మెగా ఫ్యామిలీ యంగ్ హీరోస్ సంఖ్య క్రికెట్ టీమ్ ను తలపిస్తుంది. కొణిదెల అండ్ అల్లు ఫ్యామిలీని చూస్తే మెగాభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది. దీనికి తోడు చిరు మేనల్లుళ్ళు సైతం హీరోలుగా రాణిస్తూ తమ సత్తాను చాటుకుంటున్నారు. ఇంతకూ విషయం ఏమంటే… గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కు బ్రేక్ పడగానే డిసెంబర్ 25న వరుణ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ విడుదలైంది. కేవలం యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్నా… వెనకడుగు వేయకుండా ప్రయోగాత్మకంగానే వరుణ్ తేజ్ మూవీని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్… జీ స్టూడియోస్ సంస్థ ఆధ్వర్యంలో విడుదల చేశారు. దానికి తగ్గట్టే ఆ సినిమాకు చక్కని ఆదరణ ప్రేక్షకుల నుండి లభించింది. అదే సమయంలో వరుణ్ తేజ్ తెగువను పొగుడుతూ, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కు విజయం దక్కాలంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తించారు. మెగాభిమానులతో పాటు అందరు హీరోల అభిమానులు ఆ సినిమాను ఓన్ చేసుకున్నారు. దాంతో సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు దైర్యంగా విడుదలయ్యాయి. విజయం సాధించాయి. చిత్రం ఏమంటే… ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కాస్తంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో థియేటర్లు త్వరలోనే తెరుచుకోబోతున్నాయి. మరి ఈసారి కూడా ఆక్యుపెన్సీ యాభై శాతం ఉంటుందా లేక నూరు శాతం ఉంటుందా అనేది తెలియదు. కానీ ఒకసారి థియేటర్లు అంటూ తెరిస్తే… మొదటగా జనం ముందుకు వచ్చేందుకు సాయిధరమ్ తేజ్ సిద్ధం కాబోతున్నాడట. అతను హీరోగా, దేవ కట్టా రూపొందించిన ‘రిపబ్లిక్’ మూవీని విడుదల చేసేందుకు నిర్మాతలు భగవాన్, పుల్లారావు సన్నాహాలు ప్రారంభించారు. అందులో భాగంగానే సాయితేజ్ సైతం డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు. నిజానికి ఈ సినిమా జూన్ 4న రావాల్సింది. కానీ పేండమిక్ సిట్యుయేషన్ లో వాయిదా పడింది. కానీ ఇప్పుడు థియేటర్లు తెరవగానే తొలిచిత్రంగా దీనిని జీ స్టూడియోస్, భగవాన్, పుల్లారావు విడుదల చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!!