తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు కావు… గ్లామరస్ జీవితాలు పైకి మెరిసిపోయినంత అందమైనవి కావు! తాజా ఉదాహరణ బ్రిట్నీ స్పియర్స్! అందం, అభినయం, గాత్రం, గ్లామర్… అన్నీ ఉన్నా… తనకు స్వేచ్ఛ లేదంటోంది అమెరికన్ పాప్ స్టార్!
39 ఏళ్ల బ్రిట్నీ లాస్ ఏంజిలెస్ కోర్టులో తన మానసిక వేదన మొత్తం బయట పెట్టింది. తండ్రికి తన జీవితంపై సర్వ హక్కులు కల్పించే ‘కన్సర్వేటర్ షిప్’ రద్దు చేయాలని ఆమె న్యాయమూర్తిని కోరింది. గతంలో స్పియర్స్ కు తీవ్రమైన శారీరిక, మానసిక రుగ్మతలు ఏర్పడటం వల్ల ఆమెకు సంబంధించిన అన్ని అంశాలపై ఆమె తండ్రికి న్యాయస్థానం హక్కులు కల్పించింది. ‘కన్సర్వేటర్ షిప్’గా పిలవబడే ఆ ఏర్పాటు వల్ల బ్రిట్నీ కనీసం తన పెళ్లి, పిల్లల్ని కనటం లాంటి అంశాల్లోనూ తండ్రిని కాదనటానికి వీలుండదు. అందుకే, పదేళ్లకు పైగా అటువంటి దుర్మార్గమైన ఒప్పందంలో మగ్గిపోయి ఆమె ఇప్పుడు తనకు స్వేచ్ఛ కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. తన వ్యక్తిగత అంశాలు, ఇష్టాయిష్టాలు, నిర్ణయాలు తనవేనంటోంది. తన మిలియన్ల కొద్దీ డాలర్లు విలువ చేసే ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్స్ లు కూడా ఇకపై తానే నిర్వహించుకుంటానంటోంది…
Also Read: సమంత మెచ్చిన బాలీవుడ్ ‘రాజ్ కుమారుడు’! త్వరలో అతడితో సినిమా?
తండ్రి నియంత్రణ నుంచీ తనకు విముక్తి కల్పించమని కోర్టును కోరిన బ్రిట్నీ స్పియర్స్ తాను బానిసగా బతకాల్సి వస్తోందని వాపోయింది. తనకు గర్భం రాకుండా శరీరంలో ‘ఐయూడీ’ అనే పరికరం అమర్చారని, అది తనకు ఇష్టం లేకున్నా భరించాల్సి వస్తోందని ఆమె చెప్పింది. తనకు పెళ్లి చేసుకోవాలని, బిడ్డని కనాలని ఉందంటూ న్యాయమూర్తికి మొరపెట్టుకుంది. బ్రిట్నీ స్పియర్స్ దయనీయ స్థితికి ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి పెల్లుబుకుతోంది. ఆమెకు తక్షణం స్వేచ్ఛని ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఆమె శరీరం, ఆమె మనస్సు, ఆమె జీవితం ఆమె ఇష్టం అంటూ సొషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. ‘ఫ్రీ బ్రిట్నీ స్పియర్స్’ హ్యాష్ ట్యాగ్ కూడా రన్ అవుతోంది! బ్రిట్నీ స్పియర్స్ వాదనలు విన్న కోర్టు చివరకు ఎలాంటి తీర్పుని ఇస్తుందో ముందు ముందు తెలుస్తుంది. 2018 తరువాత ఇంత వరకూ ఇంటర్నేషనల్ పాప్ సింగర్ ఎక్కడా పర్ఫామ్ చేయలేదు. ఆమెను ఫ్యాన్స్ తీవ్రంగా మిస్ అవుతున్నారు!