యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో చోటు సంపాదించాడు. బాలీవుడ్ స్టార్ హీరోల సరసన విజయ్ ఆ క్యాలెండర్ లో మెరిశాడు. దక్షిణాది నుంచి ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. కేవలం 9 సినిమాలతో విజయ్ నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించడం గమనించదగ్గ అంశం. ఇక క్యాలెండర్ కి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్ చేశాడు డబూ రత్నాని. రగ్గ్ డ్ అండ్ స్టైలిష్ లుక్ లో విజయ్ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ను లాంచ్ చేసిన సందర్భంగా విజయ్ తో ఇన్ స్టా గ్రామ్ లైవ్ ముచ్చటించాడు డబూ. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఈ ఫొటో షూట్ తక్కవ టైమ్ లో క్వాలిటీగా జరిగింది. కొన్నేళ్ల నుండి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ క్యాలెండర్ లో కనిపించారు. నేను షారుఖ్ ఖాన్ ను మీ క్యాలెండర్ లో చూసా. అలా నాకు మీ క్యాలెండర్ లో కనిపిస్తే బాగుంటుందనుకున్నా. ఎట్టకేలకు నా కోరిక తీరింది’ అన్నాడు. ఇక డబూ రత్నాని మాట్లాడుతూ ‘నా క్యాలెండర్ లో ఎంట్రీ ఇచ్చినందుకు థ్యాంక్యూ. మీరు చాలా కూల్ పర్సన్. ఈ ఫొటో షూట్ చేసినపుడు ఎంజాయ్ చేసాను. నా క్యాలెండర్ లో దర్శనం ఇచ్చిన తొలి దక్షిణాది హీరో మీరు. నేను షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ మీదే’ అంటూ విజయ్ ను ప్రశంసించారు.