కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు నిజానికి టాలీవుడ్ లో పెద్దంత క్రేజ్ లేదు. సూర్య, కార్తీకి మొదటి నుండి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో వారి సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతున్నాయి. వాటితో పాటే ధనుష్ సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అయినా ‘రఘువరన్ బి.టెక్’ మాత్రమే ఇక్కడ మంచి విజయం సాధించింది. అయితే ధనుష్ తో పాన్ ఇండియా మూవీ తీస్తే కనక వర్షం కురవడం ఖాయం. అందుకే తెలుగు నిర్మాతలు ధనుష్ తో అలాంటి కథలను తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటికే హిందీతో పాటు ఆంగ్ల చిత్రాలు సైతం చేస్తున్న ధనుష్ టాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణదాస్ నారంగ్, పి. రామమోహనరావు నిర్మించే సినిమాలో నటించబోతున్నాడు. ఎప్పుడైతే ధనుష్ స్ట్రయిట్ తెలుగు సినిమాకు పచ్చజెండా ఊపాడో మరికొందరు నిర్మాతలు అతనితో మంతనాలు మొదలెట్టారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ… ధనుష్ తో తెలుగులో ఓ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు మొదలు పెట్టారట. ఈ ప్రపోజల్ ను ధనుష్ ముందు పెట్టారని, అతను తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. దానికి కూడా ధనుష్ సుముఖత వ్యక్తం చేస్తే మాత్రం అతనికి టాలీవుడ్ లోనూ గట్టి పునాది పడినట్టే అవుతుంది.