సౌత్ ఇండియాలో కాస్తంత బొద్దుగా ఉండే హీరోయిన్లను జనం ఇష్టపడతారు కానీ బాలీవుడ్ లో అలా కుదరదు! సన్నగా నాజూకుగా ఉండాలి హీరోయిన్ అంటే!! అంతేకాదు… సైజ్ జీరో అయినా వాళ్ళకు ఓకేనే! అయితే… తమ ప్రేక్షకులను మెప్పించడానికి బాలీవుడ్ భామలు చాలా కసరత్తులే చేస్తుంటారు. యోగాతో పాటు వాళ్ళు తీసుకునే ఆహారం కూడా సైజ్ కంట్రోల్ కు కారణమౌతుంది. ఇంతకూ బాలీవుడ్ బ్యూటీస్ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏమిటో తెలుసుకోవాలని మీకుందా!? అయితే ఆలస్యమెందుకు… తెలుసుకుంటే పోలా!?
ముందుగా ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా గురించి తెలుసుకుందాం. అత్యధిక రోజులు విదేశాలలోనే ఉండే ప్రియాంక చోప్రా ఇటీవలే సరొగసీ ద్వారా ఓ ఆడపిల్లకు తల్లి అయ్యింది. విశేషం ఏమంటే… ఈ అంతర్జాతీయ నటి ఆమ్లెట్ టోస్ట్, అవాకడో టోస్ట్ లను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటుందట. అయితే పంజాబీ ఫుడ్ తో పాటు సౌతిండియన్ రెసిపీలూ ఇష్టమే అంటోంది ప్రియాంక. ఆలూ పరోటాతో పాటు ఛాన్స్ దొరకాలే కానీ దోశ, ఇడ్లీ, పోహాలనూ లాగిస్తానని చెబుతోంది. మరో అందాల ముద్దు గుమ్మ అనుష్కశర్మ అయితే ఉదయం పూట హెవీగా ఏమీ తీసుకోదట. కొద్దిగా ఓట్స్, చియా సీడ్స్ తో చేసిన జ్యూస్ మాత్రమే అల్పాహారంగా స్వీకరిస్తుందట. స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే అయితే సౌతిండియన్ ఫుడ్ కు జై అంటోంది. ఉదయం పూట తనకు బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, వడ సాంబార్ విత్ కొబ్బరి పచ్చడి ఉండాల్సిందేనట. అలానే ఓ చిక్కటి ఫిల్టర్ కాఫీతో రోజు మొదలు పెడతానని చెబుతోంది.
ఇద్దరు పిల్లల తల్లి అయిన కరీనా కపూర్ ఇప్పటికీ చక్కటి ఫిజిక్ ను మెయిన్ టైన్ చేస్తోంది. ఆమె ఆహారనియమాలే దానికి కారణం. కరీనా కపూర్ ఉదయాన్నే వెన్న రాసిన పరోటాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుందట. అలానే దోశ, ఇడ్లీ, పోహా అంటే కూడా ఇష్టమేనని చెబుతోంది. మరో అందాల భామ, ఐటమ్ గర్ల్ మలైకా అరోరా అయితే.. గోరు వెచ్చని నీళ్ళు, లెమన్ జ్యూస్ తో తన రోజును ప్రారంభిస్తుందట. అలానే పల్లీలు, ఆకుకూరలు, కొద్దిగా కూరగాయలతో చేసిన పోహా అల్పాహారంగా తీసుకుంటానని మలైకా చెబుతోంది. ఇక ‘వన్… నేనొక్కడినే’ ఫేమ్ కృతీ సనన్ అయితే బాయిల్డ్ ఎగ్ తోనే తన డే మొదలవుతుందని తెలిపింది. వాము వేసిన పరోటాలకు వెన్నపూస రాసుకుని ఆరగిస్తానని చెబుతోంది.
పొడుగుకాళ్ళ సుందరి, యోగా భామ శిల్పాశెట్టి అయితే జొన్నలు, సజ్జలు, గోధుమలు, కొర్రలతో చేసిన టోస్ట్ తింటుందట. అలానే పన్నీరుతో చేసిన కర్రీ, అవకాశం ఉంటే ఇడ్లీ సాంబార్, గోధుమరవ్వ ఉప్మాకూ సై అంటానని చెబుతోంది. ఫ్యాట్ లేకుండా వెన్నతీసిన పాలు తాగుతుందట. మరో స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ కూడా ఎగ్స్ కే మొగ్గు చూపుతోంది. కోడి గుడ్లుతో పాటు స్వీట్ పొటాటోతో చేసిన ఏ వంటకమైనా తనకు ఓకే అని చెబుతోంది. తాప్సీ పన్ను అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో బయోపిక్స్ పై దృష్టి పెట్టింది. దాంతో తన ఫిజిక్ కు నూరుశాతం ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే గోరు వెచ్చని నీళ్ళు, బాదం, జీడిపప్పు, కీరా జ్యూస్ తో బ్రేక్ ఫాస్ట్ మొదలు పెడతానని, ఆ తర్వాత కాస్తంత గ్యాప్ ఇచ్చి చోలే బటోరే ఆరగిస్తానని చెప్పింది. ఇక ‘ట్రిపుల్ ఆర్’ భామ అలియా భట్ మాత్రం తనకు ఉదయమైన ఆలూ పరోటాతో పాటు చాక్లెట్స్ ఉండాల్సిందేనని సెలవిచ్చింది. ఇవండీ మన బాలీవుడ్ బ్యూటీస్ బ్రేక్ ఫాస్ట్ ముచ్చట్లు.