వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ఎల్లుండి నుంచి అంటే ఈ నెల 4వ తేదీ నుంచి పునఃప్రారంభం కానుంది.. ఓ వైపు బోనాలు, మరో వైపు భారీ వర్షాల నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ తీసుకున్నారు వైఎస్ షర్మిల.. లాల్ దర్వాజ బోనాల వేడుకల్లో పాల్గొన్న ఆమె.. అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖఃసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు.. ఇక, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆమె.. బాధితులకు ధైర్యాన్ని చెప్పారు.. అయితే, ఇప్పుడు మళ్లీ పాదయాత్రకు సిద్ధం అయ్యారు..
Read Also: Rs 2,000 notes: రూ.2 వేల నోట్లపై అసలు విషయం బయటపడింది..!
ఈ నెల 4వ తేదీన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కల్మలచేరువు గ్రామం నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.. అయితే, భారీ వర్షాల కారణంగా గత నెల 6వ తేదీన కల్మలచేరువు గ్రామం వద్ద పాదయాత్ర వాయిదా పడిన విషయం తెలిసిందే కాగా.. తిరిగి అదే గ్రామం నుంచే పాదయాత్రను షర్మిల మొదలు పెట్టనున్నారు. మరోవైపు.. అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నారు షర్మిల.. పాదయాత్ర, బహిరంగసభలు, ప్రెస్‌మీట్లు.. చివరకు సోషల్ మీడియాలోనూ తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. ఇతర టీఆర్ఎస్ నేతలపై ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు.