తెలుగు సినిమా రంగంలో ఎందరో సంగీత దర్శకులున్నా, సినీజనం మాత్రం దేవిశ్రీ ప్రసాద్, థమన్ వెంటే పరుగులు తీస్తున్నారు. దాంతో ఒక్కో సినిమాకు వారు రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. టాప్ స్టార్స్ లో అధిక శాతం వీరిద్దరి వెంటే పడుతూ ఉండడంతో, వైవిధ్యం కూడా కొరవడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైవిధ్యం కోసం ఎ.ఆర్.రహమాన్ వైపు మన తెలుగువారి చూపు సాగుతోందని వినికిడి. నిజానికి ఎ.ఆర్.రహమాన్ తొలి రోజుల్లో అనేక తెలుగు చిత్రాలకు రాజ్-కోటి వద్ద అసోసియేట్ గా ఉంటూ మరపురాని నేపథ్య సంగీతం అందించారు. రోజా
సినిమాతో రాత్రికి రాత్రి రహమాన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. ఆ తరువాత ఆయన బాణీలపై మోజుపడ్డ కొందరు తెలుగు నిర్మాతలు రహమాన్ సంగీతం అందుకున్నారు. చిత్రమేమిటంటే, రహమాన్ స్వరకల్పనలో రూపొందిన స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఏవీ అంతగా ఆకట్టుకోలేక పోయాయి. తమిళంలో సమకూర్చిన బాణీలనే ఏ మాయ చేశావె
కు అందివ్వగా ఆ సినిమా ఒక్కటీ విజయం సాధించింది. ఇక స్టార్ హీరోస్ వెంకటేశ్, నాగార్జున, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ వంటివారు రహమాన్ బాణీలతో సాగినా పరాజయాలనే పట్టుకువచ్చారు. అందువల్లే సెంటిమెంట్ తో రహమాన్ బాణీలంటే ఇష్టం ఉన్నా, తెలుగువారు ఆయనకు దూరంగా జరిగారు. ఆ తరువాత రహమాన్ సైతం మనవాళ్ళకు అందనంత ఎత్తుకు ఎదిగారు. ఆ మధ్య చిరంజీవి తన ప్రతిష్ఠాత్మక చిత్రం సైరా...నరసింహారెడ్డి
కి తొలుత రహమాన్ నే సంగీత దర్శకుడు అని ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి రహమాన్ తప్పుకున్నారు.
ప్రస్తుతానికి వస్తే, మన తెలుగు సినిమా జనం మళ్ళీ రహమాన్ బాణీల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ యన్టీఆర్ హీరోగా ఉప్పెన
దర్శకుడు బుచ్చిబాబు రూపొందించే స్పోర్ట్స్ డ్రామాకు రహమాన్ బాణీలయితేనే బాగుంటాయని భావించారట. ఇందులో భాగంగా ఇప్పటికే రహమాన్ కు కథ కూడా వినిపించినట్టు తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా లైగర్
చిత్రం రూపొందించిన పూరి జగన్నాథ్, విజయ్ తోనే మరో సినిమా తెరకెక్కించనున్నారు. జనగణమన
టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రానికి రహమాన్ స్వరకల్పన అవసరమని పూరి భావిస్తున్నట్టు సమాచారం. అప్పట్లో టాలీవుడ్ టాప్ స్టార్స్ కు అచ్చిరాని రహమాన్ బాణీలు నవతరం కథానాయకులకు కలసి వస్తాయేమో అంటున్నారు సినీజనం. అదే జరిగితే, ఇకపై వరుసగా రహమాన్ స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కు కంపోజ్ చేసే అవకాశం ఉందనీ చెప్పవచ్చు. ఏది ఏమైనా, ముందు రహమాన్ బాణీలతో జూనియర్, విజయ్ దేవరకొండ సినిమాలు రావాలి. అప్పుడే అసలు సంగతి బయట పడేది!