వైఎస్ ఉన్నా రాష్ట్ర విభజన ఆగేది కాదు..! కిరణ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే.. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేది కాదని చాలా మంది చెబుతుంటారు.. కానీ, ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి.. విజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, రాజశేఖర్ రెడ్డి తోనే రాష్ట్ర విభజనకు అనుకూలం అనే తీర్మానాన్ని 2009లోనే కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీలో పెట్టించాలని చూసిందని పేర్కొన్నారు.. 2014లో జరిగిన రాష్ట్ర విభజన 2009లోనే జరిగాల్సింది ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అప్పటి విషయాలను గుర్తుచేసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి.. నేను చీఫ్ విప్‌గా ఉన్నప్పుడు వైఎస్ పిలిచి ”మేం తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం’ అనే తీర్మానం అసెంబ్లీలో పెట్టాలని చెప్పారు.. ఇదేంటి ఎన్నికలకు వెళ్లే ముందు ఇలా పెడితే మనం ఒడిపోతాం అని తాను రాజశేఖర్‌రెడ్డితో అన్నాను. కానీ, నా చేతుల్లో ఏం లేదు.. రాష్ట్ర విభజన చేయాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడి.. ‘మేం తెలంగాణకు అనుకూలం’ అనే తీర్మానాన్ని ‘మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు’ అని మార్చి పెట్టామని వెల్లడించారు. అయినా రాష్ట్ర విభజన జరగదని అనుకున్నాం. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. వైఎస్ ఉన్నా రాష్ట్ర విభజన ఆగేది కాదంటూ కొత్త చర్చకు తెరలేపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి..
భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోవాలి.. సీఎం భోగి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు.. ”రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ అందరికి మరొక్క మారు భోగి పండుగ శుభాకాంక్షలు.” అంటూ ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
వారికి గుడ్‌న్యూస్.. రూ.6,700 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివిధ వర్గాలకు రావాల్సిన బిల్లులకు సంబంధించి కొంతకాలంగా ఒత్తిడి వస్తోంది.. పలు వర్గాలకు గత కొంత కాలంలో పెండింగ్ లో ఉండి ప్రభుత్వం చెల్లించాల్సిన బాకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది.. .దాదాపు 8 ఏళ్లుగా కూడా కొన్ని బిల్లులు చెల్లింపులు జగన్ సర్కార్ పెండింగ్ లో పెట్టింది.. అలా పెండింగ్ లో ఉన్న బిల్లుల్లో 6,700 కోట్లు రుపాయిలు నిధులు విడుదల చేశారు.. ఇందులో పది లక్షల లోపు బిల్లులు, ఉద్యోగుల జీపీఎఫ్, పోలీసుల సరెండర్ లీవులు, విద్యార్దుల ఫీజు రియంబర్స్ మెంట్ లాంటివి ఉన్నాయి.. గత జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు లక్షా 20 వేల కోట్లు రుపాయిలు పెండింగ్ లో పెట్టింది.. 2014 – 19 మధ్యలో టీడీపీ పాలనలో పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు.. అందులో చిన్ని చిన్న కాంట్రాక్టర్లు, చిన్న పరిశ్రమలకు చెల్లింపులు , విద్యార్ధుల ఫీజు రియంబర్స్ మెంట్ ఇలా అనేక మైన బిల్లులు పెండింగ్ లో పెట్టింది జగన్ సర్కార్.. అయితే రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కుటమి సర్కార్ కు పెండింగ్ బిల్లు చాలా పెను భారంగా మారింది.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో ఉంది.. దీనికి తోడు పెండింగ్ బిల్లులు చెల్లింపులు భారంగా మారింది.
నారా భువనేశ్వరి ముగ్గుల పోటీలు.. పాల్గొన్న అందరికీ రూ.10,116 బహుమతి..
తెలుగు లొగిళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.. పట్టణాలకు, పని చేసే ప్రాంతాలకు టాటా చెప్పి.. సొంత ఊరికి చేరుకున్నారు ప్రజలు.. ఇక, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు.. వివిధ రంగాల ప్రముఖులు సైతం సొంత ఊరికెళ్లి.. పండగ చేసుకుంటున్నారు.. ఈ రోజు తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు.. మరోవైపు.. నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో నారా, నందమూరి ఫ్యామిలీలో హుషారుగా పాల్గొంటున్నాయి.. సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.. ఇక, మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు నారా భువనేశ్వరి .. అంతేకాదు.. గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు సీఎం దంపతులు.. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాన్ష్ సహా పలువురు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. మరోవైపు నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. 15 ఈ ఆటోలు, నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రారంభించారు.. గ్రామంలో సబ్ స్టేషన్, ఏ.రంగంపేటలోని హైస్కూల్’లో కోటి రూపాయలతో డిజిటల్ క్లాస్ నిర్మాణానికి పునాదులు వేశారు.. సీఎం ఇంటి ఎదుట స్వర్గీయ నందమూరి రామారావు, బసవ తారకం విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.. ఇక, ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. ఈ పోటీల్లో పాల్గొన్న అందరూ గెలుపొందినట్టే.. విన్నర్లను డిసైడ్ చేయడం మాకు చాలా కష్టం అయ్యిందన్నారు.. అందరికీ బహుమతులు అందిస్తాం.. ఈ పండుగ మీతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉంది.. ఈ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాక్షించారు.. మరోవైపు.. భువనేశ్వరి మాట్లాడుతూ.. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. ముగ్గుల పోటీల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది.. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని కాదు.. ఈ పోటీల్లో 120 మంది పాల్గొన్నారు.. చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.. ఎంతో కష్టపడి ముగ్గులు పెట్టారు.. దీంతో.. ఈ పోటీల్లో పాల్గొన్నవారందరికీ ప్రతీ మహిళలకు సాయం చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారు.. వాళ్ల ఇళ్లకు రూ.10,116 పంపిస్తానని ప్రకటించారు.. డబ్బులతో వెల కట్టాలని కాదు.. వాళ్లను చూసి నాకు చాలా సంతోషం కలిగి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. అందరూ సంతోషంగా బతకాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్టు వెల్లడించారు నారా భువనేశ్వరి..
త్వరలో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటనలు ఉంటాయి.. జాగ్రత్తగా ఉండండి..!
ఖమ్మం జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ కారణంగా ఆలస్యంగా వచ్చానన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనలు ఉంటాయని తెలిపారు. అక్రమాలు జరుగకుండా చూడాలన్నారు. భవనాలు ఉన్న వారికి ఇళ్లు ఇస్తే మొదటి బాధ్యులు కలెక్టర్ అవుతారు.. అర్హులైన వారికి ఇళ్లు రావాలన్నారు. అధికారులు, సిబ్బంది కీలక పాత్ర వహించాల్సి వుంటుంది.. అధికారులు, సిబ్బంది అలసత్వం ఉండొద్దు.. గ్రామాలు మీ ఇళ్లు అనుకుని పని చేయండి అని మంత్రి సూచించారు. అలాగే, ప్రజా పాలనలో ప్రజలు ఎంతో ఆశతో, నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు అని రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వారి కోసం ఒక్కొక్కటిగా పని చేసి పెడుతున్నాం.. ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేస్తామన్నారు. దీనికి గాను సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.. దానికి మంత్రులు, అధికారులు అందరు హాజరయ్యారు.. ప్రతి అర్హుడైన పేదవాడికి న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. అర్హుడైన ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తాం.. రెవెన్యూ మంత్రి కూడ ఖమ్మం జిల్లాకు చెందిన వాడే ఆయన దగ్గర ఉండి మరి మీకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తారు.. 16 నుంచి 26 వరకు అధికారులు కష్టపడి, ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేయాలి.. పేదలకు ఇళ్లు అందేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
వేములవాడలో రూ.35 కోట్లతో అన్నదానం సత్రం నిర్మాణం
వేములవాడ రాజన్నను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు అది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీజన్ లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి ఆయుఆరోగ్యాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్న.. రైతంగా బాగుంటేనే అందరూ బాగుంటారు.. దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇక, విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మా విజ్ఞప్తి మేరకు అన్నదాన సత్రం నిర్మాణానికి 35 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారని చెప్పారు. 35 కోట్లతో అన్నదాన సత్రం భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. అన్నదాన సత్రం నిరంతరం జరగడానికి ట్రస్ట్ లో ఇప్పటికే 20 కోట్ల రూపాయలు ఉన్నాయి.. దానిని వంద కోట్లు చేసే బాధ్యత జిల్లా ప్రజా ప్రతినిధులది ఈ ప్రాంత ప్రజలది అన్నారు. అలాగే, మా కుటుంబం తరపున 40 లక్షల రూపాయలను ఆ రాజన్న స్వామి వారి నిత్యాన్నదాన సత్రంకు విరాళం ఇస్తున్నామని మంత్రి పొన్నం చెప్పారు.
మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలకు హాజరు కానున్న ప్రధాని మోడీ, మెగాస్టార్ చిరంజీవి
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజుల పండుగ సంబరాల్లో ఊరు-వాడ భోగి మంటలు వేసుకుని వేడుకలను మొదలు పెట్టారు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను అలంకరించారు. చిన్న నుంచి పెద్ద వరకు తరతమ బేధం లేకుండా పండుగ సంబరాల్లో మునిగిపోయారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కాగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గాను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం కిషన్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. కాగా సాయంత్రం 5 గంటలకు సంక్రాంతి సంబరాలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించనున్నారు. ఈ సంక్రాంతి వేడుకల్లో కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, అలాగే వెండితెర మెగాస్టార్ చిరంజీవి, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నేడు జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన జెడ్-మోడ్ టన్నెల్‌ను ప్రారంభించారు. ఈ టన్నెల్ గాందర్‌బల్ జిల్లాలో 12 కిలోమీటర్ల మేర రూ.2,400 కోట్లతో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై నిర్మించారు.
హోటల్‌లో డాక్టర్ డిజిటల్ అరెస్టు.. రూ.50లక్షలు పోకుండా కాపాడిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సైబర్ మోసాల కేసులు నిరంతరం వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది.. కానీ ఈసారి బరేలీ ఎస్పీ మనుష్ పరీక్ మోసం జరగకముందే ఆ వ్యక్తిని రక్షించారు. ఒక వైద్యుడిని సైబర్ దుండగులు డిజిటల్‌గా అరెస్టు చేశారు. ఇది మాత్రమే కాదు, డిజిటల్ అరెస్ట్ ద్వారా, మోసగాళ్ళు వైద్యుడిని రూ. 50 లక్షలు మోసం చేయడానికి ప్రయత్నించారు. ఈ కేసు బరేలీ జిల్లాలోని బారాదరి పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినది. ఇక్కడ నజ్బుల్ హసన్ అనే వైద్యుడు అకస్మాత్తుగా తన బ్యాంకు పాస్ బుక్, ముఖ్యమైన పత్రాలను తీసుకొని ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం ప్రారంభించారు. ఆ తర్వాత డాక్టర్ మేనల్లుడు ఎస్పీ సిటీ మనుష్ కు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఎస్పీ సిటీ తన నంబర్‌ను నిఘాలో ఉంచమని ఇచ్చింది. ఆ తర్వాత డాక్టర్ లొకేషన్ ఒక హోటల్‌లో దొరికింది. ఎస్పీ సిటీ పోలీసులతో కలిసి హోటల్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు, వైద్యుడిని డిజిటల్‌గా అరెస్టు చేసినట్లు వారు చూశారు.
బంగారం కొనుగోలు దారులకు షాక్.. రూ.80వేలు క్రాస్ చేసిన పుత్తడి
బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతలా అంటే బంగారం కొనుగోలు చేసే ముందు రోజు రాత్రి వారికి నిద్ర కూడా పట్టదు. బంగారు ఆభరణాలను చూసి తమ సొంతం చేసుకునే వరకూ వాళ్లు నిద్రపోరు. అంతలా ప్రేమిస్తారు బంగారాన్ని. అందుకే ఏ వస్తువు కొనుగోలు విషయంలోనూ వారు దుకాణాలకు రావడానికి ఆసక్తి కనపర్చరు. కానీ బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసే సమయంలో మాత్రం ఖచ్చితంగా షాపులకు మహిళలే ఎక్కువ వస్తారు. వారే దగ్గరుండి తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధరలు కాస్తా అటూ ఇటూ అయినా పెద్దగా ఆలోచించరు. బంగారాన్ని సొంతం చేసుకుని ఇంటికి తీసుకెళ్లేందుకే ఎక్కువ ఉత్సాహం చూపుతారు. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నూతన సంవత్సరం మొదటి నుంచి కూడా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ. 81,000 సమీపంలో ఉంది. బంగారం ధరలు భారీగా పెరగడానికి దేశీయంగా డిమాండ్ పెరగడం కూడా ఒక కారణం. బంగారం ధర జనవరి 13వ తేదీ సోమవారం ఇలా నమోదయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,070 గా పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,400గా పలుకుతోంది. కేజీ వెండి ధర రూ. 1,04,300గా ఉంది.
రోహిత్ శర్మ భవిష్యత్ కార్యాచరణపై నీలినీడలు..
ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా ఘోర వైఫల్యంతో సీనియర్ ప్లేయర్స్ కెరీర్ల మీద నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పర్యటనలోనే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలా భవితవ్యం మీదా సుధీర్ఘ చర్చ కొనసాగుతుంది. ఈ ముగ్గురూ టెస్టులకు గుడ్‌బై చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఆస్ట్రేలియాలో ఉండగానే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ ప్రచారాన్ని అతను తోసిపుచ్చాడు. అయితే, రోహిత్ శర్మ మరి కొంత కాలం టెస్టుల్లో సారథిగా కొనసాగుతానని బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. ఆసీస్ పర్యటనపై బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశంలో రోహిత్ ఈ విషయాన్ని తెలిపాడటా.. కానీ, ‘‘కొన్ని నెలలు’’ అనే చెప్పాడట. ఈలోపు కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు కొనసాగించాలని సూచనలు చేశాడని తెలుస్తుంది. భారత్ ఇంకో ఆరు నెలల పాటు టెస్టులు ఆడే అవకాశం లేదు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను రోహితే నడిపించనున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. జూన్‌లో భారత్ ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది.
బన్నీ భారీ ప్రాజెక్ట్.. ఊహించని కాంబో లోడింగ్? (అల్లు అర్జున్)
‘పుష్ప 2’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏకంగా రూ.1900 కోట్ల వరకు వసూలు చేసి.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంకా ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్‌లో పుష్పగాడి హవా మామూలుగా లేదు. దీంతో.. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని, నిర్మాత నాగవంశీ చెబుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరి ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అంటే, భారీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి బాలీవుడ్‌లో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే బన్నీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ముంబై వెళ్లి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని కలవడం హాట్ టాపిక్ అయింది. దీంతో.. ఈ కాంబో దాదాపుగా మూవీ ఫిక్స్ అయినట్టుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. భన్సాలీ సినిమా అంటే.. ఆ భారీతనం, ఆ కథ, కథనం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఆయన ‘లవ్ అండ్ వార్’ సినిమా రూపొందిస్తున్నారు. రన్బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత భన్సాలీ చేయబోయేది బన్నీ ప్రాజెక్ట్ అని బాలీవుడ్ వర్గాల సమాచారం.
ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల ఎంపిక విషయంలో సాయిపల్లవి చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప అంగీకరించదు. అందుకే ఆమె సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. రీసెంట్‌గా ‘అమరన్’ మూవీ హిట్‌తో ఫుల్ జోష్ మీదున్న ఈ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘బలగం’ మూవీ తో దర్శకుడిగా మంచి హిట్ అందుకున్న వేణు ‘ఎల్లమ్మ’ అనే మూవీతో రాబోతున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందట అందుకే సాయి పల్లవి ని హీరోయిన్ గా ఎంచుకునరట. కథ నచ్చడంతో ఈ ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సాయిపల్లవికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తన తదుపరి చిత్రని డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నారు. అయితే విక్రమ్ కి జోడిగా సాయి పల్లవి ని ఎంపిక చేసిందట చిత్ర యూనిట్. కానీ ఆ డేట్స్‌కి కాల్షీట్ లేకపోవడంతో ఆ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకుందట సాయి పల్లవి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవగా, నటీనటుల కోసం వెతుకుతున్నారు.