(జూన్ 2న ఇళయరాజా బర్త్ డే)
ఉన్నది సప్తస్వరాలే, వాటితో పలికే రాగాలెన్నో! ఉన్నది ఒక్కడే ఇళయరాజా, ఆయన పలికించిన మధురం ఎంతో! ఈ నానుడి తమిళనాటనే కాదు, తెలుగునేలపైనా విశేషంగా వినిపిస్తుంది. తన తరం సంగీత దర్శకుల్లో ఇళయరాజా లాగా అభిమానగణాలను సంపాదించిన వారు మరొకరు కానరారు. తెరపై ఇళయరాజా పేరు కనిపించగానే అభిమానుల ఆనందం అంబరమంటేది. దాదాపుగా స్టార్ హీరోల స్థాయిలో ఇళయరాజా పేరు మారుమోగి పోయింది. ఇక ఆయన సంగీతం సమకూర్చిన చిత్రాలతోనే ఎంతోమంది స్టార్స్ గా వెలిగారు. అందుకే ఇళయరాజాను ‘స్టార్ ఆఫ్ స్టార్స్, కింగ్ ఆఫ్ మెలోడీ, మేస్ట్రో, ఇసై జ్ఞాని’ అంటూ అభిమానులు కీర్తిస్తూనే ఉన్నారు.
చిత్రసీమ చిత్రమైనది. ఇక్కడ ఎన్నో చిత్రవిచిత్రాలు సాగుతూ ఉంటాయి. ఆరంభంలో తనకు గిటారిస్ట్ గా అవకాశమిస్తే చాలు, ఆ రోజు కడుపు నింపుకోవచ్చు అని ఆశిస్తూ ఎందరో సంగీత దర్శకుల గుమ్మాల చుట్టూ తిరిగారు ఇళయరాజా. తెలుగువారైనా కన్నడ సీమలో తనదైన బాణీ పలికించిన జి.కె.వెంకటేశ్ వద్ద తమిళ తంబీ ఇళయరాజాకు అవకాశం లభించింది. వెంకటేశ్ అనేక తెలుగు, కన్నడ చిత్రాలకు మధురమైన సంగీతం సమకూర్చారు. హరనాథ్, కె.ఆర్.విజయ నటించిన ‘శ్రీదేవి’ చిత్రానికి వెంకటేశ్ స్వరకల్పన చేశారు. అందులోని “రాశాను ప్రేమలేఖలెన్నో… దాచాను ఆశలన్ని నీలో…” పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. ఆ పాటలో ఇళయరాజా గిటార్ పలికించిన తీరు ఇప్పుడు విన్నా వీనులకు విందు చేస్తుంది. అలా వెంకటేశ్ వద్ద పలు చిత్రాలకు పనిచేసిన ఇళయరాజా, తరువాతి రోజుల్లో తన గురువు జి.కె.కే తన సినిమాల నేపథ్యం సమకూర్చే బాధ్యత అప్పగించారు. ఇది విచిత్రం కాక మరేమిటి? అయితే తన గురువు వెంకటేశ్ ను ఇళయరాజా ఏ రోజునా చిన్న చూపు చూసింది లేదు. తాను ఎంతో బిజీగా ఉన్న రోజుల్లో పాటలకు మాత్రం తాను స్వరకల్పన చేసి, తరువాత నేపథ్యమంతా గురువు పర్యవేక్షణలోనే చేసేవారు. గురువు జడ్జిమెంట్ కూ విలువ నిచ్చేవారు.
తెలుగు చిత్రసీమలో ఇళయరాజా బాణీలు పలుకక మునుపే, ఆయన తమిళంలో రూపొందించిన స్వరకల్పనను పలువురు ప్రముఖ సంగీత దర్శకులే అనుసరించారు. దీనిని బట్టే ఇళయరాజా గొప్పతనమేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘భద్రకాళి’ మొదలు మొన్నటి ‘శ్రీరామరాజ్యం’ దాకా ఇళయరాజా తెలుగువారిని ఆకట్టుకొనే స్వరాలు పలికించారు. చిరంజీవి-కోదండరామిరెడ్డి-కెఎస్. రామారావు-యండమూరి కాంబోలో వచ్చిన నవలా చిత్రాలకు ఇళయరాజా బాణీలు ప్రాణం పోసిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు? చిరంజీవికి అనేక మ్యూజికల్ హిట్స్ అందించిన ఇళయరాజా, నాటి వర్ధమాన హీరోలందరికీ తన స్వరాలతో సక్సెస్ రూటు చూపించారు. మూడుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలచిన ఇళయరాజాకు రెండు సార్లు తెలుగు చిత్రాల ద్వారానే (సాగరసంగమం, రుద్రవీణ) ఆ అవార్డు దక్కడం విశేషం. తమిళనాట పుట్టినా, తెలుగువారిని ఇళయరాజా స్వరకల్పన అలరించిన తీరు అనితరసాధ్యం అనే చెప్పాలి. పరభాషా సంగీత దర్శకుల్లో మన తెలుగు సినిమాల ద్వారా ఇళయరాజా చూసిన విజయాన్ని మరెవ్వరూ చూడలేదంటే అతిశయోక్తి కాదు.