రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం.. ఏపీలో అమల్లోకి కొత్త విధానం..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అపాయింట్‌మెంట్ తీసుకునేలా డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను తీసుకొచ్చారు. ఆన్‌లైన్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ప్రజలు వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీని ద్వారా డిజిటల్‌గా రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ తీసుకునే అవకాశం ఉంది. తద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌లు, వివాహ రిజిస్ట్రేషన్ లాంటి సేవలను ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకోగానే సబ్ రిజిస్ట్రార్ కు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ జనరేట్ అవుతుందని స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్ సేవలను ఉచితంగానే అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా నమోదు అయిన స్లాట్‌లను రద్దు చేసుకుంటే వంద రూపాయలు, సమయం మార్పు చేస్తే రెండు వందల రూపాయలు చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న ముందు రోజే ఆన్‌లైన్ ద్వారా డాక్యుమెంట్ లను అప్‌లోడ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ కు సంబధించిన ఫీజులు కూడా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం. ఆన్ లైన్ డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా డిజిటల్‌గా రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ తీసుకునే అవకాశం ఉంటుంది.. తద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రెషన్‌లు, లేదా వివాహ రిజిస్ట్రేషన్ లాంటి వివిధ సేవలను ఎంపిక చేసుకునే వీలు కల్పించింది ఏపీ ప్రభుత్వం.. ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకోగానే సబ్ రిజిస్ట్రార్‌కు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ జనరేట్ అవుతుంది..
లవర్స్ డే రోజు దారుణం.. ప్రేమించలేదని యువతిపై యాసిడ్ దాడి.. ఆ తర్వాత..
ప్రేమికుల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదంటూ ఓ యువతిపై యాసిడ్ దాడి చేశాడు ప్రియుడు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.. జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన జనార్దన్, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె గౌతమి (23) పై మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ తో దాడి చేశాడు. గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. గౌతమికి ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి నిశ్చయం అయింది. ఏప్రిల్ 29న పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్ తో పెళ్లి జరగాల్సి ఉంది.. అయితే, అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్.. ప్యారంపల్లికి చేరుకుని గౌతమిని ప్రేమించమంటూ వెంటపడ్డాడు.. ఈ రోజు సదరు యువతి తల్లితండ్రులు పాలు పిండటానికి వెళ్లడం గమనించి అక్కడికి వెళ్లి గౌతమి తలపై కత్తితో దాడి చేశాడు.. ఆ తర్వాత మొహంపై యాసిడ్ పోశాడు.. తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంత్రి సంధ్యారాణి గన్‌మెన్‌పై సస్పెన్షన్ వేటు..
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ వాహనం గన్‌మెన్ జీవీ రమణపై సస్పెన్షన్ వేటు పడింది.. రమణ డ్యూటీ దిగి ఇంటికి వెళ్తుండగా బ్యాగ్ మాయమైంది. అందులో 30 బుల్లెట్లతో గన్ మ్యాగ్‌జైన్ ఉండటం పోలీసు శాఖలో కలకలం రేపింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి గాను రమణను విధుల నుంచి సస్పెండ్ చేశారు పార్వతీపురం జిల్లా ఎస్పీ.. పార్వతీపురం మన్యం జిల్లాలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రమణ.. మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనంలో గన్‌మన్‌గా ఉన్నారు. రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం తన వద్ద ఉన్న రైఫిల్‌ను పార్వతీపురం జిల్లా కేంద్రంలో అప్పగించారు. ఎప్పుడూ తన వెంట ఉండే సంచిలో భద్రపరిచిన బుల్లెట్లున్న మ్యాగ్‌జైన్ ను మాత్రం అప్పగించలేదు. విజయనగరం సమీప గ్రామానికి చెందిన రమణ.. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కూడలి వద్దకు వ్యక్తిగత పనులపై వెళ్లారు.. తనకు పరిచయమున్న ఆటోడ్రైవర్‌తో మాట్లాడి, కలక్టరేట్ వద్ద గల డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో తన చేతిలో సంచిని కింద పెట్టి, పనిలో పడిపోయారు.. తర్వాత చూస్తే.. తీరా సంచి కనిపించకపించలేదు. అందులో 30 బుల్లెట్లు ఉన్నాయంటూ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బ్యాగ్ కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీ లను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాగ్ ఆచూకీ లభించకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. కో-ఆర్డినేటర్ల నియామకం..
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీకలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచేది ఎవరూ అనేది తేలిపోయింది.. ఇక, ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే కూటమి పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.. సీఎం చంద్రబాబు మంత్రులకు, నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఈ తరుణంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు.. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయానికి జనసేన తరపున పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా సమన్వయకర్తలను నియమించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఆయా పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కూటమి నేతలతో సమన్వయం చేసుకొంటూ, నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం అభ్యర్ధుల విజయానికి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్..
వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలి: మంత్రి తుమ్మల
వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్లు గుర్తించాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మ్యారిగోల్డ్ హోటల్‌లో జరిగిన ‘నాబార్డ్’ స్టేట్ క్రెడిట్ సెమినార్ 2025-26కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… ‘రాష్ట్రంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్లు గుర్తించాలి. పశుపోషణ, మత్స్యపరిశ్రమ, కృషి ఆధారిత పరిశ్రమలు వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలి. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి’ అని అన్నారు.
“నా గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండు”.. ఏకలవ్యుడిని ఉదహరిస్తూ, విద్యార్థినికి టీచర్ వేధింపులు..
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థినిని తన ‘‘గర్ల్‌ఫ్రెండ్’’గా ఉండాలని కోరాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. తన గురుదక్షిణ కింద గర్ల్ ఫ్రెండ్‌గా మారమని కోరడం పెద్ద వివాదానికి దారి తీసింది. బాలిక పాఠశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. పాఠశాల అధికారులు రాష్ట్ర విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు, కానీ ఇప్పటి వరకు సదరు ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కిసాన్‌గంజ్ జిల్లాలోని కిసాన్ హైస్కూల్ ఉపాధ్యాయుడు వికాస్ కుమార్ 12వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఫోన్ చేసి పలుసార్లు వేధించాడు. ఇద్దరం కలిసి సిలిగురి వెళ్తామని ప్రపోజ్ చేశాడు. అసభ్యకరంగా ప్రవర్తించారని అమ్మాయి ఆరోపించింది. మహాభారతంలో ఎకలవ్యుడని ఉదాహరణగా తీసుకుని ద్రోణాచార్యుడిగా గురువుగా భావించి, గురుదక్షిణగా కుడి చేతి బొటనవేటు కోసి ఇచ్చాడని, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌వి ఎందుకు కాలేకపోతున్నావు అని ఉపాధ్యాయుడు ప్రశ్నించాడని విద్యార్థిన ఆరోపించింది.
భారత్‌కి ట్రంప్ F-35 ఆఫర్.. అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ ప్రత్యేకతలు ఇవే..
అమెరికాలో భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ముగిసింది. అంతకుముందు వైట్ హౌజ్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, ఒప్పందాలపై చర్చించారు. అయితే, ఈ సమయంలో భారత్‌కి ట్రంప్ ‘‘F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్’’ ఆఫర్ చేశారు. ప్రపంచంలో ఉన్న యుద్ధవిమానాల్లో F-35 అత్యంత అడ్వాన్సుడ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన యుద్ధవిమానంగా పేరుంది. ఈ ఉంటే శత్రుదేశాలు హడలి చావాల్సిందే. ‘‘మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాము. చివరికి భారతదేశానికి F-35 స్టీల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నాము’’ అని ట్రంప్ స్యంగా ప్రకటించారు. F-35 5వ జనరేషన్ యుద్ధవిమానం. స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉంది. శత్రుదేశాల రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలిగే సత్తా దీని సొంతం. దీంట్లో అధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, ఓపెన్ ఆర్కిటెక్చర్, అడ్వాన్సుడ్ సెన్సార్లు ఉంటాయి. ఈ లక్షణాల కారణంగా ఇది సుదూరాల్లో ఉన్న లక్ష్యాలపై ఈజీగా దాడులు చేయగలదు.
ఓటీటీ ప్రపంచంలో సత్తా చూపడానికి సిద్దమవుతున్న జియోహాట్‌స్టార్!
తాజాగా డిస్నీ స్టార్ ఓటీటీ లవర్స్‌కు ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘జియోహాట్‌స్టార్’ పేరిట ఒక కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ లను కలిపిన ప్లాట్‌ఫామ్ అని చెప్పవచ్చు. “స్ట్రీమింగ్‌లో సరికొత్త శకం” అంటూ డిస్నీ స్టార్ సంస్థ ఈ కొత్త ప్లాట్‌ఫామ్ కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇకపై ఈ రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌ను ఒకే యాప్‌లో చూడగలుగుతాం. గత కొంతకాలంగా జియోహాట్‌స్టార్ గురించి అనేక విషయాలు వినిపిస్తున్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో “జియోహాట్‌స్టార్” పేరు కనిపించడం, పలు యాడ్స్‌లో కూడా ఇదే పేరును చూడటం అన్నీ దీని నిజం అనేది స్పష్టమయ్యేలా చేశాయి. ఇప్పుడు ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు కలిసి పనిచేయబోతున్నాయి. నిజానికి, ఈ వ్యవహారం గత ఏడాది నుంచే ఆరంభమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వయాకామ్18, వాల్ట్ డిస్నీ కంపెనీలు కలిసి ఈ బిజినెస్‌ను మరింత సమ్మిళితంగా తీసుకురావాలని నిర్ణయించుకున్నాయి.
బన్నీ, త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్.. సినిమా బ్యాక్ డ్రాప్ ఇదేనట
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప 2తో అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ ను మరింతగా పెంచుకున్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. పుష్ప 2 సినిమాలోని విజయంతో బన్నీ అభిమానులలో తదుపరి ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది. కాగా, పుష్ప 3 సినిమాను వెంటనే చేయకపోవడం, తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేయనున్నాడో అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తింది. ఈ నేపథ్యంలో బన్నీ తదుపరి సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పని చేయనున్నాడని సమాచారం అందింది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించబడినప్పటికీ, ఇటీవల తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా బన్నీతో సినిమా చేయాలని అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, అట్లీ చెప్పిన కథ బన్నీకి నచ్చకపోవడంతో, అది వేరే హీరోతో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తోనే చేయబోతున్నాడని పటిష్టంగా వార్తలు వస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి ఈ సినిమాకు సంబంధించి పూర్తి నెరేషన్ ఇచ్చారని తెలుస్తోంది.
భయపెడుతున్న ‘రా రాజా’ వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్!
ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకు రాని ఓ కొత్త సబ్జెక్ట్.. ఎవ్వరూ టచ్ చేయని ఓ ప్రయోగంతో ఓ చిత్రం రాబోతోంది. అసలే ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు అంతా కూడా కొత్త కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. మొహాలు కనిపించుకుండా ఓ ట్రైలర్‌ను కట్ చేయడం అన్నది ఎలాంటి టెక్నీషియన్‌కు అయినా కష్టమే. అలాంటి ఓ విభిన్న ప్రయోగాన్ని ‘రా రాజా’ టీం చేసింది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ దర్శకత్వంలో ‘రా రాజా’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. రోమాలు నిక్కబొడుచుకునేలా, వెన్నులో వణుకు పుట్టేలా కట్ చేసిన ‘రా రాజా’ ట్రైలర్‌ను ఇది వరకే అందరం చూశాం. ఓ కెమెరామెన్ బ్రిల్లియన్స్, ఓ డైరెక్టర్ కొత్త విజన్, ఓ మ్యూజిక్ డైరెక్టర్ పనితనం ఆ ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఒక్క యాక్టర్ మొహం కూడా చూపించకుండా కట్ చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్, రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరా యాంగిల్స్‌తోనే అందరినీ భయపెట్టేశారు. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇంత వరకు సినిమా రాలేదు. అసలు ఇలాంటి ట్రైలర్‌ను ఇంత వరకు ఇండియన్ సినీ హిస్టరీలోనే చూసి ఉండరు. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ జనాల్లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. ఇక త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.
హరిహర వీరమల్లు సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ ఇదే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. గతనెలలో ఈ సినిమా నుండి స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలపించిన మాట వినాలి అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా అద్భుత స్పందన లభించింది. ఇక నేడు వాలంటైన్స్ డే ను పురస్కరించుకుని ఈ సినిమాకు సంబందిచిన మరొక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హరిహర వీరమల్లు నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘ కొల్లగొట్టిందిరో’ అనే సాగె లిరికల్ సాంగ్ ను ఈ నెల 24 న మూడు గంటలకు విడుదల చేస్తున్నాం అని తెలియజేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగార్వల్ తో ఉన్న స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్.