బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దేశమంతా రైతు బంధు, ఉచిత కరెంటు
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దేశమంతా రైతు బంధుతో పాటు ఉచిత కరెంటు ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కష్టాలు, కన్నీళ్ల నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందని, సహజ వనరులు ప్రజలకు దక్కేలా చూడటమే ఈ పార్టీ లక్ష్యమని తెలిపారు. మోడీ హయాంలో తెలంగాణలో తప్ప దేశమంతటా కరెంటు కోతలే ఉన్నాయన్నారు. అసలు దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని.. లక్షల కోట్ల సంపద ఏమైపోయిందో తెలియడం లేదన్నారు. నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టి.. కేంద్రం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. స్వాతంత్య్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఈ నీటి యుద్దాలు ఎందుకని ప్రశ్నించారు. దశాబ్దాల క్రితం కట్టిన ప్రాజెక్టులు తప్ప కొత్తవి మళ్లీ కట్టలేదని, ఏళ్లు గడుస్తున్నా నీటి వివాదాలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయని ప్రచారం.. ఖండించిన ఏపీ పౌరసరఫరాల శాఖ
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసినట్లు ఈనాడులో ప్రచురించిన కథనాన్ని ప్రభుత్వం ఖండించింది. ఈనాడు దినపత్రికలో 18-01-2023న ‘ధాన్యం కొనుగోలు నిలిపివేత’ అను శీర్షికన వార్త ప్రచురించారు. రైతుల వద్ద ఇంకా నిల్వలు.. ఎదురు చూపులు, బ్యాంకు గ్యారంటీలు లేక కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు, రంగు మారిన ధాన్యం సేకరణకూ మొండి చెయ్యి అంటూ అవాస్తవాలను ప్రచురించారని పౌర సరఫరాల శాఖ ఎద్దేవా చేసింది. ధాన్యం సేకరణకు సంబంధించిన పౌర సరఫరాల శాఖ తెలిపిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఏ జిల్లాలోనూ నిలిపివేయలేదు. ప్రతిజిల్లా లోని రైతు భరోసా కేంద్రం పరిధిలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఏ రైతు వద్ద ధాన్యము నిల్వ లేదని నిర్దారించుకొన్న తర్వాతనే ధాన్యం సేకరణ ప్రక్రియను అక్కడ ముగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిజ నిర్ధారణ(ఫ్యాక్ట్ చెక్) ద్వారా తెలియజేసింది.
గవర్నర్లను మోడీ ఆడిస్తున్నారు.. బీజేపీని తరిమికొట్టాలి
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. 2024 ఎన్నికల్లో దేశమంతా కలిసి బీజేపీని తరిమికొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉందన్నారు. బీజేపీ నియమించిన గవర్నర్లంతా రాజకీయం చేస్తున్నారని.. ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి గవర్నర్లకు ఒత్తిడి ఉందని, ఆ గవర్నర్లను మోడీనే ఆడిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే ఈ గవర్నర్ల పని అన్నట్లుగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవున్నా.. దేశం వెనుకబడే ఉందని పేర్కొన్నారు. కానీ.. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన సింగపూర్ మాత్రం దూసుకెళ్తోందన్నారు. మనమేం పాపం చేశామని వెనుకబడిపోతున్నామని ప్రశ్నించారు.
ఆనాడు ఎన్టీఆర్ అలా అనుకుని ఉంటే.. తెలుగు జాతి ఏమయ్యేది?
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తొలిసారిగా తాను అనురాగదేవత సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్‌ను కలిశానని.. తన తొలి భేటీలోనే ఎన్టీఆర్ ప్రజాసేవ గురించి వ్యాఖ్యానించారని చెప్పారు. ఒక సినిమా నటుడిగా వచ్చి.. తరువాత కాలంలో రాజకీయాలను సమూలంగా మార్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి భావితరాలకు కూడా ఆదర్శంగా నిలిచిందన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అని చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తుచేశారు. ఆనాడు నాకెందుకు రాజకీయం అని ఎన్టీఆర్ అనుకుని ఉంటే తెలుగు జాతి ఏమయ్యేదో ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మనకు గట్టిగా ప్రశ్నించే విధానాన్ని, చైతన్యాన్ని అందించింది ఎన్టీఆర్ అని.. ఇప్పుడు అదే స్ఫూర్తితో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలను ప్రశ్నించాలన్నారు.
పవన్ కళ్యాణ్ ‘రంగం’ సినిమాలో విలన్ లాంటోడు
వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏంచేస్తుందో చూద్దాం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో జగన్ ప్రవేశిస్తే అక్కడ ప్రకంపనలు వస్తాయన్నారు. జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన కోసం స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయని బైరెడ్డి అన్నారు. ఆ దృష్టితోనే తాను జగన్‌కు ప్రైవేటు సైన్యం ఉందని వ్యాఖ్యానించానని.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ జగన్ అభిమానులు ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, పొడిచేస్తుంది, చించేస్తుంది అంటూ తెలంగాణ మంత్రులు కూడా మాట్లాడుతున్నారని.. వాళ్లు ఇక్కడికి వచ్చి ఏం చించుతారో, ఏం పొడుస్తారో తెలియదు కానీ… జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే మాత్రం అక్కడి ప్రభుత్వాలే తలకిందులవుతాయని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పష్టం చేశారు.
అండర్-19 టీమిండియా మాజీ కెప్టెన్ అరెస్ట్
టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ విజయ్ జోల్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో 19మందిపై కిడ్నాప్, దోపిడి, అల్లర్లకు పాల్పడ్డారన్న కారణంతో కేసు నమోదైంది. క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు విజయ్, అతడి సోదరుడు విక్రమ్‌తో పాటు మొత్తం 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన కొడుకు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాడు కానీ ఎలాంటి తప్పు పని చేయలేదని విజయ్ తండ్రి, సీనియర్ క్రిమినల్ లాయర్ బావు సాహెబ్ వెల్లడించారు. అనవసరంగా తప్పుడు కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
డ్రోన్‌ను మింగేసిన మొసలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ఆనంద్ మహీంద్రా ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన ఆనంద్ మహీంద్రా వ్యాపారం రంగంలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటారు. స్పూర్తినిచ్చే ప్రతీ అంశంపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఇలాంటి అంశంపైనే ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ‘‘ టెక్నాలజీపై ప్రకృతిదే విజయం’’ అంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పదివేల మంది ఈ వీడియోకు లైక్స్ కొట్టగా.. ఏకంగా 5 లక్షల వ్యూస్ వచ్చాయి. ఓ సరస్సు వద్ద డ్రోన్ తో షూట్ చేస్తున్న సమయంలో ఓ చిన్న మొసలి దాన్ని తదేకంగా చూస్తూ ఒక్కసారిగా పైకి ఎగిరి డ్రోన్ ను నోట కరుచుకుని నీటిలోకి వెళ్లిపోతుంది. నాచురల్ వరల్డ్ ఎల్లప్పుడు టెక్నాలజీపై ఆధిక్యతను ప్రదర్శిస్తుందనే దానికి ఇదే ఉదాహరణ అని ఆయన ట్వీట్ చేశారు. నీటిపై ఉన్న డ్రోన్ ను వెంటాడుతూ, చివరకు దాన్ని ఎగిరి నోటితో పట్టుకుంటుంది. డ్రోన్ పైకెగిరే ప్రయత్నం చేసినా.. క్షణాల్లో దాన్ని పట్టుకుంటుంది మొసలి. ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. నిజమే సార్ అంటూ ఓ నెటిజెన్ ట్వీట్ చేయాగా.. మరొకరు ఇది మహీంద్రా థార్ కన్నా స్పీడ్ గా ఉన్న డ్రోన్ మొసలి నుంచి తప్పించుకోలేకపోయిందని, మొసలికి కొత్త డ్రోన్ వచ్చిందంటూ మరో నెటిజన్ ఫన్నీగా రిఫ్లై ఇచ్చాడు.