మారిపోయిన భూ యజమాని పేరు.. ఎమ్మార్వో ఎదుటే బాధితుడి ఆత్మహత్యాయత్నం..
తమ పేరుపై ఉండాల్సిన భూమి.. తమ ప్రమేయం లేకుండానే మరో వ్యక్తి పేరు మీదకు మారిపోవడంతో.. బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.. బీఎన్ కండ్రిగ ఎమ్మార్వో ఆఫీసులో పల్లమాలకు చెందిన పాండు అనే వ్యక్తి ఎంఆర్వో సమక్షంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తమ ఐదెకరాల భూమిపై గొడవలు జరుగుతున్నాయని, ప్రస్తుతం దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. అయితే, ఈ నెల 8వ తేదీ వరకు తన తల్లి వదప్పగారి అనసూయమ్మ పేరు మీద ఉన్న భూమి.. ఇప్పుడు బి.రవీంద్రబాబు పేరు మీదకు ఎలా మారిందంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో ఎమ్మార్వో అక్కడే ఉండడంతో ఆయన సమక్షంలోనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.. వెంటనే స్థానికులు అడ్డుకున్నారు.. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యం అన్నాడు.. అయితే, అధికారులు ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బీఎన్ కండ్రిగ ఎమ్మార్వో కార్యాలయం దగ్గర తీవ్ర కలకలం రేగింది..
ఎక్సైజ్ శాఖకు ఊహించని షాక్..!
మూడు హాఫ్ లు… ఆరు ఫుల్లులు అనుకుంటే లిక్కర్ సిండికేట్ వ్యాపారం చుక్కలు చూపిస్తోంది. లైసెన్స్ ఫీజులు భారీగా పెంచేసిన సర్కార్.. 20 శాతం మార్జిన్ పై ఇచ్చిన హామీని అమలు చేయడం లేదు. పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కూడా రావని ఆందోళనలో ఉంటే ఇటీవల పర్మిట్ రూమ్ ల పరేషాన్ ఎక్కువైందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇందు కోసం ఏడున్నర లక్షలు చెల్లించాలని ఒత్తిళ్లు ఎక్కువయ్యాయనే ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని లిక్కర్ వ్యాపారులు సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాకపోవడం., పెరుగుతున్న ఒత్తిళ్లను తట్టుకో లేక మూకుమ్మడిగా వైన్ షాపులు మూసి వేయాలని తీర్మానించారు. ఎక్కడి స్టాక్ అక్కడే వదిలేసి మూసి వేసిన షాపుల తాళాలను అనకాపల్లిలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసులో అప్పగించి నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నామని చెబున్న ప్రభుత్వం… ఖజానాకు ఆదాయం తెచ్చిపెడుతున్న తమకు మాత్రం అన్యాయం చేస్తోందనేది వ్యాపారులు వాదన.
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి నారా లోకేష్..
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ దేశాల్లో పర్యటిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తూ వచ్చిన ఆయన.. కీలక పెట్టుబడులను సైతం సాధించగలిగారు.. ఇక తాజాగా మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. రేపు ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు నారా లోకేష్.. రేపటి నుంచి అంటే.. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించబోతున్నారు.. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాల్సిందిగా ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఏపీ మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం పంపించారు.. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా గవర్నమెంట్.. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాల్సిందిగా నారా లోకేష్‌కి పంపిన ఆహ్వానంలో పేర్కొంది.. దీంతో, రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించి.. వివిధ యూనివర్సిటీలను సందర్శించనున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి.. ఆయా యూనివర్సిటీల్లో అధునాతన విద్యావిధానాలపై అధ్యయనం చేయనున్నారు.. మరోవైపు, వచ్చే నె అంటే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతూ రోడ్ షోలో పాల్గొననున్నారు మంత్రి నారా లోకేష్.. కాగా, కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత విద్యాశాఖలో కీలక మార్పులు చేసిన మంత్రి నారా లోకేష్.. ఈ పర్యటన తర్వాత మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..
ఫలించిన హైదరాబాద్ డాక్టర్ 8 ఏళ్ల పోరాటం.. ఆ పానీయాలకు ‘ORS’ లేబుల్ నిషేధం..
హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలి 8 ఏళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలపై ఏళ్లుగా పోరాడింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి ఆరోగ్యం దెబ్బతీసే విధంగా లేబుల్స్ ఉన్నాయని వాటిని నిషేధించాలని ఆమె పట్టుబట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్యశాఖలకు లేఖలు రాస్తూ వచ్చిందామే. ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ వైద్యురాలి ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని కఠినమైన నిర్ణయాలను ప్రవేశపెట్టింది. అసలు ఏం జరిగింది..? ఆ వైద్యురాలు ఎవరు? అనే అంశాల గురించి తెలుసుకుందాం.. హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని. ఆమె ప్రస్తుతం ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న బ్రాండ్లు అన్ని నిజమైన ఓఆర్ఎస్‌లు కావని ఆమె ఏళ్ల తరబడి చెబుతూ పోరాటం చేశారు. సాధారణంగా, అతిసారం (డయేరియా)తో బాధపడుతున్నప్పుడు శరీరంలో సోడియం, షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఉండేందుకు ‘ఓఆర్ఎస్’ తాగాలని వైద్యులు సూచిస్తారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం.. సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాషియం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ డైహైడ్రేట్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉన్న పానీయం అసలైన ఓఆర్ఎస్. ఇందులో గ్లూకోజ్ స్థాయి కీలకం. వంద మిల్లీలీటర్ల ఓఆర్ఎస్ ద్రావణంలో 1.35 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి. కొన్ని నకిలీ ఓఆర్ఎస్‌లలో గ్లూకోజు స్థాయి వంద మిల్లీలీటర్ల ద్రావణంలో 8 నుంచి 12 గ్రాముల వరకు ఉంటుంది. చక్కెర స్థాయిలు సైతం అధికంగా ఉంటున్నాయి. తక్కువస్థాయిలో ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి. దీంతో వాటి లేబుల్స్‌ని రద్దు చేయాలని ఆమె కోరింది. లేబుల్స్ కారణంగా నకిలీ ఓఆర్ఎస్ ఏదో.. అసలైన ఓఆర్ఎస్ ఏదో కనుక్కోవడంలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని తెలిపింది.
పండగ పూట “బీసీ బంద్”.. ప్రైవేట్ క్యాబ్స్ దోపిడీ.. ఏకంగా డబుల్ ఛార్జీలు..!
అసలే పండగ. మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో వలస వచ్చిన కార్మికులతో పాటు విద్యార్థులు పెట్టేబేడ సర్దుకుని సొంత స్థలాలకు పయణమయ్యారు. కానీ.. బస్టాండ్‌లకు చేరుకోగానే బస్సులు బంద్ అని తెలిసి అసహనం వ్యక్తం చేశారు. కొందరికి ముందే బంద్ అని తెలిసి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఎలాగైతేనేం.. అందరికీ తమ తమ సొంత వాహనాలు ఉండవు.. బస్సులు రోడెక్కే పరిస్థితి లేదు. ప్రైవేటు వాహనాలే దిక్కయ్యాయి. మరోవైపు.. ప్రైవేటు క్యాబ్స్ ఓనర్స్‌కి ఇదే మంచి సమయం అనుకున్నారు. ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. ఏకంగా రెండింతల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రెండ్రోజులైనా ఇంట్లో సుఖంగా ఉందామని బయలుదేరిన ప్రయాణికులు ఆ ఛార్జీలు చూసి లబోదిబోమంటున్నారు.. ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు మామూలు రోజుల్లో రూ.200 తీసుకుంటారు.. కానీ ప్రస్తుతం రూ.800 డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ కార్ల డ్రైవర్లు.. విజయవాడ వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ.2 వేలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. నేడు(శనివారం) బీసీ వర్గాల హక్కుల సాధన కోసం, 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత డిమాండ్‌తో రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అన్ని విద్యాసంస్థలు సెలవును ప్రకటించాయి. మరునాడు అక్టోబర్ 19 ఆదివారం కావడంతో అది వారపు సెలవు. ఆ మరుసటి రోజు, అంటే అక్టోబర్ 20 దీపావళి సెలవు. ఈ విధంగా సండే కలిసిరావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు లభించాయి. పాఠశాలలు, కళాశాలలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడతాయి. పండగ వేళ వరుస సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరిగంతేస్తున్నారు.
అసలైన దీపావళి నవంబర్ 14నే.. చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు
బీహార్‌లో రసవత్తరంగా ఎన్నికల సమరం సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. ఇదిలా ఉంటే లోక్ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అసలైన దీపావళి నవంబర్ 14న చేసుకుంటామని తెలిపారు. సీట్ల పంకాల విషయంలో ఎన్డీఏ కూటమిపై అనేక ఊహాగానాలు వచ్చాయని.. ప్రస్తుతం ఎలాంటి గందరగోళం లేదని చెప్పుకొచ్చారు. ఇండియా కూటమిలోనే ప్రస్తుతం గందరగోళంగా ఉందని వ్యాఖ్యానించారు. చరిత్రాత్మక విజయం దిశగా ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలతో తనకు ఒక్క శాతం కూడా వివాదం లేదని స్పష్టం చేశారు. నవంబర్ 14న అసలైన దీపావళి చేసుకుంటామని పేర్కొన్నారు.
ట్రెండింగ్‌గా రివాబా జడేజా.. కారణమిదే!
రివాబా జడేజా.. నిన్నామొన్నటిదాకా అంతగా ఫేమస్ కానీ ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యగా ముఖ పరిచయం కానీ.. పేరు అంతగా గుర్తింపు పొందలేదు. కానీ తాజాగా ఆమె పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. దీనికంతటికి ఆమెకు ప్రమోషన్ దక్కడమే కారణం. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ఎదిగిపోయారు. శుక్రవారం జరిగిన గుజరాత్ కేబినెట్ విస్తరణలో అనూహ్యంగా రివాబా జడేజాకు చోటు దక్కింది. మంత్రివర్గ విస్తరణ ఒకెత్తు అయితే.. రివాబా జడేజా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం హైలెట్‌గా నిలిచింది. దీంతో ఆమెకు సంబంధించిన విషయాలను నెటిజన్లు సర్చ్ చేస్తున్నారు. అసలామె ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదివేయండి. రివాబా జడేజా.. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య. నవంబర్ 2, 1990న రాజ్‌కోట్‌లో హర్దేవ్‌సిన్హ్, ప్రఫుల్లబా సోలంకి దంపతులకు జన్మించారు. రాజ వంశానికి చెందిన రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన వారు. అంతేకాదు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు హరి సింగ్ సోలంకికి బంధువు కూడా. అహ్మదాబాద్‌లోని గుజరాత్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అనంతరం మహిళా సంక్షేమం, సాధికారతపై దృష్టి సారించే శ్రీ మాతృశక్తి ఛారిటబుల్ ట్రస్ట్ అనే ఎన్జీవోను స్థాపించారు. 2016లో క్రికెటర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది.
రణరంగంగా ఢిల్లీ రైల్వేస్టేషన్.. డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్
దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వేస్టేషన్ కాస్తా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌కు వేదికలాగా మారిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్యాసింజర్స్ బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. అలాంటి రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫామ్‌పై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం సిబ్బంది వాగ్వాదానికి దిగారు. అంతలోనే తీవ్ర కొట్లాటకు దారి తీసింది. ఒకరిపై ఒకరు చెత్తబుట్టలు విసురుకోవడం, బెల్టులుతో కొట్టుకోవడం, తన్నుకోవడం, పిడిగుద్దుల వర్షంతో భీతావాహం సృష్టించారు. దీంతో ప్రయాణికులంతా హడలెత్తిపోయారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌ను గుర్తుచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సురక్షితమైన దీపావళి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
దీపావళి వచ్చేస్తోంది.. పండుగ చిన్నా పెద్దల హడావుడి అంతా ఇంతా కాదు.. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో దీపాలు వెలిగించే సమయంలో.. బాణసంచా పేల్చే టైంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.. తెలిసి తెలియక చేసే తప్పులు.. కొన్ని సందర్భాల్లో కంటిచూపు కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చి పెట్టవచ్చు.. ఇంకా కొన్ని సార్లు వినికిడి సమస్యలు వచ్చేలా చేయొచ్చు.. కావును.. పెద్దల పర్యవేక్షణలోనే చిన్నారులు టపాసులు పేల్చాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.. సురక్షితమైన దీపావళి కోసం.. గాయాలను నివారించడానికి సమగ్ర గైడ్ సహాయపడుతుంది. భద్రతా ప్రోటోకాల్‌లను పాటించడం మరియు త్వరిత ప్రథమ చికిత్స చర్యల గురించి తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నిపుణులు నొక్కి చెబుతున్నారు. దీపావళికి ముందు, సమయంలో మరియు తరువాత భారతదేశంలో రికార్డు స్థాయిలో కాలిన గాయాలు నమోదవుతున్నందున, ఈ దీపావళిలో మీరు, మీ కుటుంబాన్ని, మిమ్మల్ని మీరు రక్షించుకునేలా చూసుకోవడానికి సరైన ఏర్పాట్లు చేసుకోవాలంటున్నారు.. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా , కాలిన గాయాలు, బాణసంచా సంబంధిత ప్రమాదాలు లేకుండా వేడుకలను ఆస్వాదించవచ్చు. దీపావళి స్ఫూర్తిని ఆలింగనం చేసుకుంటూనే భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పండుగ అందరికీ ఆనందకరమైన సందర్భంగా ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఆడనున్న రోహిత్, విరాట్.. తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గిల్..
పెర్త్‌లో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు సిద్ధమవుతోంది టీమిండియా.. ఇప్పటికే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత జట్టు.. రేపు జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు ప్రాక్టీస్‌లో మునిగిపోయింది.. అయితే, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో అనుభవజ్ఞులైన బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడబోతున్నారు.. అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఇద్దరూ గిల్ నాయకత్వంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ తొలిసారి ఆడుతుండడంతో.. ఆసక్తిరంగా మారింది.. ఈ పరిణామాలపై ఫస్ట్ టైం స్పందించారు టీమిండియా కెప్టెన్ గిల్.. అయితే, కెప్టెన్సీ మారినప్పటికీ రోహిత్‌తో తన అనుబంధం మారలేదని పేర్కొన్నారు గిల్.. క్రికెటర్‌గా గిల్ తన బాల్యంలో ఆరాధించిన ఆటగాడు కోహ్లీ విషయంలో కూడా ఇదే జరుగుతుందన్నారు.. బయట కథనాలు ఎలా ఉన్నా, మా మధ్య అలాంటిదేమీ జరగలేదు.. ఇది గత కాలంలాగే ఉంది. అతను చాలా సపోర్ట్‌గా ఉంటాడు.. ఎల్లప్పుడూ తన అనుభవాలను పంచుకుంటాడు.. నేను కూడా రోహిత్ సలహాలను తీసుకుంటాను అని స్పష్టం చేశాడు.. ‘నువ్వు కెప్టెన్ అయితే ఈ వికెట్‌పై ఏం చేసేవాడివి?’ అని నేను రోహిత్‌ను అడుగుతాను.. ఇతర ఆటగాళ్ల ఆలోచనలను తెలుసుకోవడం అంటే నాకు ఇష్టం” పెర్త్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నాడు గిల్..
వాళ్ళు ఇద్దరూ చాలా బిజీ.. తన కోడలపై అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ అందాల నటి, సీనియర్ యాక్ట్రెస్ అమల అక్కినేని ప్రస్తుతం సినిమాల కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో చివరిసారిగా తెరపై కనిపించిన ఆమె, అప్పటి నుంచి కొత్త సినిమాలకు సైన్ చేయకపోయినా పబ్లిక్ లైఫ్‌లో చురుకుగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల అక్కినేని, తన కోడళ్లైన శోభిత ధూళిపాల (నాగ చైతన్య భార్య), జైనబ్ (అఖిల్ అక్కినేని భార్య) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అమల మాట్లాడుతూ.. “నాకు అద్భుతమైన కోడలు ఉన్నారు. వాళ్లు చాలా మంచి వ్యక్తిత్వం కలవారు. వాళ్ల వల్ల నా జీవితం కొత్తగా మారిపోయింది. మా ఇంట్లో ఇప్పుడు నాకు ‘గర్ల్స్ సర్కిల్’ ఏర్పడింది. అలాగే వారు ఇద్దరూ తమ కెరీర్‌ల్లో చాలా బిజీగా ఉంటారు, ఇది నిజంగా మంచి విషయం. యువత ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండటం చాలా అవసరం. వాళ్లు తమ పనుల్లో బిజీగా ఉంటే నేను నా పనుల్లోనే బిజీగా ఉంటాను. సమయం దొరికినప్పుడు మేమంతా కలిసి సరదాగా గడుపుతాం. నేను డిమాండ్ చేసే అత్తను కాదు, అలాగే డిమాండ్ చేసే భార్యను కూడా కాదు” అంటూ నవ్వుతూ చెప్పారు. అలాగే నాగ చైతన్య, అఖిల్ గురించి మాట్లాడుతూ.. “వాళ్ళు ఇద్దరూ మంచి ఆలోచనతో ఎదిగారు. నాగార్జున గారికి వాళ్లపై అపారమైన ప్రేమ ఉంటుంది. నేను నా బాధ్యతల పట్ల చాలా కచ్చితంగా ఉంటాను. పిల్లల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండను. నా కుటుంభం పిల్లలు తర్వాతే వేరే ఏదైనా. ఇప్పటికైతే నా జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది” అంటూ చెప్పుకొచ్చింది అమల. మొదటి సారిగా తన కోడలపై స్పందించడంతో ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ – లోకేష్ కాంబినేషన్ ఫిక్స్..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే పాన్ ఇండియా డైరెక్టర్‌తో జతకడుతున్నారనే వార్త మీడియాలో సంచలనం రేపుతుంది. ఈ సినిమాను తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నదని..ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే సదరు సంస్థ అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతుంది టాక్. మని ఇంతకి ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? ఆ నిర్మాణ సంస్థ ఏంటీ అనే వివరాల్లోకి వెళితే.. రాజకీయంలో తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే పవన్ కల్యాణ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఓజీ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం సుమారుగా రూ. 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి పవన్ కెరీర్ లో ఊహించని హిట్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోపాటు మరో మూవీని కూడా పట్టాలేక్కించే పనిలో ఉన్నారట పవన్ కల్యాణ్. తమిళంలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ సంస్థ లో.. ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొన్న లోకేష్ కనకరాజ్ గానీ.. లేదా వినోద్ గానీ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయట. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే సెన్సేషనల్ న్యూస్ అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.