ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్స్ వీళ్లే..
ఆంధ్రప్రదేశ్‌లో ఫలితాల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. ఈ రోజు ఫలితాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేశారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. 6,100 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల కాగా.. ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టినట్టు తెలిపింది ఏపీ ప్రభుత్వం.. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. 2022లో నోటిఫికేషన్ ఇచ్చిన కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు ఇప్పుడు విడుదల చేస్తున్నాం అని వివరించారు.. మొత్తం 6100 పోస్టులకు 5.3 లక్షల దరఖాస్తులు రాగా 4.59 లక్షల మంది హాజరయ్యారు.. ఫైనల్స్ కి 33,921 మంది అర్హత పొందారని పేర్కొన్నారు.. ఇక, సెలక్ట్ అయిన అభ్యర్ధులకు ట్రైనింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తాం.. 9 నెలల్లో వారికి పోస్టింగ్ ఇస్తామని వెల్లడించారు.. ఇక, విశాఖపట్నానికి చెందిన గండి నానాజీ మొదటి స్థానంలో నిలవగా.. విజయనగరానికి చెందిన రమ్య మాధురి రెండో స్థానంలో ఉన్నారు.. రాజమండ్రికి చెందిన అచ్యుత రావు మూడో స్థానంలో నిలిచారు.. ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు ఆన్‌లైన్‌లో పెట్టగా.. www.slprb.ap.gov.inలో అందుబాటులో ఉంచారు.
అది వార్నింగ్ కాదు.. సినిమా డైలాగ్..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎవరిని తన్నాలని అనలేదు అని క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. సినిమా వేరు రాజకీయం వేరన్న ఆమె.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో పవన్ కల్యాణ్ అభిమానులు లేరా..? పవన్ కల్యాణ్ సినిమా చూడరా? అని ప్రశ్నించారు.. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పొలిటికల్ కామెంట్లు చేశారు.. నెల్లూరులో జగన్ చేసిన సీరియన్ వార్నింగ్ కామెంట్లపై స్పందిస్తూ.. అది వార్నింగ్ కాదు.. సినిమా డైలాగ్ అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్.. నెల్లూరు పర్యటనపై హోం మంత్రి అనిత విమర్శలు గుప్పించారు.. వైఎస్ జగన్ ప్రాంతానికి ఒక మాట మాట్లాడే వ్యక్తి అని దుయ్యబట్టారు.. అసలు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లటం ద్వారా వైఎస్ జగన్ ఏ మెసేజ్ ఇస్తున్నారు..? అని మండిపడ్డారు.. ఓ మహిళా ఎమ్మెల్యేను కించ పరిచిన వ్యక్తిని పరామర్శించడం సరికాదు అని హితవు పలికారు.. వైఎస్ జగన్ పరామర్శ యాత్ర చేపడితే జగన్ మొదట షర్మిల ఇంటి నుంచి మొదలు పెట్టాలి అంటూ సెటైర్లు వేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఇక, మంత్రులను తమ కార్యకర్తలు ఎటాక్ చేస్తారని జగన్ అంటున్నారు.. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం బట్టే వారి మెంటల్ స్టెబిలిటీ అర్థం అవుతోందన్నారు.. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కచ్చితంగా కేసు నమోదు చేయాలి.. చేస్తాం అన్నారు హోం మంత్రి అనిత..
సూట్ కేసు రెడీ చేసుకో…. త్వరలో జైలుకే..!
వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై హాట్ కామెంట్లు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.. సీఎం చంద్రబాబు బావిలో దూకాలన్న జగన్ కామెంట్లుకు కౌంటర్ ఇచ్చిన ఆమె.. చంద్రబాబు బాయిలో దూకడం కాదు జగన్.. నువ్వు నీరు లేని బావిలో పడ్డా.. నీ పాపాలు పోవు అని వ్యాఖ్యానించారు.. సూట్ కేసు రెడీ చేసుకుని ఉండు… త్వరలో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత.. అనంతపురం రూరల్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత .. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.. ప్రకాష్ రెడ్డికి నిద్రలో కూడా పరిటాల రవినే గుర్తొస్తున్నారు.. ఆయన చనిపోయి 20 ఏళ్లు అయింది.. ప్రకాష్ రెడ్డి ఇంకా మీకు భయం పోలేదా..? అని ప్రశ్నించారు.. పరిటాల రవి పేరు ఉచ్చరించకుండా మీ సమావేశాలే ఉండవు.. పరిటాల రవి హత్యలు చేసి ఉంటే గత ఐదేళ్లలో ఎందుకు నిరూపించలేకపోయావు.? అని నిలదీశారు..
ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. ఆ విషయం మరవొద్దు..!
ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. అనేక అంశాలపై స్పదించారు.. అన్నదాత సుఖీభవ, పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలపై చర్చించిన ఆయన.. సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించారు.. చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తున్నాం.. గత ప్రభుత్వానికంటే రెండింతలు సంక్షేమం ఇస్తున్నాం.. లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.. ఆర్థిక చేయూతను పెంచాం. ఈ నెలలోనే సూపర్ సిక్స్ లోని రెండు హామీలు నెరవేరుస్తున్నాం. రేపు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తున్నాం. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం అమలు చేయనున్నాం. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పార్టీ యంత్రాంగమే. నిత్యం ప్రజల్లో ఉండాలి.. ప్రజల కోసం పని చేయాలి. ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలో ఉన్నామనే విషయాన్ని ఎప్పటికీ మరువొద్దు అని సూచించారు..
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీఎం రేవంత్ పై బీజేపీ కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ చేసిన వాఖ్యల గురించి నాంపల్లి స్పెషల్ కోర్టులో కేస్ వేశాడు కాసం వెంకటేశ్వర్లు. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల భాజపా పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న ఈ కేసును కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన హైకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్.. ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్
ఓ ప్రభుత్వ ఉద్యోగి తన అటెండెన్స్ కోసం ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఉపయోగించుకున్నాడు. రోజూ ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు అధికారులు. దీంతో ఆ ఉద్యోగి చేసిన ఘనకార్యం వెలుగుచూసింది. సీఎం ఫోటోతో హాజరు నమోదు చేసిన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందయాపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జగిత్యాల జిల్లా కలెక్టర్. ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో రేవంత్ రెడ్డి ఫోటోతో ప్రభుత్వ ఉద్యోగి అటెండెన్స్ వేసుకుంటున్నాడు. విధులకు హాజరు కాకుండా యాప్‌లో రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేశాడు పంచాయతీ కార్యదర్శి. కాగా పంచాయతీ కార్యదర్శుల హాజరును పర్యవేక్షించేందుకు మొబైల్ ఫోన్ ద్వారా ఉపయోగించే యాప్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా విధులు నిర్వహిస్తున్న గ్రామాల నుండే అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉండగా, కొంత మంది రోజూ ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఐక్యతా విగ్రహాన్ని సందర్శించిన ఒమర్ అబ్దుల్లా.. మోడీ ప్రశంసలు
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గుజరాత్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా సబర్మతి నదీ తీరం దగ్గర ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. ఇందకు సంబంధించిన ఫొటోను ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ప్రధాని మోడీ స్పందించి ప్రశంసలు కురిపించారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జమ్మూకాశ్మీ్ర్‌లో పర్యాటక రంగం దెబ్బతింది. దీంతో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దు్ల్లా రాష్ట్రాల పర్యటన చేపట్టారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల గుజరాత్‌లో ఒమర్ అబ్దుల్లా రెండు రోజుల పర్యటన చేపట్టారు. జమ్మూకాశ్మీర్ పర్యాటక రంగం గురించి వివరించారు. భద్రత కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం ఆర్థిక వ్యవస్థకు కీలకమైన భాగం అని.. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తోటి భారతీయులు జమ్మూకాశ్మీర్‌ను సందర్శించాలని కోరుతున్నట్లు వేడుకున్నారు. పహల్గామ్‌లో జరిగిన ఘటనను మరిచిపోయి.. తిరిగి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక గుజరాత్ పర్యటన ఫొటోలను ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ప్రధాని మోడీ రీపోస్ట్ చేశారు. శెభాష్ అంటూ ప్రశంసించారు.
భారత్ కారణంగానే రష్యా రెచ్చిపోతుంది.. మార్కో రూబియో విమర్శలు
భారత్‌పై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేయడం ఏ మాత్రం బాగోలేదని.. ఈ పరిణామం కచ్చితంగా చికాకు కలిగించే అంశం అని రూబియో పేర్కొన్నారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనడంతోనే పుతిన్ రెచ్చిపోయి.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే భారత్‌తో చర్చల్లో తమను ఇబ్బందిపెట్టే అంశమని వ్యాఖ్యానించారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాన్ని విధించారు. అంతేకాకుండా రష్యా దగ్గర సైనిక పరికరాలు, ఇతర కొనుగులు చేస్తే అదనపు జరిమానా కూడా విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. రష్యాతో భారత్ సంబంధాలు పెట్టుకోవడం ఏ మాత్రం బాగోలేదన్నారు. తాజాగా రూబియో కూడా భారత్‌పై రుసరుసలాడారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడంతోనే ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం కొనసాగిస్తున్నారని.. దీనికి భారతదేశమే కారణం అన్నారు.
రోజుకు 30 నిమిషాల పని.. నెలకు రూ18 వేల జీతం.. ముంబై కుక్ సంపాదన తెలిస్తే షాకే!
ముంబైకి చెందిన ఓ న్యాయవాది తన వంట మనిషికి రోజుకు 30 నిమిషాల పని కోసం నెలకు 18 వేల రూపాయల జీతం ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే, ఆయుషి దోషి అనే ఈ అడ్వకేట్ ఇంట్లో పని చేసే మహారాజ్ (కుక్) తాను నివాసం ఉండే కాంప్లెక్స్‌లోని సుమారు 10-12 ఇళ్లలో పని చేస్తాడని తెలిపారు. ఈ సందర్భంగా అతను సాధారణంగా కుటుంబ సభ్యులను బట్టి ఒక్కో ఇంట్లో సుమారు 30 నిమిషాలు గడుపుతాడని చెప్పుకొచ్చారు. ఇక, మహారాజ్ తన ప్రయాణానికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు.. వంట చేసిన ప్రతీ ఇంట్లో ఉచితంగా ఆహారం, టీ అతడికి లభిస్తుంది.. అలాగే, సమయానికి జీతం కూడా అందుకుంటాడు.. ఇంకా ఎప్పుడైనా ఎలాంటి నోటీసు లేకుండా ఉద్యోగం వదిలి వెళ్లగల స్వేచ్ఛ అతను కలిగివున్నాడని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.
విజయనగరంలో చరణ్ పోరాటం
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా తెరకెక్కుతోంది. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో, ఆయన అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతామని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే, ఫస్ట్ షాట్ అంటూ బుచ్చిబాబు రిలీజ్ చేసిన ఒక గ్లిమ్స్ ఒక్కసారిగా సినిమా మీద అందరిలోనూ అంచనాలను అమాంతం పెంచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా విజయనగరం సెట్‌లో ఒక ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో రెండు రోజుల పాటు ఈ నైట్ షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. నబా కాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ ఫైట్ ను ఈ రోజు నుంచి శంకర్పల్లిలో ప్లాన్ చేశారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే అధికారికంగానే ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇప్పుడు విజయనగరం నేపథ్యంగా ఈ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేయడం కూడా ఆసక్తి పెంచుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు కావడంతో పాటు, చరణ్ లుక్ ఈ సినిమా మీద అంచనాలను పెంచుతూ పోతోంది.
కింగ్డమ్ ఫస్ట్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, గురువారం నాడు, అంటే జూలై 31వ తేదీన, ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, సినిమాకి అమెరికా ప్రీమియర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంతమంది అదిరిపోయింది అని అంటే, కొంతమంది మాత్రం ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్‌కి కంప్లైంట్స్ ఉన్నాయని అంటున్నారు. ఏదైతేనేం, మొత్తానికి సినిమా మాత్రం బాగానే వర్కౌట్ అయిందంటున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా నిర్మాణ సంస్థ. ఏకంగా మొదటి రోజు 39 కోట్ల గ్రాస్ కింగ్డమ్ సినిమా కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆంధ్ర తెలంగాణలో ఈ సినిమా విజయ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిందని అంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం లైగర్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయిందని అంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఏరియాలలో 50% రికవరీ ఫస్ట్ డే సాధించిందని నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ శ్రీలంకలో ఉన్న తన అన్నను వెతుక్కుంటూ వెళ్లిన లైన్‌తో ఈ సినిమా రాసుకున్నాడు గౌతం.