విజయవాడలో దారుణం.. రూ.10 కోసం వృద్ధుడి హత్య..!
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మందు తాగేందుకు కేవలం రూ.10 ఇవ్వలేదన్న కారణంతో ఓ వృద్ధుడిని మైనర్ బాలుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టీనగర్ లౌక్య బార్ సమీపంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. మైనర్ బాలుడు ప్రసాద్ మద్యం మత్తులో మందు కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతో అక్కడే ఉన్న వృద్ధుడు బుల్ రాజును రూ.10 ఇవ్వమని అడిగాడు. వృద్ధుడు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన మైనర్ బాలుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు బుల్ రాజు తాపి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆయన స్వస్థలం మంగళగిరి నులకపేట కాగా, ఉపాధి కోసం విజయవాడలో ఉంటూ పని చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా, అదే సమయంలో మైనర్ బాలుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో చిన్న కారణంతో ప్రాణం తీసిన ఈ దారుణంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనాలపై కీలక నిర్ణయం
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త అందించింది. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మల్లన్న స్పర్శ దర్శనాల స్లాట్లను పెంచుతున్నట్లు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈవో) శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానం 2026 జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది. ప్రతి వారం శని, ఆదివారాలు మరియు సోమవారాల్లో మల్లన్న స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రోజుల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి స్పర్శ దర్శన స్లాట్ అందుబాటులో ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం స్పర్శ దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 5 స్పర్శ దర్శన స్లాట్లకు ఆన్లైన్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించామని, ఆఫ్‌లైన్‌లో టికెట్లు జారీ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అధిక సంఖ్యలో భక్తులు మల్లన్న స్వామిని స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం లభించనుంది. ముఖ్యంగా వారాంతాలు, సోమవారాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందని దేవస్థానం అధికారులు తెలిపారు. మల్లన్న భక్తుల్లో ఈ ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
గోదావరి జిల్లాల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కీలక అడుగు.. రేపు పవన్ కల్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన..
ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం వేస్తోన్న కీలక అడుగుకు శుభ ముహూర్తం ఖరారైంది. 3 వేల 50 కోట్ల రూపాయలతో చేపట్టే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ఈ నెల 20న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. పెరవలిలోని ఎన్‌హెచ్ 216ఏ దగ్గర ఆర్కే రైస్ మిస్ సమీపంలో నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అధునాతన సాంకేతికతతో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి సమీపంలో నుండి గోదావరి జలాలు శుద్ధి చేసి తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ తదితర 5 జిల్లాల్లోని 23 నియోజకవర్గాలు, 66 మండలాల్లోని రూ.67 లక్షల 82 వేల. మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ఇందులో భాగంగా 1,650 కోట్ల రూపాయాలతో ఉమ్మడి తూర్పుగోదావరిలోని కాకినాడ, డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరిలోని 11 నియోజకవర్గాలు, 32 మండలలాల్లోని 39 లక్షల 64 మంది ప్రజలకు, రూ.1,400 కోట్లతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, పశ్చిమగోదావరి, ఈస్ట్ గోదావరి కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాలు 12 నియోజకవర్గాలు, 34 మండలాల్లోని 28 లక్షల 18 వేల మంది ప్రజలకు త్రాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జల్ జీన్ మిషన్ నిధులతో రెండు దశల్లో నిర్మాణ పనుల పూర్తికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 2 ఏళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనుల పూర్తికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
టీటీడీ పరకామణి చోరీ కేసుపై దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా స్వామివారి కానుకల లెక్కింపులో పారదర్శకత తప్పనిసరి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. భక్తులు సమర్పించే ప్రతి పైసా లెక్క సరిగ్గా ఉండాలని, దొంగతనాలు, మోసాలు జరగకుండా చూసే పూర్తి బాధ్యత టీటీడీ బోర్డుపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో గత విచారణలో పరకామణి లెక్కింపు వ్యవహారంపై సలహాలు ఇవ్వమన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్‌ను కోర్టు ప్రశ్నించింది. పరకామణి లెక్కింపులో ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులే కొనసాగుతున్నాయా? ఆధునిక సాంకేతికత వినియోగంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని న్యాయస్థానం నిలదీసింది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ఏ చిన్న లోపం జరిగినా తీవ్ర ప్రభావం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అందుకే టీటీడీలో స్వామివారి కానుకల లెక్కింపులో AI టెక్నాలజీ, కంప్యూటర్లు, డిజిటల్ రికార్డింగ్ వ్యవస్థలు వినియోగించాలని ఆదేశించింది. లెక్కింపు, పర్యవేక్షణ, రికార్డుల భద్రత అన్నీ ఆధునిక సాంకేతికతతోనే జరగాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2025 అక్టోబర్ 27న జరిగిన ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే ఒక సమగ్ర ముసాయిదా (డ్రాఫ్ట్ ప్లాన్) రూపొందించి, రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని టీటీడీ బోర్డును ఆదేశించింది. అలాగే ప్లాన్–Bపై కూడా ఎనిమిది వారాల్లోగా ప్రత్యేక నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది.. ఇన్వెస్టర్స్ భయపడే పరిస్థితి ఉంది..
మరోసారి కూటమి సర్కార్‌పై విమర్శలకు దిగారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్.. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్ర భంగం కలుగుతోందన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు భూ కబ్జాలు, భూ వివాదాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు పెట్టుబడుల కోసం ముందుకొచ్చే ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయని రాజకీయ వర్గాలు, పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేశారు అమర్నాథ్.. ప్రత్యేకంగా భూ వివాదాలు, సివిల్ సెటిల్మెంట్ల విషయంలో ఎమ్మెల్యేల జోక్యం పెరుగుతుండటంతో పాలనా యంత్రాంగం చేతకాని స్థితిలో పడిపోయిందన్నారు అమర్నాథ్.. ప్రభుత్వం ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. కలెక్టర్లు, ఎస్పీలను పిలిపించి క్లాస్ పీకడం వల్ల ప్రయోజనం ఉండదని, అసలు సమస్యకు మూలమైన ఎమ్మెల్యేలపైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. సామంత రాజుల్లా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని అంటున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు దాతృత్వం.. విద్యార్థిని ఫీజు కోసం ఇంటికి తాకట్టు పెట్టి..
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు దాతృత్వం ప్రదర్శించారు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం బ్యాంకులో తన స్వగృహాన్ని మార్టిగేజ్(తాకట్టు) పెట్టారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ఏటా 7.50లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత, తండ్రి రామచంద్రం హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సిద్దిపేటలోని తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ. 20 లక్షల ఎడ్యూకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజుకి లక్ష రూపాయలు సహాయం చేశారు.
ప్రధాని మోడీ చెవికి “ఇయరింగ్”!.. ఇది సాధారణ రింగ్ కాదు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒమన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఒమన్ రక్షణ వ్యవహారాల ఉప ప్రధాని స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు, గౌరవ వందనం వంటి కార్యక్రమాలతో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ అంశం ఆసక్తిని రేపింది. ఈ పర్యటనలో మోడీ ఎడమ చెవి పక్కన ఏదో కనిపించింది. ఇది ఒక చెవి ఆభరణంలాంటి వస్తువు. ఇది మోడీ కొత్త స్టైల్? అనే ప్రచారం మొదలైంది. వాస్తవానికి.. మోడీ దేశ పాలన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ.. తన దుస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారన్న విషయం తెలిసిందే. ఆయన ధరించే కుట్టిన సూట్లు, ప్రకాశవంతమైన రంగులు దుస్తులు ఎప్పుడూ చర్చకు వస్తుంటాయి. ఒకసారి తన పేరుతో నేసిన బంధ్గాలా సూట్ హైలైట్ గా నిలిచింది. కానీ ఈసారి చెవిలో కనిపించిన “ఇయరింగ్” గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే.. మోడీ చెవిలో కనిపించిన రింగ్ ఫ్యాషన్ కోసం కాదు. అది రియల్ టైమ్ అనువాద పరికరం అని తెలిసింది. అంతర్జాతీయ దౌత్య సమావేశాల్లో దీన్ని ఉపయోగిస్తారు. విమానాశ్రయంలో ఒమన్ ఉప ప్రధాని సయ్యిద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్‌ను కలిసిన సమయంలో మోడీ ఈ పరికరాన్ని ధరించారు. గల్ఫ్ దేశమైన ఒమన్ అధికార భాష అరబిక్. ఈ భాషను అర్థం చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. ప్రధాని మోడీ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. ఆయా దేశాల్లో విభిన్న భాషలు ఉంటాయి. వివిధ దేశాధినేతలు కలిసినప్పుడు వాళ్లు మాట్లాడే మాటలు అర్థం చేసుకోవడానికి, ట్రాన్స్‌లేట్ చేయడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది.
బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేకి హత్య.. ఇంతకీ ఎవరీ ఉస్మాన్ హాదీ..?
స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. విద్యార్థి ఉద్యమంతో హసీనా సర్కార్ ను గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఇప్పుడు దుండగుల చేతిలో తన ప్రాణాలను కోల్పోవడంతో ఆగ్రహ జ్వాలలు రేకెత్తున్నాయి. నిరసనకారులు రోడ్డెక్కడంతో పరిస్థితి హింసాత్మకంగా మారాయి. అయితే, ఇంతకీ ఎవరీ ఉస్మాన్ హాదీ..? కాగా, బంగ్లాదేశ్‌లోని ఝల్కాతీ జిల్లాలో 1994లో షరీఫ్ ఉస్మాన్ హాదీ జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఉద్యమ భావజాలంతో ఉన్న అతడు.. విద్యార్థి లీడర్ గా ఎదిగాడు. గతేడాది జులైలో అవామీ లీగ్ నేత, నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీ రోల్ పోషించాడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థలో కన్వీనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించాడు. కొన్నాళ్ల క్రితం భారత్‌కు వ్యతిరేక కామెంట్స్ చేశాడు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో చూపిస్తున్నట్లుగా ఉన్న మ్యాప్‌లను పంచినట్లు తాజాగా వార్తలు బయటకు వచ్చాయి. అయితే, గతేడాది విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినప్పటికీ.. తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంక్విలాబ్ మంచ్‌ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు.. ఈ పార్టీ వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతో షరీఫ్ ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. ఢాకా-8 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన హాదీ.. డిసెంబర్ 12వ తేదీన ఎన్నికల ప్రచారం కోసం ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు గత శనివారం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం నాడు మరణించాడు.
ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. గ్రీన్‌కార్డ్ లాటరీ నిలిపేసినట్లు ప్రకటన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డు లాటరీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బ్రౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. నిందితుడు పోర్చు్గీస్ జాతీయుడు క్లాడియో నెవెస్ వాలెంటే (48)గా గుర్తించారు. అనంతరం నిందితుడు తనకు తానుగా తుపాకీతో కాల్చుకుని హతమయ్యాడు. ఈ కాల్పుల నేపథ్యంలో గ్రీన్‌కార్డు లాటరీ నిలిపివేశారు. ట్రంప్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం-ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ను ఆదేశిస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. ఇలాంటి దారుణమైన వ్యక్తులను దేశంలో ఎప్పటికీ అనుమతించకూడదని పేర్కొన్నారు.
లక్కీభాస్కర్ కు సీక్వెల్ చేసే ఆలోచనలో వెంకీ అట్లూరి
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా 2024 అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది లక్కీ భాస్కర్. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. సూర్య సినిమా ఫినిష్ చేసి ఆ వెంటనే లక్కీ భాస్కర్ కు సీక్వెల్ కథ, కథనాలపై ద్రుష్టిపెట్టాలని వెంకీ అట్లూరి ప్లానింగ్ చేస్తున్నారట. లక్కీ భాస్కర్ క్లైమాక్స్ లో హీరో తన సంపందనను మొత్తం అధికారుల కంటపడకుండా విదేశాలకు తరలించి అక్కడ సెటిల్ అవుతాడు. మరి లక్కీ భాస్కర్ సీక్వెల్ ను ఎక్కడ నుండి మొదలు పెడతారో చూడలి. అన్ని అనుకున్నట్టు జరిగితే లక్కీ భాస్కర్ ఈ సారి కొత్త సమస్యలు, వాటి నుండి తప్పించుకునే ప్రణాళికలతో 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.