డిప్యూటీ సీఎం పేషీకి ఫోన్ చేసిన వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఓ వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకరమైన భాషతో హెచ్చరిస్తూ మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే ఈ బెదిరింపు కాల్స్ అలాగే బెదిరింపు మెసేజ్ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పోలీసుల దృష్టికి పేషీ సిబ్బంది తీసుకెళ్లారు. ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఈ కాల్స్ రాగా.. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ పేషీకి ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు తిరువూరుకి చెందిన నక్కా మల్లిఖార్జున రావుగా గుర్తించారు. బందరు రోడ్డు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి మల్లిఖార్జున రావు కాల్ చేసినట్లు తెలుసుకున్నారు. మల్లికార్జురావును పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకు ఫోన్ చేశాడు..ఎవరైనా చేయించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వారికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. అద్భుతాలు చేయడం తెలియదు..
గత ప్రభుత్వానికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసునని.. కానీ ఆ చెత్తను ఉపయోగించి ఏ అద్భుతాలు చేయాలో తెలియదని మంత్రి నారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా నాయుడుపాలెం ప్రాంతంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు సందర్శించారు. అక్టోబర్ రెండో తేదీకి, రాష్ట్రంలో ఉన్న డంప్ యార్డ్స్‌లో ఉన్న చెత్త మొత్తాన్ని క్లియర్ చేస్తామని మంత్రి తెలిపారు. నగరాల్లో ఉత్పత్తి అయ్యే చెత్త ద్వారా, ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పాలని, 2014 టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సింగపూర్ తరహా దేశాలు కూడా ఇదేవిధంగా ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. త్వరలోనే కాకినాడ, నెల్లూరులో చెత్త ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేసే ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు. కడప -కర్నూలు మధ్యలో కూడా మరొక ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థలాలు అందుబాటులో ఉండటం వల్ల గుంటూరు, విశాఖపట్నంలో శరవేగంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పామన్నారు. ప్లాంటు పెట్టడం వల్ల 50 నుండి 60 కిలోమీటర్ల పరిధిలో ఉండే మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లో ఉండే చెత్త మొత్తం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌కు చేరుతుందన్నారు. తద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం తగ్గుతుందని.. ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. గుంటూరు సమీపంలో ఉన్న జిందాల్ ఎనర్జీ ప్లాంట్‌కు 6,990 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందన్నారు. చెత్త ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేసే, ప్లాంట్లు భారతదేశం మొత్తం కలిపి 3 ప్లాంట్లు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పట్టణాలు, నగర ప్రాంతాల్లో విస్తరిస్తున్న ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
నరేందర్‌రెడ్డి, సురేష్ సహకరించట్లేదు.. కస్టడీని మరో రెండు రోజులు పొడిగించండి..
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కస్టడీలో ఉన్న నరేందర్ రెడ్డి తమకు సహకరించట్లేదంటూ పోలీసులు నివేదిక ఇచ్చారు. మరో రెండు రోజులపాటు కస్టడీని పొడిగించాలని పోలీసులు నివేదికలో కోరారు. లగచర్ల ఘటనలో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కోర్టు అనుమతితో రెండు రోజులు పోలీసులు కస్టడీకి తీస్కుని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే పట్నం విచారణకు సహకరించ లేదని, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని పోలీసులు నివేదించారు. మరో ప్రధాన నిందితుడు సురేష్ ఇచ్చిన వివరాల ఆధారంగా కోస్గికి చెందిన ఎక్సైజ్ అధికారుల నుండి మద్యం విక్రయాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఘటనలకు ముందు స్థానికులకు సురేష్ మందు పార్టీలు ఇచ్చినట్లు సమాచారం. పట్నం, సురేష్ ను కలిపి విచారించడానికి మరి కొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరనున్నట్లు సమాచారం!
హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకు వద్దు..
హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకు వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పంచామృతంతో తెలంగాణ భవన్ లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. ఉద్యమకారులతో రేవంత్ రెడ్డి పెట్టుకోవద్దని హెచ్చారించారు. ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడలేదన్నారు. ఉద్యమ కారులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీ గురువు చంద్రబాబును అడుగు అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి తెలంగాణ జాతరలు, ఆడబిడ్డల పేర్లు తీయలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహం పెట్టారని కవిత మండిపడ్డారు. టీజీ అని ఉద్యమంలో పచ్చబొట్టు కొట్టుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. టీజీని గుర్తించిన రేవంత్ ఉద్యమకారులంతా కలిసి తయారు చేసుకున్న విగ్రహం ఎందుకు మార్చారని తెలిపారు. ప్రపంచంలో అందరూ పూలతో దేవుని పూజిస్తే తెలంగాణలో మాత్రమే పూలను పూజిస్తామన్నారు. యూనిక్ ఐడెంటిటీ గా ఉన్న బతుకమ్మను మాయం చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ నీ మాయం చేసి కాంగ్రెస్ గుర్తు పెట్టారని మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలకు విగ్రహాలు… పురుషులకు వరాలు ఇస్తున్నారని తెలిపారు. బీద తల్లిని పెట్టారు… తెలంగాణ మహిళలు ఎదగటం ఇష్టం లేదా? తల్లి గొప్పగా ఉండాలి… కానీ మీరు కాంగ్రెస్ తల్లి నీ పెట్టుకున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంక గాంధీ బ్యాగ్‌పై మోడీ-అదానీ ఫోటోలు.. అభినందించిన రాహుల్
ఈ రోజు (డిసెంబర్ 10) పార్లమెంటుకు వచ్చిన వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఒక చమత్కారమైన బ్యాగ్‌ని తీసుకెళ్లారు. ఆ బ్యాగ్‌పై ఒక వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీల ఫోటోలు ఉండగా.. మరోవైపు మోడీ- అదానీ భాయ్ భాయ్ అనే నినాదంతో కూడిన డిజైన్ బ్యాగ్ ను ఆమె తీసుకెళ్లారు. ఇక, ఈ బ్యాగ్‌ని చూసిన కాంగ్రెస్ సీనియన్ నేత, లోక్ సభలో ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ ఆనందించారు. వీరి ఇరువురి మధ్య జరిగిన సంభాషణ సమయంలో దాన్ని పట్టుకుని.. ఇది చాలా అందంగా ఉంది అని చెప్పుకొచ్చారు. మొదట్లో మోడీ- అదానీ చిత్రం ఉన్న ఫ్రంట్ డిజైన్‌ను చెక్ చేసి.. వెనుక వైపు ఉన్న నినాదాన్ని చదవడానికి దాన్ని తిప్పాడు.. ఆ నినాదాన్ని చూడగానే, రాహుల్ గాంధీ నవ్వుతూ.. ఇది ఎంత ముద్దుగా ఉందో చూడండి అని ఇండియా కూటమి నేతలకు చూపించారు. ఆ బ్యాగ్ డిజైనర్ గురించి కూడా ప్రియాంకను రాహుల్ అడగడంతో ఆమె కూడా నవ్వుతూ ముందుకు కొనసాగింది.
డొనాల్డ్ ట్రంప్‌కు కెనడా ప్రధాని ట్రూడో వార్నింగ్..
హాలీఫాక్స్ ఛాంబరాఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. తమపై ట్రంప్ అదనపు టారీఫ్ లు విధిస్తే.. తాము ప్రతి చర్యలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో ట్రంప్ గత కార్యవర్గంతో పోలిస్తే.. కొత్త బృందంతో డీల్ చేయడం కొంచెం కష్టమైనదన్నారు. అయితే, ప్రజల జీవితాలను సరళతరం చేస్తానన్న చెప్పి అధికారంలోకి వచ్చారు ట్రంప్.. కానీ, ఇప్పుడు వారికి అసలు విషయాలు బోధపడుతున్నాయి. కెనడా నుంచి వచ్చే ప్రతి వస్తువుపై పన్నులూ విధించడం వల్ల జీవన వ్యయాలు మరింత పెరిగిపోతాయని యూఎస్ ప్రజలకు అర్థమవుతోందని జస్టిన్ ట్రూడో చెప్పుకొచ్చారు. ఇక, ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. నేను వాణిజ్య భాగస్వాములపై విధించే పన్నులతో ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరగడం లేదనే హామీ ఇవ్వడం లేదు.. కానీ, ఏ రకంగానూ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోం కదా.. 25 శాతం సుంకాలనేవి కెనడా ఆర్థిక వ్యవస్థను బాగా నాశనం చేయనుంది. యూఎస్ మన నుంచి 65 శాతం చమురు, చెప్పుకోదగ్గ స్థాయిలో విద్యుత్తు, దాదాపు మొత్తం సహజ వాయువును దిగుమతి చేసుకుంటుందని ఆయన తెలిపారు. అలాగే, అమెరికా అల్యూమినియం, వ్యవసాయోత్పత్తులకు కూడా మనపైనే ఆధారపడిందన్నారు. మనపై టారిఫ్‌లు విధిస్తే వీటి ధరలు భారీగా పెరుగుతాయి.. గత 8 ఏళ్ల క్రితమే ఇలాంటిది ఎదుర్కొన్నాం.. ఇప్పుడూ ఎదుర్కొంటామని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.
ఆర్బీఐ గవర్నర్గా తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ రోజు ( డిసెంబర్ 10) పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్బీఐ బ్యాంక్‌కు నాయకత్వం వహించే అవకాశం ఇవ్వడంతో పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. గత ఆరేళ్లలో ఆర్థిక- ద్రవ్య సమన్వయం అత్యుత్తమంగా ఉందని శక్తికాంత్ దాస్ అన్నారు. ఇక, మిగులు బదిలీ, రెగ్యులేటర్ స్వయం ప్రతిపత్తి విషయంలో ఆర్‌బీఐకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన గొడవలతో ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. 2018 డిసెంబర్ లో ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతను మిగులు బదిలీకి సంబంధించిన వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించారు. అలాగే, మార్కెట్లో ఒడిదుడుకులను తగ్గించారు. ఆయన హయాంలో ఆర్బీఐ ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఇప్పటి వరకు అత్యధికంగా రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్ ఫండ్ ఇచ్చింది.
డబ్ల్యూటీసీ రేసులో వెనుకబడ్డ భారత్.. అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా
వరుసగా మూడో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలనే టీమిండియా ఆశలు నెరవేరడం కష్టంగా మారిపోయింది. ఓ దశలో వరుసగా ఆరు టెస్టు విజయాలతో డబ్ల్యూటీసీ పట్టికలో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగిన భారత్.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఐదు టెస్టుల్లో నాలుగు ఓడిపోవడంతో ఫైనల్‌కు వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాపై పెర్త్ టెస్టులో ఘన విజయంతో తిరిగి పట్టికలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా.. అడిలైడ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయి థర్డో ప్లేస్ కి పడిపోయింది. ఇక, భారత జట్టు పాయింట్ల శాతం 61.11 నుంచి 57.29కి తగ్గిపోయింది. పాయింట్ల శాతాన్ని 57.69 నుంచి 60.71కి పెంచుకున్న ఆసీస్ సెకండ్ ప్లేస్ కి పోయింది. ఇక, తాజాగా శ్రీలంకపై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా 63.33 పాయింట్లతో నెంబర్ ర్యాంకును దక్కించుకుంది. టాప్-2లో నిలిచే టీమ్స్ డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి.
మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్.. పోరాటం ఆగదు
మంచు ఫ్యామిలీలో రేగిన ఆస్థి తగాదాల వ్యవహారం మరింత ముదిరింది. నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లతో సినిమాల్లో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ ను తలపించే దృశ్యాలు మోహన్ బాబు ఇంటి వద్ద కనిపించాయి. నువ్వా నేనా అనే రేంజ్ లో అటు మోహన్ బాబు ఇటు మంచు మనోజ్ తండ్రి కొడుకుల సమరానికి కాలు దువ్వారు. కాగా, ఈ వ్యవ్యహారంపై మంచు మనోజ్ ఏ రోజు మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేసారు. మనోజ్ మాట్లాడుతూ ” నేను డబ్బు కోసమో ,ఆస్తి కోసమో ఈ పోరాటం చేయటం లేదు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను. ఒక మగాడిగా నాతో ఎంత గొడవపడిన పర్వాలేదు, కానీ భార్య, 7 నెలల పాపాను ఈ వివాదంలోకి లాగడం కరెక్ట్ కాదు. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. నేను పోలీసుల దగ్గరకు వెళ్లి రక్షణ కోరాను, మీర దైర్యంగా ఉండండి మేము మీకు రక్షణ కల్పిస్తాం అని చెప్పిన ఎస్సై ఈ రోజు ఓ కానిస్టేబుల్ ను పంపి మా వాళ్ళను లోనికి రానివ్వకుండా, బెదించడం ఏంటి, వాళ్లకు ఆ అధికారం ఎవరిచ్చారు. పోలీసులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం అందరిని కలుస్తా. నా భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, అందుకే పోరాటం చేస్తున్న’ అని అన్నారు. మరోవైపు . గత కొద్దీ రోజులుగా విదేశాల్లో ఉన్న మంచు విష్ణు ఈ తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్నారు. ఈ వ్యవహారంపై విష్ణును ప్రశ్నించగా అనవసరంగా న్యూసెన్స్ చేయద్దని సమాధానం చెప్తు వెళ్లిపోయారు.
రియల్ కోర్ట్ డ్రామా గా వస్తున్న‘లీగల్లీ వీర్’
సిల్వర్ కాస్ట్ బ్యానర్ మీద స్వర్గీయ ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో ‘లీగల్లీ వీర్’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. రవి గోగుల దర్శకత్వం వహించారు. సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో హీరో, వీర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు. కరోనా టైంలో పాడ్ కాస్ట్ చేయాలని అనుకున్నాను. ఆ టైంలో నాకు సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. మంచి సినిమా చేద్దాం అనుకున్న, లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్రను చేయడం సులభంగా అనిపించింది. ఇంతవరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. నటనకు కొత్త కావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా టేక్స్ తీసుకున్న. డబ్బింగ్‌లో ప్రాబ్లం వచ్చింది కానీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డిసెంబర్ 27 విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. డైరెక్టర్ రవి మాట్లాడుతూ.. ‘వీర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపిస్తుంది. గ్లింప్స్ చూశాకా నాకు మాటలు రావడం లేదు. మా సినిమాకి మీడియా ప్రోత్సహించి, ఆదరించాలి’ అని అన్నారు. నటుడు గిరిధర్ మాట్లాడుతూ ‘కొత్త టీం అయినా కూడా సినిమాని చాలా బాగా అద్భుతంగా చిత్రీకరించారు. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది కానీ ఇలాంటి టీం ఇంత వరకు చూడలేదు’ అని అన్నారు.
మాట మార్చి.. మడమ తిప్పిన మోహన్ బాబు..
మంచు ఫామిలీ వివాదం గంటకో మలుపు, రోజుకో ట్విస్ట్ లతో అచ్చం ఓ పొలిటికల్ యాక్షన్ సినిమాలాగా సాగుతుంది. నిన్నటికి నిన్న తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని, తన ప్రాణానికి తన ఆస్తులకు రక్షణ కల్పించాలని రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేసాడు. మాదాపూర్ లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించి, నాకు హాని కలిగించే ఉద్దేశంతో, చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్, మౌనికలు ప్లాన్ చేశారు అని నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ని, నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మోహన్ బాబు స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు ఆయన ఇంటికి చేరుకున్నారు పహడీ షరీఫ్ పోలీసులు. అయితే పోలీసులతో మోహన్ బాబు మాట్లాడుతూ ‘ ఏ ఇంట్లో నైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయి. అవి అందరి ఇళ్లలో ఉంటాయి. ఇళ్ళలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారు.మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది, దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. గతంలో నేను ఎన్నో కుటుంబాల సమస్యలను పరిష్కరించి వారి కుటుంబాలు కలిసేలా చేశా, ఇప్పుడు మా ఫ్యామిలీ తగాదా కూడా మేము పరిష్కరించుకుంటా’ అని అన్నట్టు తెలుస్తోంది. నిన్న కొడుకుపై కేసు పెట్టి నేడు అదేం లేదు అంతా తూచ్ అని మెం పరిష్కరించుకుంటాం అనడం ఏంటో ఆయనకె తెలియాలి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.