ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ పార్టీ జయకేతనం ఎగరేసింది. పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కడంతో ఆయన పార్టీలోనూ తన పట్టు బిగించే పనిలో పడ్డారు. ఇంతవరకూ కేరళ వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా కె.కె. శైలజ ఉన్నారు. శైలజా టీచర్
అంటూ ఆమెను ప్రతి ఒక్కరూ సొంతమనిషిలా పిలుస్తుంటారు. తాజాఎన్నికల్లో మత్తనూర్ నియోజక వర్గం నుండి 60 వేలకు పైగా మెజారిటీ తో శైలజా టీచర్ గెలిచారు. ఎంతో ప్రజాదరణ ఉన్న ఆమెకు ఈసారి కొత్త ప్రభుత్వంలో చోటు దక్కలేదు. ఇవాళ పినరయి విజయన్ విడుదల చేసిన మంత్రుల జాబితాలో శైలజ పేరు లేకపోవడం చూసి చాలామంది హతాశయులయ్యారు.
ఆమెను అభిమానించే సినీతారల అనుపమా పరమేశ్వరన్, మాళవిక మోహనన్, పార్వతి వంటి వారైతే బాహాటంగానే బ్రింగ్ బ్యాక్ శైలజా టీచర్
అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మద్దత్తు పలికారు. వాట్ హ్యాపెండ్ సీఎం అంటూ కొందరు పినవయి విజయన్ ను ప్రశ్నిస్తున్నారు. కొవిడ్ సమయంలో ఎంతో కష్టపడి పనిచేసి దేశవ్యాప్తంగా శైలజా టీచర్ గుర్తింపు తెచ్చుకుందని, ఆమెను పక్కన పెట్టి, తన అల్లుడికి మంత్రి పదవి కట్టబెట్టడం కరెక్ట్ కాదని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే విజయన్ చర్య నెపోటిజమ్ కిందకు రాదని, ఆయన అల్లుడు కాకముందు నుండే మహ్మద్ రియాస్ పార్టీ పదవుల్లో ఉన్నాడని మరికొందరు వాదిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం పార్టీ చీఫ్ విప్ పదవిని శైలజా టీచర్ కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె పడిన శ్రమకు, ఆమెకు ఉన్న పేరు ప్రఖ్యాతులకు చీఫ్ విప్ పదవి చాలా చిన్నదని కొందరు పెదవి విరుస్తున్నారు. విశేషం ఏమంటే… శైలజా టీచర్ కార్యకుశలతను గుర్తించిన కొందరు మలయాళ దర్శకులు ఆమె స్ఫూర్తితో సినిమాలను సైతం తీస్తున్నారు. మరి విజయన్ చర్యలపై శైలజా టీచర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
#BringBackShailajaTeacher ❤️ pic.twitter.com/qtRpwbBAXT
— Anupama Parameswaran (@anupamahere) May 18, 2021