విక్టరీ వెంకటేశ్ తాజా చిత్రం ‘నారప్ప’ ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి కష్టాన్నైనా సహించే తండ్రిగా ఆ మధ్య ‘దృశ్యం’లో నటించి మెప్పించిన వెంకటేశ్, ఇప్పుడు తన కొడుకును దక్కించుకోవడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే తండ్రిగా ‘నారప్ప’లో జీవించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాను వెంకటేశ్ బంధుమిత్రులూ చూసి అభినందనల జల్లు కురిపిస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత ఈ సినిమాను చూసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా తన తండ్రిని ప్రశంసిస్తూ రాసిన మాటలు ఓ ఎత్తు.
Read Also: సీరియల్ కిల్లర్ గా సుహాస్!
‘నారప్ప’ను ఎమోషనల్ రోలర్ కాస్టర్ అని అభివర్ణించిన దగ్గుబాగటి ఆశ్రిత, తండ్రి వెంకటేశ్ అభినయానికి ఫిదా అయిపోయినట్టు తెలిపింది. సహజంగా ప్రతి సినిమాను విడుదలైన మొదటి రోజు మొదటి ఆట చూసే తాను ఇప్పుడు మాత్రం ‘నారప్ప’ను ఓటీటీలో చూడాల్సి వచ్చిందని, పైగా ఇంటికి దూరంగా ఉన్న తనకు ఇదే వీలైందని పేర్కొంది. సినిమాలో కుటుంబం కోసం ప్రాణాలను పణంగా పెట్టే తండ్రి ‘నారప్ప’గా వెంకటేశ్ అద్భుతమైన నటన ప్రదర్శించడానికి కారణం, ఆన్ స్క్రీన్ మీదనే కాకుండా ఆఫ్ స్క్రీన్ మీద కూడా ఆయన మనస్తత్వం అంతే కావడమని ఆశ్రిత తెలిపింది. తన తండ్రిలోని సర్వ సద్గుణాలనూ ఈ పోస్ట్ లో ఆశ్రిత ఏకరువు పెట్టేసింది. తండ్రిలోని గొప్ప గుణాలలో కనీసం సగం ఉన్నా అది తనకు గర్వకారణమే అని ఆమె పేర్కొనడం విశేషం. ఆయన లాంటి గొప్ప వ్యక్తి మరొకరు ఉండరంటూ కితాబిచ్చిన ఆశ్రిత తనకు తండ్రి అంటే అనంతమైన ప్రేమ అని వెల్లడించింది.