ఘనంగా నాగోబా విగ్రహ ప్రతిష్ట.. హాజరైన మెస్రం వంశీయులు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఆదివారం ఉదయం మెస్రం వాసులు నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. అనంతరం తమ ఆరాధ్య దైవానికి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జెడ్పీ చైర్మన్ మెస్రం వంశీయులు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. మెస్రం వాసులు తొలినాళ్లలో నాగోబా దేవి దర్శనమిచ్చిన పుణ్యక్షేత్రాన్ని (పుట్ట) మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డి కప్పులతో చిన్న గుడిసె నిర్మించి పూజలు చేశారు. అనంతరం 1995లో సిమెంటు, ఇటుకలతో చిన్నపాటి గుడి నిర్మించి పూజలు చేశారు. ప్రభుత్వ సహకారంతో 2000 సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం శిలలతో కొత్త ఆలయాన్ని నిర్మించారు. పుష్య మాసంలో మెస్రం కులస్తులు నిర్వహించే నాగోబా జాతర రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర.
బండి సంజయ్ రాలేదంటే.. నీ తప్పు ఒప్పుకున్నట్టే
బండి సంజయ్ హిందుత్వం పేరిట ప్రజలని తప్పు దోవ పట్టిస్తే చూస్తూ ఊరుకొమని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో బండి సంజయ్ రాలేదు. బండి సంజయ్ మాటలు అబద్దమని మరోసారి రుజువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లోని వేములవాడ లేదంటే తాండూరులో ను భద్రేశ్వరాలయంకు రావాలని ఛాలెంజ్ చేస్తున్నా అని తెలిపారు. ఇవాల్టి నుంచి తగ్గేదే లేదు… బీజేపీ నేతల ఆటలు సాగవంటూ రోహిత్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు తమ తప్పును కప్పి పుచ్చుకోవడనికి అనేక రకాల అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఈడి వ్యవహారాన్ని మేము తప్పు బడితే ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవ చేశారు. కావాలనే బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో బిజినెస్ మన్ లను, కీలక నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. నాపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు అమ్మవారి దేవాలయం ముందు సవాల్ విరిసిన సంజయ్ ఎందుకు స్పందించడం లేదని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతివ్వండి
ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి మొదటివారంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కి రెండు పేజీల లేఖ రాశారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. పోలవరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నిపుణుల బృందం జనవరి మొదటివారంలో సందర్శిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవధార.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో విపరీత జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదటినుండి కాంగ్రెస్‌పార్టీ అనుకూలంగా ఉంది.ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ఘనత కాంగ్రెస్, యు.పి.ఏ ప్రభుత్వానిదే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత నేత డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కల. దివంగతనేత డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి కల అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో వై.ఎస్.సి.పి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విఫలమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అనుమతులు 2004-2014 ల మధ్య కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని మంజూరు అయ్యాయి.
రెండేళ్ళలో పాలసముద్రం యూనిట్ ప్రారంభం
ప్రధాని మోడీ రక్షణ రంగ ఫ్యాక్టరీలు.. పెట్టుబడులకు ఏపీలో అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు బెల్ డెరైక్టర్ పార్థసారథి. బందరు బెల్ కంపెనీ విస్తరిస్తున్నాం.. త్వరలో పూర్తి కాబోతోంది. సత్యసాయి జిల్లాలో పాల సముద్రంలో మరో బెల్ యూనిట్ ప్రారంభించబోతున్నాం.బెల్ కంపెనీకి గతంలోనే ఏపీఐఐసీ భూమి కేటాయించినా.. సరైన సమయంలో ఫ్యాక్టరీ ప్రారంభించ లేదని ఫైన్ వేసింది.అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత పాల సముద్రంలో బెల్ కంపెనీకి యూనిట్ పనుల ప్రారంభానికి అడ్డంకులు అధిగమించాం అన్నారు బెల్ డైరెక్టర్ పార్థసారథి. వచ్చే రెండేళ్ల కాలంలో పాల సముద్రం బెల్ యూనిట్ ప్రారంభించబోతున్నాం.దేశంలో మిగిలిన యూనిట్ల కంటే పాల సముద్రంలోని బెల్ యూనిట్ అతి పెద్ద ప్రాజెక్టు. దాదాపు వేయి ఎకరాల్లో పాల సముద్రం బెల్ యూనిట్ ప్రారంభం కాబోతోంది. పాల సముద్రం బెల్ యూనిట్ కోసం తొలి విడతగా రూ. 384 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశాన్ని శత్రువుల నుంచి రక్షించేెలా అవసరమైన పరికరాలు తయారు చేయడడం బెల్ కంపెనీ ప్రధాన లక్ష్యం.తీర ప్రాంత, భూ సరిహద్దుల నుంచే కాకుండా ఆకాశ మార్గాన, సముద్ర గర్బం నుంచి జరిగే దాడులను ఆపేందుకు బెల్ కంపెనీ ఎక్విప్మెంట్ తయారు చేస్తోంది.గతంలో రక్షణ అవసరాల పరికరాలు కోసం విదేశాలపై ఆధారపడేవాళ్లం.కానీ ప్రధాని మోడీ రక్షణ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. రక్షణ రంగ ఉత్పత్తులు దేశీయంగానే రూపొందించేలా చర్యలు తీసుకున్నారు.
రెండవ రోజు తగ్గిన అవతార్ 2 కలెక్షన్స్
జేమ్స్ కమరూన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ విజువల్ వండర్, డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. లార్జర్ దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ‘అవతార్ 2’ మొదటి రోజు ఎర్త్ శాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ‘అవతార్ 2’ ఉంది. ఓవరాల్ గా అన్ని ఏరియాలు కలుపుకోని ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 136.5 మిలియన్ డాలర్లని రాబట్టింది (ఇండియన్ కరెన్సీలో 1125.17 కోట్లు). ఇక రెండో రోజు మాత్రం ‘అవతార్ 2’ కలెక్షన్స్ ని డ్రాప్ కనిపించింది. సెకండ్ డే ‘అవతార్ 2’ సినిమా 70 మిలియన్ డాలర్లని రాబట్టింది(రూ. 579.13 కోట్లు). మొదటిరోజు కన్నా 66 మిలియన్ డాలర్స్ డ్రాప్ కనిపించడంతో ‘అవతార్ 2’ బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వడం కష్టం, సినిమా లెంగ్త్ ని తగ్గించాల్సి ఉంది, 2 బిలియన్స్ రాబట్టడం అయ్యే పని కాదు అంటూ రకరకాల విమర్శలు వినిపించడం మొదలయ్యింది.
షియోమీకి బిగ్ రిలీఫ్.. నిధులపై బ్లాక్ రద్దు చేసిన కర్నాటక కోర్టు
చైనా మొబైల్ దిగ్గజం ‘షియోమీ’కి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇండియాలో ఆర్థికపరమైన నేరాలకు పాల్పడుతున్న కారణంగా ఆ సమస్యపై భారత ప్రభుత్వం పలు కేసులను మోపింది. దీంతో ఇండియాలో షియోమీ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వివిధ కారణాల వల్ల ఆ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలోని రూ.3700 కోట్ల డిపాజిట్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్లాక్ చేసింది. ఆదాయపన్ను ఎగవేత కారణంగా షియోమీ ఇండియా ప్రధాన కార్యాలయంపై దాడులు జరిగాయి. ఐటీ శాఖ ఈ సంస్థ నిధులను స్తంభింపచేసింది. భారతదేశంలో షియోమీ తన కాంట్రాక్ట్ తయారీదారుల నుండి తక్కువ లాభాలను నమోదు చేయడానికి, కార్పొరేట్ పన్నులను ఎగవేసేందుకు పెంచిన ఖర్చులతో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా కర్ణాటక కోర్టు ఈ సంస్థ నిధులపై విధించిన బ్లాక్ ను రద్దు చేసింది. ఇది కంపెనీకి సానుకూలంగా ఉండబోతోంది. ఇదిలా ఉంటే షియోమీ అక్రమంగా విదేశీ చెల్లింపులు చేసిందనే మనీలాండరింగ్ కు పాల్పడిందని ఈడీ కేసు నమోదు చేసింది.
పేలిన సిలిండర్.. 32 మంది మృతి
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో వివాహ వేడుకలో సిలిండర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది. మరో నలుగురు వ్యక్తులు ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జోధ్‌పుర్‌లోని భుంగ్రా గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో డిసెంబర్ 8న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 32 మంది చనిపోయారు. మిగతా వారు జోధ్‌పుర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం అశోక్ గహ్లోత్ ఇంకా ఈ గ్రామాన్ని గానీ, ఆస్పత్రిని గానీ సందర్శించకపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని, గ్యాస్ కంపెనీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. పేలుడు జరిగిన గ్రామాన్ని సీఎం ఇంకా సందర్శించలేదని ధ్వజమెత్తింది. ఇంత విషాద సమయంలో కాంగ్రెస్ మ్యూజిక్ కన్‌సర్ట్ నిర్వహించిందని మండిపడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్‌లో మ్యూజిక్ కన్‌సర్ట్ నిర్వహించింది కాంగ్రెస్. దీన్ని ఉద్దేశిస్తూ బీజేపీ గహ్లోత్ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టింది.