ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సహజంగా ప్రయోగాలు చేయడానికి పెద్దంత ఇష్టపడడు. కమర్షియల్ అంశాలు జత అయిన సినిమాల్లో డిఫరెంట్ గా కనిపించడానికి మాత్రం తపిస్తూ ఉంటాడు. అలా చేసిన సినిమాలే ‘డీ.జె. దువ్వాడ జగన్నాథమ్’, ‘నా పేరు సూర్య’ చిత్రాలు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘పుష్ప’ సినిమా కూడ అదే కోవకు చెందింది. ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్న అర్జున్ ఓ డిఫరెంట్ గెటప్ లో ఇందులో కనిపించబోతున్నాడు. విశేషం ఏమంటే… రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా, రెండో భాగంలో వేరే విలన్ ను పెడతారట. అలానే ‘పుష్ప’కు సంబంధించిన మరో అప్ డేట్ కూడా ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. తొలి భాగాన్ని ఆగస్ట్ 13న విడుదల చేసి, రెండో భాగాన్ని వచ్చే యేడాది రిలీజ్ చేస్తారట. అలానే ఈ సినిమా షూటింగ్ ను చైనాలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించబోతున్నారని అంటున్నారు.
ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ చేయబోతున్న ‘ఐకాన్’ మూవీకి సంబంధించిన ఓ సూపర్ అప్ డేట్ వచ్చేసింది. ‘కనుబడుట లేదు’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో బన్నీకి నిజంగానే కనిపించదట. అతను గుడ్డివాడి పాత్ర చేయబోతున్నాడట. ఆ మధ్య మాస్ మహరాజా రవితేజ కూడా ‘రాజా ది గ్రేట్’లో గుడ్డివాడి పాత్రే పోషించి ఘన విజయాన్ని తన కిట్ లో వేసుకున్నాడు. మరి బన్నీ చేస్తున్న ఈ బ్లైండ్ క్యారెక్టర్ అతన్ని ఏ విజయ తీరాలకు చేర్చుతుందో చూడాలి.