సత్యసాయి బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయి..
సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయి.. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని తెలిపారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయన్నారు.. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న ఆమె.. సత్యసాయి బోధనలు కోట్లాది మందిని ప్రభావితం చేశాయి.. ఇక, సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారు.. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు.. అయితే, సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు రాష్ట్రపతి..
ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదు.. సత్యసాయి ట్రస్ట్‌పై సీఎం ప్రశంసలు..
శ్రీ సత్యసాయి బాబా సేవా స్పూర్తి ప్రపంచానికి ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి నారా లోకేష్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస.. ఇవే సత్యసాయి జీవన సూత్రాలని, ఇవి ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపే విలువలని సీఎం గుర్తుచేశారు. సత్యసాయి సేవలు అపారమైనవి అని పేర్కొన్నారు. సత్యసాయి బాబా సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి తాగునీటి సౌకర్యం అందించిన తొలి సేవా కార్యక్రమం ఇదే అని తెలిపారు సీఎం చంద్రబాబు.. తాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని సత్యసాయి బాబా చెప్పారని.. అయితే, భక్తుల విరాళాలతో ఆ ప్రాజెక్టులు విజయవంతమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, సత్యసాయి సేవాసంస్థలో పనిచేస్తున్న వాలంటీర్ల సంఖ్య 7.50 లక్షలు ఉండటం విశేషమని, ఎలాంటి ప్రభుత్వ లేదా ప్రైవేట్ వ్యవస్థకు కూడా ఇంతటి శక్తి లేదని సీఎం అభినందించారు. ఈ ఉత్సవాల సందర్భంగా సత్యసాయి ట్రైబల్ విమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ప్రారంభించడం ఆనందకరమని తెలిపారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న వైద్య సేవలు ప్రశంసనీయం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యువ ఐఏఎస్ జంట..
పెళ్లంటే హంగు, ఆర్భాటాలు.. ఎవరిస్థాయిలో వారు నిర్వహిస్తారు.. మరి కొందరు అయితే.. మాట రావొద్దు అంటూ.. అప్పు చేసైనా గొప్పలకు పోయి పెళ్లిళ్లు చేసేవారు ఉన్నారు.. జీవితంలో ఒక్కసారే చేసుకునే ఈ తంతు.. కలకాలం గుర్తుండిపోవాలి అంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారు లేకపోలేదు.. అయితే, పెళ్లంటే ఆర్భాటాలు కాదు.. ఒకరికి ఒకరు జీవితాంతం తోడు నీడగా నిలబడటమేనని నిరూపించింది ఓ యువ ఐఏఎస్ జంట.. ధూమ్ ధామ్ గా పెళ్లి చేసుకుని.. హంగామా.. ఆర్భాటం చేసే అవకాశం ఉన్న అధికారులు నిరాడంబరంగా ఒక్కటవ్వడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగిన యువ ఐఏఎస్ అధికారుల పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే… ఆంధ్ర క్యాడర్ కు చెందిన తిరుమణి శ్రీ పూజ, మేఘాలయ IAS ఆదిత్య వర్మల వివాహం విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగింది. ఇద్దరూ ఉన్నతాధికారులు అయినప్పటికీ హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా వెళ్లి చేసుకోవడం అభినందాలకు కారణం అయ్యింది. ఆర్భాటాలు కాదు.. ప్రేమ, పరస్పర గౌరవం, ఆర్థిక భారం లేని.. నూతన జీవితమే అసలు శోభ అని నిరూపించారు. ఈ యువ ఐఏఎస్ అధికారులు.. ఇక, యువ ఐఏఎస్ ల వివాహ వేడుకకు రెండు కుటుంబాల సమక్షంలో ఆత్మీయుల హాజరయ్యారు. ప్రస్తుతం తిరుమణి శ్రీపూజ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఇంఛార్జ్ సంయుక్త కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. వరుడు ఆదిత్య వర్మ మేఘాలయలో దాదెంగ్రి జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ముందుగా విశాఖలోని కైలాసగిరిపై ఉన్న శివాలయంలో దండలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ యువ ఐఏఎస్ జంట.. ఆ తర్వాత.. వన్‌టౌన్‌లోని జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేసి తమ వివాహాన్ని రిజిస్ట్రార్ చేసుకున్నారు..
అమరావతికి అధికారిక గెజిట్.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు..!
అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించే గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాజధాని విషయం చర్చించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం హోం శాఖలో ఫైల్ క్లియర్ అయి, న్యాయశాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక, రాజధాని నిర్మాణంలో భాగంగా రైతులకు భూవినిమయ ఒప్పందంలో 98 శాతం ప్లాట్ల పంపిణీ పూర్తైనట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మిగిలిన 2 శాతం సమస్యలు కూడా త్వరలో పరిష్కారం కానున్నాయని తెలిపారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా శాశ్వతంగా ప్రకటించేందుకు పార్లమెంట్ సాక్షిగా బిల్లు తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. దీనితో అమరావతి రాజధాని విషయంలో ఓపెన్ ఎండింగ్ లేకుండా శాసనపరంగా పూర్తి నిర్ధారణ కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, అమరావతి గెజిట్‌పై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో, రాజధాని ప్రాంతంలో తిరిగి కార్యకలాపాలు వేగం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రేమించినోడు మోసం చేశాడు.. కడుపులో ఉన్న బిడ్డనే అమ్మకానికి పెట్టిన యువతి..!
ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో కడుపులో పెరుగుతున్న బిడ్డను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ మహిళ మధ్యవర్తులను ఆశ్రయించింది. ఎలా పోషించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఆ యువతికి పుట్టిన బాలుడిని మధ్యవర్తులు కరీంనగర్‌కు చెందిన దంపతులకు ఆరు లక్షలకు విక్రయించారు. బాలుడు విక్రయం సంగతి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో విషయం బయటపడింది. బాలుడిని విక్రయించిన కొనుగోలు చేసిన వారితో పాటు బాలుడిని విక్రయించడానికి మధ్యవర్తులుగా ఉన్న 12 మందిపై కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కు చెందిన యువతి.. ఓ యువకుడిని ప్రేమించి మోసపోయింది. గర్భవతి అయిన ఆ యువతిని సదరు యువకుడు వదిలేసి వెళ్లిపోయాడు. పుట్టబోయే బిడ్డని ఎలా పోషించాలో తెలియని పరిస్థితుల్లో కొంతమంది మధ్య వ్యక్తులను ఆశ్రయించింది. పుట్టబోయే శిశువుని విక్రయించాలని ఆ యువతిని ఒప్పించారు మధ్యవర్తులు.. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో వారం రోజుల కిందట ఓ బాలుడికి జన్మనిచ్చింది. 12 మంది మధ్యవర్తుల ద్వారా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లెకు చెందిన భామండ్ల రాయమల్లు లత దంపతులకు బాలుడి కొనుగోలుకు ఆరు లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. గురువారం కరీంనగర్‌లోని సాయిబాబా దేవాలయం సమీపంలోని ప్రవేట్ ఆసుపత్రి వద్ద బాలుడిని కొనుగోలు చేస్తున్నట్లు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహకారంతో విచారణ చేపట్టి శుక్రవారం బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. బాలుడి కొనుగోలు విక్రయించిన వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 12 మంది ఈ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని మాతా శిశు కేంద్రం కు తరలించారు. బాలల పరిరక్షణ ప్రొటెక్షన్ అధికారి జోగు తిరుపతి ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి తెలిపారు.
రాజీనామా తర్వాత తొలిసారి పబ్లిక్‌గా ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి
జగదీప్ ధన్‌కర్ అనూహ్యంగా జూలై నెలలో ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజే ఊహించని రీతిలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు. అనూహ్య నిర్ణయంపై అనేక ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే ధన్‌ఖర్ రాజీనామా చేశారంటూ విపక్ష నాయకులు ఆరోపించారు. ఇక ఆయన ఆచూకీ కనిపించకపోవడంతో కూడా రకరకాలైన కథనాలు వెల్లువడ్డాయి. మొత్తానికి రాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో అనుమానాలు తొలగిపోయాయి. మరొకసారి ధన్‌ఖర్ వార్తల్లో నిలిచారు. ఈసారి మాత్రం ట్విస్ట్‌లు ఇవ్వకుండా పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చారు. భోపాల్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కనిపించారు. ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పుస్తకం మన గత వైభవానికి అద్దం అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ పుస్తకం నిద్రపోతున్న వారిని మేల్కొల్పుతుంది. ఇది మన సాంస్కృతిక విలువల గురించి మనకు అవగాహన కల్పిస్తుంది.’’ అని తెలిపారు.
నోబెల్ శాంతి గ్రహీతకు కొత్త చిక్కులు.. అవార్డ్‌పై వెనిజులా అభ్యంతరం
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత ప్రయత్నించారో ప్రపంచమంతటికి తెలిసిందే. అనేక యుద్ధాలు ఆపానని తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ట్రంప్ ఆశపడ్డారు. అంతేకాకుండా అనేక దేశాలు కూడా ట్రంప్ పేరును ప్రతిపాదించాయి. కానీ చివరికి ‘‘ఆశ దోశ అప్పడం వడ’’ అన్నట్టుగా నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో తన్నుకుపోయారు. దీంతో ట్రంప్ గుండెలో పిడుగు పడినట్లైంది. ఇంత వరకు బాగానే ఉంది గానీ.. తాజాగా నోబెల్ శాంతి గ్రహీత మచాడో (58)కు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. ఒకరేమో అవార్డు రాకుండా బాధపడుతుంటే.. ఇప్పుడు మచాడోకు అవార్డు అందుకోవడానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. అవార్డు అందుకునేందుకు మచాడో దేశం దాటి బయటకు వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని వెనిజులా అటార్నీ జనరల్ ప్రకటించారు. కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి ఆరోపణలు, పలు కేసులు ఉండడంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. ప్రీమియం ఫీచర్లతో..
రాయల్ ఎన్ఫీల్డ్ తన పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ పేరు మెటియోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ స్పెషల్ ఎడిషన్. కంపెనీ దీనిని మోటోవర్స్ 2025 ఈవెంట్‌లో రూ. 2.18 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభించింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 27,649 ఎక్కువ ఖరీదైనది. దీని బుకింగ్‌లు నవంబర్ 22, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. డిజైన్ పరంగా, ఈ ప్రత్యేక ఎడిషన్ అతిపెద్ద హైలైట్ దాని కొత్త సన్‌డౌనర్ ఆరెంజ్ కలర్. ఇది దీనికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. ప్రామాణిక మోడల్ ఇప్పటికే ఫైర్‌బాల్ ఆరెంజ్, ఫైర్‌బాల్ గ్రే, స్టెల్లార్ మాట్టే గ్రే, స్టెల్లార్ మెరైన్ బ్లూ, అరోరా రెట్రో గ్రీన్, అరోరా రెడ్, సూపర్నోవా బ్లాక్ వంటి అనేక కలర్ ఆప్షన్స్ తో వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ స్పెషల్ ఎడిషన్ బేస్ మోడల్ కంటే ఎక్కువ ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. ఇది ఫ్యాక్టరీ-ఫిటెడ్ టూరింగ్ సీటు, ఫ్లైస్క్రీన్, ప్యాసింజర్ బ్యాక్‌రెస్ట్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్‌తో వస్తుంది. ఇందులో అల్యూమినియం ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్, స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్, అడ్జస్టబుల్ బ్రేక్, క్లచ్ లివర్లు, LED హెడ్‌ల్యాంప్, USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నాయి. ఇంజిన్ మాత్రం మారలేదు. ఇది 349 cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 20.2 hp, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లింక్ చేశారు. ఛాసిస్, సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్ మారలేదు.
Google నుంచి క్రేజీ ఫీచర్.. ఫోటోల రహస్యాలు ఒకే క్లిక్‌తో బయటకు
డిజిటల్ ప్రపంచంలో AI-జనరేటెడ్ ఫోటోల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనివల్ల నిజమైన, నకిలీ ఫొటోల మధ్య తేడాను గుర్తించడం కష్టమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, గూగుల్ జెమిని యాప్‌కు AI డిటెక్షన్ ఫీచర్‌ను జోడించాలని నిర్ణయించింది. ఈ ఫీచర్ ద్వారా ఏ యూజర్ అయినా ఒక ఫోటో నిజమైనదా లేదా AI ద్వారా రూపుదిద్దుకుందా అని నిర్ధారించుకోవచ్చు. దీనికోసం గూగుల్ తన ఇన్ విజిబుల్ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీ, సింథిడ్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడం చాలా సులభం. యూజర్లు జెమిని యాప్‌కి ఫోటోను అప్‌లోడ్ చేసి, “ఇది గూగుల్ AI నుండి వచ్చిన ఫోటొనా?” అని అడగాలి. ఆ తర్వాత జెమిని యాప్ ఫోటోపై దాచిన సింథిడ్ వాటర్‌మార్క్‌ను స్కాన్ చేసి, ఆ చిత్రం నిజమా లేదా AI ద్వారా సృష్టించబడిందా అని వినియోగదారుకు తెలియజేస్తుంది. Google ప్లాన్ ఫోటోలకు పరిమితం కాదు. త్వరలో, ఈ ఫీచర్ వీడియో, ఆడియో, డిజిటల్ క్రియేటివ్ కంటెంట్‌కు కూడా వర్తిస్తుంది. Google ఈ ఫీచర్‌ను C2PA ప్రమాణం కింద అభివృద్ధి చేస్తోంది. ఇది OpenAI Sora, Adobe Firefly, Midjourney వంటి ఇతర AI సాధనాల నుంచి కంటెంట్‌ను ధృవీకరించడానికి అనుమతిస్తుంది.
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. 1936 రేర్ రికార్డు బ్రేక్!
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక యాషెస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. యాషెస్ 2025-26లో భాగంగా పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ (5/23) పడగొట్టడంతో ఈ రికార్డు స్టోక్స్ ఖాతాలో చేరింది. అంతకుముందు ఈ రికార్డు గుబ్బీ అలెన్ పేరిట ఉంది. అలెన్ 1936లో 5 వికెట్స్ పడగొట్టి 36 రన్స్ ఇచ్చారు. అలెన్ రికార్డును స్టోక్స్ బద్దలు కొట్టాడు. 1990/91 తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ టెస్ట్‌లో రెండు జట్లు తొలి ఇన్నింగ్స్‌లో 200 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. పెర్త్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 32.5 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 58 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 132 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్ 6 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 1990/91 యాషెస్‌లో భాగంగా గబ్బా టెస్ట్‌లో ఇంగ్లాండ్ 194 పరుగులకు, ఆస్ట్రేలియా 152 పరుగులకు ఆలౌట్ అయ్యాయి.
పాన్ వరల్డ్.. భారీ బడ్జెట్ కాదు.. కంటెంట్ కావాలి మాకు
ఇటీవల సినిమా మేకర్స్ తమ ప్రాజెక్ట్‌ల గురించి విపరీతమైన స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం ఒక ట్రెండ్‌లా మారిపోయింది. ఎక్కడ చూసినా “ఇంత భారీ బడ్జెట్”, “ఇంతవరకు ఎప్పుడూ చేయని విజువల్ ఎఫెక్ట్స్”, “పాన్ వరల్డ్ రిలీజ్”, “రికార్డులు బ్రేక్ చేయబోతున్నాం” వంటి మాటలే వినిపిస్తున్నాయి. కానీ ఈ పెద్ద పెద్ద హామీలు ప్రేక్షకులలో అంచనాలను పెంచడం తప్ప అసలు సినిమాకే నష్టం చేస్తున్నాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ప్రచారం కోసం చెప్పే ఈ “టాల్ స్టేట్‌మెంట్స్” వాస్తవానికి సినిమాపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. కంటెంట్ కంటే ముందే బడ్జెట్, వసూళ్లు, స్టార్ కాంబినేషన్స్, బిగ్ సెట్‌లు వంటి విషయాలు చర్చకెక్కుతుండడంతో, ప్రేక్షకులు కూడా సినిమాను చూసే ముందు గాల్లో ఎక్కడికో తీసుకెళ్తున్నారు. కానీ విడుదలైన తర్వాత ఆ అంచనాలు నెరవేరకపోతే, వెంటనే ట్రోలింగ్ మొదలై నెగటివ్ వేవ్ క్రియేట్ అవుతుంది. ఇదే చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డ్యామేజ్ అయ్యేందుకు ప్రధాన కారణమవుతుంది.
వచ్చే ఏడాది బాక్సాఫీస్‌పై దండయాత్రకు రెడీ అవుతున్న మృణాల్ ఠాకూర్
సీతారామంతో తెలుగు ఆడియన్స్ మదిలో సీతామమహాలక్ష్మీగా పర్మినెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్‌గా ఛేంజ్ అయితే.. సీతగా స్పెషల్ ఐడెంటిటీనిచ్చింది టీటౌన్. హాయ్ నాన్నతో సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్న భామకు ఫ్యామిలీ స్టార్ రూపంలో హ్యాట్రిక్ మిస్సయ్యింది. కల్కిలో క్యామియో అప్పీరియన్స్ ఇచ్చిన భామ.. టాలీవుడ్ ఆడియన్స్‌కు గ్యాప్ ఇచ్చినా.. బాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ కంటిన్యూ చేస్తోంది. ఈ ఏడాది జస్ట్ వన్ ఫిల్మ్స్ సన్నాఫ్ సర్దార్2తో సరిపెట్టేసింది అమ్మడు. ఈ బొమ్మ కూడా బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్మామెన్స్ చేసింది. రెండేళ్ల నుండి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో హిట్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న మృణాల్.. తనకు బాగా అచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీలతో నెక్ట్స్ ఇయర్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తోంది. 2026 స్టార్టింగ్ నుండే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సందడి చేయబోతోంది. తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీ డెకాయిట్: ఒక ప్రేమ కథ.. ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ కావాల్సి ఉండగా.. నెక్ట్స్ ఇయర్ మార్చి 19కు పోస్ట్ పోన్ చేసుకుంది. అంత కన్నా ముందే మరో బాలీవుడ్ లవ్ స్టోరీతో హాయ్ చెప్పబోతోంది అమ్మడు. రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న దో దీవానీ షెహర్ మే ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ దో దీవానీ షెహర్ మే నెక్ట్స్ ఇయర్ వాలంటైన్స్ డేను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే జూన్ 5న హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హైతో హాయ్ చెప్పబోతుంది. వరుణ్ ధావన్,పూజా హేగ్డే, మృణాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రాబోతుంది ఈ ఫిల్మ్. అలాగే ఎప్పుడో కంప్లీటై విడుదలకు నోచుకోని కాంట్రవర్షీయల్ సబ్జెక్ట్ మూవీ పూజా మేరీ జాన్ కూడా నెక్ట్స్ ఇయరే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మడాక్ ఫిల్మ్స్. అలాగే బన్నీ- అట్లీ హై బడ్జెట్ ఫిల్మ్ కూడా రిలీజయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
హీరో ఆధిపత్యంపై రాశీ ఖన్నా సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్‌లో ‘ఊహలు గుసగుసలాడే’తో ఎంట్రీ ఇచ్చిన రాశీ, జిల్, బెంగాల్ టైగర్, హైపర్, ఠోలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా. పెద్ద బ్రేక్‌లు రాకపోవడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లి బోల్డ్ రోల్స్ చేస్తూ తన కొత్త కోణాన్ని చూపించింది. ఇటీవల సిద్దు జొన్నలగడ్డతో చేసిన ‘తెలుసు కదా’ హిట్ అవ్వడంతో మళ్లీ క్రేజ్ పెరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో రాశీ ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఉన్న లింగ అసమానత గురించి బోల్డ్‌గా మాట్లాడింది. “మన దేశంలో హీరో వర్షిప్ చాలా కాలం నుంచే ఉంది. మేల్ యాక్టర్స్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు తేస్తారని అందరూ నమ్ముతారు. అది నిజమే.. కానీ మార్కెట్ జెండర్ మీద ఆధారపడదు, టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది” అని రాశీ చెప్పింది. అదే సమయంలో మరో ప్రధాన విషయంలో కూడా ఆమె స్పష్టంగా స్పందించింది.. “స్క్రీన్ మీద హీరో, హీరోయిన్ ఎవరికైతే ఎక్కువ మార్కెట్ ఉందో వాళ్లే నిర్ణయిస్తారు. కానీ సెట్స్‌పై మాత్రం అందరికీ సమాన గౌరవం రావాలి. మహిళా నటీమణుల పట్ల కూడా మన ప్రవర్తనలో, సదుపాయాల్లో, గౌరవంలో ఎలాంటి తేడా ఉండకూడదు” ఇండస్ట్రీలో ఇంకా హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉందని, హీరోయిన్లు ఎంత టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు రెండో స్థానానికి పడిపోతున్నారని రాశీ తెలిపారు. ఇక రాశీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లలో పెద్ద చర్చగా మారాయి. చాలా మంది ఆమె మాటలకు మద్దతు తెలుపుతూ, “అవును మహిళా నటీమణులకూ సమాన గౌరవం తప్పకుండా రావాలి” అని కామెంట్లు చేస్తున్నారు.