శ్రీశైలంలో కార్తీక మాసం చివరి సోమవారం సందడి
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం తరలివచ్చారు. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, కార్తీక మాసం పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తులు శివనామ స్మరణలో తరిస్తున్నారు. భారీ రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం చేసే అవకాశం కల్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు దీర్ఘ క్యూల్లో నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీ స్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక, కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కిటకిటలాడుతోంది.
స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ఆందోళనకు దిగిన కార్మికులు..
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి కార్మికులు ధర్నాకు దిగారు.. దీంతో, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట కార్మికులు భారీ స్థాయిలో మహా ధర్నా చేపట్టారు. కార్మికుల వేతనాలను ఉత్పత్తి ఆధారంగా చెల్లించాలన్న సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నాణ్యమైన రా మెటీరియల్స్ సరఫరా, యంత్రాల మరమ్మతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని.. ఇప్పుడు తమ వైఫల్యాలను కార్మికులపై మోపడం అన్యాయం అని మండిపడుతున్నారు కార్మికులు.. దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే మంత్రులు, ఎంపీలు జీతాలు తగ్గించుకున్నారా?” అని ప్రశ్నించారు. కార్మికులను కవ్వించి ఉద్యమాన్ని అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ చర్యలు కార్మికుల పొట్టగొట్టే కుట్రలే అని జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా విమర్శించింది. ఈ పరిణామాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సుదీర్ఘ ఉద్యమం కొనసాగిన విషయం విదితమే..
వైసీపీ పాలనలో ఒక్క M.O.U జరగలేదు.. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలకు భరోసా వచ్చింది..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పరిశ్రమలకు సంబంధించిన ఒక్క M.O.U జరగలేదు.. కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటుంది అనే భరోసా వచ్చింది అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్.. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన. పరిశ్రమల రంగంలో వైసీపీ పాలన పూర్తిగా విఫలమైందని, వారి అధికార కాలంలో ఒక్క పరిశ్రమలకు సంబంధించిన M.O.U కూడా జరగలేదని మండిపడ్డారు. అయితే, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పరిశ్రమల అభివృద్ధిలో ఉన్న పాత్ర అపారమైనది ప్రశంసించారు.. ఇండియాలో పరిశ్రమల ఏర్పాటు కోసం సింగిల్ విండో సిస్టమ్‌ను తీసుకు వచ్చిన ఘనత పూర్తిగా చంద్రబాబు నాయుడిదే అని ప్రశంసించారు. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం ఆయన నాయకత్వంలోనే సాధ్యమైందని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమల ఏర్పాటు తప్పనిసరి… పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి అన్నారు ఎంపీ పుట్టా మహేష్.. పరిశ్రమలు వస్తేనే ఆదాయం పెరుగుతుంది.. ఉద్యోగాలు వస్తాయి.. రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ఇక, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మోడల్ రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలను సృష్టించబోతుందని చెప్పారు. ఏపీలో భవిష్యత్తులో లక్షలాది మంది యువతకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నమ్మి పెట్టుబడిదారులు రాష్ట్రంలోకి రావడం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఇతర దేశాల ప్రజలు కూడా మన రాష్ట్రానికి వచ్చి పని చేసే స్థాయి ఏర్పడుతుంది అని పుట్టా మహేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇంటినుంచి పారిపోయిన అమ్మాయి.. పట్టించిన ఫ్రీ వైఫై..!
అలిగి ఇంటినుంచి వెళ్లిపోయిన అమ్మాయిని ఫ్రీ వైఫై పట్టించింది.. ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటి నుంచి అలిగి వెళ్లిన పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. చదువుపై తల్లి మందలించడంతో ఆవేశంలో పరీక్ష ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లిన హారిక.. ఆ తర్వాత అదృశ్యమైంది. అయితే, తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు పోలీసులు, 12 రోజుల పాటు ఆమె ఆచూకీ కోసం వెతికారు. తాను ఉన్న లొకేష్ దొరకకూడదని భావించి హారిక తన మొబైల్‌లో ఉన్న సిమ్ కార్డ్‌ను తీసేసి, ఎలాంటి కాల్ ట్రేసింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయినా ఆమె ప్రయాణం మాత్రం ఆగలేదు. బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల్లో తిరుగుతూ, కేవలం రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లో లభించే ఫ్రీ వైఫై ఆధారంగా ఇన్‌టర్నెట్ వాడుతూ ముందుకు సాగింది.. అయితే, ఫ్రీ వైఫై లాగిన్‌తో కేసు ఛేదించారు పోలీసులు.. సిమ్ లేకపోయినా, పబ్లిక్ వైఫై లాగిన్ డేటాతో ఆమె లొకేషన్ ట్రేస్ చేయగలిగింది పోలీసుల టెక్నికల్ టీమ్. ఒక్కొక లొకేషన్‌ను వెరిఫై చేయడం ద్వారా హారిక ప్రయాణ మార్గాన్ని అంచనా వేసి.. చివరకు ఆమెను రాజమండ్రి పరిసరాల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
రైతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ’ మరియు పీఎం కిసాన్ పథకాల రెండో విడత నిధుల విడుదలకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఈ నిధుల విడుదలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులుతో సమీక్ష నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు మంత్రి మార్గదర్శకాలు జారీ చేశారు.. ఈ నెల 19వ తేదీన, అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేయనున్నారు. అదే రోజున పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక, సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. చనిపోయిన రైతుల వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు.. NPCAలో ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.. అర్హత ఉన్న రైతులు సులభంగా రిజిస్టర్ చేసుకునేలా ఆన్‌లైన్ వ్యవస్థను సింప్లిఫై చేయాలని సూచించారు..
ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టుధిక్కారంపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్‌కి దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్. గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. “మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే.. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి..” అని జస్టిస్ బీఆర్ గవాయి స్పష్టం చేశారు. నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి వెల్లడించారు.
రవిని పట్టుకుంటే పోలీసులపై మీమ్స్ చేయడం సరికాదు.. “మీమర్స్‌కు” సజ్జనార్ హెచ్చరిక..
ఐ-బొమ్మ ఇమ్మడి రవి టెలిగ్రామ్ యాప్‌లో కూడా పైరసీ సినిమాలు అప్లోడ్ చేశాడని సీపీ సజ్జనార్ వెల్లడించారు.. పైరసీ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేశాడని స్పష్టం చేశారు. తాజాగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జనార్ ప్రసంగించారు. ఐ బొమ్మ సైట్‌ను క్లిక్ చేయగానే.. బెట్టింగ్ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడని తెలిపారు. One win, one X betను ఎక్కువగా ప్రమోట్ చేశాడు.. Apk ఫైల్స్ ను డౌన్లోడ్ చేయించాడు. వ్యక్తిగత సమాచారం దోచుకున్నాడన్నారు. ఇలాంటి వెబ్సైట్ ల జోలికి వెళ్లొద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అని సవాల్ విసిరాడు.. ఇమ్మడి రవి ఇప్పుడు ఎక్కడున్నాడు మరి..!! హైదరాబాద్ పోలీస్ ను అంత తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు… కొన్ని నెలల పాటు శ్రమించి ఇమ్మడి రవిని పట్టుకున్నామన్నారు. ఇమ్మడి రవిని పట్టుకున్న తర్వాత చాలా మంది పోలీసుల పైన మీమ్స్ చేస్తున్నారు. అది సరైంది కాదు.. చేసే వాళ్ళ పైన కూడా నిఘా ఉంటుందని హెచ్చిరించారు.. ఫ్రీగా వస్తుంది కదా అని ఐ బొమ్మను ఎంకరేజ్ చేశారు. కానీ మీ డేటా మొత్తం చోరీ కి గురైంది. ఆ విషయం మర్చిపోయారన్నారు.
“సాయంత్రం వరకు క్లారిటీ”.. సౌదీ బస్సు ప్రమాదంపై ఎంఐఎం ఎమ్మెల్యే కీలక ప్రకటన..
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే తనకు కాల్ చేశాడన్నారు. మోహదీపట్నంలో బాధిత కుటుంబాలను కలిశాన్నారు. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. అసరుద్దీన్ ఓవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు. బాధ్యత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రతి కుటుంబాన్ని స్వయంగా వెళ్లి కలుస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 11 గంటలకు సౌదీ అరేబియాకు తమ పార్టీ తరఫున ఐదుగురిని పంపినట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు వాళ్లు అక్కడికి చేరుకుంటారన్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత క్లారిటీ వస్తుందని వెల్లడించారు.. మృతదేహాలను ఇక్కడికి తీసుకురావడానికి అవకాశం ఉందా? లేదా అనే విషయంపై సాయంత్రం క్లారిటీ వస్తుందన్నారు.
బ్లాస్ట్‌కు ముందు 2 కీలక ఫోన్లు మిస్సింగ్.. ఉమర్ ఎవరికిచ్చాడు? పూర్తి డేటా వచ్చేసింది
ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో తాజాగా అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడెక్కడ తిరిగాడో ఆ సీసీటీవీ ఫుటేజ్‌లను అధికారులు సేకరించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్‌లో ఉమర్ రెండు సెల్‌ఫోన్లు ఉపయోగించినట్లుగా గుర్తించారు. అయితే పేలుడు సమయంలో ఈ రెండు ఫోన్ల ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో దర్యాప్తు అధికారులు ఫోన్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఆ రెండు ఫోన్లు ఎలా మిస్ అయ్యాయి. బ్లాస్ట్‌కు ముందు ఉమర్ ఎవరికైనా ఇచ్చాడా? లేదంటే ఎక్కడైనా భద్రపరిచాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫోన్లలోనే కీలక సమాచారం ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుడుకు ఒక రోజు ముందు నవంబర్ 9న ఉగ్రవాది ఉమర్.. ఫరీదాబాద్, నుహ్, బల్లబ్‌గఢ్, సమీప ప్రాంతాల్లో సంచరించినట్లుగా దర్యాప్తు అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ను బట్టి గుర్తించారు. ఉమర్ ప్రయాణించిన మార్గంలో మసీదులు, లాడ్జీలు, కోచింగ్ సెంటర్లు, స్నాక్స్ సెంటర్లు, మెడికల్ స్టోర్లలో ఉన్న సీసీకెమెరాలను అధికారులు జల్లెడ పట్టారు. ఈ సీసీటీవీలో రికార్డైన దానిని బట్టి చూస్తే.. ఎవరో ఉమర్‌కు మార్గనిర్దేశం చేస్తున్నట్లుగా కనిపెట్టారు. అంతేకాకుండా అతనికి నిధులు కూడా సమకూర్చినట్లుగా తెలుస్తోంది.
ఎల్పీజీపై అమెరికాతో భారత్ కీలక ఒప్పందం.. ధరలు తగ్గే అవకాశం!
అమెరికాతో వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఎల్‌పీజీ దిగుమతిపై అమెరికాతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురీ వెల్లడించారు. భారత ప్రజలకు అందుబాటు ధరలో ఎల్పీజీని అందించే క్రమంలో కీలక ముందడుగు పడిందని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పేర్కొన్నారు. యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి ఈ ఎల్పీజీ రానుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో వెల్లడించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీలు అమెరికన్ సంస్థలతో గత కొన్ని నెలలుగా చర్చలు జరిపినట్లు వివరించారు. ప్రపంచంలోనే ఎల్పీజీ ఉపయోగించడంలో భారతదేశం రెండో అతి పెద్ద దేశం. ఇలాంటి తరుణంలో ఎల్పీజీ దిగుమతిపై అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఉజ్వల యోజన పథకం కింద కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. తాజా ఒప్పందంతో గృహవినియోగదారులందరికీ కూడా తక్కువ ధరకే ఎల్పీజీ దొరికే అవకాశం ఉంది. గతేడాది ఎల్పీజీ ధరలు ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం పెరిగినా.. భారత్‌లో మాత్రం ఉజ్వల లబ్ధిదారులకు కేవలం రూ.500-550కే లభించింది. తాజాగా అమెరికాతో ఒప్పందం ప్రకారం గృహ వినియోగదారులందరికీ ఉపశమనం లభించే ఛాన్సుంది.
3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP69K/69/68/66 డ్యూరబిలిటీ రేటింగ్‌లతో లాంచ్‌కు సిద్ధమైన Honor 500 సిరీస్..!
Honor సంస్థ కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ Honor 500 ను ఈ నెల 24న చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో Honor 500, Honor 500 Pro మోడళ్లు లాంచ్ కానున్నాయి. ఈ మొబైల్స్ సంబంధించి కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, అధికారికంగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఫోన్‌ల వెనుక భాగం డిజైన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ ఎయిర్-స్టైల్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ బ్యాక్ డిజైన్ స్పష్టంగా వీటిలో కనిపిస్తున్నాయి. Honor 500 సిరీస్ ఈసారి భారీ స్పెసిఫికేషన్లతో రానుందని సమాచారం. సాధారణ Honor 500 మోడల్‌లో 6.55 అంగుళాల 1.5K 120Hz LTPS ఫ్లాట్ OLED డిస్‌ప్లే, 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ లభించనుంది. దీనిలో Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ను, కెమెరా విభాగంలో 200MP HP3 ప్రధాన సెన్సార్ (OISతో), 12MP అల్ట్రావైడ్ మరియు 50MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. అలాగే 8000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితోపాటు IP69K/69/68/66 రేటింగ్‌లు, మెటల్ ఫ్రేమ్, Honor యొక్క C1+, E2 చిప్‌లు, MagicOS 10 లాంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
సింగీతం దర్శకత్వంలో నాగ్ అశ్విన్ సినిమా?
నాగ్ అశ్విన్ ఇప్పటికే దర్శకుడిగా కొన్ని సినిమాలు చేశారు. నిర్మాతగా మారి జాతి రత్నాలు లాంటి హిట్ సినిమా నిర్మించారు. ప్రస్తుతం కల్కి సినిమాను పూర్తిచేసిన ఆయన, ఇప్పుడు కల్కి సెకండ్ పార్ట్ కోసం పనిచేస్తున్నారు. ప్రభాస్ ఖాళీ అయిన వెంటనే ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాగ్ అశ్విన్ మరోసారి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించబోయే ఒక సినిమాను ఆయన నిర్మించబోతున్నారు. నిజానికి నాగ్ అశ్విన్ సింగీతం గారితో గతంలో కూడా కొన్ని సినిమాలకు కలిసి పని చేశారు. వీరిద్దరూ కలిసి మహానటి తో పాటు ఇటీవల విడుదలైన కల్కి సినిమాకి కూడా కొంత వర్క్ చేశారు. ఆ తర్వాత సింగీతం తాత్కాలికంగా దూరమైనా, నాగ్ అశ్విన్ మాత్రం ఆయన పట్ల గాఢ గౌరవం కలిగి ఉన్నారు. ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లో డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ఒక సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించబోతున్నారని సమాచారం. అయితే ఇది ఎప్పుడు నిజమవుతుందో, కాలమే నిర్ణయించాలి
తమిళనాడు పోలీసులు చేయలేనిది తెలంగాణా పోలీసులు చేసి చూపించారు.. హ్యాట్సఫ్
హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శక దిగ్గజం రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబు భేటీ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ను పట్టి పీడిస్తున్న పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని రెండు రోజుల క్రితం హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. రవి నుండి కీలక సమాచారాన్ని సేకరించి మరికొన్ని పైరసీ వెబ్‌సైట్స్ కు అడ్డుకట్ట వేశారు పోలీసులు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపారు సినిమా పెద్దలు. అనంతర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అక్కినేని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేసారు. నాగార్జున మాట్లాడుతూ ‘ తెలంగాణ పోలీస్ శాఖ వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఐ బొమ్మ రవి అరెస్ట్ అవగానే చెన్నై నుంచి ఒక వ్యక్తి కాల్ చేశాడు. ఇక్కడ మేము చేయలేని పని మీ తెలంగాణ పోలీస్ చేశారని గర్వంగా చెప్పాడు. ఐ బొమ్మ రవి 50 లక్షల మంది పర్సనల్ డేటా చోరీ చేశాడు. వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నాడు. 6 నెలల క్రితం మా ఫ్యామిలీ మెంబర్ ఒకరిని 2 రోజులపాటు డిజిటల్ అరెస్ట్ లో పెట్టారు. ఆ సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చాం. వారు మా వాళ్ళని కాపాడారు. డబ్బులు లేకుండా ఇంట్లో కూర్చుని ఉచితంగా సినిమా చూస్తున్నాం అని మాత్రం అనుకోకండి. మీ డేటా చోరీ అవుతుంది అనేది గుర్తుంచుకోండి. మీకు తెలియకుండా మీ పర్సనల్ డేటా మొత్తాన్ని పైరసీ కేటుగాళ్లు సేకరిస్తున్నారు. ఇండస్ట్రీని ఈ పైరసీ భూతం నుండి కాపాడిన తెలంగాణ పోలీసులకు, సీపీ సజ్జనార్ కు ధన్యవాదాలు’ అని అన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలయ్యలకు ఘన సన్మానం
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ చిత్ర సినిమాలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తీ చేసుకున్నారు. ఈ సందర్భంగా రజనీ, బాలయ్య అరుదైన సత్కారం అందుకోబోతున్నారు. గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల ముగింపు వేడుకలో రజినీకాంత్, బాలయ్యను ఇఫీ – 2025 సత్కరించనుంది. కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ గోవాలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 1975లో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’తో వెండితెరకు పరిచయమై సూపర్ స్టార్ గా ఎదిగి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తమిళ చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసి తలైవర్ గా జేజేలు అందుకుంటున్నాడు. తాతమ్మ కల సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలయ్య సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలలో నటించి గాడ్ ఆఫ్ మాస్ గా ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పటికి చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా కొనసాగుతు సామజిక సేవా కార్యక్రమల్లోనూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన నటించిన ‘అఖండ 2’ డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు.