పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రొమాంటిక్ డ్రామా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”. ధూళిపూడి ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించారు. వివా హర్ష, పోసాని కృష్ణ మురళి, హేమ, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సంవత్సరం జనవరి 29న చిత్రం తెరపైకి వచ్చింది. సినిమా విడుదలకు ముందే అందులో సిద్ శ్రీరామ్ పాడిన “నీలి నీలి ఆకాశం” సాంగ్ బాగా వైరల్ కావడంతో “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం కామెడీతో కూడిన పునర్జన్మ ఆధారిత ప్రేమకథ. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన సంగీతం కూడా ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచింది. చాలా మంది దాని డిజిటల్ విడుదల కోసం చాలా కాలంగా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే నిన్న ఈ చిత్రం ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ లో సినిమాలను విడుదల చేసేముందు ఏదో ఒక ప్రమోషనల్ కంటెంట్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తారు. కానీ ఈ చిత్రం థియేటర్ లో విడుదలై దాదాపు నాలుగు నెలలవుతోంది. ఇంత గ్యాప్ తరువాత విడుదల చేస్తున్న ఈ చిత్రం గురించి అమెజాన్ ప్రైమ్ అసలు ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడం గమనార్హం. ఈ సినిమా ఓటిటి కోసం విడుదల ఆతృతగా చూస్తున్న ప్రేక్షకులకు చాలా మందికి “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” ఓటిటిలో రిలీజ్ అయ్యిందన్న విషయం తెలీకుండా పోయింది. మరి అమెజాన్ ఈ చిత్రాన్ని ఇంత సైలెంట్ గా విడుదల చేయటానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారు ప్రదీప్ అభిమానులు.