సీనియర్ స్టార్ హీరోలలో యమజోరుగా ఉంది విక్టరీ వెంకటేశే! ఈ యేడాది ద్వితీయార్థంలో వెంకీమామ నటిస్తున్న మూడు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. సెన్సార్ ను కూడా పూర్తి చేసుకున్న తమిళ ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ అతి త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ చివరి దశలో ఉన్న మలయాళ రీమేక్ ‘దృశ్యం -2’ సైతం ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే… వీటి స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించడంలో నిర్మాత సురేశ్ బాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇక వెంకటేశ్ ఈ యేడాది నటిస్తున్న మరో సినిమా ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’. దీని చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దీనిని కూడా ఇదే యేడాది కాస్త అటూ ఇటూగా ‘దిల్’ రాజు విడుదల చేస్తారని అంటున్నారు.
ఇదిలా ఉంటే… ఈ యేడాదే కాదు… వచ్చే యేడాది సైతం వెంకటేశ్ నటించే మూడు సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ను మొదట పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ వెంకటేశ్ కిట్ లోకి వెళ్ళిందని కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో పాటే త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ మూవీ నిర్మితమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అలానే గత కొంతకాలంగా ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ సైతం వెంకటేశ్ తో ఓ సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య వెంకటేశ్ కు తరుణ్ భాస్కర్ లైన్ చెప్పాడని, అది నచ్చి సీనియర్ హీరో ప్రొసీడ్ అన్నారని తాజా సమాచారం. సో… ఈ మూడు ప్రాజెక్ట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి సెట్స్ పైకి వెళ్ళిపోతే… ఇవన్నీ కూడా 2022లో జనం ముందుకు వచ్చేస్తాయట. మొత్తం మీద వెంకీమామ… రెండేళ్ళలో ఆరు సినిమాలు చేస్తూ… సీనియర్ స్టార్ హీరోలలో సూపర్ ఫాస్ట్ తో సాగుతోంది తానే నిరూపించుకోబోతున్నారు.