‘మజిలి’ , ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి చిత్రాల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుని ‘కలర్‌ఫోటో’లో హీరోగా నటించాడు కమెడియన్ సుహాస్. తాజాగా సుహాస్ హీరోగా మెహెర్ తేజ్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ‘ఫ్యామిలీ డ్రామా’ అనే సినిమా తెరకెక్కబోతోంది. దీన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే ని మెహెర్ తేజ్, షణ్ముఖ ప్రశాంత్ అందిస్తున్నారు. ‘కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి చిత్రాలకి పనిచేసిన రామకృష్ణ ఆర్రామ్ దీనికి ఎడిటింగ్ చేస్తున్నారు. అజయ్ అండ్ సంజయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ‘ఫ్యామిలీ డ్రామా’ అనే టైటిల్ కి భిన్నంగా ఈ పోస్టర్ ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో పాటు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.