మరోసారి హస్తిన బాట.. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్..
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు.. ఉపరాష్ట్రపతి నామినేషన్.. అంతకు ముందు ఎన్డీయే పక్షాల సమావేశం ఎజెండాగా సీఎం చంద్రబాబు.. ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. మరోవైపు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు మంత్రి నారా లోకేష్ కూడా హస్తినకు వెళ్తున్నారు. ఎల్లుండి జరిగే ఎన్డీయేపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఈ రాత్రికి ఢిల్లీ వెళ్తున్నారు. 21న ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ సందర్భంగా చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆలోగా రేపు కొంతమంది కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. మంత్రి లోకేష్ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ఇప్పటికే పలుమార్లు ఆయా ప్రాజెక్టులపై చర్చించిన లోకేష్.. మరోసారి వాటి ప్రస్తావన తేనున్నారు రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు మంత్రి అశ్వనీ వైష్టవ్‌ని కలిసి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు చెబుతారు. అలాగే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలుస్తారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని, ఓడరేవులు, జలరవాణాశాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్ను, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ని కలుస్తారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తోనూ మంత్రి లోకేష్ సమావేశమవుతారు. వాళ్లందరికీ రాష్ట్రప్రభుత్వం తరపున పలురకాల ప్రతిపాదనలు, విజ్ఞప్తులు అందజేయనున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్.. రాష్ట్రప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు ఇవ్వనున్న మంత్రి లోకేష్
తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్.. జేసీ వర్సెస్ కేతిరెడ్డి..!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ… మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో శివుడి విగ్రహావిష్కరణ. దీంతో.. ఇవాళ ఏం జరగబోతోందన్న టెన్షన్ అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. గతం వైసీపీ ప్రభుత్వ హయాంతో పాటు.. కూటమి సర్కార్‌లోనూ తాడిపత్రి పాలిటిక్స్ కాకరేపుతూనే ఉన్నాయి.. జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంది.. హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్లనున్నారు పెద్దారెడ్డి. అయితే, మరోవైపు తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని జేసీ ఇప్పటికే పిలుపు ఇచ్చారు. అయితే.. శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డికి పోలీసులు సూచించారు. కానీ… ఎలాగైనా కార్యక్రమం నిర్వహించి తీరుతామంటున్నారు జేసీ వర్గీయులు. దీంతో, తాడిపత్రిలో ఏం జరుగుతుంది అనేది టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది..
వాయుగుండంతో అప్రమత్తమైన రైల్వే శాఖ.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు..
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.. ఇక, వాయుగుండం ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది.. ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. గడచిన 24 గంటల్లో విశాఖలోని కాపులుప్పాడలో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరంజ్ ఎలెర్ట్ జారీ అయ్యింది.. నేడు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్య అవకాశం ఉండగా.. తీరం వెంబడి ఈదురు గాలుల ప్రభావం కొనసాగుతోం.. కోస్తా తీరం వెంబడి పోర్టులకు మూడవ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు.. అయితే, వాయుగుండం ఎఫెక్ట్‌తో అప్రమత్తమైన తూర్పు కోస్తా (తూ.కో.) రైల్వే శాఖ.. కేకే లైన్‌లో పలు రైళ్లు దారి మళ్లించింది.. మరికొన్ని రైళ్లు రద్దు చేసినట్టు ప్రకటించారు..మరోవైపు, అరకు పర్యాటక రైలు ఇవాళ, రేపు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఇక, దారిమళ్లిన రైళ్లను పరిశీలిస్తే.. 18515 విశాఖ – కిరండోల్ నైట్ ఎక్స్ ప్రెస్ ను దారిమళ్లించారు.. ఇప్పటికే అరకు చేరుకున్న 58501 విశాఖ – కిరండోల్ రైలును వెనక్కి రప్పిస్తున్నారు అధికారులు..
దమ్ముంటే రా.. తేల్చుకుందాం.. కేతిరెడ్డికి జేసీ సవాల్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజకీయం కాకరేపుతోంది.. కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా… తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీపై స్పందించిన జేసీ… కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు.. కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.. హైకోర్టు ఆర్డర్ ఉంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రావచ్చు అన్నారు.. అయితే, గతంలో టిడిపి నాయకులకు కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నా… కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదు? ఎందుకు అని నిలదీశారు.. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కాదు… ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలని సలహా ఇచ్చారు.. అయితే, పోలీసులపై అనవసర ఆరోపణలు చేయొద్దు అని సూచించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాకు ఆ రోజు గన్‌మెన్లు లేరు.. ఈరోజు కూడా గన్‌మెన్లు లేరన్న ఆయన.. కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం… ఏకే 47లతో గన్‌మెన్లు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.. కాగా, హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు రెడీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. కానీ, నారాయణరెడ్డిపల్లి వద్ద పెద్దారెడ్డిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు.. అయితే, జేసీ వర్సెస్ పెద్దారెడ్డి రాజకీయాలతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి..
వైఎస్ జగన్‌కు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్.. మాకు మద్దతివ్వండి..!
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించిన ఎన్డీఏ.. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.. ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. విపక్ష పార్టీలు అభ్యర్థి పెట్టకుండా తమ అభ్యర్థికే మద్దతు పలకాలని చర్చలు మొదలు పెట్టారు కమలనాథులు. ప్రతిపక్ష నేతల మద్దతు కోసం వాళ్లతో చర్చించడానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ ఫోన్‌లో మాట్లాడిన రాజ్‌నాథ్.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కూడా ఫోన్ చేశారు.. ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని వైఎస్ జగన్ ను కోరారు రాజ్‌నాథ్ సింగ్.. రాజ్యసభలో వైసీపీకి ఏడుగురు సభ్యుల బలం ఉండగా.. ఇటు లోక్‌సభలో వైసీపీకి నలుగురు సభ్యులు ఉన్నారు.. దీంతో, వైసీపీ అధినేతకు ఫోన్ చేసి.. మద్దతుకోరారు రాజ్‌నాథ్.. ఇక, బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు వైఎస్ జగన్.. అయితే, బీజేపీ ప్రతిపాదనపై వైసీపీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. గతంలోనూ పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచారు వైఎస్ జగన్.. ఇక, ఇటీవలే రాహుల్ గాంధీపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేయడంతో.. ఇప్పుడు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైఎస్ జగన్ మద్దతు ప్రకటిస్తారనే చర్చ సాగుతోంది..
నిండు కుండలా హుస్సేన్ సాగర్.. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి ఉప్పొంగిన వరద నీరు!
గత రెండురోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని కాలువలు, చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లు నీళ్లతో కలకాలాడుతున్నాయి. ఇందులో భాగంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ ప్రస్తుతం వరద నీటితో ఉప్పొంగిపోతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో సరస్సు నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్‌ను దాటింది. బంజారా, పికెట్, కూకట్‌పల్లి, బుల్కాపూర్ నాళాల ద్వారా హుస్సేన్ సాగర్‌లోకి వరద నీరు భారీగా వస్తోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ సరస్సులోకి 1873 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1438 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ద్వారా నీటిని బయటకు వదులుతున్నారు అధికారులు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమేనా?
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. విపక్ష పార్టీలు అభ్యర్థి పెట్టకుండా తమ అభ్యర్థికే మద్దతు పలకాలని చర్చలు మొదలు పెట్టారు కమలనాథులు. ప్రతిపక్ష నేతల మద్దతు కోసం వాళ్లతో చర్చించడానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 9 న ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ జరగనుంది. ఆగస్టు 21 నామినేషన్లకు చివరి రోజు. దాంతో ఇప్పటికే ఎన్డీయే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించింది. రాధాకృష్ణన్ అభ్యర్థిత్వంపై ఎన్డీయే కూటమిలో ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఉండవు కూడా. అయితే తమ అభ్యర్థి గెలుపు కోసం కావాల్సిన పూర్తి మెజారిటీ తమకు ఉన్నప్పటికీ, ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా ప్రయత్నాలు చేస్తుంది ఎన్డీయేలో పెద్దన్న కమలం పార్టీ.
జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్‌బరస్ట్.. ఏడుగురు మృతి
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. కథువాలో ఆకస్మిక వరదలు కారణంగా ఏడుగురు చనిపోయారు. జోధ్ ఘాటిలో వరదలు కారణంగా ఐదుగురు చనిపోతే.. జాంగ్లోట్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం-ఆదివారం మధ్య రాత్రి సమయంంలో ఈ క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఒక్కసారిగా వరద ముంచుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఒక రైల్వే ట్రాక్, జాతీయ రహదారి-44, ఒక పోలీస్ స్టేషన్ కూడా తాజా వరదల్లో దెబ్బతిన్నాయని చెప్పారు. వెంటనే సైన్యం, పారామిలిటరీ దళాలు వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కథువా సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
ముదురుతున్న ఓట్ల చోరీ వివాదం.. సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు ప్లాన్
దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీ వివాదం ముదురుతోంది. ఎన్నికల సంఘం-ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని ఆధారాలను కూడా రాహుల్‌గాంధీ చూపించారు. దీనికి కౌంటర్‌గా ఆదివారం ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించింది. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఓట్ల చోరీపై ఆధారాలు చూపించాలని.. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఈసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం ఉంటుుంది. కానీ ప్రతిపక్షాలకు పార్లమెంట్‌లో అంత బలం లేదు. ఈ నేపథ్యంలో అభిశంసన తీర్మానం పెడతారా? లేదా? అని తేలాల్సి ఉంది.
పసిడి ప్రియులకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇలా..!
పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా హెచ్చు తగ్గులుగా ఉన్న బంగారం ధరలు గత వారం బాగానే తగ్గుముఖం పట్టాయి. ట్రంప్ సుంకాలు కారణంగా బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోతాయని గోల్డ్ లవర్స్ ఆందోళన చెందారు. కానీ అందుకు భిన్నంగా ధరలు తగ్గుతుండడంతో బంగారం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వారం ప్రారంభంలో ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ప్రస్తుత ధరలు యథావిధిగానే ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01, 180 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,890 దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ధర మాత్రం షాకిచ్చింది. కేజీ వెండిపై రూ.800 పెరిగింది. ప్రస్తుతం రూ.1,17, 000 దగ్గర ట్రేడ్ అవుతుంది. చెన్నైలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.1, 27, 00 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం రూ.1,17,000 దగ్గర ట్రేడ్ అవుతుంది.
లండన్ వీధుల్లో భార్యతో కలిసి స్వేచ్ఛగా షికార్లు కొడుతున్న కోహ్లీ.. వీడియో వైరల్
విరాట్ కోహ్లీ.. అది పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. టాప్ రేటెడ్ బ్యాట్స్‌మన్‌గా ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభతో పేరుగాంచిన ఈ క్రికెటర్ 2008 లో అంతర్జాతీయ క్రికెట్‌లో డెబ్యూ చేసి టీ20, టెస్ట్, ODIలో భారత జట్టు కోసం అనేక రికార్డులు సృష్టించారు. కోహ్లీ 2014 నుండి 2022 వరకు భారత జట్టు కెప్టెన్‌గా కొనసాగారు. ఇక గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 లకు రిటైర్మెంట్ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చారు. దీనితో ప్రస్తుతం వన్డే టీంలో మాత్రమే ఆయన కొనసాగనున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం టీమిండియాకు ఎలాంటి మ్యాచ్ లు లేకపోవడంతో కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి లండన్ విధుల్లో సంతోషంగా, అందంగా విహరిస్తున్నారు.
వెంకీ అట్లూరి – సూర్య ‘టైటిల్’ ఇదే
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. కానీ ఇన్నిరోజులు సూర్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయలేదు. ఇప్పడు ఇన్నాళ్ళకు సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన సూర్య బర్త్ డే పోస్టర్ కు మంచి స్పందన లభించింది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అనిల్ కపూర్ పాత్ర ముఖ్య భూమిక పోషిస్తుందట. అయితే యునిట్ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారట. ప్యూర్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గా వస్తున్న ఈ సినిమాకు ‘ విశ్వనాధం అండ్ సన్స్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. కథకు తగ్గట్టు ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అందుకే ఆ టైటిల్ ను ఫిక్స్ చేసారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారట. విశ్వనాధం అండ్ సన్స్ వెంకీ అట్లూరి కిరీర్ లో బెస్ట్ వర్క్ ఫిల్మ్ అవుతుందని యూనిట్ ధీమాగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా G.V ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
‘భారత్ మాతాకీ జై’ వివాదం పై.. కౌంటర్ ఇచ్చిన జాన్వీ
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడ కనిపించినా ట్రెండ్ అవుతుందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ముంబయిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జాన్వీ ఉత్సాహంగా అందరితో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశారు. అయితే ఒక సందర్భంలో ఆమె ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించగా, సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ మొదలుపెట్టారు. “స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి వేరు.. ఈ సందర్భంలో ఆ నినాదం అవసరమా?” అంటూ విమర్శలు చేశారు. దీంతో ఈ ట్రోల్స్‌కి జాన్వీ సూటిగా స్పందించింది. తన ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘అక్కడ పాల్గొన్నవారంతా ముందే ‘భారత్ మాతాకీ జై’ అన్నారు. తర్వాత నేను కూడా అన్నాను. కానీ వీడియోను కట్ చేసి నా మాటలనే వైరల్ చేస్తున్నారు. అయినా దేశాన్ని పొగడటానికి ఒక ప్రత్యేక రోజుకే పరిమితం కాదు. ప్రతిరోజూ నేను గర్వంగా ‘భారత్ మాతాకీ జై’ అంటాను’’ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, ఈ వేడుకలో జాన్వీ మరాఠీలో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. తన రాబోయే చిత్రం ‘పరమ్ సుందరి’ (ఆగస్టు 29న విడుదల)ని తప్పక చూడమని అభిమానులను కోరింది. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
వారెవ్వా.. మోక్షజ్ఞ.. లుక్ అదిరింది అబ్బాయ్
గత కొన్నేళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు. అందుకే సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాదాపు ఏడాదిగా ఈ సినిమాను అలా పక్కన పెట్టేసారు. ఇక మోక్షు కూడా ఇటీవల కాలంలో బయట ఎక్కడ కనిపించలేదు. అసలు మోక్షు సినిమాల్లోకి వస్తాడా లేదా అని అనుమానం కూడా కలిగింది. అయితే మోక్షు సినీ ఎంట్రీ అనేది తప్పకుండా ఉండబోతుంది. అందుకు తగ్గట్టే తన లుక్ ను కూడా మైంటైన్ చేస్తున్నాడు ఈ యంగ్ లయన్. చాలా రోజుల తర్వాత మోక్షు ఫ్యామిలీ ఫంక్షన్ లో దర్శనమిచ్చాడు. తండ్రికి తగ్గ కొడుకులాగా సూపర్ కూల్ లుక్ లో మాస్ అప్పీల్ తో సూపర్ గా ఉన్నాడు మోక్షు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నందమూరి నటసింహం వారసుడు సింబా త్వరలోనే వెండితెర అరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నామని నందమూరి అభిమానూలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య వారసుడి ఎంట్రీ ఎప్పుడైనా సరే తొలి సినిమాతో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. బి బహుశా ఆ సినిమాతో మోక్షు టాలీవుడ్ ఎంట్రీ ఉండొచ్చు.