Ntv top-headlines March 10, 2023 -at-9AM
ట్విట్టర్ టిల్లూ నన్ను కెలికితే ఊరుకుంటానా.. అంతకు మించి సినిమా చూపిస్తా
కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు నన్ను కెలకాలనుకుంటున్నాడు నేను ఊరుకుంటనా అంతకంటే ఎక్కువ కెలుకుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వాఖ్యలు చేశారు. నామీద 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందిని పెట్టారని అన్నారు. మేడ్చల్ జిల్లా, దుండిగల్ గండిమైసమ్మ మండలంలోని గ్రామం కొంపల్లిలో జరుగిన ‘ఉపాధ్యాయ – అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం’లో బండి సంజయ్ మాట్లాడుతూ.. కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్ లో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంట్ లో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ బిడ్డ మీద ఈడీ, సీబీఐ విచారణలు చేస్తుంటే మాత్రం స్పందిస్తారు…. మరి ఇతరుల మీద ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. కవిత మహిళా బిల్లుపై చేస్తున్న దీక్షను చూసి జనం నవ్వుకుంటున్నారు. కేసీఆర్ బిడ్డ చేసిన దొంగ సారా దందావల్ల తెలంగాణ ప్రజలు తలదించుకునే దుస్థితి ఏర్పడింది అన్నారు. తెలంగాణ వచ్చినాక ఏం ఒరిగింది? 2014కు ముందు మద్యం ద్వారా రూ.10 వేల కోట్లు మాత్రమే వస్తే… కేసీఆర్ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి రూ.40 వేల కోట్లు ఆదాయం సంపాదిస్తున్నరు. అయినా తెలంగాణ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందన్నారు.
రోజూ రూ. 253 ఆదా చేస్తే.. రూ. 54 లక్షలు పొందవచ్చు..
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ, జీవిత రక్షణ బీమాతో పాటు ఉత్తమ రాబడిని అందిస్తుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అనేక పథకాల్లో మిలియన్ల మంది పౌరులు ఇప్పటి దాకా పెట్టుబడి పెట్టారు. ప్రతి వయస్సు వారికి ఏదో ఒక పథకాన్ని ఎల్‌ఐసి అందజేస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి తర్వాత పెద్ద నిధులను కూడగట్టుకోవాలనుకుంటే, LIC వారి ఈ పాలసీ సాయపడుతుంది. ఈ పథకం స్టాక్ మార్కెట్‌తో అనుసంధానించబడినది కూడా. పథకం పేరు ఎల్‌ఐసీ జీవన్ లాభ్(LIC Jeevan Labh Scheme). ఈ నాన్-లింక్డ్ పాలసీ మెచ్యూరిటీ తర్వాత బీమా చేసిన వ్యక్తికి ఏకమొత్తంలో ప్రయోజనాన్ని అందిస్తుంది. రోజూ రూ. 253 ఆదా చేసుకుంటే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 54 లక్షలు పొందవచ్చు. LIC యొక్క ఈ పథకం స్టాక్ మార్కెట్‌పై ఆధారపడనందున సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే, అతని వారసులు పరిహారం మొత్తాన్ని పొందుతారు. కాబట్టి పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ ప్లాన్ మీకు ఖచ్చితంగా సరిపోయే ప్లాన్. ప్రతిరోజూ కేవలం రూ. 253 ఆదా చేయడం ద్వారా, రాబోయే 25 ఏళ్లలో రూ. 54 లక్షల నిధిని కూడగట్టుకోవచ్చు. బీమా ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఇంద్రకీలాద్రిపై తలనీలాలు ఇస్తే నిలువు దోపిడీయే
అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చాల పెద్దమ్మ దుర్గమ్మ సన్నిధికి వెళితే అంతా శుభం జరుగుతుంది. విజయవాడలో వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అమ్మవారి దర్శనంతో పునీతులు అవుతుంటారు. అయితే ఇంద్రకీలాద్రి లో దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోందని భక్తులు వాపోతున్నారు. దుర్గమ్మ కొండపై దళారుల బెడద ఎక్కువగా ఉంది. కేశఖండనశాలలో భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు సిబ్బంది. దూర ప్రాంతాల నుంచి వచ్చు భక్తులను నిలువునా దోచుకుంటున్నారు దేవస్థానం సిబ్బంది..కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించే భక్తుల నుండి అధిక దోపిడీ చేస్తున్నారు. దుర్గగుడి కేశఖండన శాలలో భక్తుల నుండి అధిక ధరలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సెంటిమెంటును ఆసరా చేసుకుంటున్నారు దేవాలయ సిబ్బంది.. భక్తులు సమర్పించే తలనీలాలు టికెట్ ధర 25 రూపాయలు..ఆలయ సిబ్బంది మాత్రం 500 రూపాయలు డబ్బులు ఇస్తేనే తలనీలాలు చేస్తాం లేకపోతే లేదు అని చెబుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలకు తొలిసారి తలనీలాలు సమర్పించాలని సర్వం ఇవ్వాల్సిందే. దుర్గగుడి కేశఖండన శాలలో రోజు ఇదే తంతు. భక్తులను దోపిడీ చేస్తున్న దేవస్థానం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
కట్నం సరిపోలేదని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు
అవును, మీరు చదివింది నిజమే! సాధారణంగా అదనపు కట్నం కోసం వరుడు తరఫు బంధువులు పెళ్లిళ్లు రద్దు చేసుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కానీ, ఇక్కడ రివర్స్‌లో వధువు పెళ్లి రద్దు చేసుకుంది. తమకిచ్చిన కట్నం సరిపోలేదంటూ.. ముహూర్తానికి గంట పెళ్లి క్యాన్సిల్ చేశారు వధువు తరఫు బంధువులు. చివరికి పోలీసులు రంగంలోకి దిగినా.. ఫలితం లేకుండా పోవడంతో, ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..పోచారం మునిసిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. కట్నం విషయంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఒక విచిత్రమైన ఒప్పందం కుదిరింది. ఇక్కడ అబ్బాయి వారే అమ్మాయి తరఫు బంధువులకు ఎదురుకట్నం ఇచ్చేలా డీల్ చేసుకున్నారు. రూ.2 లక్షలు అమ్మాయికి కట్నం ఇచ్చేలా పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. మొదట్లో అమ్మాయి తరఫు బంధువులు ఇంకా ఎక్కువగానే డిమాండ్ చేశారు కానీ, చివరికి డీల్ రూ.2 లక్షలకు సెట్ అయ్యింది. నిన్న (గురువారం) రాత్రి 7:21 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.పెళ్లి కోసం వరుడి తరఫు బంధువులు కళ్యాణ మండపానికి ముహూర్తానికి గంట ముందే చేరుకున్నారు. కానీ.. వధువు తరఫు వారు రాలేదు. ముహూర్తం సమయంలోపు వస్తారనుకున్నారు. కానీ.. ముహూర్తం సమయం మించిపోతున్నా ఎవ్వరు రాలేదు. దీంతో.. వరుడి బంధువులు ఆరా తీస్తే, వధువు వారు ఊహించని షాకిచ్చారు. తమకు రూ.2 లక్షల కట్నం సరిపోదని, అదనంగా మరింత కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోక.. వరుడి తరఫు బంధువులు పోలీసుల్ని ఆశ్రయించారు. వాళ్లు మాట్లాడినా యువతి తరఫు వారు కట్నం విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో.. పెళ్లి రద్దయ్యింది. వధువుకు కట్నంగా ఇచ్చిన రూ. 2 లక్షలను కూడా వదులుకోవాల్సి వచ్చింది.
ఈ నాలుగు రాశులకు రాజయోగమే.. ఎందుకంటే?
బృహస్పతి-శుక్ర గ్రహం ప్రభావం ఈ ఏడాది మార్చి నుంచి అత్యంత ఎక్కువగా ఉంది. గ్రహాల కదలికలు మరియు నక్షత్రరాశులకు అత్యున్నత ప్రాముఖ్యతనిచ్చే జ్యోతిషశాస్త్రం యొక్క విస్తారమైన సముద్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు సంచరించే వివిధ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను అవస్థ అంటారు. అవస్థ అంటే ఒక దశ అని అర్థం చెబుతారు. హిందూ జ్యోతిష్యం వారు గ్రహాల స్థితిగతులను (అవస్థ) లెక్కించగల అధ్యయనాలను అభివృద్ధి చేశారు. ఈ అవస్థలను పలు విధాలుగా పిలుస్తారు. బాల అవస్థ, కుమార అవస్థ, యువ అవస్థ, వృద్ధ అవస్థ మరియు మృత్యు అవస్థ. ఒక గ్రహం తన యవ్వన స్థితిలో యువ అవస్థలో ఉన్నప్పుడు, అది దాని పూర్తి బలంతో మరియు ఉత్సాహంతో ప్రయోజనాలను మరియు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.ఈ ఏడాది మార్చి నుంచి నాలుగు రాశులవారి దశ, దిశ మారనుంది. ఎందుకంటే దేవతల సలహాదారు, బృహస్పతి మరియు దైత్య గురువు శుక్రాచార్య, శుక్రుడు ఇద్దరూ తమ యవ్వన స్థితిలోకి ప్రవేశించారు. రాశిచక్రంలోని ప్రతి రాశిని వేర్వేరుగా ప్రభావితం చేస్తారని చెప్పనవసరం లేదు. కాబట్టి ఈ రాశుల వారు తమ ఆర్థిక జీవితంలో వరం పొందే మరియు అభిరుచితో పురోగమించే అవకాశం మెండుగా ఉంది.
వృషభం
వృషభ రాశి వారికి గురు-శుక్ర యువ గ్రహ స్థితి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జాతకంలో బృహస్పతి-శుక్రులు ఇద్దరూ అనుకూలమైన స్థితిలో ఉంచబడినందున. ఈ కాలంలో మీ పనులన్నీ విజయవంతమవుతాయి. వృషభ రాశి వారు విదేశాలకు సంబంధించిన వ్యాపారాలను కలిగి ఉన్నవారు ఈ కాలంలో మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి మరియు మీ ముందస్తు పెట్టుబడులు మీకు మంచి అదృష్టాన్ని ఇస్తాయి. కాబట్టి ఆచితూచి మీరు అడుగులు వేయండి. మంచి ఫలితాలు పొందండి.
యువకుడి హత్య కేసులో లేడీ రౌడీ హస్తం.. ఇన్‌స్టాలో రీల్స్.. పోలీసుల గాలింపు
గ్యాంగ్ వార్స్.. ఇప్పటికీ అక్కడక్కడ ఇవి వెలుగు చూస్తుంటాయి. స్థానికంగా తమ బలం చాటుకోవడం కోసం, కొందరు రౌడీలు చిన్న చిన్న గ్యాంగ్‌లను మెయింటెయిన్ చేస్తుంటారు. ఏదో సమాజానికి మేలు చేస్తున్నంత లెవెల్‌లో.. వీళ్లు పరస్పరం గొడవ పడుతూనే ఉంటారు. ఒక్కోసారి ఈ గొడవలు ముదిరి.. హత్యలు చేసుకునేదాకా వెళ్తాయి. అలాంటి సంఘటనే ఒకటి కోయంబత్తూరులో చోటు చేసుకుంది. రెండు గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న గొడవలో.. ఓ యువకుడు అన్యాయంగా బలి అయ్యాడు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ హత్యకు ఓ లేడీ రౌడీతో లింక్ ఉండటం! ఇప్పుడు ఆ అమ్మాయి గురించే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే..కోయంబత్తూరు రెండు రౌడీ గ్యాంగ్‌లు ఉన్నాయి. ఈ గ్యాంగ్‌ల మధ్య గత నెల రోజుల నుంచి తీవ్రస్థాయిలో వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఓ రౌడీ గ్యాంగ్ ‘గోకుల్’ అనే యువకుడ్ని చంపింది. దీనిపై హత్య కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టగా.. లేడీ రౌడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోకుల్‌ని చంపిన గ్యాంగ్‌తో ఆ లేడీ రౌడీ కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రీల్స్ చేసింది. అంతేకాదండో.. ఆ యువతి సిగరెట్ తాగుతూ, కత్తులతో బెదిరిస్తున్న రీల్స్ కూడా చేసింది. ఈ రీల్స్ గమనించిన పోలీసులు.. కచ్ఛితంగా ఈ హత్య వెనుక ఆ యువతి హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ లేడీ రౌడీ ‘ఫ్రెండ్స్ కాల్ మీ తమన్నా’ అనే పేరుతో అకౌంట్ తెరిచింది. ఈ హత్య జరిగినప్పటి నుంచి ఆ లేడీ రౌడీ కూడా కనిపించకుండా పోయింది. దీంతో.. ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటు, ఆ గ్యాంగ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో, ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం తమిళనాడులో ఈ లేడీ రౌడీ గురించే చర్చలు జరుగుతున్నాయి.
రాత్రిపూట తినకూడని ఆహారాలేంటో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది రాత్రిపూట ఏ ఆహారం దొరికితే అది తినేస్తారు. ఏదో తిన్నాంలే అనే భావన అందరిలోనూ ఉంటోంది. అంతేకాకుండా ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్స్ అందుబాటులోకి వచ్చాక ఆహారపు అలవాట్లలో విపరీతమయిన ధోరణి కనిపిస్తోంది. ఎక్కువమందిలో నిద్రపట్టక పోవడం అనేది కనిపిస్తోంది. రాత్రి సమయంలో మనం తీసుకునే భోజనం కూడా నిద్రపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. రాత్రి భోజనంలో తినకూడని కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు అనేకం ఉన్నాయి. ఎంత ఆరోగ్యానికి ప్రయోజనమైనా రాత్రి సమయంలో పలు రకాల ఆహారపదార్థాలను తీసుకోకూడదు.
* రాత్రి సమయంలో గడ్డ పెరుగు లాంటిది అసలు తీసుకోకూడదు.. రాత్రంతా మెదడు చురుగ్గా ఉండేందుకు ఈ పెరుగు సరిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినకూడదు. ఎందుకంటే ఇది శ్లేష్మాన్ని ఉత్పత్రి చేసి కఫానికి దారి తీస్తుంది.
*కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ దానిని రాత్రిపూట తినకూడదు. ఎందుకంటే గాఢ నిద్రకు ఆటంకాలు కలిగించే కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన నిద్ర కోసం రాత్రి భోజనంలో కాలీఫ్లవర్‌ను తినకపోవడమే మంచిది
* రాత్రి భోజనంలో సలాడ్‌తో టొమాటోలను ఎప్పుడూ తినకూడదు. ఇందులో టైరమైన్ అనే ఒక రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడు కార్యకలాపాలను పెంచుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే రాత్రిపూటు సలాడ్స్ తినండి కానీ అందులో టొమాటో ఉండకుండా చూసుకోండి.
*బ్రోకలీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలిసిందే. అయితే డిన్నర్‌లో బ్రకోలీని ఎప్పుడూ తినకూడదు. బ్రకోలీలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
కేజీఎఫ్3 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పెద్ద స్కెచ్చే!
కేజీఎఫ్.. భారత చిత్రసీమలోని బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీలలో ఇది ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో పార్ట్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగం క్లైమాక్స్‌లోనే హింట్ ఇచ్చాడు. కానీ.. మూడో భాగం ఎప్పుడు ఉంటుంది? అనే విషయంపైనే స్పష్టత లేదు. ఇప్పుడు ఆ మిస్టరీకి తెరపడింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. సలార్, ఎన్టీఆర్31 ప్రాజెక్టులు ముగిసిన వెంటనే కేజీఎఫ్3ని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. తన ‘నీల్ వర్స్’లో భాగంగా ఈ మూడు సినిమాలకూ లింక్ ఉంది కాబట్టి, ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఎన్టీఆర్31 సినిమా పూర్తైన వెంటనే కేజీఎఫ్3ని తెరకెక్కించనున్నట్టు వార్తలొస్తున్నాయి. 2024 చివర్లో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లి, 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదిలోనే సెప్టెంబర్ 28వ తేదీన దీనిని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని కూడా రెండు భాగాల్లో ప్లాన్ చేశారు. సలార్ రిలీజైన వెంటనే ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్‌ని ప్రశాంత్ నీల్ మొదలుపెట్టనున్నాడు. 2024 చివర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేలా పక్కా స్కెచ్ వేసినట్టు వార్తలొస్తున్నాయి. ఆ వెంటనే కేజీఎఫ్3 ప్రాజెక్ట్ ప్రారంభించాల్సి ఉంటుంది కాబట్టి, తారక్ సినిమాను తక్కువ సమయంలోనే కంప్లీట్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి, ఈ ప్రాజెక్టుల నడుమ ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ ఎప్పుడు తీస్తాడన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న. చూద్దాం.. ఈ డైరెక్టర్ ఎలాంటి ప్లాన్ వేశాడో?