అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా దీనిని నిర్మించారు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు ‘హిప్ హాప్’ తమిళ, హీరో ఆర్య ట్విట్టర్ ద్వారా టీజర్ ను రిలీజ్ చేశారు.రిలీజ్ డేట్ పోస్టర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రచయిత బీవీఎస్ రవి ఆవిష్కరించారు. మార్చి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సి. కళ్యాణ్ మాట్లాడుతూ “చిన్నాతో నాది 40 ఏళ్ల స్నేహం. నేను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు అతను మ్యుజిషియన్. చిన్నా నేపథ్య సంగీతం చేయడం అనేది నాతో మొదలైంది. నేను, శివమణి, ఎస్పీ బాలు, చిన్నా… మేమంతా ఓ బ్యాచ్. అభినయం పరంగా సౌందర్య తర్వాత అవికా గోర్ అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయికి రావాల్సినంత సక్సెస్ రాలేదు. తనకు తప్పకుండా ఈ సినిమాతో సక్సెస్ వస్తుంది. పనిలో కెమెరామేన్ అంజి చిచ్చరపిడుగు. అతను పెద్ద మాస్ దర్శకుడు అవుతాడు” అని అన్నారు. కెమెరామేన్ అంజి వినాయక్ అంత కమర్షియల్ డైరెక్టర్ కావాలనే ఆకాంక్షను చోటా కె నాయుడు వ్యక్తం చేశారు. చిత్రనిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ “మా టెన్త్ క్లాస్‌మేట్స్ అందరూ రీయూనియన్ అయిన తర్వాత అందులో నుంచి వచ్చిన పాయింట్స్ తీసుకుని సినిమా చేశాం. మేం దీనిని మొదలు పెట్టినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం. తర్వాత కొంచెం పెరుగుతూ ఉందని అనుకున్నప్పుడు… మనకు సపోర్ట్ అవసరమని మేం అడగ్గానే ఏఏకే క్రియేషన్స్ నుంచి రవి కొల్లిపర సపోర్ట్ చేశారు. ఆయనతో పాటు అజయ్ మైసూర్ కూడా మాతో జాయిన్ అయ్యారు. సినిమా విడుదలకు ముందు నేను స్ట్రెస్ ఫ్రీగా ఉన్నానంటే కారణం వాళ్లే” అని అన్నారు.
‘గరుడవేగ’ అంజి మాట్లాడుతూ “సినిమాటోగ్రాఫర్‌గా నా 50వ సినిమాకు నేను డైరెక్షన్ చేయాలనే డ్రీమ్ నాకు లేదు. మా నిర్మాతలకు వచ్చింది. కథ విన్నాను. సుజీత్ మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. నాకు పూర్తిగా సహకరించిన సురేష్ బొబ్బిలి, చిన్నా, ప్రవీణ్ పూడి, ఇతరులు అందరికీ థాంక్స్. ఈ సినిమాకు అవికా గోర్ పెద్ద ప్లస్ పాయింట్. క్లైమాక్స్‌లో ఆవిడ పెర్ఫార్మన్స్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. రామారావుగారు చెప్పినట్టు ముందు అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం పెరిగింది. ఆయనకు మద్దతుగా రవి, అజయ్ మైసూర్ వచ్చారు. ’96’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’, ‘కొత్త బంగారు లోకం’ కోవలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమా ఉంటుంది” అని అన్నారు.అవికా గోర్ మాట్లాడుతూ “నా టెన్త్ క్లాస్ నాకు ఎంతో స్పెషల్. పదో తరగతిలో ఉన్నప్పుడు ‘ఉయ్యాలా జంపాలా’ చేశా. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేశారు. అందువల్ల, పదో తరగతి నాకెప్పుడూ గుర్తు ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సినిమా చూసి మీరంతా ఎలా ఉందో చెబుతారని ఆశిస్తున్నాను. నన్ను బబ్లీ, చబ్బీరోల్స్‌లో చూశారు. ఈ రోల్ చాలా డిఫరెంట్ ” అని అన్నారు.