54 శాతం ఉత్తీర్ణత సాధించారు. పాలిసెట్ లో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించుటకు 120 మార్కులకు గాను నిర్ణీత 30 శాతం అనగా 36 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC,ST అభ్యర్థులకు నిర్ణీత ఉత్తీర్ణతకు 01 మార్కు పొందవలెను. పాలిసెట్-2025 లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్థులకు మెరిట్ ర్యాంకులు కేటాయించనున్నారు. 18039 మంది SC విద్యార్థులకు గాను ఉత్తీర్ణత సాధించిన 18037 మందికి ర్యాంకులను ఇవ్వటం జరిగినది. అదేవిధంగా 7459 మంది ST విద్యార్థులకు గాను ఉత్తీర్ణత సాధించిన 7459మందికి ర్యాంకులను కేటాయించారు. ఫలితాల కోసం www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి చూసుకోవచ్చు.
గుడ్‌న్యూస్… రుతుపవనాలు వచ్చేశాయోచ్!
ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయి. కొద్ది సేపటి క్రితమే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో రెండు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నాయి. 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ తెలిపింది. 2009లో మే 23న రుతుపవనాలు ప్రవేశించాయి. మళ్లీ ఇన్నాళ్లకు త్వరగా రుతుపవనాలు వచ్చాయి. సాధారణ తేదీ కంటే 8 రోజులు ముందే రుతుపవనాలు వచ్చినట్లు ఐఎండీ పేర్కొంది. వాస్తవంగా రోహిణి కార్తె సమయంలో ఎండలు మండిపోతుంటాయి. అలాంటిది ఈ ఏడాది ఆ పరిస్థితులు తలెత్తలేదు. ఇక రోహిణి కార్తె మే 25న(ఆదివారం) రానుంది. ఇది జూన్ 8 వరకు ఉంటుంది. రాహిణి కార్తె సమయంలో ఎండలు భగభగ మండిపోతాయి. తీవ్ర ఉష్ణోగ్రతతో బండరాళ్లు కూడా పగిలిపోతాయంటారు. అలాంటిది ఈ ఏడాది ఆ పరిస్థితులు కనిపించకపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. మావో అగ్ర నేత హతం
దేశంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నేత బసవరాజు హతమయ్యాడు. ఇతడిపై రూ.కోటికి పైగా రివార్డు ఉంది. తాజాగా శనివారం జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో అగ్ర నేత పప్పు లోహారా హతమయ్యాడు. ఇతడిపై రూ.10 లక్షల రివార్డు ఉంది. ఇతడు జార్ఖండ్ జన ముక్తి పరిషత్ అనే తిరుగుబాటు మావోయిస్టు సంస్థకు నాయకుడిగా ఉన్నాడు. శనివారం జార్ఖండ్‌లోని లతేహార్‌లో భద్రతా దళాలు ఒక సీనియర్ మావోయిస్టు నాయకుడు పప్పు లోహారాను హతమార్చాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. మరో రూ.5లక్షల రివార్డు ఉన్న లోహారా సహాయకుడు ప్రభాత్ గంజుతో కలిసి ప్రాణాలు కోల్పోయాడు. ఇక గాయపడ్డ మరొక సభ్యుడ్ని అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఐఎన్‌ఎస్‌ఏఎస్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఐక్యరాజ్యసమితిలో పాక్ తీరును ఎండగట్టిన భారత్
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ తీరును భారత్ ఎండగట్టింది. ఉగ్రవాద దాడుల్లో 20,000 మంది భారతీయులు మరణించారని భారత్ తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు గుప్పించింది. గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్ తప్పుడు సమాచారం ఇచ్చిందని భారత్ విమర్శించింది. గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాతే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు పేర్కొంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రాయబారి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ రాయబారిపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్థాన్‌కు ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పాక్ ప్రతినిధి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. భారత్ దశాబ్దాలుగా పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులతో పోరాడుతోందని తెలిపారు. సింధు జలాలపై పాకిస్థాన్ తప్పుడు సమాచారం ఇచ్చిందని.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాతే సింధు జలాలు నిలిపివేసినట్లు పర్వతనేని హరీష్ అన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఉపసంహరించుకునేంత వరకు 65 ఏళ్ల నాటి సింధు జలాల ఒప్పందం నిలిచి ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.
మళ్లీ భగ్గుమన్న పసిడి ధరలు.. రూ. 500 పెరిగిన తులం గోల్డ్ ధర
బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. నేడు తులంపై రూ. 500 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,808, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,990 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రభావితం అవడం వంటి కారణాలు పుత్తడి ధరల్లో మార్పుకు కారణమవుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 500 పెరిగింది. దీంతో రూ. 89,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగింది. దీంతో రూ. 98,080 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,230 వద్ద ట్రేడ్ అవుతోంది.
‘హిట్ 3’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇటీవల నేచురల్ నాని ప్రధాన పాత్రలో రూపొందిన ‘హిట్ 3’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీ మేడే కానుకగా, ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అంచనాలను మించి.. సూపర్ హిట్‌గా నిలిచింది. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొన్నగా. అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద ఊహించని విద్ధంగా వంద కోట్ల కలెక్షన్స్ అవలీలగా దాటేసింది. నాని ముందు చిత్రాలతో పోలిస్తే ఇందులో రక్తపాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా ఆడియెన్స్‌కు మాత్రం ఈ చిత్రం మంచి కిక్ ఇచ్చింది. ఇక నాని కెరీర్లోనే, రికార్డు ఓపెనింగ్స్‌ని అందుకున్న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను, ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, ఇందుకోసం రూ. 50 కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్లు సమాచారం. కాగా తాజా సమాచారం ప్రకారం మే 29 నుంచి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. ఇక థియేటర్‌లో మిస్ అయి.. ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న వారు మరికొన్ని రోజులో ఇంట్లో కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
తృటిలో తప్పిన ప్రమాదం.. కొడుకుతో సహా ప్రాణాలతో బయటపడ్డ జెనీలియా
‘బొమ్మరిల్లు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి బ్యూటీ జెనీలియా. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమ వివాహం చేసుకోగా, ఆ జంటకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మూవీస్ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జెనిలీయ.. తన ఇద్దరు కొడుకులతో అప్పుడప్పుడు సరదాగా షికార్లకి వెళుతుంటుంది. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాని అభిమానులతో పంచుకుంటు ఉంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం జెనీలియా పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. తన కుమారులతో బయటకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లడానికి కారు ఎక్కుతుండగా.. ఆ సమయంలో డ్రైవర్ తొందరపాటుతో కాస్త ముందుకు పోనిచ్చాడు. లోపల ఉన్నవారు అరవడంతో కారుని ఆపేశారు. అదే కారు వేగంగా వెళ్లి ఉంటే జెనీలియాకి పెను ప్రమాదమే జరిగి ఉండేది. కారులో నుండి కింద పడి గాయలు అయ్యేవి. దేవుడి దయ వల్ల ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో నెటిజన్స్ డ్రైవర్ భయ్య కాస్త చూసుకొండి అంటూ.. అభిమానులు కూడా ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నారు. ఇక ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జెనీలియా మంచి మంచి కథలు ఎంచుకుంటుంది. ఇటు రితేష్ కూడా విలన్ గా దూసుకుపోతున్నాడు.